
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించాలనే తపనతో సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో చాలామంది దరఖాస్తుల సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ విశ్లేషించింది. ఫలితంగా మెజారిటీ అభ్యర్థులు ఉద్యోగ యత్నం నుంచి ఆదిలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడింది. గతేడాది కాలంగా విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తు సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్ తీరుకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేసింది.
26 ప్రకటనలు.. 17,134 కొలువులు
గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 17,134 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ 26 ఉద్యోగ ప్రకటనలు జారీచేసి దరఖాస్తులను స్వీకరించింది. అయితే దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు సకాలంలో స్పందించడం లేదని కమిషన్ గుర్తించింది. దరఖాస్తు తొలినాళ్లలో పట్టించుకోకుండా గడువు తేదీ సమీపిస్తున్న తరుణంలో హడావుడి చేస్తున్నట్లు కనుగొంది.
ఈ క్రమంలో సాంకేతిక కారణాలు, ఇతర ధ్రువపత్రాలు అందుబాటులో లేని కారణంగా తొలి ఘట్టమైన దరఖాస్తు సమర్పణ ప్రక్రియకే దూరమవుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే తొలి రెండు రోజుల్లో కేవలం 3.79 శాతం మంది అప్లై చేసుకోగా చివరి రెండ్రోజుల్లో 22.37 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు.
గ్రూప్–2 కేటగిరీలో తొలి రెండ్రోజుల్లో 9.24 శాతం దరఖాస్తులు రాగా చివరి రెండ్రోజుల్లో 16.32 శాతం మేర దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్–3లో తొలి రెండ్రోజులకు 7.22 శాతం, చివరి రెండ్రోజులకు 10.80 శాతం, గ్రూప్–4లో తొలి రెండ్రోజులు 3.45 శాతం, చివరి రెండ్రోజులు 10.69 శాతం మేర దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వివరించింది.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లోనూ ఆలస్యమే..
దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది హాల్‌టికెట్లను సైతం సకాలంలో డౌన్‌లోడ్ చేసుకోవడంలేదని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. పరీక్ష తేదీకి వారం ముందుగానే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతున్నా ఎక్కువ మంది అభ్యర్థులు వాటిని పరీక్ష తేదీకి ఒకట్రెండు రోజుల ముందే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా పరీక్ష కేంద్రాన్ని సరిచూసుకోకపోవడంతోపాటు హాల్‌టికెట్లలో పొరపాట్లను సైతం పరిష్కరించుకోకుండానే చివరకు పరీక్షకు దూరమవుతున్నారని కమిషన్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment