ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్‌..? | Adilabad Village Peoples Questions To Jogu Ramanna | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్‌..?

Published Tue, Oct 9 2018 7:18 AM | Last Updated on Tue, Oct 9 2018 7:18 AM

Adilabad Village Peoples Questions To Jogu Ramanna - Sakshi

జైనథ్‌: సాంగ్విలో శనివారం మంత్రి జోగు రామన్నను నిలదీస్తున్న గ్రామస్తులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీలోని వ్యతిరేకవర్గం పన్నాగమో... ప్రజల్లో నిక్షిప్తమైన ఆగ్రహమో తెలియదు గానీ... టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడం లేదు. పూజలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థిని ఒక గ్రామంలో నిలదీస్తే... యోగక్షేమాలు అడిగిన అభ్యర్థికి ఓ వృద్ధురాలి నుంచి వ్యతిరేకత ఎదురైంది. తాజాగా సోమవారం ఖానాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాఖానాయక్‌ను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా గ్రామస్తులతో గొంతుకలపడం గమనార్హం. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది.

చైతన్యమా... రాజకీయ  ప్రోద్బలమా..?
ముందస్తు ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్‌ 6న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చెన్నూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సీటివ్వలేదు. మిగతా చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. దీంతో చెన్నూర్‌తో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌లోనే వ్యతిరేకత మొదలైంది. చెన్నూర్‌లో అభ్యర్థి బాల్క సుమన్‌ ప్రచారాన్ని ప్రారంభించిన ఇందారంలో గట్టయ్య అనే ఓదెలు అభిమాని పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖానాపూర్‌లో మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ పార్టీని వీడారు. బోథ్‌లో ఎంపీ నగేష్‌ అంతర్గతంగా తనవంతు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు. ముధోల్‌లో సిట్టింగ్‌ ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఎస్‌.వేణుగోపాలచారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు.  బెల్లంపల్లిలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు కంటిలో నలుసుగా మారారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారడాలు, సద్దుమణగడం వంటివి జరిగినట్లు కనిపిస్తున్నా... పోరు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరుగుబాటు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు కొట్టివేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేతల ప్రోద్బలంతోనే వ్యతిరేక సీన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు.

జైనథ్‌లో మంత్రి  జోగు రామన్నకు తప్పని వ్యతిరేకత...
ఇటీవల రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు జైన£థ్‌ మండలంలో రెండుచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సాంగ్వి, భోరజ్‌ గ్రామాల్లో మంత్రి ప్రచారానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... సాంగ్విలో మంత్రిని వ్యతిరేకించడం వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగిన ఓ వ్యక్తి తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మంత్రి రామన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే సాంగ్విలో స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మండలంలోని భోరజ్‌లో మాత్రం ఒక దళిత బస్తీలో స్థానికులు మంత్రిని ప్రశ్నించడం గమనార్హం. మూడెకరాల ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ ద్వారా నిర్మించే సీసీ రోడ్డు తమ బస్తీకి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. భోరజ్‌లో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించిది.


బెల్లంపల్లి, బోథ్‌లలో...
బెల్లంపల్లి మండలం పరిధిలోని చాకెపల్లి, బుదాగుర్ధు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. బోథ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావు ప్రచారాన్ని తరచూ అడ్డుకోవడం జరుగుతోంది. ఇక్కడ గిరిజన తెగల్లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వైషమ్యాలు పెరగడం అనే అంశంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు సమాచారం. బోథ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయినా కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్‌ బాపూరావుకే సీటు ఇవ్వడం ఆయన వర్గీయులకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నగేష్‌ వర్గీయులే కీలక స్థానాల్లో ఉండడంతో బాపూరావుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయినా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతుండడం గమనార్హం.
 
మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారైతే...
నెలరోజుల క్రితమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రస్తుతం వారే ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం గమనిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్‌ మహా కూటమి, బీజేపీ నుంచి ఖరారయ్యే అభ్యర్థుల విషయంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. చెన్నూర్‌ మినహా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే కావడంతో సహజంగడా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం పార్టీలో టికెట్టు ఆశించి భంగపడ్డ వారి ప్రోద్బలంతోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు కూడా వీరినే ఫాలో అయితే పరిస్థితి ఏంటనేది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement