jogu rammanna
-
మిసెస్ ఇండియా రన్నరప్‌గా ఆదిలాబాద్ వాసి
ఎదులాపురం(ఆదిలాబాద్): మిసెస్ ఇండియా అందాల పోటీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వర్షశర్మ రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ నెల 2న ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ పనాషే ముంబాయిలో మిసెస్ ఇండియా పోటీ నిర్వహించగా వర్షశర్మ 35 మందితో పోటీపడి మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న శనివారం వర్షశర్మను శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణానికి చెందిన వర్షశర్మ అందాల పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలవడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. అనంతరం వర్షశర్మ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకూడదన్నారు. ప్రయత్నిస్తే మహిళలు రాణించలేని రంగమంటూ లేదన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు సాయిని రవి, దేవన్న, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ ‘పరీక్ష’!
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. మొదటి విడత ఘట్టం ముంచుకొస్తుంది. మరో రెండు రోజుల్లో తొలి సమరం జరగనుంది. దీంతో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపోటముల ప్రభావం ముఖ్య నేతలపై ఉంది. దీంతో ఆ నేతలకు ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న ఆ నేతల్లో కొందరికి తీపి, మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అలా మొదటి పరీక్ష ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ద్వారా రెండో పరీక్షలోనూ ఫలితాలు చూశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ద్వారా మూడో పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ద్వారా మరో పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేతలకు కీలకం.. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ పరంగా మంచి ఫలితాల కోసం కొంతమంది ముఖ్య నేతలు జిల్లాలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం వారికి కీలకం కానుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలకు ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న మరోసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోయినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత నెల జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. మిగతా నేతలకు అందనంత దూరంలో ఆయన ప్రచారం సాగింది. తద్వారా నియోజకవర్గంలో అటు లోక్‌సభ, ఇటు ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నిలిచిన పాయల శంకర్ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా అంత పెద్దగా ప్రభావం చూపనప్పటికీ స్వల్ప ఫలితాలు సాధించి పార్టీ ఉనికిని చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే అటు పార్టీతోపాటు పాయల శంకర్‌కు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండేకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినా గండ్రత్ సుజాతకు దక్కడంతో ఆమె గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే నియోజవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీఆర్ఎస్ తర్వాత నిలిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో అంతాతానై వ్యవహరిస్తుండడంతో ఫలితాలు కీలకంగా మారాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితానికి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. బోథ్ నియోజవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బాపురావుకు ఊరటనిచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కూడా బోథ్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ఆ ఫలితాల బాధ్యత ఇరువురిపై ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు కీలకం కానుంది. ప్రధానంగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన పక్షంలో సీఎం దగ్గర పలుకుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సోయం బాపురావుకు ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సోయం బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు జిల్లాలోకి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రాథోడ్ రమేశ్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ మండలాలతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ సీనియర్ నేతగా, పార్టీలో మరింత పట్టుకోసం ఈ ఎన్నికల ద్వారా కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఈ మండలాల్లో గెలుపు కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాథోడ్ రమేశ్‌పై గెలుపుతో నియోజకవర్గంలో ప్రభావం చూపారు. అదే సరళిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె భుజస్కందాలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇక్కడ గెలుపు పొందడం ద్వారా తన ప్రత్యర్థి రాథోడ్ రమేశ్‌ను గట్టిగా రాజకీయంగా దెబ్బతీయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇక నార్నూర్, గాదిగూడలో ఈ ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించడం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి కోవ లక్ష్మికి కీలకం కానుంది. -
అభివృద్ధికే ఓటు వేయండి
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పలువురు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పు చ్చుకుంటున్నారని ఆపద్ధర్మ మంత్రి జోగురామ న్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్, శాంతినగర్ కాలనీల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో జోగురామన్న సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా రామన్న వారికి పార్టీ కండువాల ను కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం చేసిన పథకాలను చూసే ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇందులో భా గంగానే ఈ కాలనీల్లోని మహిళలు, యువకులు సైతం పార్టీలో చేరినట్లు వివరించారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లోక భూమారెడ్డి, అయ్యుబ్, యూసుఫ్, షేక్ అజీమ్, రాథోడ్ దత్తు, కార్తిక్, హేమంత్ పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
ఆదిలాబాద్‌కల్చరల్: విజయదశమిని పురస్కరించుకుని గురువారం జిల్లాలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. శమి పూజ, రావణాసుర దహనం కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల అధికారులు, మరి కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు రావణాసురుడి ప్రతిమకు నిప్పు అంటించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం దసరా ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టుకు పూజ చేయడంతోపాటు పనిముట్లు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలు జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. సంఘటితంతోనే విజయం ఎన్నో కులాలు, మతాలు ఉన్న మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా పేరొందిందని, సంఘటితంగా ఉండడం ద్వారా ప్రతి పనిలో విజయం సాధించవచ్చని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న అన్నారు. సనాత హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అంతకుముందు శ్రీగోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు ఖడ్గాన్ని అందజేశారు. వేడుకల్లో భాగంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రావణుని బొమ్మను దహనం చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, ప్రమోద్ఖత్రి, నాయకులు దుర్గం రాజేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫూల్ వఝే సభ్యులు బండారి దేవన్న, కందుల గజేందర్, పడకంటి సూర్యకాంత్, మేకల అశోక్, సతీష్ మిత్తల్, జగదీశ్వర్, బాసెట్టి గజేందర్, అంజుకుమార్, గెడం మాధవ్, భవానీ సంతోష్, రేనికుంట రవీందర్, నర్సోజి, గాలే నర్సింగ్, లోలపు శ్రీనివాస్, కె.సంజీవ్, గజానన్, రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. చెడుపై విజయానికి ప్రతీక ఆదిలాబాద్‌రూరల్: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే దసరా వేడుకలు జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, సన్మార్గంలో సాగితే తప్పకుండా విజయం కలుగుతుందని అన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో శాంతియుతంగా నిర్వహించిన, మట్టి విగ్రహాలను ప్రతిష్టాపించిన నిమజ్జన యాత్రలో విగ్రహాలను అందంగా అలంకిరించిన గణేష్ మండలి నిర్వాహకులకు ఆయన చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. అంతకుముందు శమి, ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ దహనాన్ని నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ఆదిలాబాద్ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, ఆర్డీవో సూర్యనారాయణ, ఆశన్న, రాజేశ్వర్, కాసర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీలోని వ్యతిరేకవర్గం పన్నాగమో... ప్రజల్లో నిక్షిప్తమైన ఆగ్రహమో తెలియదు గానీ... టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడం లేదు. పూజలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థిని ఒక గ్రామంలో నిలదీస్తే... యోగక్షేమాలు అడిగిన అభ్యర్థికి ఓ వృద్ధురాలి నుంచి వ్యతిరేకత ఎదురైంది. తాజాగా సోమవారం ఖానాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాఖానాయక్ను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రామస్తులతో గొంతుకలపడం గమనార్హం. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. చైతన్యమా... రాజకీయ ప్రోద్బలమా..? ముందస్తు ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సీటివ్వలేదు. మిగతా చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. దీంతో చెన్నూర్‌తో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లోనే వ్యతిరేకత మొదలైంది. చెన్నూర్‌లో అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఇందారంలో గట్టయ్య అనే ఓదెలు అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్‌లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడారు. బోథ్‌లో ఎంపీ నగేష్ అంతర్గతంగా తనవంతు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు. ముధోల్‌లో సిట్టింగ్ ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఎస్.వేణుగోపాలచారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. బెల్లంపల్లిలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు కంటిలో నలుసుగా మారారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారడాలు, సద్దుమణగడం వంటివి జరిగినట్లు కనిపిస్తున్నా... పోరు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరుగుబాటు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు కొట్టివేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేతల ప్రోద్బలంతోనే వ్యతిరేక సీన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జైనథ్‌లో మంత్రి జోగు రామన్నకు తప్పని వ్యతిరేకత... ఇటీవల రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు జైన£థ్ మండలంలో రెండుచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సాంగ్వి, భోరజ్ గ్రామాల్లో మంత్రి ప్రచారానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... సాంగ్విలో మంత్రిని వ్యతిరేకించడం వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్లోనే కొనసాగిన ఓ వ్యక్తి తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మంత్రి రామన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే సాంగ్విలో స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మండలంలోని భోరజ్‌లో మాత్రం ఒక దళిత బస్తీలో స్థానికులు మంత్రిని ప్రశ్నించడం గమనార్హం. మూడెకరాల ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ ద్వారా నిర్మించే సీసీ రోడ్డు తమ బస్తీకి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. భోరజ్‌లో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించిది. బెల్లంపల్లి, బోథ్‌లలో... బెల్లంపల్లి మండలం పరిధిలోని చాకెపల్లి, బుదాగుర్ధు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు ప్రచారాన్ని తరచూ అడ్డుకోవడం జరుగుతోంది. ఇక్కడ గిరిజన తెగల్లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వైషమ్యాలు పెరగడం అనే అంశంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు సమాచారం. బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయినా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావుకే సీటు ఇవ్వడం ఆయన వర్గీయులకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నగేష్ వర్గీయులే కీలక స్థానాల్లో ఉండడంతో బాపూరావుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయినా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతుండడం గమనార్హం. మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారైతే... నెలరోజుల క్రితమే టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రస్తుతం వారే ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం గమనిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ మహా కూటమి, బీజేపీ నుంచి ఖరారయ్యే అభ్యర్థుల విషయంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. చెన్నూర్ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో సహజంగడా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం పార్టీలో టికెట్టు ఆశించి భంగపడ్డ వారి ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు కూడా వీరినే ఫాలో అయితే పరిస్థితి ఏంటనేది టీఆర్ఎస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. -
అమాత్యుల హస్తంతోనే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘నాలుగేళ్లలో అనేకసార్లు సర్వేలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేశాం. ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఇచ్చాం. కేవలం ఇద్దరికి తప్ప సిట్టింగులద్దరికి సీట్లు ఇవ్వడం జరిగింది.’ ఈనెల 6న శాసనసభ రద్దు తరువాత 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరి టికెట్ల విషయంలో మంత్రులు, ముఖ్య నేతల మాట చెల్లుబాటు అయినట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశించిన నాయకులు, వారి అనుచరులు సైతం అదే నిజమని చెబుతుండడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రులతో పాటు వచ్చే ప్రభుత్వంలో కీలక పదవులు పొందాలని భావి స్తున్న కొందరు నేతలు, ఓ ఎమ్మెల్సీ ముందు జాగ్రత్తగా సీనియర్ నాయకులకు టికెట్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపణ. ప్రధానంగా ఎస్టీ రిజర్వుడు సీట్లైన ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో పార్టీ సిట్టింగ్‌లనే కొనసాగించడానికి కారణమదేనని చెపుతున్నారు. చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలును తొలగించి ఎంపీ బాల్క సుమన్‌ను తీసుకురావడంలో కూడా నేతల అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. పార్టీలో, జిల్లాలో ఆధిపత్యం తగ్గకుండా ప్రణాళికబద్ధంగా సీనియర్లకు చెక్ పెట్టారని టికెట్లు రాని నేతల అనుచరులు ఆరోపిస్తున్నారు. రాథోడ్ టీఆర్ఎస్లో చేరకుండా ... కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తరువాత జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో అనతికాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు రాథోడ్ రమేష్. ఎస్టీ రిజర్వుడు ఖానాపూర్ నుంచి తొలుత గెలిచి, తరువాత ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రతికూల పరిస్థితుల్లో 2009లో టీడీపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అయితే 2010 నుంచి మారిన రాజకీయ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన నాయకులంతా ఒక్కొక్కరిగా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరినా, ఆయన అక్కడే కొనసాగారు. చివరికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓడిపోయినా, పార్టీని వీడలేదు. చివరికి 2017లో ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ద్వారా టీఆర్ఎస్లో చేరారు. అది కూడా తదుపరి ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పార్టీ టికెట్టు ఖాయమనే హామీతో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు అంతకు ముందు చేసిన ప్రయత్నాలను ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు సాగనీయలేదు. కాంగ్రెస్, బీజేపీల నుంచి రాథోడ్‌కు ఆహ్వానాలు అందుతున్న తరుణంలో తుమ్మల ప్రోద్భలంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ కండువా కప్పుకున్న రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్ టికెట్టు హామీ ఇచ్చారని ప్రకటించడం గమనార్హం. అయితే ఇప్పుడు టికెట్టు రాకపోవడానికి మంత్రులతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలే చక్రం తిప్పినట్లు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మంత్రిగా అడ్డు కాకూడదనేనా...? నాలుగేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో బీసీ, అగ్ర వర్ణాలకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహించారు. ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజనులకు కేటాయించినవే. సాధారణంగా ఆదిలాబాద్ నుంచి ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బోథ్ అసెంబ్లీ నుంచి మూడుసార్లు గెలిచిన గోడం నగేష్ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన ఎమ్మెల్యే అయితే సీనియారిటీ, కుల సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం లభించడం ఖాయం. ఇక్కడే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చక్రం తిప్పారని బోథ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆదివాసీ, లంబాడా ఉద్యమం ఉచ్ఛస్థితికి చేరుకున్న సమయంలో ఓ పథకం ప్రకారం ఆదివాసీకి చెందిన నగేష్‌ను ఎంపీగానే కొనసాగిస్తారని పార్టీ వర్గాల్లో లీక్ చేశారని ఆయన అనుయాయుల ఆరోపణ. ఇదే వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికల రూపంలో చేరేలా పార్టీ ముఖ్య నేతలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రుల నివేదికల్లో సిట్టింగ్‌లపై సానుకూలత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాగజ్‌నగర్ వచ్చిన సందర్భంలో ఆయన కొందరు ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల్లో సిట్టింగ్‌ల్లో చెన్నూర్ నుంచి ఓదెలుకు మినహా తొమ్మిది మందికి సీట్లు ఖాయమనే ప్రచారం అప్పుడే ముఖ్య నాయకులు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. ఖానాపూర్, బోథ్‌లలో సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వబోతున్న విషయం కూడా మంత్రులకు ముందే తెలుసని సమాచారం . అలాగే ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరించే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జోగు రామన్న సైతం ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అధిష్టానానికి సానుకూల నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే బోథ్, ఖానాపూర్‌లలో సిట్టింగ్‌లను మారిస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని ముఖ్య నాయకులు స్కెచ్ గీసినట్లు అర్థమవుతోంది. సుమన్ కోరిక మేరకే చెన్నూర్ సిట్టింగులకు సీట్లు ఇచ్చే క్రమంలో చెన్నూర్ నుంచి ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన నల్లాల ఓదెలుకు సీటు రావాలి. పెద్దపల్లి లోక్‌సభ సీటును ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్‌కు ఇవ్వడం అనివార్యం. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ సుమన్‌ను అసెంబ్లీకి పంపించాలనేది వ్యూహం. సుమన్‌కు 2014లోనే చొప్పదండి ఎమ్మెల్యే సీటు ఇస్తారని భావించిగా, వివేక్ చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరడంతో సుమన్‌కు ఆ అవకాశం లభించింది. మారిన పరిస్థితుల్లో వివేక్‌కు ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే చొప్పదండి సుమన్‌కు కేటాయించాలి. కుల సమీకరణల విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు. కానీ చొప్పదండి నుంచి పోటీ చేయడం ఇష్టం లేని సుమన్ చెన్నూర్ కోరడంతో ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన సుమన్ వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి టార్గెట్‌గానే ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. -
మూడు నెలల క్రితమే ప్రేమపెళ్లి..
జైనథ్(ఆదిలాబాద్): కట్నం వేధింపులు తాళలేక జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆవుల అంకిత(25) పెన్‌గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దీపాయిగూడలోని లోక రవీందర్ రెడ్డి, అనురాధల కుమార్తె అంకిత, అదే గ్రామానికి చెందిన సాయి నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో కాపురం పెట్టారు. కాగా సాయి తనకు రూ.3లక్షల కట్నం ఇవ్వాలని తరుచూ భార్య అంకితను వేధించేవాడు. అంకిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి, కట్నం ఇస్తేనే కూతురితో కాపురం చేస్తానని, లేదంటే తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు కలిసి ఆదిలాబాద్ నుంచి భోరజ్ గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి సాయి దీపాయిగూడకు వెళ్లగా, అంకిత మహారాష్ట్రలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి పిప్పల్‌కోటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు బ్రిడ్జిపై నుంచి పెన్‌గంగ నదిలో దూకింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. శనివారం ఉదయం మండలంలోని ఆనంద్‌పూర్ సమీపంలో బ్రిడ్జికి కూతవేటు దూరంలో మృతదేహం కనిపించగా జాలర్లు ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్సై తోట తిరుపతి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఆపధర్మ మంత్రి జోగు రామన్న, డీఎస్పీ నర్సింహా రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. దీపాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి జోగు రామన్న పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిండు జీవితాలు బలి వాస్తవంగా అంకిత, సాయి ఇద్దరిదీ రెండో వివాహమే. నాలుగు సంవత్సరాల క్రితం అంకితను జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆవుల సాయికి అదే గ్రామానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. వీరి ఇద్దరు కూడా పెళ్లి జీవితాల్లో ఇమడలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా వీరి మధ్య సంబంధం కొనసాగడంతో పాత జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారు. అనంతరం పెద్దలను ఎదిరించి ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు. కట్నం కోసం సాయి, అంకితను వేధించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మొదటి పెళ్లి కాదని, పెద్దలను ఎదిరించి రెండో వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు దూరమయ్యారు. భర్త వేధింపులు అధికమవడంతో అంకిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాయిపై 498(ఏ), 304(బి) సెక్షన్ల కింద వరకట్నం వేధింపులు, గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దారులన్నీ ‘కొంగర’కే..!
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా నుంచి దారులన్నీ కొంగరకలాన్ బాటపట్టాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కొంగరకలాన్‌లో ఆదివారం నిర్వహించే ప్రగతి నివేదన సభకు జనాన్ని భారీగా తరలించేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే సభకు భారీ సంఖ్యలో ప్రజల ను తరలిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగా నాల నేపథ్యంలో పార్టీ నాయకులు పెద్ద మొత్తం లో తరలించేందుకు సిద్ధమయ్యారు. జనసమీకరణ బాధ్యతలను ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్యనాయకులకు అప్పగిం చారు. కాగా శనివారం కొంతమంది పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరారు. పెద్ద మొత్తంలో మాత్రం ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలను భారీగా తరలించనున్నా రు. బస్సులను గ్రామాలకు పంపించి అక్కడి నుంచే జనాన్ని సభకు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. సభకు తరలిస్తున్న జనానికి టీ, టిఫిన్‌తోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోటార్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా జనాన్ని ప్రగతి నివేదన సభకు తరలించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి మరో 10వేల చొప్పున జనం తరలించేందుకు కసరత్తు చేశారు. ఆదిలాబాద్ రూరల్ ప్రాంతం నుంచి 30 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్ బస్సు, 18 తుఫాన్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి 39 ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. బేల మండలం నుంచి 36 ఆర్టీసీ బస్సులు, 55 తుఫాన్ వాహనాలు, జైనథ్ మండలం నంచి 39 ఆర్టీసీ బస్సులు, 5 ప్రైవేట్ బస్సులు, 41 తుఫాన్ వాహనాల్లో జనాన్ని తరలించనున్నారు. మావల మండలం నుంచి 16 ప్రైవేటు బస్సుల్లో జనాలను సభకు తీసుకెళ్లనున్నారు. జనాన్ని బట్టి మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపూరావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి 9వేల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 10 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ బస్సులు, 516 జీపులు సిద్ధం చేశారు. ఉదయం 7గంటలకు తన నివాసం వద్ద నుంచి భీంపూర్, తలమడుగు, తాంసి మండలాల ప్రజలను వాహనాల్లో జెండా ఊపి తరలించనున్నట్లు ఎమ్మెల్యే బాపురావు పేర్కొన్నారు. ఆ తర్వాత గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్ మండలాలకు వెళ్లి వాహనాలను పంపి ప్రజలు, కార్యకర్తలను తరలించనున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో 126 ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. 186 జీపులు, కార్ల ద్వారా జనాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉట్నూర్ 35 మ్యాక్స్‌లు, 18 బస్సులు, ఇంద్రవెల్లి 28 వాహనాల వరకు సిద్ధం చేశారు. దాదాపు 3వేల వరకు జనాన్ని తరలించనున్నారు. -
సబ్సిడీ.. దుర్వినియోగం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా హెవీ లైసెన్స్ కలిగిన వారికి వాహనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీ మహిళాలకు 45 శాతంపై, పురుషులకు 35 శాతంపై సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేరుపై సబ్సిడీ రుణాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొంత మంది ఎస్సీ, ఎస్టీలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. శాఖల వారీగా.. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాలను పొంది వారు ఉపాధి పొందుతునే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 96 యూనిట్లను మంజూరు చేశారు. రూ.2,00,09,000 సబ్సిడీ కింద అందజేశారు. ఇందులో ఆటో ట్రాలీలు 22 మందికి, ట్యాక్సి కార్ 17 మందికి, గల్పర్ మిషన్ 2, ప్యాసింజర్ ఆటోలు 44మందికి, పికప్ వ్యాన్ 5 మందికి, టాటా ఏస్ 2, ట్రాక్టర్, ట్రాలీ 4గురికి అందజేశారు. 2016–17 సంవత్సరంలో 25 మంది లబ్ధిదారులకు రూ.66లక్షల సబ్సిడీతో రుణాలు అందించారు. వీటిలో ట్రాక్టర్ ట్రాలీ 2, టాటా ఏస్ 1, పికప్ వ్యాన్ 1, డీజిల్ ఆటోలు 3, ట్యాక్సి కార్ 7, ఆటో ట్రాలీ 11 మంది లబ్ధిదారులకు అందజేశారు. 2017–18 సంవత్సరంలో 21 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్, ప్యాసింజర్ ఆటోలు, ఆటో ట్రాలీలు, ఆటో పికప్ వ్యాన్లను మంజూరు చేయగా, వీరికి రూ 45.54లక్షల సబ్సిడీని అందజేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సీసీడీపీ పథకం ద్వారా ఐసీడీఎస్‌లో 34 మంది పీటీజీ తెగలకు రూ.50లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీపై ఆటోలను అందించారు. వీరు నెలల వాయిదా పద్ధతిలో తీసుకున్న రుణాన్ని బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. 2016–17ఆర్థిక సంవత్సరంలో 124 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 6లక్షల 27వేల వ్యయంతో ప్యాసింజర్ ఆటోలను అందించారు. రెండు ప్యాసింజర్ మోటార్ క్యాబ్‌లను అందజేశారు. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా.. స్వయం ఉపాధి రుణాల పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 శాతం సబ్సిడీపై, పురుషులకు 35 శాతం సబ్సిడీపై రుణాలను అందజేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో 2014 సంవత్సరం నుంచి 2017 వరకు 28 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.80,91,069 సబ్సిడీ మంజూరు చేశారు. 11 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.28,55,221 సబ్సిడీని మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీ ప్రైడ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 42 మంది లబ్ధిదారులకు, 40 మంది ఎస్టీలకు రుణాలను మంజూరు చేశారు. ఇదిలా ఉండగా పరిశ్రమ శాఖలో కొంతమంది ఎస్సీ, ఎస్టీలపై భారీగా సబ్సిడీ రుణాలను పొంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రూ.10లక్షలలోపు రుణం తీసుకుంటే జిల్లా కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. రూ.10లక్షలకు పైగా రుణం తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సబ్సిడీ నగదు సకాలంలో మంజూరు కాకపోవడం, మంజూరైన ఖాతాలో జమ కాకపోవడంతో లబ్ధిదారులు వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే సబ్సిడీని వడ్డీ కిందకే కట్టావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో చెల్లిస్తే పేదలను ఆదుకున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు జిల్లాలోని నిరుద్యోగులు వివిధ పథకాలకు పరిశ్రమల శాఖలో 1 ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు 224 మంది టీ ఫ్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మరో 24 మంది లబ్ధిదారులకు రూ.63,60,980 సబ్సిడీ మంజూరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
-
హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముకరంపుర: హరితహారం కార్యక్రమంలో జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈనెల 15లోగా మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమంలో వేగం పెంచాలన్నారు. అవసరమైన ఈత, పండ్లు, టేకు మొక్కలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలకు నీరు పోసి రక్షించేందుకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలన్నింటికీ రక్షణగా ట్రీగార్డులు, కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను వచ్చే వర్షాకాలం వరకు నీరు పొసి రక్షించుటకు కావాల్సిన నిధులు 2017 మార్చి వరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు వీలుగా ప్రజలకు కావాల్సిన మొక్కలను మాత్రమే నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నుంచి న ర్సరీలో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయేల్ డేవిస్, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.బాబురావు, డీఎఫ్‌వోలు రవికిరణ్, వినోద్‌కుమార్, మహేందర్‌రాజు, ఏజేసీ నాగేంద్ర, డ్వామా పీడీ వేంకటేశ్వర్ రావు, జెడ్పీ సీఈవో సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.