సాక్షి, అమరావతి :రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్–1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్ psc.ap.gov.in/ లో చూడొచ్చని కార్యదర్శి పేర్కొన్నారు.
గ్రూప్–1 సహా అత్యున్నత కేడర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. తాజా ఉత్తర్వులతో ఈ 42ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్ 30వరకు అమల్లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment