గ్రూప్-2.. ఒక్కో పోస్టుకు 1,285 మంది
► గ్రూప్-2లో 439 పోస్టులకు 5,64,431 దరఖాస్తులు
► అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది
► అత్యల్పంగా నిజామాబాద్ నుంచి 33,473 మంది పోటీ
► ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష..
► ఏర్పాట్లు ప్రారంభించిన టీఎస్‌పీఎస్సీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రకటించిన గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఐదు శాఖల పరిధిలోని 439 పోస్టులకు 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,03,379 మంది మహిళా అభ్యర్థులు, 3,61,052 మంది పురు ష అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా ఒక్కో పోస్టుకు సగటున 1,285 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే... అత్యధికంగా కరీంనగర్ నుంచి 80,442 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా నుంచి 33,473 మంది పోటీ పడుతున్నారు.
ఇక ఈసారి పోస్టుల భర్తీలో ప్రభుత్వం వయోపరిమితిని సడలించడంతో... 34 ఏళ్ల వయసు దాటిన 64,206 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39-44 ఏళ్ల మధ్య వయసున్న వారు 16,465 మంది, 44 ఏళ్లు దాటినవారు 2,758 మంది ఉన్నారు. గ్రూప్-2 పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసినందున పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషన్ చైర్మన్ చక్రపాణి తెలిపారు.
పది లక్షలు దాటిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ద్వారా ఇప్పటివరకూ పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ నెల 9వ తేదీ నాటికి 10,04,427 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.