Group-2 posts
-
గ్రూప్–2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు గడువును మరో వారం రోజల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు. చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా! -
APPSC : జాబ్స్ పిలుపు.. 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్
త్వరలో గ్రూప్–1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్ తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. సాక్షి, అమరావతి: యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. వెబ్సైట్లో సిలబస్ అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్–1, పేపర్–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్‌ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు. -
ఉద్యోగాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్‌పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. -
‘గ్రూప్-2’పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగ నియామకాలపై ఉమ్మడి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓఎంఆర్‌ను రెండుసార్లు దిద్దినట్లు కనిపించినా, వైట్నర్ వాడినట్లు గుర్తించినా ఆ ఓఎంఆర్‌లను పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంఆర్ అన్సర్ షీట్ల పరిశీలనకు ముగ్గురు న్యాయవాదులను నియమించాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల పరిశీలన జరుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా పడింది. -
గ్రూప్–2 హాల్ టికెట్ల సమస్యకు పరిష్కారం
హైదరాబాద్ కేంద్రాలకూ హాల్ టికెట్ల జారీ సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 26న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను ఏపీ ఆన్లైన్ సంస్థ పరిష్కరించిందని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సజావుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అభ్యర్థులు తమ దృష్టికి తీసుకురాగానే ఏపీ ఆన్‌లైన్‌తో చర్చించామని, సర్వర్‌లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇలా అయ్యిందని గుర్తించి వెంటనే సరిదిద్దే ప్రయత్నాలు చేశామన్నారు. ఈ విషయంలో అభ్యర్థులు తమ సమస్యలపై appsc.halltickets@aptonline. inకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. కులం, స్థానికత తదితర అంశాల్లో తప్పులు చోటు చేసుకున్నట్లు కొంతమంది నుంచి సమాచారం వస్తోందని, అలాంటి అంశాలను సరిచేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు కంప్యూటర్ టెస్టు ఉంటుందని కొందరి నుంచి వస్తున్న సమాచారం సరైనది కాదన్నారు. ఈ విషయంలో కొత్తగా ఎలాంటి అర్హత నిబంధనలు మార్పు చేయలేదని, నోటిఫికేషన్లో ఉన్న మేరకే వర్తిస్తాయన్నారు. ఇలా ఉండగా, హైదరాబాద్ కేంద్రాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్న వారికి కూడా మంగళవారం నుంచి హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. కాగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీవరకు పొడిగించినట్లు కార్యదర్శి సాయి తెలిపారు. -
గ్రూప్-2 పరీక్షకు 6.5 లక్షల మంది దరఖాస్తు
► అత్యధికంగా విశాఖ నుంచి 74,369 దరఖాస్తులు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్-2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు కమిషన్ ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి. ఆదివారం అర్థరాత్రితో గడువు ముగిసే సమయానికి ఈ పోస్టులకు 6,55,729 మంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ పేమెంట్‌కు సంబంధించి బ్యాంకుల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరో వెయ్యి వరకూ పెరుగుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 52,893 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి వచ్చిన ఆన్లైన్ దరఖాస్తుల పరిస్థితిని పరిశీలిస్తే విశాఖపట్టణం జిల్లాలో అత్యధిక శాతం మంది ఈ పరీక్షలకు పోటీపడుతున్నారు. విశాఖపట్టణం నుంచి అత్యధికంగా 74,369 మంది దరఖాస్తు చేశారు. -
మరో 593 గ్రూప్-2 పోస్టులు
- భర్తీకి అనుమతిస్తూ సర్కారు నిర్ణయం - టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు - ఇప్పటికే 434 పోస్టులకు నోటిఫై మొత్తంగా 1,027 పోస్టుల - భర్తీకి సన్నాహాలు త్వరలోనే నోటిఫికేషన్ - జారీ అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో 593 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటి భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి అనుమతి నిస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆ పరీక్ష నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులతోపాటు తాజాగా అనుమతించినవి కలిపి మొత్తంగా 1,027 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా అనుమతించిన పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్.. 434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులూ వచ్చాయి. కానీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు, యువత నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో తమకు అదనంగా పోస్టులు అవసరమని పలు ప్రభుత్వ విభాగాలు సీఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లాయి. మరోవైపు మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో వెయ్యికిపైగా పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమని.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై సీఎస్ ఆదేశాల మేరకు తమకు అదనంగా కావాల్సిన పోస్టుల వివరాలను వివిధ ప్రభుత్వ విభాగాలు నివేదికలు సమర్పించాయి. ఆ ఫైలుకు తాజాగా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ పోస్టులతో నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులివే: తాజాగా భర్తీ చేయనున్న 593 పోస్టుల్లో... వ్యవసాయం-సహకార శాఖ పరిధిలోని కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 62; సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 90; ఆర్థిక శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 28; న్యాయ శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10; పరిశ్రమల శాఖలోని హ్యాండ్లూమ్, టెక్స్టైల్ విభాగం పరిధిలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ 20; కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 3; వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 46; డిప్యూటీ తహసీల్దార్ 259; ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ 64; దేవాదాయశాఖ పరిధిలో కార్యనిర్వహణాధికారి గ్రేడ్-1 పోస్టులు 11 ఉన్నాయి. -
కొత్త జిల్లాల తర్వాతే?
► గ్రూపు-2 భర్తీ.. అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం ► ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు తప్పని నిరాశ సాక్షి, హైదరాబాద్ ఈ ఏడాది కూడా నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. టీఎస్పీఎస్సీ గ్రూపు-2 పోస్టుల భర్తీకి ‘కొత్త’ సమస్య వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆటంకంగా మారనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాకే గ్రూపు-2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా ప్రభుత్వ వైఖరి ఉంది. దీంతో గ్రూపు-2 పరీక్ష ఇప్పట్లో నిర్వహించే పరిస్థితిలేదు. ఫలితంగా 5,64,431 మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు మిగిలే అవకాశముంది. 439 పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంగా పరీక్షను వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వం అదనపు పోస్టులు ఇచ్చే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు మరో 460 పోస్టులు వస్తాయని అభ్యర్థులు భావించారు. ఇంకా టీఎస్పీఎస్సీకి వాటి వివరాలు అందలేదు. ఈలోగా జిల్లాల విభజన అంశం ముందుకు వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి జోనల్ సమస్య ఆటంకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాకే అదనపు పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఒక జిల్లాలోని మండలాలు మరో జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో ఏ పోస్టు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది? ఏ జోన్ పరిధిలోకి వెళ్తుందన్న గందరగోళం నెలకొంది. ఐదో జోన్ పరిధిలో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్‌లోని నల్లగొండ జిల్లాకు చెందిన 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే ఆరో జోన్లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని 5 మండలాలు, వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనలు జోనల్ సమస్యకు దారి తీసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక, గ్రూపు-2 ఖాళీలు స్పష్టంగా ఏయే జిల్లాలో ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుస్తాయని, అప్పుడే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. -
గ్రూప్-2.. ఒక్కో పోస్టుకు 1,285 మంది
► గ్రూప్-2లో 439 పోస్టులకు 5,64,431 దరఖాస్తులు ► అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది ► అత్యల్పంగా నిజామాబాద్ నుంచి 33,473 మంది పోటీ ► ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష.. ► ఏర్పాట్లు ప్రారంభించిన టీఎస్పీఎస్సీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రకటించిన గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఐదు శాఖల పరిధిలోని 439 పోస్టులకు 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,03,379 మంది మహిళా అభ్యర్థులు, 3,61,052 మంది పురు ష అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా ఒక్కో పోస్టుకు సగటున 1,285 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే... అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా నుంచి 33,473 మంది పోటీ పడుతున్నారు. ఇక ఈసారి పోస్టుల భర్తీలో ప్రభుత్వం వయోపరిమితిని సడలించడంతో... 34 ఏళ్ల వయసు దాటిన 64,206 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39-44 ఏళ్ల మధ్య వయసున్న వారు 16,465 మంది, 44 ఏళ్లు దాటినవారు 2,758 మంది ఉన్నారు. గ్రూప్-2 పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసినందున పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషన్ చైర్మన్ చక్రపాణి తెలిపారు. పది లక్షలు దాటిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ద్వారా ఇప్పటివరకూ పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ నెల 9వ తేదీ నాటికి 10,04,427 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.