పరిషత్‌ ‘పరీక్ష’! | Telangana ZPTC And MPTC Elections Ends Campaign | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ‘పరీక్ష’!

Published Sat, May 4 2019 8:04 AM | Last Updated on Sat, May 4 2019 8:04 AM

Telangana ZPTC And MPTC Elections Ends Campaign - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుంది. మొదటి విడత ఘట్టం ముంచుకొస్తుంది. మరో రెండు రోజుల్లో తొలి సమరం జరగనుంది. దీంతో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపోటముల ప్రభావం ముఖ్య నేతలపై ఉంది. దీంతో ఆ నేతలకు ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న ఆ నేతల్లో కొందరికి తీపి, మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అలా మొదటి పరీక్ష ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ద్వారా రెండో పరీక్షలోనూ ఫలితాలు చూశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ద్వారా మూడో పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ద్వారా మరో పరీక్షకు సిద్ధమయ్యారు.

ఈ నేతలకు కీలకం..
ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ పరంగా మంచి ఫలితాల కోసం కొంతమంది ముఖ్య నేతలు జిల్లాలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం వారికి కీలకం కానుంది. ప్రధానంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండేలకు ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న మరోసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోయినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో గత నెల  జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.

మిగతా నేతలకు అందనంత దూరంలో ఆయన ప్రచారం సాగింది. తద్వారా నియోజకవర్గంలో అటు లోక్‌సభ, ఇటు ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నిలిచిన పాయల శంకర్‌ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా అంత పెద్దగా ప్రభావం చూపనప్పటికీ స్వల్ప ఫలితాలు సాధించి పార్టీ ఉనికిని చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే అటు పార్టీతోపాటు పాయల శంకర్‌కు వ్యక్తిగతంగా ఇమేజ్‌ పెరుగుతుంది. ఇక కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌ పాండేకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్‌ ఆశించినా గండ్రత్‌ సుజాతకు దక్కడంతో ఆమె గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే నియోజవర్గంలో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ తర్వాత నిలిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో అంతాతానై వ్యవహరిస్తుండడంతో ఫలితాలు కీలకంగా మారాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితానికి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. బోథ్‌ నియోజవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బాపురావుకు ఊరటనిచ్చింది.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ కూడా బోథ్‌ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ఆ ఫలితాల బాధ్యత ఇరువురిపై ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుకు కీలకం కానుంది. ప్రధానంగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన పక్షంలో సీఎం దగ్గర పలుకుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సోయం బాపురావుకు ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సోయం బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

ఇక ఖానాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు జిల్లాలోకి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపు కోసం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ మండలాలతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ సీనియర్‌ నేతగా, పార్టీలో మరింత పట్టుకోసం ఈ ఎన్నికల ద్వారా కృషి చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఈ మండలాల్లో గెలుపు కీలకం కానుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాథోడ్‌ రమేశ్‌పై గెలుపుతో నియోజకవర్గంలో ప్రభావం చూపారు. అదే సరళిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె భుజస్కందాలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇక్కడ గెలుపు పొందడం ద్వారా తన ప్రత్యర్థి రాథోడ్‌ రమేశ్‌ను గట్టిగా రాజకీయంగా దెబ్బతీయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇక నార్నూర్, గాదిగూడలో ఈ ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా విజయం సాధించడం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కోవ లక్ష్మికి కీలకం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement