సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టులకు నిర్వహిస్తున్న మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాష పేపర్‌ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) భావిస్తోంది. తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఈ పేపర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనుంది. రానున్న గ్రూప్–1 నోటిఫికేషన్‌లకు దీన్ని వర్తింపచేయనుంది. గ్రూప్–1 మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్ పేపర్‌తోపాటు ఐదు సబ్జెక్ట్ పేపర్లు ఉన్నాయి. ఇంగ్లిష్ పేపర్‌లో అభ్యర్థులు ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఉంది. లేకపోతే మిగతా ఐదు సబ్జెక్టుల పేపర్లలో ఎన్ని మార్కులు సాధించినా వాటిని పరిగణనలోకి తీసుకోరు.
యూపీఎస్‌సీ డ్రాఫ్ట్ సిలబస్ సూచనల మేరకు..
గ్రూప్–1 సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు దేని పంథాన అవి నడుస్తున్నాయి. అయితే అందరికీ ఒకే సిలబస్ ఉంటే మంచిదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కామన్ సిలబస్‌ను ప్రతిపాదించింది. దీని ముసాయిదాను ఆయా రాష్ట్ర కమిషన్లకు పంపి అధ్యయనం చేయించింది. అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో కొద్దికాలం క్రితం గోవాలో సమావేశమై వాటి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. గ్రూప్–1 మెయిన్స్‌లో నాలుగు సబ్జెక్టు పేపర్లు, వీటితోపాటు జనరల్ ఇంగ్లిష్, ఆయా ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఒక పేపర్‌ను ప్రవేశపెట్టాలని యూపీఎస్సీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో సూచించింది.
సబ్జెక్టు పేపర్లతోపాటు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల పేపర్లలో వచ్చిన మార్కులను సైతం మెరిట్‌కు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఏపీపీఏస్సీ ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా ఐదు సబ్జెక్టు పేపర్లను అమలు చేస్తోంది. ఇందులో ఇంగ్లిష్‌ను కేవలం క్వాలిఫై పేపర్‌గా మాత్రమే పరిగణిస్తోంది. యూపీఎస్సీ సూచనల మేరకు ప్రాంతీయ భాషగా రాష్ట్రంలో తెలుగును ఏడో పేపర్‌గా ప్రవేశపెట్టాలని, దాన్ని కూడా క్వాలిఫై పేపర్‌గానే పరిగణించాలని భావిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నారు. గత రెండు రోజులుగా యూపీఎస్సీ ముసాయిదా ప్రతిపాదనలపై ఏపీపీఎస్సీ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది.
గ్రూప్–1 సిలబస్‌లో 20 శాతం మేర మార్పులు
కాగా.. యూపీఎస్సీ ప్రతిపాదనల మేరకు కామన్ సిలబస్‌కు అనుగుణంగా గ్రూప్–1 మెయిన్స్ సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. యూపీఎస్సీ ప్రతిపాదిత కామన్ సిలబస్‌ను అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రస్తుతమున్న ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ సిలబస్ దాదాపు 80 శాతం వరకు దానితో సమానంగా ఉందని భావించింది. మరో 20 శాతం మేర స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ‘ప్రస్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్–1 సిలబస్ యూపీఎస్సీ ప్రతిపాదిత సిలబస్‌తో దాదాపు సమానంగానే ఉంది. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేయాల్సి వచ్చినా 10 నుంచి 20 శాతం సిలబస్‌లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment