మళ్లీ ‘మెయిన్స్’ నిర్వహించాల్సిందే
గ్రూప్-1 పరీక్షలపై ‘సుప్రీం’ ఆదేశం
గైర్హాజరైన 7 వేల మందికి నిరాకరణ
ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సీ నివేదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ ‘కీ’లో దొర్లిన ఆరు తప్పులపై గత ఏడాది అక్టోబర్ 7న అత్యున్నత న్యాయస్థానం ఇదే తీర్పు ఇచ్చింది. ఆ ఆరు ప్రశ్నలను తొలగించాలని, మిగతా ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల తాజా జాబితా రూపొందించి మెయిన్స్ నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పుపై ఏపీపీఎస్సీ సివిల్ అప్పీల్ దాఖలు చేయగా మెయిన్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని ‘సుప్రీం’ సోమవారం పునరుద్ఘాటించింది. అయితే గతంలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు గైర్హాజరైన వారిని ఈసారి పరీక్షకు అనుమతించాల్సిన అవసరం లేదని తీర్పులో పేర్కొంది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జె.చలమేశ్వర్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది.
రెండు పరీక్షలొద్దు...: ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే తమ తప్పేమీ లేని అభ్యర్థులు కూడా మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందని, అందువల్ల అంతే ప్రమాణాలు కలిగిన మరో ప్రశ్నపత్రం ద్వారా కొత్తగా అర్హులైన వారికి పరీక్ష నిర్వహిస్తామని కోర్టుకు ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, జి.వివేకానంద్ విన్నవించారు. అయితే ఒక పరీక్ష ద్వారా కొంద రిని, రెండో పరీక్ష ద్వారా మరికొందరిని ఎంపిక చేయడాన్ని ధర్మాసనం సమ్మతించలేదు. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించాక రూపొందించిన నూతన మెరిట్ జాబితాకు కొత్తగా అర్హత సాధించిన 209 మందిని కలిపితే మొత్తం 16,113 మంది అర్హులని ఏపీపీఎస్సీ తేల్చింది. అయితే వీరిలో గైర్హాజరైన 7 వేల మందికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
వెంటనే మెయిన్స్ నిర్వహించాలి: అభ్యర్థులు
సుప్రీం తీర్పు మేరకు వెంటనే మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం చేస్తే మొత్తం నోటిఫికేషనే ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తీర్పు ప్రకారం మళ్లీ మెయిన్స్ నిర్వహించకుండా రివ్యూ పిటిషన్ వేసేందుకు ఏపీపీఎస్సీ యోచన చేస్తోందన్నారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరై పోస్టింగుల కోసం నిరీక్షిస్తున్నవారు తాజా తీర్పుతో ఖిన్నులయ్యారు.