Group-1 Posts
-
గ్రూప్-1పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: గ్రూప్-1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ జీవో విడుదల చేసింది. దీంతో గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పోస్టుల సంఖ్య.. ఈ సర్కార్ నిర్ణయంతో పెరిగినట్లయ్యింది. ఆర్థిక, హోం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్‌డెవలప్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌కు జత చేస్తూ మూడో తేదీన నిర్ణయం తీసుకుంది. ఇక.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.పేపర్ లీకేజీల వ్యవహారం వెలుగు చూడడంతో ఎగ్జామ్ రెండుసార్లు రద్దుకాగా.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ఇతరత్రా పరీక్షల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు కావొస్తున్నా.. ఎగ్జామ్ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్ఫష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో సర్కార్ తాజా నిర్ణయంతో పోస్టుల సంఖ్య మాత్రం 563కి చేరినట్లయ్యింది. -
ఉద్యోగాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్‌పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. -
డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సువర్ణ ఎంపిక
శ్రీకాకుళం: వరుసగా రెండో ఏడాది కూడా పరపటి సువర్ణ గ్రూప్–1 పోస్టు కొట్టేశారు. 2022 గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారో గ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా బాధ్యత స్వీకరించి, శిక్షణలో ఉండగానే మళ్లీ తాజా గా ప్రకటించిన గ్రూప్–1 పరీక్షల్లో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికై రికార్డు సృష్టించారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె సువర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీలో పీజీ పూర్తి చేశా రు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా, 2022లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1కు అర్హత సాధించారు. అనంతరం మళ్లీ తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. కలెక్టర్‌గా చూడాలన్నది నాన్న కల నన్ను కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కల నెరవేర్చుతాను. ప్రస్తుతానికి రెండు సార్లు వరుసగా గ్రూప్–1 పోస్టులు సాధించాను. తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదువుతాను. – సువర్ణ, గ్రూప్–1 విజేత -
గ్రూప్–1 ఫైనల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 111 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒక పోస్టుకు ఎంపికపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి నివేదిక రావాల్సి ఉంది. పోటీపడ్డ ఉన్నత విద్యావంతులు.. మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది (53.6 శాతం) మహిళలు 51 (46.4 శాతం) మంది ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలుండగా నలుగురు పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూలకు వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు. విద్యార్హతల పరంగా చూస్తే.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు, వైస్ చాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థల ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపికలు జరిగి రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికలను పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది ఎంపిక.. గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 1,26,450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 86,494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 6,455 మందిని ఎంపిక చేసింది. జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4,688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లోనే ఏపీపీఎస్సీ పూర్తి చేయించింది. జూలై 14న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు మూడు బోర్డులతో వీటిని నిర్వహించింది. టాప్–5 ర్యాంకర్లు వీరే.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష భూమిరెడ్డి పావని కంబాలకుంట లక్ష్మీప్రసన్న కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భానుప్రకాశ్‌రెడ్డి మిమ్మితి టాపర్స్ ఇలా.. పేరు: గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష విద్యార్హత: గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ స్వస్థలం: సీసలి, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి తండ్రి: వెంకట రామాంజనేయులు ( ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీఈవో కార్యాలయంలో ఏపీవో) ► భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్–1లో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రిలిమ్స్ పూర్తిచేసి సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు తండ్రి రామాంజనేయులు తెలిపారు. పేరు: భూమిరెడ్డి పావని విద్యార్హత: బీటెక్ (ఈసీఈ) తండ్రి: భూమిరెడ్డి గంగయ్య (రైతు) తల్లి: లక్ష్మీదేవి స్వస్థలం: మైదుకూరు, వైఎస్సార్ జిల్లా ► పావని గ్రూప్–1 ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించారు. 2016 నుంచి హైదరాబాద్‌లో గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నారు. 2016, 2017లో గ్రూప్–2 మెయిన్స్వరకు వెళ్లారు. 2018లో గ్రూప్–1 ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. తల్లిదండ్రులు, సోదరి భాగ్య, సోదరుడు గణేష్ సహకారంతో కష్టపడి చదివి ఈసారి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. పేరు: కె.లక్ష్మీప్రసన్న విద్యార్హత: బీటెక్ (ఐటీ) 2013, రాజంపేట స్వస్థలం: టంగుటూరు గ్రామం, అన్నమయ్య జిల్లా భర్త: పి.చంద్రదీప్ (పంచాయతీ సెక్రటరీ) తండ్రి: కె.సుబ్బారాయుడు (ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్) తల్లి: సరస్వతి ► లక్ష్మీ ప్రసన్న గ్రూప్–1 ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె టీవీ పురం పంచాయతీలో గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2014 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. పేరు: కుప్పిరెడ్డి ప్రవీణ్ కుమార్‌రెడ్డి విద్యార్హత: బీటెక్ (ఈఈఈ), 2009, మదనపల్లె స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా తండ్రిపేరు: కేసీ వెంకటరెడ్డి(డీసీసీబీ రిటైర్డ్ సూపర్వైజర్) తల్లి: కె.రామసుబ్బమ్మ ► ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో గ్రూప్–1 నోటిఫికేషన్లో పరీక్ష రాయగా.. 2022లో రిజల్ట్స్ వచ్చాయి. 47వ ర్యాంకు సాధించగా.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా సెలక్టయ్యారు. కానీ.. 2018లోనే గ్రూప్–2 పరీక్ష రాయగా.. 2020లో వెలువడిన ఫలితాల్లో 11వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఎంపికై ప్రస్తుతం మదనపల్లెలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు ఎనిమిదేళ్లు ఒరాకిల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. 2018 నాటి గ్రూప్–1 ఫలితాలు 2022లో వెలువడే నాటికే ఆయన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిపోవడంతో.. మరింత మెరుగైన ర్యాంకు కోసం శ్రమించారు. -
గ్రూప్–1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 2వ తేదీతో(బుధవారంతో) గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్ టెస్టు)ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు. -
గ్రూప్–1లో తెలుగు పేపర్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టులకు నిర్వహిస్తున్న మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాష పేపర్‌ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) భావిస్తోంది. తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఈ పేపర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనుంది. రానున్న గ్రూప్–1 నోటిఫికేషన్లకు దీన్ని వర్తింపచేయనుంది. గ్రూప్–1 మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్ పేపర్‌తోపాటు ఐదు సబ్జెక్ట్ పేపర్లు ఉన్నాయి. ఇంగ్లిష్ పేపర్లో అభ్యర్థులు ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఉంది. లేకపోతే మిగతా ఐదు సబ్జెక్టుల పేపర్లలో ఎన్ని మార్కులు సాధించినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. యూపీఎస్సీ డ్రాఫ్ట్ సిలబస్ సూచనల మేరకు.. గ్రూప్–1 సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేని పంథాన అవి నడుస్తున్నాయి. అయితే అందరికీ ఒకే సిలబస్ ఉంటే మంచిదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కామన్ సిలబస్‌ను ప్రతిపాదించింది. దీని ముసాయిదాను ఆయా రాష్ట్ర కమిషన్లకు పంపి అధ్యయనం చేయించింది. అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో కొద్దికాలం క్రితం గోవాలో సమావేశమై వాటి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. గ్రూప్–1 మెయిన్స్‌లో నాలుగు సబ్జెక్టు పేపర్లు, వీటితోపాటు జనరల్ ఇంగ్లిష్, ఆయా ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఒక పేపర్‌ను ప్రవేశపెట్టాలని యూపీఎస్సీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో సూచించింది. సబ్జెక్టు పేపర్లతోపాటు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల పేపర్లలో వచ్చిన మార్కులను సైతం మెరిట్‌కు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఏపీపీఏస్సీ ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా ఐదు సబ్జెక్టు పేపర్లను అమలు చేస్తోంది. ఇందులో ఇంగ్లిష్‌ను కేవలం క్వాలిఫై పేపర్‌గా మాత్రమే పరిగణిస్తోంది. యూపీఎస్సీ సూచనల మేరకు ప్రాంతీయ భాషగా రాష్ట్రంలో తెలుగును ఏడో పేపర్‌గా ప్రవేశపెట్టాలని, దాన్ని కూడా క్వాలిఫై పేపర్‌గానే పరిగణించాలని భావిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నారు. గత రెండు రోజులుగా యూపీఎస్సీ ముసాయిదా ప్రతిపాదనలపై ఏపీపీఎస్సీ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. గ్రూప్–1 సిలబస్‌లో 20 శాతం మేర మార్పులు కాగా.. యూపీఎస్సీ ప్రతిపాదనల మేరకు కామన్ సిలబస్‌కు అనుగుణంగా గ్రూప్–1 మెయిన్స్ సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. యూపీఎస్సీ ప్రతిపాదిత కామన్ సిలబస్‌ను అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రస్తుతమున్న ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ సిలబస్ దాదాపు 80 శాతం వరకు దానితో సమానంగా ఉందని భావించింది. మరో 20 శాతం మేర స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ‘ప్రస్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్–1 సిలబస్ యూపీఎస్సీ ప్రతిపాదిత సిలబస్‌తో దాదాపు సమానంగానే ఉంది. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేయాల్సి వచ్చినా 10 నుంచి 20 శాతం సిలబస్‌లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. -
మళ్లీ ‘మెయిన్స్’ నిర్వహించాల్సిందే
గ్రూప్-1 పరీక్షలపై ‘సుప్రీం’ ఆదేశం గైర్హాజరైన 7 వేల మందికి నిరాకరణ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సీ నివేదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ ‘కీ’లో దొర్లిన ఆరు తప్పులపై గత ఏడాది అక్టోబర్ 7న అత్యున్నత న్యాయస్థానం ఇదే తీర్పు ఇచ్చింది. ఆ ఆరు ప్రశ్నలను తొలగించాలని, మిగతా ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల తాజా జాబితా రూపొందించి మెయిన్స్ నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పుపై ఏపీపీఎస్సీ సివిల్ అప్పీల్ దాఖలు చేయగా మెయిన్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని ‘సుప్రీం’ సోమవారం పునరుద్ఘాటించింది. అయితే గతంలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు గైర్హాజరైన వారిని ఈసారి పరీక్షకు అనుమతించాల్సిన అవసరం లేదని తీర్పులో పేర్కొంది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జె.చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. రెండు పరీక్షలొద్దు...: ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే తమ తప్పేమీ లేని అభ్యర్థులు కూడా మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందని, అందువల్ల అంతే ప్రమాణాలు కలిగిన మరో ప్రశ్నపత్రం ద్వారా కొత్తగా అర్హులైన వారికి పరీక్ష నిర్వహిస్తామని కోర్టుకు ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, జి.వివేకానంద్ విన్నవించారు. అయితే ఒక పరీక్ష ద్వారా కొంద రిని, రెండో పరీక్ష ద్వారా మరికొందరిని ఎంపిక చేయడాన్ని ధర్మాసనం సమ్మతించలేదు. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించాక రూపొందించిన నూతన మెరిట్ జాబితాకు కొత్తగా అర్హత సాధించిన 209 మందిని కలిపితే మొత్తం 16,113 మంది అర్హులని ఏపీపీఎస్సీ తేల్చింది. అయితే వీరిలో గైర్హాజరైన 7 వేల మందికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. వెంటనే మెయిన్స్ నిర్వహించాలి: అభ్యర్థులు సుప్రీం తీర్పు మేరకు వెంటనే మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం చేస్తే మొత్తం నోటిఫికేషనే ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తీర్పు ప్రకారం మళ్లీ మెయిన్స్ నిర్వహించకుండా రివ్యూ పిటిషన్ వేసేందుకు ఏపీపీఎస్సీ యోచన చేస్తోందన్నారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరై పోస్టింగుల కోసం నిరీక్షిస్తున్నవారు తాజా తీర్పుతో ఖిన్నులయ్యారు. -
గ్రూప్-1కు మళ్లీ మెయిన్స్
ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011 గ్రూప్-1 కేసులో తీర్పు వివాదాస్పద 6 ప్రశ్నలు తీసేసి మెరిట్ జాబితా రూపొందించండి దాని ప్రకారం అర్హులకు మెయిన్స్ నిర్వహించాలంటూ ఉత్తర్వులు సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011-నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు.. ఇపుడు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలోని వివాదాస్పద ప్రశ్నలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసును సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించి మిగిలిన ప్రశ్నలకు లభించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కొత్తగా రూపొందించాలని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అంతేకాదు, ఆ మెరిట్ జాబితాను అనుసరించి అర్హులకు మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కేసును పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై కమిషన్ వర్గాలను సంప్రదించగా.. కోర్టు తీర్పు కాపీ అందాక పరిశీలించి, కమిషన్‌లో చర్చించి చర్యలు చేపడతామని పేర్కొన్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇంటర్వ్యూలు పూర్తయిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే... 2011 నవంబర్‌లో 314 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ 2012 మే 27న ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను జూన్ 13న ప్రకటించింది. ఇందులో 1:50 చొప్పున 16,426 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అయితే పలువురు అభ్యర్థులు ఇందులో కటాఫ్ మార్కులు తెలియజేయాలని, కీని ప్రకటించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆగస్టు 31న ఏపీపీఎస్సీ కీని ప్రకటించింది. ఆ కీలో తప్పులు దొర్లాయని, 13 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలనే ఏపీపీఎస్సీ కీలో సరైనవిగా పేర్కొందని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కమిషన్ వర్గాలు మొదట పట్టించుకోలేదు. మెయిన్స్ రాత పరీక్షలకు వారం రోజుల ముందు కమిషన్ వేసిన నిపుణుల కమిటీ 7 తప్పులను మాత్రమే సరిదిద్దింది. దీంతో కటాఫ్ మారింది. మొదట మెయిన్స్‌కు ఎంపిక చేసిన జాబితా నుంచి 845 మంది అభ్యర్థులను తొలగించగా, 1,201 మంది కొత్త వారికి మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది. వారంతా ప్రిపేర్ కాకుండానే మెయిన్స్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మరోవైపు అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా మిగిలిన ఆరు తప్పులను సరిదిద్దలేదు. 2012 సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా 606 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. వారికి గత జనవరి 28 నుంచి మార్చి 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అభ్యర్థుల న్యాయపోరాటం.. మరోవైపు పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో దొర్లిన ఆ ఆరు తప్పులను కూడా సరిదిద్దాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... నాలుగు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ న్యాయవివాదం జరుగుతుండగానే ఏపీపీఎస్సీ 2011 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తిచేసింది. దీంతో హైకోర్టు తుది ఫలితాల ప్రకటనను నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఏపీపీఎస్సీ ఈ ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వేసింది. జస్టిస్ గోఖలే, జస్టిస్ చలమేశ్వర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ఆలకించిన మీదట కేసును పరిష్కరిస్తూ తాజా ఆదేశాలిచ్చింది. -
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి: ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీని నిలుపుదల చేయడంలో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, గ్రూప్-1 సర్వీసు తప్ప మిగిలిన అన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. నోటిఫికేన్లు నిలిపివేయడంలో న్యాయం లేదని, ఉద్యోగాలొస్తాయనే ఆశతో దాదాపు 25లక్షల మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలకు సెలవులు పెట్టి, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భర్తీకి సిద్ధంగా ఉన్నా ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిపివేయడం సరికాదని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.