unemployed candidates
-
ఇలా భర్తీ.. అలా ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణ మవుతోంది. నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరా శకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారు తోంది. ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురుచూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే.. మరోవైపు వేలకొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవడం.. నియామక పత్రాలు స్వీకరించడం.. చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకుని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి కారణాలతో మిగిలిపోయినట్టు అంచనా. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండటమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.భర్తీ 53 వేలు.. ఖాళీ అయినవి 10 వేలు!రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 53 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతుండగా.. మిగతా కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ (టీజీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై కేటగిరీలలో 16,067 ఉద్యోగాలు భర్తీకాగా.. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా 11 వేల ఉద్యోగాలను, గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా 8,304 గురుకుల టీచర్ పోస్టులను, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవిగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటిలో కలిపి సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ అయి, ఆ వెంటనే ఖాళీ అయ్యాయి.అటకెక్కిన అవరోహణ విధానం..ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో ఒక క్రమపద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి.. తర్వాత క్రమంగా దిగువ కేడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేసి... తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, చివరగా గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను ప్రకటించగా.. నియామక ఉత్తర్వులు కూడా జారీ అవుతున్నాయి. త్వరలో గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు సాధించినవారు వాటిలో ఎంపికైతే, గ్రూప్–4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీ అయినట్టే.కానరాని సమన్వయం..రాష్ట్రంలో నాలుగు రిక్రూట్మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీసు నియామకాలు, గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా.. ఎవరికివారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరం. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు, తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం గమనార్హం.నియామక పత్రాల జారీ ఇలా..ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగ నియామక పత్రాల జారీ సాగింది. ప్రధానంగా ఎల్బీ స్టేడియం వేదికగా పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. జనవరి 31న వైద్యారోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన 6,959 మందికి నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 7న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 441 కారుణ్య నియామకాలు చేపట్టారు.⇒ ఫిబ్రవరి 14న పోలీసు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో 13,444 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 15న గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీలు కేటగిరీలలో 1,997 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ మార్చి 4న గురుకులాల్లో లెక్చరర్, టీచర్, మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీల్లో 5,192 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ సెప్టెంబర్ 26న వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 687 మంది అపాయింట్ అయ్యారు. ⇒ తర్వాత గురుకులాల్లోని లైబ్రేరియన్, పీఈటీ, ఇంజనీరింగ్ కేటగిరీలో ఏఈఈ, అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీలకు సంబంధించి 1,635 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ దసరా సందర్భంగా అక్టోబర్ 9న 10,009 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా వేర్వేరు రోజుల్లో ఇప్పటివరకు 8,143 మందికి నియామక పత్రాల పంపిణీ జరిగింది.అన్ని రకాల పోస్టుల్లో అదే ఖాళీలు..⇒ గురుకుల విద్యా సంస్థల్లో కూడా తొలుత పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) ఫలితాలను ప్రకటించి, నియామక ఉత్తర్వులు జారీ చేశాక.. అంతకంటే పెద్ద కేటగిరీలైన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టడంతో వేలాది ఖాళీలు ఏర్పడ్డాయి. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా... విధుల్లో చేరింది సుమారు 6 వేల మందే. ఇలా గురుకుల పోస్టుల్లోనే 20శాతానికిపైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు మొదట భర్తీ చేసి, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ను భర్తీ చేస్తే నియామకాలు నూరుశాతం జరిగేవి. కానీ రెండు కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి, నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెయ్యికి పైబడి ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి.⇒ పోలీస్ శాఖలో జరిగిన నియామకాల్లోనూ రెండున్నర వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ఇప్పుడు గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరేనాటికి మొత్తం 53వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు ఖాళీగా ఉండిపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..!
పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది. ప్రపంచం ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి. చాలా దేశాల్లో సరిపడా ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందేంత స్థోమతలేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు సంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలామందికి పని దొరకడం కష్టం అవుతోంది. పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇదీ చదవండి: విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్! నూటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్కతేల్చే ‘నిరుద్యోగిత రేటు’ నిత్యం మారుతోంది. భారత్‌లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1 శాతంగా ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్ల్యాండ్లో తక్కువగా 2 శాతం నిరుద్యోగితరేటు ఉంటే గరిష్ఠంగా దక్షిణాఫ్రికాలో 31.9 శాతం ఉంది. Unemployment rate: 🇿🇦 South Africa: 31.9% 🇪🇸 Spain: 11.84% 🇹🇷 Turkey: 9.1% 🇧🇷 Brazil: 7.7% 🇮🇹 Italy: 7.4% 🇫🇷 France: 7.4% 🇮🇳 India: 7.1% 🇦🇷 Argentina: 6.2% 🇩🇪 Germany: 5.8% 🇨🇦 Canada: 5.7% 🇮🇩 Indonesia: 5.32% 🇨🇳 China: 5% 🇸🇦 Saudi: 4.9% 🇬🇧 UK: 4.2% 🇺🇸 US: 3.9% 🇦🇺 Australia:… — World of Statistics (@stats_feed) November 23, 2023 -
TSPSC: ఆఖరి నిమిషంలో హడావుడి!.. ఇదీ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించాలనే తపనతో సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో చాలామంది దరఖాస్తుల సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్లోడ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ విశ్లేషించింది. ఫలితంగా మెజారిటీ అభ్యర్థులు ఉద్యోగ యత్నం నుంచి ఆదిలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడింది. గతేడాది కాలంగా విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తు సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ తీరుకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేసింది. 26 ప్రకటనలు.. 17,134 కొలువులు గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 17,134 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి టీఎస్పీఎస్సీ 26 ఉద్యోగ ప్రకటనలు జారీచేసి దరఖాస్తులను స్వీకరించింది. అయితే దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు సకాలంలో స్పందించడం లేదని కమిషన్ గుర్తించింది. దరఖాస్తు తొలినాళ్లలో పట్టించుకోకుండా గడువు తేదీ సమీపిస్తున్న తరుణంలో హడావుడి చేస్తున్నట్లు కనుగొంది. ఈ క్రమంలో సాంకేతిక కారణాలు, ఇతర ధ్రువపత్రాలు అందుబాటులో లేని కారణంగా తొలి ఘట్టమైన దరఖాస్తు సమర్పణ ప్రక్రియకే దూరమవుతున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే తొలి రెండు రోజుల్లో కేవలం 3.79 శాతం మంది అప్లై చేసుకోగా చివరి రెండ్రోజుల్లో 22.37 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్–2 కేటగిరీలో తొలి రెండ్రోజుల్లో 9.24 శాతం దరఖాస్తులు రాగా చివరి రెండ్రోజుల్లో 16.32 శాతం మేర దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్–3లో తొలి రెండ్రోజులకు 7.22 శాతం, చివరి రెండ్రోజులకు 10.80 శాతం, గ్రూప్–4లో తొలి రెండ్రోజులు 3.45 శాతం, చివరి రెండ్రోజులు 10.69 శాతం మేర దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లోనూ ఆలస్యమే.. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది హాల్‌టికెట్లను సైతం సకాలంలో డౌన్లోడ్ చేసుకోవడంలేదని టీఎస్పీఎస్సీ పేర్కొంది. పరీక్ష తేదీకి వారం ముందుగానే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతున్నా ఎక్కువ మంది అభ్యర్థులు వాటిని పరీక్ష తేదీకి ఒకట్రెండు రోజుల ముందే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా పరీక్ష కేంద్రాన్ని సరిచూసుకోకపోవడంతోపాటు హాల్టికెట్లలో పొరపాట్లను సైతం పరిష్కరించుకోకుండానే చివరకు పరీక్షకు దూరమవుతున్నారని కమిషన్ వివరించింది. -
మీ తప్పులకు మేము బలవ్వాలా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అడ్డగోలు నిబంధనలు విధిస్తూ, వాటిని తరచూ మార్పు చేస్తూ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఏపీపీఎస్సీ తప్పులకు తాము బలవ్వాలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే మే 26న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు సంబంధించి కమిషన్ నిర్ణయంతో అన్యాయం జరిగిందని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్లో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే.. పరీక్షకు వారం ముందు అనుమతించబోమని ప్రకటించింది. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌కు అనుమతి ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడంతో నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే పరీక్షలో ఆంగ్లం నుంచి తెలుగులో అనువాదం చేసి ఇచ్చిన ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. వీటిపైనా అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. డీఏవో పరీక్షకూ షరతులు జూలై 7న నిర్వహించే డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రిలిమ్స్ పరీక్షకు కూడా క్యాలిక్యులేటర్ అనుమతిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న ఏపీపీఎస్సీ శుక్రవారం అనుమతి ఇవ్వబోమని వెబ్‌నోట్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని పరీక్ష సమయంలో మరో నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అభ్యర్థులు అంటున్నారు. క్యాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నోటిఫికేషన్లో ముందే పేర్కొని ఉంటే దానికనుగుణంగా సన్నద్ధమయ్యేవారమని చెబుతున్నారు. ఇదంతా పరిశీలిస్తే.. సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేసేందుకు, అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కేలా కావాలనే ఇలా చేస్తుందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి పైనా.. కాగా.. ఏపీపీఎస్సీ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు కూడా అభ్యర్థులకు శాపంగా మారుతున్నాయి. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ.. ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా అభ్యర్థుల నిష్పత్తిపై నిర్ణయాన్ని ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఏ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారో ఏపీపీఎస్సీ ముందుగా వెల్లడించడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గతంలోని నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా 400 పోస్టులు జత చేసి 1:50 నిష్పత్తిలో ఎంపికకు అవకాశం కల్పించారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య పెరగకపోయినా కనీసం మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నా కమిషన్ వారి మొర ఆలకించడం లేదు. గతంలో గ్రూప్–1కు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు అన్నింటికీ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు శిక్షణా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆప్టిట్యూడ్ ప్రశ్నలపైనా అదే తీరు యూపీఎస్సీ తరహా అంటూనే ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో యూపీఎస్సీ.. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టింది. దీనిలో పూర్తిగా అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన పరీక్షలో అర్థమెటిక్ అవసరం లేదని, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ అంశాలు ఉంటే చాలని పలువురు అభిప్రాయపడ్డారు. అర్థమెటిక్ అంశాల వల్ల తమకు నష్టం జరుగుతుందని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో యూపీఎస్సీ సీ–శాట్ పేపర్‌ను కేవలం క్వాలిఫైయింగ్ పేపర్‌గా మార్చింది. కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీ అదే ఆప్టిట్యూడ్ ప్రశ్నలను గ్రూప్–1లో ప్రవేశపెట్టడంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. తెలుగులో ప్రశ్నలు ఇవ్వకుండా.. కొన్ని కేటగిరీల పోస్టులకు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతామని, తెలుగు మాధ్యమంలో ప్రశ్నలు ఉండవని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. యూపీఎస్సీ, బ్యాంకింగ్ నియామక సంస్థలే అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు అడుగుతుండగా ఏపీపీఎస్సీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మరోపక్క కొన్ని కేటగిరీల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నలు అడుగుతున్నా అనువాదంలో అనేక తప్పులు ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ తెలుగు మాధ్యమ ప్రశ్నల్లో ఏకంగా 36 ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కమిషన్ చైర్మన్ తీరుపై నిరసన కాగా.. గతంలో ఎన్నడూ లేని వివాదాలు ప్రస్తుత చైర్మన్ పి.ఉదయభాస్కర్ హయాంలోనే ఏపీపీఎస్సీని చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నియమితులైన ఈయన ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలో గ్రూప్–2లో పేపర్ లీకేజీ ఆరోపణల వివాదంపై పలువురిపై అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పటికీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ నుంచి నోటీసులు వస్తున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ హయాంలో తమకు న్యాయం జరగదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఉద్యోగాలిస్తానని మోసం చేస్తావా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘జాబు కావాలంటే బాబు రావాల’ని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే భిక్షమేసినట్లు ఏడు వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మోసం చేశారని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం వారు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకుముందు నగరంలోని శకుంతల కల్యాణ మండపం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. డీఎస్సీ పోస్టులను పెంచాలని, సిలబస్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, గంటాకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించి.. వారితో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేల పోస్టులను నోటిఫికేషన్లో చూపించి అందులోనూ వెయ్యి పోస్టులను కుదించడం అన్యాయమన్నారు. ఏటా డీఎస్సీని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం..నాలుగున్నరేళ్లుగా మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. ప్రస్తుత డీఎస్సీలో కొన్ని విభాగాల్లో పోస్టులే లేవని, అలాంటప్పుడు ఏళ్లుగా వాటి కోసమే చదువుతున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక అభ్యర్థితో రెండు పరీక్షలకు డబ్బు కట్టించుకున్న ప్రభుత్వం..పరీక్ష మాత్రం ఒక్కదానినే రాయాలని పేర్కొనడం దారుణమన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మోసం చేసిన ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థులు బుద్ధి చెప్పాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. 22 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యి.. ప్రతి పోస్టు భర్తీకి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ కోసం ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఏడు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. ఇది కూడా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. నిరుద్యోగ భృతి కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి డీఎస్సీ పోస్టులను పెంచాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఆసిఫ్, కృష్ణకాంత్‌రెడ్డి, రవిబాబు, జగన్నాథరెడ్డి, వై.రాజశేఖరరెడ్డి, ధనుంజయాచారి, భాస్కరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం దా‘రుణం’!
ఖమ్మంమయూరిసెంటర్: ఉపాధి చూసుకునేందుకు, ఆర్థిక స్వావలంబన పొందేందుకు సబ్సిడీ రుణాలిచ్చి చేయూతనిచ్చే రాజీవ్ యువశక్తి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు సంవత్సరాలుగా దీనిద్వారా ఎలాంటి రుణాలు మంజూరు చేయట్లేదు. అసలు..దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం ఏర్పాటు చేశారా? లేక కొనసాగిస్తారా? యువజనుల పరిస్థితి ఏంటి..? అనే అంశాలపై స్పష్టత కరువైంది. రుణాలు పొంది బాగుపడుదామనుకున్న అర్హులు..తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువజన సర్వీసుల శాఖ (సెట్‌కమ్) నిర్వీర్యమైంది. లోన్లు ఇచ్చి సొంత వ్యాపారం పెట్టించే, బతుకుదెరువు చూపించే రాజీవ్ యువశక్తి పథకం ద్వారా చివరిసారిగా 2014–15 లో జిల్లాలోని 296 మంది నిరుద్యోగులకు రూ.2.77 కోట్ల రుణాలను 30శాతం సబ్సిడీపై మంజూరు చేశారు. ఆ తర్వాత మూడేళ్లుగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి లోన్లు కేటాయించలేదు. యువజ న సర్వీసుల శాఖతోపాటు క్రీడల విభాగాన్ని కూడా అనుసంధానం చేసి డీవైఎస్వోగా మార్చారు. దీంతో యువత కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన శాఖ ద్వారా రుణా లు అందుతాయని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో రాజీవ్‌యువశక్తి పథకం ఉందో లేదో తెలియని అయోమయం నెలకొంది. అన్నివర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచే శాఖ నుంచి పథకాలు తీసేస్తే తమ పరిస్థితి ఏంటని యువత ప్రశ్నించుకుంటున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై చదువులు పూర్తిచేసి, ఉద్యోగాలు లేని అనేకమంది యువత సెట్క మ్ ద్వారా అందించే రుణాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ శాఖ చడీచప్పుడు లేకుండా పడిఉంది. జీఓ వచ్చినా రుణాలు రాలే.. 2016–17 ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగ యువతకు మూడు విభాగాలుగా సబ్సిడీ కోటాను పెంచింది. స్కీమ్–ఏ కింద 7వ తరగతివరకు చదివిన నిరుద్యోగులకు రూ.లక్ష వరకు లోను మంజూరు చేస్తారు. దీనికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. స్కీమ్–బీ కింద పదో తరగతి విద్యార్హతపై నిరుద్యోగులకు రూ.2లక్షల రుణం ఇచ్చి, 70శాతం సబ్సిడీని వర్తింపజేయాలి. స్కీమ్–సీ కింద డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు రూ.5లక్షల వరకు 60శాతం సబ్సిడీపై రుణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జీవో జారీ అయినా..నేటికీ మార్గదర్శకాలు రాలేదు. నిరుద్యోగులకు వెతలు తప్పట్లేదు. నిరుద్యోగుల్లో తీరని వేదన.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతను చైతన్య పరచడంతో పాటు వారిలోని కళను వెలికితీయడం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సబ్సిడీ రుణాలు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖను ఏర్పాటు చేసింది. అయితే ఏ లక్ష్యంతో దీనిని ప్రారంభించారో ఆ శాఖ నుంచి నిరుద్యోగులకు అవసరమైన సాయం మాత్రం అందట్లేదు. కేవలం యువతలోని కళలను మాత్రమే ప్రొత్సహిస్తున్న యువజన సర్వీసుల శాఖ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించలేట్లేదు. ప్రభుత్వ శాఖను క్రీడలశాఖలో విలీనం చేసి, రెండు శాఖలకు ఒకే అధికారిని నియమించింది. దీంతో నిరుద్యోగులు, యువజన సంఘాలు, కళాకారులతో కళకళలాడే యువజన సర్వీసుల శాఖ గత రెండు సంవత్సరాల నుంచి వెలవెలబోతోంది. ఈ శాఖ నుంచి తమకు సాయం అందదని నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు. -
బీసీ రుణాలపై వీడని సందిగ్ధత
బీసీ రుణాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. నాలుగేళ్లుగా స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రుణాల పంపిణీ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖకు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం స్వయం ఉపాధితో జీవనం గడుపుదామని భావించిన బీసీ వర్గాలకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖకు బీసీలు, ఎంబీసీలు, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం 100 మందికి రూ.50 వేల చొప్పున 50 లక్షల రుణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మిగతా దరఖాస్తుదారులు తమకు రుణాలు వస్తాయా లేదా అనే మీమాంసలో పడ్డారు. సాక్షి, కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడబోమని పదేపదే వేదికలపై వల్లెవేస్తున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల జాడే లేదు. ఫెడరేషన్ల పరిస్థితి అదే తీరు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక ఊసేలేదు. దీంతో బడుగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలతో ఆశలు.. ఎన్నడూ లేని విధంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికలో భారీ రాయితీలను ప్రకటించింది. గతంలో ఇంత భారీ మొత్తం ఇవ్వలేదు. ఇచ్చినా రూ.2 లక్షలు మించి ఇచ్చేవారు కాదు. రాయితీ రుణంలో 50 శాతం మించేది కాదు. ఈసారి ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచింది. కేటగిరి 1,2,3 పేరిట ఈ మొత్తాన్ని పెంచినట్లు ప్రకటించింది. కేటగిరి 1 లో రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం, ఆపై 50 శాతం రాయితీ వర్తింపజేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. బీసీ కార్పొరేషన్లో 21,323 దరఖాస్తులు వచ్చాయి. ఫెడరేషన్ రుణాల పరిమితిని పెంచి రాయితీని పెంచారు. రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రాయితీ ప్రకటించారు. దీనికితోడు గౌడ సంఘానికి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఫెడరేషన్స్ రుణాల కోసం దరఖాస్తులు వచ్చాయి. అందేది ఎప్పుడు..? బీసీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరానికి మార్జిన్ మనీ కింద లక్ష్యం 434 యూనిట్లకు రూ.388.80 లక్షలు ఇవ్వగా 418 యూనిట్లకు రూ. 320.78 లక్షలకు మంజూరు ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి 146 యూనిట్లకు రూ.108.64 లక్షల నిధులు మంజూరు కాగా, 272 యూనిట్లకు రూ. 212.06 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వారికి సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన కింద 128 యూనిట్లకు రూ.121 లక్షలుగా లక్ష్యం నిర్దేశిస్తే 120 యూనిట్లకు రూ.93.40 లక్షలు మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇందులో కేంద్ర కార్యాలయం నుంచి 102 యూనిట్లకు రూ.76.25 లక్షల నిధులు లబ్ధిదారుల చేతికి వచ్చాయి. ఇంకా 11 మందికి రూ.12.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. మొత్తంగా 283 మంది లబ్ధిదారులకు రూ.224.21 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఫెడరేషన్ల పరిస్థితీ అంతే.. జిల్లాలో వివిధ సామాజిక ఫెడరేషన్లలో 37 యూనిట్లకు రూ.432.50 లక్షలు మంజూరు ఇస్తే ఇప్పటివరకు 14 ఫెడరేషన్ యూనిట్ల కు రూ.168 లక్షలు మాత్రమే మంజూరు చే శారు. ఇంకా 23 ఫెడరేషన్లకు రూ.264.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఫెడరేషన్ల సభ్యులు రుణాలకు ఎదురుచూస్తున్నారు. కమ్ముకున్న నీలినీడలు.. 2015–16, 2016–17 సంవత్సరాలకు మంజూరు చేసిన రుణాలకే రాయితీలు రాక లబ్ధిదారులు బ్యాంకులు, బీసీ అభివృద్ధి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతోంది. అయినా.. ఇప్పటివరకు పాత రుణాల జాడలేదు. కొత్త రుణాలకు సంబంధించిన ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీసీ, ఎంబీసీలకు, ఫెడరేషన్లకు మూడు కేటగిరీలలో 100 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మరో 20 వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మళ్లీ రుణాలు ఇస్తారో లేదో అనే సందేహంలో పడ్డారు. ఇప్పటికే స్టెప్‌కార్ ద్వారా ఇచ్చే రుణాలను ఎత్తివేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు మంగళం పాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా.. రూ.2 లక్షలు రుణం మంజూరు చేసి ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటివరకు రుణం డబ్బులు బ్యాంకులో వేయలేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారుల వద్దకు వెళ్తే నేరుగా మీ ఖాతాకే లోన్ మొత్తం వస్తుందంటున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లోన్ జాడే లేదు. – నాగవెల్లి లక్ష్మీనారాయణ, లబ్ధిదారుడు బీసీలను విస్మరించడం బాధాకరం.. జనాభాలో సగభాగమున్న బీసీలను దగా చేయడం బాధాకరం. భారీ రాయితీలు ప్రకటించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి రుణాలు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం బీసీల మనోభావాలను దెబ్బతీయడమే. నాలుగేళ్ల అనంతరం కేవలం 50 వేల చొప్పున రుణం ఇవ్వడం సరికాదు. – కేశిపెద్ది శ్రీధర్‌రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభల ద్వారా ఎంపికై ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్ల ద్వారా వంద మందిని ఎంపిక చేశాం. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు అందించాం. మిగితా దరఖాస్తుదారులకు సంబంధించి బడ్జెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగానే పంపిణీ చేస్తాం. – రంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
కుదింపు కుదిరితేనే రుణం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రుణాలు అందజేసి ఆదుకుంటోంది. రూ.లక్ష నుంచి రూ.12లక్షల వరకు సబ్సిడీ రుణాలు పొందేందుకు నిరుద్యోగులు, చిరువ్యాపారులు, యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న విషయం విదితమే.. కాగా 2017–18 సంవత్సరానికి గాను కేటగిరి–1 కింద రూ.లక్ష యూనిట్ కోసం 3,882 మంది బీసీ లబ్ధిదారులు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో రూ.50వేల యూనిట్ ఆప్షన్ లేకపోవడం, రూ.లక్ష యూనిట్ నుంచే రుణాల దరఖాస్తుల స్వీకరణ ఉండడంతో వాటికి అనుగుణంగానే దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలను అందజేసింది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వేలకు పైగా బీసీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, పూర్తిస్థాయిలో రుణాలకు పంపిణీ చేయలేదు. రూ.లక్ష యూనిట్ కింద దరఖాస్తు చేసుకున్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందజేసి చేతులు దులిపేసుకుంది. మూడేళ్లుగా రుణాలు అందించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా 2017–18 సంవత్సరానికి సంబంధించి బీసీలకు పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రుణాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్ కింద రూ.50వేల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయనుండడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. మిగతా వారికెప్పుడో..! బీసీ స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం కేటగిరి–1 కింద రూ.1లక్ష యూనిట్ నుంచి మొదలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అప్పుడు రూ.50వేల యూనిట్ అని ఎక్కడా లేదు. అయితే రూ.లక్ష యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 వేలకు కుదించి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కాకుండా రూ.50వేల వరకు అవసరమున్న కుటీర పరిశ్రమల వారికి వంద శాతం సబ్సిడీపై పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కుదింపునకు ఒప్పుకున్న వంద మంది లబ్ధిదారులకు అందజేయనుంది. కాగా, కేటగిరి–1లో 3,882 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆయా మండలాల ఎంపీడీఓల నుంచి ఆన్లైన్ ద్వారా 2,708 మంది జాబితా సంబంధిత శాఖలకు చేరుకున్నాయి. కేటగిరి–2లో రూ.లక్ష పైనుంచి రూ.2లక్షల్లోపు 7,051 మంది ఆన్లైన్లో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, 5,364 మందికి సంబంధించిన జాబితా సంబంధిత శాఖకు చేరుకుంది. కేటగిరి–3లో రూ.2లక్షల పైనుంచి రూ.12లక్షల వరకు రుణాల కోసం 2,973 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1305 మంది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా బీసీ కార్పొరేషన్‌కు చేరుకుంది. మిగతా లబ్ధిదారుల జాబితా చేరాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వంద మంది లబ్ధిదారులకు మాత్రమే రూ.50వేల యూనిట్‌కు సంబంధించి రుణాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం రూ.50 లక్షల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.12లక్షల దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురుచూస్తున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. చిరువ్యాపారులకు ప్రాధాన్యం.. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చిరువ్యాపారు(స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్)లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని రూ.50వేల వరకు రుణాలను పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అందించనున్నారు. చిరువ్యాపారాలు చేసుకొని వీరు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించనుంది. బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి గతంలో ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా స్వయం ఉపాధి రుణాలను అందించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు కాకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే నగదు జమ చేయాలి. పరికరాలను అందజేస్తే నాసిరకంతోపాటు దళారులకు మేలు కలిగించేలా అవుతుంది. లబ్ధిదారులకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచించాలి. – చిక్కాల దత్తు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రూ.లక్ష రుణం అందించాలి.. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ వంద శాతానికి బదులు రూ.లక్ష రుణం వంద శాతం రాయితీపై కల్పించాలి. నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే సబ్సిడీ రుణాన్ని జమ చేయాలి. లేనిపక్షంలో లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుంది. – మందపెల్లి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంద మందికి పంపిణీ.. వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వంద మంది లబ్ధిదారులకు రూ.50వేల చొప్పున రుణాలు అందించనున్నాం. రూ.లక్ష నుంచి కుదించి రూ.50వేలకు ఒప్పుకున్న లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందించనున్నాం. వీటికి సంబంధించి రూ.50లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. – ఆశన్న, జిల్లా బీసీ శాఖ అభివృద్ధి అధికారి -
సబ్సిడీ.. దుర్వినియోగం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా హెవీ లైసెన్స్ కలిగిన వారికి వాహనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీ మహిళాలకు 45 శాతంపై, పురుషులకు 35 శాతంపై సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేరుపై సబ్సిడీ రుణాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొంత మంది ఎస్సీ, ఎస్టీలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. శాఖల వారీగా.. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాలను పొంది వారు ఉపాధి పొందుతునే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 96 యూనిట్లను మంజూరు చేశారు. రూ.2,00,09,000 సబ్సిడీ కింద అందజేశారు. ఇందులో ఆటో ట్రాలీలు 22 మందికి, ట్యాక్సి కార్ 17 మందికి, గల్పర్ మిషన్ 2, ప్యాసింజర్ ఆటోలు 44మందికి, పికప్ వ్యాన్ 5 మందికి, టాటా ఏస్ 2, ట్రాక్టర్, ట్రాలీ 4గురికి అందజేశారు. 2016–17 సంవత్సరంలో 25 మంది లబ్ధిదారులకు రూ.66లక్షల సబ్సిడీతో రుణాలు అందించారు. వీటిలో ట్రాక్టర్ ట్రాలీ 2, టాటా ఏస్ 1, పికప్ వ్యాన్ 1, డీజిల్ ఆటోలు 3, ట్యాక్సి కార్ 7, ఆటో ట్రాలీ 11 మంది లబ్ధిదారులకు అందజేశారు. 2017–18 సంవత్సరంలో 21 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్, ప్యాసింజర్ ఆటోలు, ఆటో ట్రాలీలు, ఆటో పికప్ వ్యాన్లను మంజూరు చేయగా, వీరికి రూ 45.54లక్షల సబ్సిడీని అందజేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సీసీడీపీ పథకం ద్వారా ఐసీడీఎస్‌లో 34 మంది పీటీజీ తెగలకు రూ.50లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీపై ఆటోలను అందించారు. వీరు నెలల వాయిదా పద్ధతిలో తీసుకున్న రుణాన్ని బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. 2016–17ఆర్థిక సంవత్సరంలో 124 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 6లక్షల 27వేల వ్యయంతో ప్యాసింజర్ ఆటోలను అందించారు. రెండు ప్యాసింజర్ మోటార్ క్యాబ్‌లను అందజేశారు. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా.. స్వయం ఉపాధి రుణాల పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 శాతం సబ్సిడీపై, పురుషులకు 35 శాతం సబ్సిడీపై రుణాలను అందజేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో 2014 సంవత్సరం నుంచి 2017 వరకు 28 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.80,91,069 సబ్సిడీ మంజూరు చేశారు. 11 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.28,55,221 సబ్సిడీని మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీ ప్రైడ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 42 మంది లబ్ధిదారులకు, 40 మంది ఎస్టీలకు రుణాలను మంజూరు చేశారు. ఇదిలా ఉండగా పరిశ్రమ శాఖలో కొంతమంది ఎస్సీ, ఎస్టీలపై భారీగా సబ్సిడీ రుణాలను పొంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రూ.10లక్షలలోపు రుణం తీసుకుంటే జిల్లా కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. రూ.10లక్షలకు పైగా రుణం తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సబ్సిడీ నగదు సకాలంలో మంజూరు కాకపోవడం, మంజూరైన ఖాతాలో జమ కాకపోవడంతో లబ్ధిదారులు వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే సబ్సిడీని వడ్డీ కిందకే కట్టావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో చెల్లిస్తే పేదలను ఆదుకున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు జిల్లాలోని నిరుద్యోగులు వివిధ పథకాలకు పరిశ్రమల శాఖలో 1 ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు 224 మంది టీ ఫ్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మరో 24 మంది లబ్ధిదారులకు రూ.63,60,980 సబ్సిడీ మంజూరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
నిరుద్యోగుల చెవిలో పూలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భృతి విషయంలో నిరుద్యోగుల చెవిలో సీఎం చంద్రబాబునాయుడు పూలు పెట్టారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని..ఇప్పుడు ఒక్క వేలు చూపుతూ రూ.1000 ఇస్తానని, దానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు పెట్టుకోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో దాచుకున్న వేలు నిరుద్యోగులు కట్ చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే 12 లక్షల మందికే భృతి వచ్చేలా మంత్రి నారా లోకేష్‌బాబు 600 గంటలు కష్టపడి నిబంధనలను రూపొందించారన్నారు. చంద్రబాబునాయుడు..లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి ఉద్యోగాన్ని ఇచ్చారని, యువతీ, యువకులను మాత్రం మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతీయువకులతో కలసి పోరాటాలకు పిలుపునిస్తామన్నారు. ఆ నిధులు ఎప్పుడిస్తారు? రైతు రుణమాఫీకి రూ.11,500 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, అక్క చెల్లెమ్మలకు రూ. 4 వేల కోట్ల నిధులను జమ చేయాల్సి ఉందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మరో ఐదారు నెలల్లో ప్రభుత్వ సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారికి పింఛన్ ఇస్తామంటే టీడీపీ నాయకులు అవహేళన చేశారని, అయితే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టుకునే వారికి 40 ఏళ్లకే రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో పయనించడం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీరు–చెట్టు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 1.49 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 720 భారీ పరిశ్రమలు, 2.27 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు. ఇలా గొప్పలు చెప్పుకుంటే పోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక హోదాను ఇస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, టీడీపీ నాయకులకు అవినీతి సొమ్ముతో పొట్టలు వచ్చాయన్నారు. కాపులను మోసగించిన చంద్రబాబు కాపులను బీసీల్లోకి చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేశా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసే పనులనే చెబుతారని, ఆయన మాటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం నుంచి తిరిగి వచ్చినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికలంటే టీడీపీకి భయం ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం అని తేలిపోయిందన్నారు. అందులో భాగంగానే సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచేందుకు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ తీసివేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఓటర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఒటు హక్కును పొందాలని సూచించారు. కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు సమన్వకర్తలు మురళీకృష్ణ, హఫీజ్‌ఖాన్, నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, అబ్దుల్ రెహమాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యంయాదవ్, తోట కృష్ణారెడ్డి, ఆది మోహన్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, భాస్కరరెడ్డి, ఆసిఫ్, మహేశ్వరరెడ్డి, శీను తదితరులు పాల్గొన్నారు. -
లక్ష ఉద్యోగాలు ఇచ్చేవరకు పోరాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అందని ద్రాక్షగా మారిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నారని, ఆయన ఉద్యోగాల కల్పనను పట్టించుకోవడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. లక్ష ఉద్యోగాల వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వెంటనే ఆమేరకు ఉద్యోగాలు కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యోగాల కోసం పోరాడాల్సిన దౌర్భాగ్యం నెలకొందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతుండడం, నిర్దిష్ట నియమ నిబంధనలను పేర్కొనకపోవడాన్ని చూస్తే నియామకాలపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందని చెప్పారు. వీటి కారణంగానే 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–2, గతేడాది చేపట్టిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల చేయడం లేదని ఆయన ఉదహరించారు. టీఎస్ పీఎస్సీ తప్పిదాల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమని నిరుద్యోగులను అవహేళన చూస్తూ మాట్లాడడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 12 వేల మందికే ఉద్యోగాలు వచ్చాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేదాకా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పురాకుండా దశల వారీగా తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఇన్‌ఛార్జి డీఆర్ఓ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్, యూత్ విభాగం అధ్యక్షుడు శీలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇబ్రహీం, జిల్లా యూత్ కార్యదర్శి తాళ్ల అఖిలేష్గౌడ్, నాయకులు అంజిబాడు, రాంరెడ్డి, వంశీరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గైడ్, నరేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
భృతి.. భ్రమే..!
టీడీపీ సర్కార్ నిరుద్యోగభృతిని గాలికొదిలేసింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. నిరుద్యోగ భృతి హామీ అమలుకు అడుగులు వేసింది. అయితే కొర్రీలు పెట్టడం గమనార్హం ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపుతోంది. 2014 ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఆశతో టీడీపీకి ఓటేశారు. అధికారం చేపట్టాక మొండిచేయి చూపింది. అదే హామీని మళ్లీ అమలు చేస్తామని చెబుతుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూ.2వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సవాలక్ష కొర్రీలు పెట్టడమే కాకుండా రూ.1000కి కుదించడం.. 35 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇస్తామని చెబుతుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామాల్లో ప్రజాసాధికార సర్వేల్లో పేర్లు నమోదై ఉండాలని షరతులు విధించడంతో యువత నుంచి నిరాశ వ్యక్తమవుతోంది. ఆశ..అడియాస.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 25 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు సుమారు 15 వేల మందిపైనే ఉన్నారు. వీరంతా భృతి అందుతుందని ఆశించి భంగపడినవారే. భర్తీకానీ పోస్టులు... వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటిని భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు డీఎస్సీ పేరిట రెండు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఇప్పుడు బీఈడి అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హులని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగావకాశాలు కల్పించకుండా అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చుతున్న సీఎం చంద్రబాబు నయవంచనకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సబ్సిడీ రుణాలు, పథకాలను కూడా తమ అనుచరలకే ఇప్పించుకుంటూ వేలమంది నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని అంటున్నారు. భృతిని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకుల సమక్షంలో కొందరికే ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. నాలుగున్నరేళ్లకు గుర్తొచ్చిందా..? అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి కింద రూ.2వేలు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీకి భయం పుట్టింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అది చెప్పి కూడా రెండు నెలలు అయింది. ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ 600 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. – మూలె హర్షవర్థన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత, ఎర్రగుంట్ల మండలం -
డాటా ఎంట్రీ పేరుతో ఘరానా మోసం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : డాటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని ఆర్యనగర్‌కు చెందిన సతీష్‌కుమార్ శెట్టి వినాయక్‌నగర్‌లో గత డిసెంబర్ 13న ఎస్కేఎస్ అనే కంపెనీని ఆరంభించాడు. కంపెనీలో బిజ్నెస్ ప్రాసెసింగ్, అవుట్సోర్సింగ్, ఐటీ సొల్యూషన్ ఆఫ్ లైన్ వర్కింగ్ పని ఉంటుందని యువతకు గాలం వేశాడు. దీంతో నిరుద్యోగులు ఆకర్షితులయ్యారు. వీరే కాదు నిజామాబాద్‌కు చెందిన కొందరు యువకులు హైదరాబాద్‌లో మంచి కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు సైతం అక్కడ మానేసి ఇంటి వద్దనే డబ్బులు మిగులుతాయన్న ఆశకు పోయి ఎస్కేఎస్ కంపెనీలో చేరారు. డాటా ఎంట్రీ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.20వేలు సతీష్ వసూలు చేశాడు. ఇలా దాదాపు 60 నుంచి 65 మంది యువత బలయ్యారు. అంటే సుమారు రూ.12లక్షలు వసూలు చేశాడు. నెల తర్వాత డాటా ఎంట్రీ పూర్తిచేశాక జీతం డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు నమ్మి డబ్బులు పెట్టి పనిలో జాయిన్ అయ్యారు. వీరేకాకుండా తన కంపెనీలో పనిచేసేందుకు మరో 60 మందిని నియమించుకున్నాడు. 15 రోజుల శిక్షణాకాలంలో నిత్యం ఒక్కొక్కరికి రూ. 200లు ఉపకార వేతనం చెల్లిస్తామని సతీష్ చెప్పాడు. ఇదిలా ఉండగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు తమకు స్టయిఫండ్ డబ్బులు ఇవ్వాలని తరుచుగా సతీష్‌ను అడిగారు. దీంతో డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే ఐపీ పెడుతానని వారిని బెదిరించాడు. దాంతో పనిచేసే వారికి సతీష్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. గురువారం ఉదయం సతీష్ కంపనీకి రాకపోవటంతో అనుమానం వచ్చిన వారు ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో బాధితులు జరిగిన మోసంపై నాల్గోటౌన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్కేఎస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. సతీష్ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. పోలీసులు ఆర్యనగర్‌లో సతీష్ ఉంటున్న నివాసాన్ని కనుగొని అక్కడ అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ డబ్బులు ఇప్పించాలని, న్యాయం చేయాలని ఎస్ఐ శంకర్‌ను కోరారు. అన్ని మాయ మాటలే.. ఎస్కేఎస్ కంపెనీ పేరుతో కార్యాలయాన్ని స్థాపించిన సతీష్ తనది మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అని కొందరితో, రాయసీమ అని మరికొందరితో చెప్పాడు. అలంపూర్‌లో ట్రస్ట్ ఉందని, ట్రస్ట్‌కు సహాయంగా మీవంతు సహాకారం అందించాలని చెప్పాడు. కంపెనీలో చేరినవారిని నుంచి రూ.100 నుంచి 200 వరకు విరాళాలు సేకరించాడు. తాను క్రెవన్స్ కంపెనీలో రెండు తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్‌నంటూ నమ్మించాడు. తాము మళ్లీ ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అధికారాంతమున.. అడ్డగోలు నియామకాలు
విశాఖపట్నం : అధికారాంతమున ఏయూ పెద్దలు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. వీసీగా బాధ్యతల నుంచి వైదొలగడానికి రెండు నెలలు ముందు నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదన్నది సంప్రదాయం. కానీ అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేందుకు ఏయూ పెద్దలు అన్నింటినీ గాలికి వదిలేశారు. బాధ్యతల నుంచి వైదొలగానికి రెండురోజుల ముందు వీసీ జీఎస్‌ఎన్‌రాజు అడ్డదారిలో అస్మదీయులకు అందలం ఎక్కించారు. అందుకోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఇదీ అక్రమాల దొంతర ఏయూ వుమెన్ స్టడీ సెంటర్‌కు ఇటీవల యూజీసీ భారీ గ్రాంటు మంజూరు చేసింది. అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏయూ పెద్దలు వ్యవహరించారు. అప్పటికే ఆ విభాగంలో కన్సాలిడెటెడ్ వేతనంతో పనిచేస్తున్న ఆరుగురిని టైంస్కేల్ కిందకు మార్చేశారు. అలా ఒక్కొక్కరి వేతనాన్ని రెట్టింపు చేసేశారు. అంతేగానీ కొత్తగా పోస్టులు భర్తీ చేసి అర్హులైన నిరుద్యోగులు న్యాయం చేయాలని భావించలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. అందుకే హడావుడిగా పదవీ కాలం ముగియడానికి ఒక రోజు ముందు ఫైలు రూపొందించి ఆమోదముద్ర వేశారు. జపనీస్ స్టడీస్ విభాగంలో ఒకర్ని టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఆయనకు నెలకు రూ.20వేల వేతనం నిర్ణయించడం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ సెంటర్(ఐఏఎస్సీ)లో అడ్డగోలుగా ఓ మహిళకు పోస్టింగు ఇచ్చారు. గతంలో విజయనగరం పీజీ సెంటర్లో పనిచేసిన ఆమె దాదాపు 8 నెలల క్రితం విధుల నుంచి వైదొలగారు. కానీ ఆమెను ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఐఏఎస్సీ విభాగంలో టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ వ్యవహారంలో కూడా అధికార పార్టీ నేతల సిఫారసుతోపాటు పెద్దమొత్తం చేతులు మారినట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఒకర్ని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నియామకానికి ఆ విభాగ పెద్దలు సమ్మతించలేదని తెలుస్తోంది. ఆయన్ని చేర్చుకోవడానికి వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరో ముగ్గురిని టీచింగ్ అసిస్టెంట్లుగా నియమించడానికి కూడా ఫైలు రూపొందించారు. కానీ ఇంతలో ఇన్చార్జ్ వీసీని నియమిస్తూ ఆదేశాలు రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. అయినాసరే ఉత్తర్వులు ఇచ్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు తిలోదకాలు అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించడానికి ఏయూ పెద్దలు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం కొత్త పోస్టులు నియమించాలంటే రోస్టర్ పాయింట్లు పాటించాలి. రిజర్వేషన్లను పాటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇంట ర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. అలా చేస్తే అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా అడ్డదారిలో ఏయూ పెద్దలు తమ వారిని అందలం ఎక్కించేశారు. నియామకాలు చెల్లుతాయా? నిబంధనల ప్రకారం పదవీకాలం ముగియడానికి రెండు నెలల ముందు నుంచి వీసీలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకడదు. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పోస్టుల భర్తీ అనేది జీతభత్యాల రూపంలో ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన అంశమే. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీసీ జీఎస్ఎన్ రాజు పోస్టులు కట్టబెట్టేయడం గమనార్హం. గతంలో కూడా ఒకరిద్దరు వీసీలు తమ పదవీకాలం చివరిరోజుల్లో భర్తీ చేసిన పోస్టులను తరువాత రద్దు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసీ జీఎస్‌ఎన్‌రాజు తన పదవీకాలం చివర్లో ఆమోదించిన ఈ నియామకాల అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. -
‘పోటీ’లో ఇంజనీరింగ్ అభ్యర్థులు
♦ ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి ♦ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ♦ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నదీ 6.75 లక్షలు ♦ అందులో రెండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే ♦ తరువాత స్థానంలో బీకాం, బీఎస్సీ నిరుద్యోగులు ♦ నాలుగు, ఐదు స్థానాల్లో బీఏ, ఎంబీయే అభ్యర్థులు ♦ అందరి దృష్టి గ్రూప్స్‌పైనే! సాక్షి, హైదరాబాద్: ఉన్నత సాంకేతిక కోర్సులు చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. సాంకేతికపరమైన పోస్టులతో పాటు సాధారణ పోస్టులకూ పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. బీఏ, బీకాం వంటి సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినవారికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. అసలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేయించుకున్న 6.75 లక్షల మందిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారే 2,06,406 మంది ఉండటం గమనార్హం. ఇంజనీరింగ్ అర్హతతో పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం, అవసరమైన దానికన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తుండడం, ప్రభుత్వ కొలువులపై ఆశ వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పోగా.. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలు చేసిన వారు 2,60,825 మంది, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు 1,61,620 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర కేంద్ర ప్రభుత్వ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఇందుకు అదనం. ఇక గ్రూప్స్ నోటిఫికేషన్లు జారీ అయితే ఓటీఆర్ చేయించుకునే వారి సంఖ్య బాగా పెరగనుంది. కోర్సుల వారీగా చూస్తే.. కోర్సుల వారీగా పరిశీలిస్తే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో బీకాం గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తంగా బీకాం గ్రాడ్యుయేట్లు 1,17,817 మంది ఓటీఆర్ చేసుకోగా.. అందులో సాధారణ బీకాం వారు 65,571 మంది, బీకాం కంప్యూటర్స్ చేసినవారు 52,246 మంది ఉన్నారు. ఇక బీఎస్సీ (వివిధ కోర్సులు) పూర్తి చేసినవారు 91,691 మంది, బీఏ పూర్తి చేసిన వారు 51,317 మంది ఓటీఆర్ చేసుకున్నారు. పోస్టుల సంఖ్యే కీలకం.. నిరుద్యోగులందరి చూపూ భర్తీ చేసే పోస్టుల సంఖ్యపైనే ఉంది. ఇప్పటివరకు ఇంజనీర్, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫైనాన్స్ అసిస్టెంట్, వాటర్ వర్క్స్ మేనేజర్ వంటి సాంకేతిక, ప్రత్యేక కోర్సుల అర ్హతతో పరీక్షలు నిర్వహించిన పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్స్ కేటగిరీల్లో పోస్టులు చాలాతక్కువగా ఉన్నాయి. గ్రూప్-1లో 52 పోస్టులకు, గ్రూప్-2లో 434 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్-3, గ్రూప్-4, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి అనుమతే రాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిన ఫైలులోని దాదాపు 10 వేల పోస్టుల్లో ఇవే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
తొలిరోజు ఎస్జీటీలకు పరీక్ష 35 కేంద్రాలు... 8,216 మంది అభ్యర్థులు చీకట్లోనే నంబర్లు వేసిన వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. డీఎస్సీ-14 పరీక్షలు రాసేందుకు రోజుల తరబడి పుస్తకాలతో కసరత్తు చేసిన అభ్యర్థులకు వారి ప్రతిభాపాటవాలు నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ డీఎస్సీ తొలిరోజు ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 8216 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. డీఈఓ అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. చీకటిలో నంబర్లు వేసిన వైనం పరీక్షల నిర్వహణపై అనుమానాలు తలెత్తడంతో కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్విజిలేషన్ విధులు మొదులుకుని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడంలో అత్యంత గోప్యంగా ఉంచారు. మరీ ముఖ్యంగా కేంద్రాల కేటాయింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఆర్డర్లు ఇవ్వడంలో శుక్రవారం ఆలస్యమైంది. ఎట్టకేలకు సాయంత్రం ఆర్డర్లు తీసుకున్న చీఫ్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఆయా కేంద్రాలకు పరుగులు తీశారు. ముఖ్యంగా శనివారం జరిగే పరీక్షకు నియమించిన ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో ఆయా కేంద్రాలకు వెళ్లారు. అప్పటికి చీకటి పడింది. చాలా కేంద్రాల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో సెల్ఫోన్ల వెలుగుతో నంబర్లు వేయడం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనూ కొన్ని కేంద్రాల్లో నంబర్లు వేశారు. -
బాబు వచ్చాడు... జాబు పోయింది!
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ఉద్యోగుల గెంటివేత హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా మూడు నెలల క్రితం ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రతినిధి చొప్పున ఎన్నికల సర్వే, పార్టీ కార్యకలాపాల కోసం 294 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ నాయకులను ఎన్నుకునేందుకు కొందరు నిరుద్యోగ యువతిలను కూడా రిక్రూట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచాయి... ఎన్నికలు ముగిశాయి... ఫలితాలు వచ్చాయి... బాబు గెలిచాడు... అయితే పర్మినెంట్ అనుకున్న ఉద్యోగాలు ఉన్న పళంగా పోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఈ ఉద్యోగులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాబుతో ములాఖత్ కోసం పడిగాపులు కాసారు. ట్రస్ట్ భవన్‌లోకి అనుమతించకపోవడంతో కేబీఆర్ పార్కు వద్ద ఆకలిడప్పులతో అలమటిస్తూ ఉండిపోయారు. మీకు హామీలు ఎవరు ఇచ్చారో వారిని తీసుకొని రండంటూ ట్రస్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశాడని బాధితులు వాపోయారు. సాక్షాత్తు ట్రస్ట్ భవన్‌లోనే మాకు శిక్షణా తరగతులు ఇచ్చారని, చంద్రబాబు కూడా కొన్నిసార్లు తమతో ముఖాముఖి అయి మాట్లాడిన సందర్భాలున్నాయని ఇలా మోసపోతామని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకునేటప్పుడే అందరు ఉన్నత చదువులు చదివి ఉండాలని మంచి భవిష్యత్ ఉంటుందని, రూ. 18 వేల జీతం అని చెప్పారని వారు బాధపడుతున్నారు. ధర్నా చేయడానికి వచ్చిన వీరందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెల కొంది. లోకేష్ వచ్చాక నిర్ణయం చెబుతామని ట్రస్ట్భవన్ వర్గాలు చెప్పడంతో వారు ఎటు పాలుపోని స్థితిలో ఉన్నారు. -
డీఎస్సీ పోస్టులకు రేషనలైజేషన్ గండి
జాబితాలో 1204 పోస్టులు డీఎస్సీ లిస్టులో 700 ఖాళీలకు కోత? గణితం, సోషల్ ఆశలు గల్లంతేనా సాక్షి, విశాఖపట్నం : డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రేషనలైజేషన్ పిడుగుపాటుగా మారనుంది. తొలుత సిద్ధం చేసిన జాబితాలో ఏకంగా 700 పోస్టుల వరకు గండి పడనున్నట్టు సమాచారం. ఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులకు కోత వేస్తారన్నది తెలియని పరిస్థితి. తొలుత రేషనలైజేషన్ కాకుండా కేవలం సర్దుబాటుతోనే సరిపెట్టుకోవాలనుకున్నప్పటికీ డీఎస్సీ ప్రకటనతో రేషనలైజేషన్ దిశగా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. మిగిలి.. పోయేవెన్ని? : జిల్లా విద్యాశాఖ తాజా అంచనాల మేరకు జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1714 పోస్టులు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సిద్ధం చేశారు. రేషనలైజేషన్ తప్పనిసరన్న వార్తలతో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి కంటే ఎక్కువ పోస్టులున్న చోట వాటిని అవసరమైన చోటికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జరిగితే డీఎస్సీ పోస్టుల్లో ఏకంగా 700 వరకు కోతపడే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా. రేషనలైజేషన్ అంచనాల మేరకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 502 ఎస్జీటీలు మిగులు పోస్టులుగా లెక్కతేల్చారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు భాషా పండితులు నాలుగు, ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెక్టుల్లో 780 మంది ఉపాధ్యాయులు అధికంగా ఉన్నట్టు తాజా నివేదికలో స్పష్టం చేశారు.ఎస్జీటీ కేటగిరీలో 1474, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 615, ఉన్నత పాఠశాలల్లో 266 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. గణితం, సోషల్ ఆశలు గల్లంతేనా? తాజా డీఎస్సీకి గతేడాది సిద్ధం చేసిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పోస్టులతో గణితం(106), సోషల్(131) ఆశావహులు ఆనందపడ్డారు. తాజా రేషనలైజేషన్ లెక్కల మేరకు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ గణితంలో 144, సోషల్ సబ్జెక్టులో 108 పోస్టులు మిగులు పోస్టులుగా నిర్థారించారు. దీంతో వీటిలో ఎన్ని పోస్టుల్ని రేషనలైజేషన్ పేరిట తొలగిస్తారోనన్న ఆందోళన నెలకొంది. అదే జరిగితే జిల్లాలో ఎస్జీటీ కేటగిరీ మినహా స్కూల్ అసిస్టెంట్ పోస్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేనట్టే..!