సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మొత్తం 27 మండల పరిషత్‌లు ఉండ గా 19 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజారిటీ పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దక్కింది. మిగిలిన ఎనిమిదింటిలో ఒక్క చందూరు ఎంపీపీ కాంగ్రెస్‌కు దక్కే మెజారిటీ ఉంది. ఏడు చోట్ల టీఆర్‌ఎస్ పార్టీకి స్వతంత్రులు గానీ, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఒకరిద్దరు సభ్యుల మద్దతు అవసరం ఏర్పడింది. దీంతో ఆయా మండలాల్లో స్వతంత్ర ఎంపీటీసీలు, ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఇప్పటికే కూడగట్టిన గులాబీ నేతలు దాదాపు అన్ని మండలాల అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు పావులు కదిపారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు బాధ్యతలు తీసుకున్నారు. తమ పార్టీ ఎంపీటీసీలతో పాటు, ఇతర ఎంపీటీసీలను కూడా క్యాంపునకు తరలించారు. శుక్రవారం ఎంపీటీసీ సభ్యులను నేరుగా మండల పరిషత్ సమావేశాలకు తరలించనున్నారు.
చందూరు కోసం..
జిల్లాలోనే అతి చిన్న మండలమైన చందూరు ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయింది. ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఒకటి టీఆర్‌ఎస్‌కు రాగా, మిగిలిన రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క ఎంపీటీసీ మద్దతుంటే చాలు ఎంపీపీ అయిపోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులుండటంతో ఎంపీపీ స్థానం కాంగ్రెస్ కైవసం అవుతోంది. దీన్ని కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. దీన్ని ఎలాగైనా కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీటీసీలిద్దరు పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలను కలిశారు. మొత్తం మీద ఈ ఎంపీపీ స్థానం కాంగ్రెస్‌కు దక్కుతుందా., టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళుతుందా అనే అంశంపై నేడు స్పష్టత రానుంది.
రెంజల్, నవీపేట్‌లో ఆసక్తికరం
రెంజల్, నవీపేట్ ఎంపీపీ స్థానాల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ రెండు మండలాల్లో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం మద్దతు ఇచ్చుకోవడం ద్వారా రెండు చోట్ల ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 16 ఎంపీటీసీ స్థానాలున్న నవీపేట్‌లో కాంగ్రెస్‌కు ఐదు దక్కాయి, ఇక్కడ మూడు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ, ఒక స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు గాను రెంజల్‌లో కాంగ్రెస్ ఎంపీటీసీలు బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ రెండు మండలాలు టీఆర్‌ఎస్‌కు దక్కకుండా కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఏడు స్థానాల్లో ..
- మిగిలిన ఏడు మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఏడింటిలోనూ టీఆర్‌ఎస్ ఎంపీటీసీలే గెలిచినప్పటికీ.. ఒకరిద్దరు ఎంపీటీసీల మద్దతు తప్పనిసరిగా మారింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలిచిన టీఆర్‌ఎస్ రెబల్ ఎంపీటీసీలను, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఒకరిద్దరు ఎంపీటీసీలను క్యాంపునకు తరలించిన టీఆర్‌ఎస్ ఈ ఏడింటిని కూడా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
- మెండోరా ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రి జర్వు అయింది. ఇక్కడ ఒకే ఒక్క ఎస్సీ మహి ళ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీటీసీగా విజయం సాదించారు.దీంతోఈ ఎంపీపీ స్థానంటీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతుతో గానీ, ఆ రెండు పార్టీల సభ్యులు ఓటింగ్‌లో గైర్హాజరుకావడంద్వారాగానీ ఈ ఎంపీపీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకోనుంది.
- మోర్తాడ్ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌కు మరో ఎంపీటీసీ సభ్యుని మద్దతు అవసరం కాగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన టీఆర్‌ఎస్ రెబల్ ఎంపీటీసీ మద్దతు కూడగట్టినట్లు సమాచారం.
- టీఆర్‌ఎస్ పార్టీకి ఆర్మూర్‌లో ఒక ఎంపీటీసీ, నందిపేట్‌లో ఇద్దరు ఎంపీటీసీల మద్దతు అవసరం ఉంటుంది. స్వతంత్ర ఎంపీటీసీలను టీఆర్‌ఎస్ క్యాంపునకు తరలించిన ఆ పార్టీ నేతలు ఈ రెండు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోనున్నారు.
- ఎడపల్లిలో ఐదు స్థానాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్, మరో ఇద్దరు స్వతంత్ర, కాంగ్రెస్ ఎంపీటీసీల మద్దతుతో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment