జూన్ 2న వాహనాన్ని పంపిణీ చేస్తున్న అటవీశాఖ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా హెవీ లైసెన్స్ కలిగిన వారికి వాహనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీ మహిళాలకు 45 శాతంపై, పురుషులకు 35 శాతంపై సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేరుపై సబ్సిడీ రుణాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొంత మంది ఎస్సీ, ఎస్టీలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
శాఖల వారీగా..
జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాలను పొంది వారు ఉపాధి పొందుతునే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 96 యూనిట్లను మంజూరు చేశారు. రూ.2,00,09,000 సబ్సిడీ కింద అందజేశారు. ఇందులో ఆటో ట్రాలీలు 22 మందికి, ట్యాక్సి కార్ 17 మందికి, గల్‌పర్ మిషన్ 2, ప్యాసింజర్ ఆటోలు 44మందికి, పికప్ వ్యాన్ 5 మందికి, టాటా ఏస్ 2, ట్రాక్టర్, ట్రాలీ 4గురికి అందజేశారు. 2016–17 సంవత్సరంలో 25 మంది లబ్ధిదారులకు రూ.66లక్షల సబ్సిడీతో రుణాలు అందించారు. వీటిలో ట్రాక్టర్ ట్రాలీ 2, టాటా ఏస్ 1, పికప్ వ్యాన్ 1, డీజిల్ ఆటోలు 3, ట్యాక్సి కార్ 7, ఆటో ట్రాలీ 11 మంది లబ్ధిదారులకు అందజేశారు. 2017–18 సంవత్సరంలో 21 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్, ప్యాసింజర్ ఆటోలు, ఆటో ట్రాలీలు, ఆటో పికప్ వ్యాన్‌లను మంజూరు చేయగా, వీరికి రూ 45.54లక్షల సబ్సిడీని అందజేయనున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సీసీడీపీ పథకం ద్వారా ఐసీడీఎస్‌లో 34 మంది పీటీజీ తెగలకు రూ.50లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీపై ఆటోలను అందించారు. వీరు నెలల వాయిదా పద్ధతిలో తీసుకున్న రుణాన్ని బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. 2016–17ఆర్థిక సంవత్సరంలో 124 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 6లక్షల 27వేల వ్యయంతో ప్యాసింజర్ ఆటోలను అందించారు. రెండు ప్యాసింజర్ మోటార్ క్యాబ్‌లను అందజేశారు.
జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా..
స్వయం ఉపాధి రుణాల పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 శాతం సబ్సిడీపై, పురుషులకు 35 శాతం సబ్సిడీపై రుణాలను అందజేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో 2014 సంవత్సరం నుంచి 2017 వరకు 28 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.80,91,069 సబ్సిడీ మంజూరు చేశారు. 11 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.28,55,221 సబ్సిడీని మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీ ప్రైడ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 42 మంది లబ్ధిదారులకు, 40 మంది ఎస్టీలకు రుణాలను మంజూరు చేశారు. ఇదిలా ఉండగా పరిశ్రమ శాఖలో కొంతమంది ఎస్సీ, ఎస్టీలపై భారీగా సబ్సిడీ రుణాలను పొంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
రూ.10లక్షలలోపు రుణం తీసుకుంటే జిల్లా కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. రూ.10లక్షలకు పైగా రుణం తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సబ్సిడీ నగదు సకాలంలో మంజూరు కాకపోవడం, మంజూరైన ఖాతాలో జమ కాకపోవడంతో లబ్ధిదారులు వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే సబ్సిడీని వడ్డీ కిందకే కట్టావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో చెల్లిస్తే పేదలను ఆదుకున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు.
పెండింగ్‌లో దరఖాస్తులు
జిల్లాలోని నిరుద్యోగులు వివిధ పథకాలకు పరిశ్రమల శాఖలో 1 ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు 224 మంది టీ ఫ్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మరో 24 మంది లబ్ధిదారులకు రూ.63,60,980 సబ్సిడీ మంజూరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment