rathode ramesh
-
పరిషత్ ‘పరీక్ష’!
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. మొదటి విడత ఘట్టం ముంచుకొస్తుంది. మరో రెండు రోజుల్లో తొలి సమరం జరగనుంది. దీంతో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపోటముల ప్రభావం ముఖ్య నేతలపై ఉంది. దీంతో ఆ నేతలకు ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న ఆ నేతల్లో కొందరికి తీపి, మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అలా మొదటి పరీక్ష ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ద్వారా రెండో పరీక్షలోనూ ఫలితాలు చూశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ద్వారా మూడో పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ద్వారా మరో పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేతలకు కీలకం.. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ పరంగా మంచి ఫలితాల కోసం కొంతమంది ముఖ్య నేతలు జిల్లాలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం వారికి కీలకం కానుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలకు ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న మరోసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోయినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత నెల జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. మిగతా నేతలకు అందనంత దూరంలో ఆయన ప్రచారం సాగింది. తద్వారా నియోజకవర్గంలో అటు లోక్‌సభ, ఇటు ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నిలిచిన పాయల శంకర్ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా అంత పెద్దగా ప్రభావం చూపనప్పటికీ స్వల్ప ఫలితాలు సాధించి పార్టీ ఉనికిని చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే అటు పార్టీతోపాటు పాయల శంకర్‌కు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండేకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినా గండ్రత్ సుజాతకు దక్కడంతో ఆమె గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే నియోజవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీఆర్ఎస్ తర్వాత నిలిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో అంతాతానై వ్యవహరిస్తుండడంతో ఫలితాలు కీలకంగా మారాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితానికి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. బోథ్ నియోజవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బాపురావుకు ఊరటనిచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కూడా బోథ్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ఆ ఫలితాల బాధ్యత ఇరువురిపై ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు కీలకం కానుంది. ప్రధానంగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన పక్షంలో సీఎం దగ్గర పలుకుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సోయం బాపురావుకు ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సోయం బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు జిల్లాలోకి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రాథోడ్ రమేశ్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ మండలాలతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ సీనియర్ నేతగా, పార్టీలో మరింత పట్టుకోసం ఈ ఎన్నికల ద్వారా కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఈ మండలాల్లో గెలుపు కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాథోడ్ రమేశ్‌పై గెలుపుతో నియోజకవర్గంలో ప్రభావం చూపారు. అదే సరళిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె భుజస్కందాలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇక్కడ గెలుపు పొందడం ద్వారా తన ప్రత్యర్థి రాథోడ్ రమేశ్‌ను గట్టిగా రాజకీయంగా దెబ్బతీయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇక నార్నూర్, గాదిగూడలో ఈ ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించడం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి కోవ లక్ష్మికి కీలకం కానుంది. -
కొంపముంచే ‘క్రాస్ ఓటింగ్’
సాక్షి, భైంసా : నేరుగా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే క్రాస్ ఓటింగ్ ఒక్కోసారి సత్ఫలితాలనిచ్చినా.. కొంప ముంచే అవకాశాలే ఎక్కువ! నచ్చిన నాయకున్ని గెలిపించాలనే తాపత్రయంలో లెక్క గానీ తప్పితే.. ఆ నాయకుడు మరో ఐదేళ్ల దాకా పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిందే! 2009 ఎన్నికలప్పుడు ముథోల్ నియోజకవర్గంలో ఈ విషయమే తేటతెల్లమైంది! 2009 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేణుగోపాలాచారి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్, ప్రజారాజ్యం అభ్యర్థిగా విఠల్‌రెడ్డి శాసనసభ బరిలో దిగారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడంతో లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, ప్రజారాజ్యం అభ్యర్థిగా నాగోరావు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ సామాజికవర్గీయుల్లో చాలా మంది విఠల్‌రెడ్డి మద్దతుదారులు. విఠల్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో అంతా కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అప్పుడు తన సామాజికవర్గం ఓట్ల కోసం రాథోడ్ రమేశ్ ప్రజారాజ్యం పార్టీలో చేరిన విఠల్‌రెడ్డి మద్దతుదారుల సాయం కోసం అభ్యర్థించారు. ఇందులో భాగంగా వారిని ఎమ్మెల్యే స్థానానికి ఎవరికి ఓటేసినా.. ఎంపీ స్థానానికి మాత్రం తనకే ఓటేయాలని మాట తీసుకున్నట్లు సమాచారం! దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారికి కష్టమొచ్చింది. రాథోడ్ రమేశ్ కూడా అంతా సాఫీగానే జరుగుంతుందని అనుకున్నారు. కానీ, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ సామాజికవర్గ నాయకుడిని ఎంపీగా గెలిపించాలన్న ఆలోచనలో ఓటు వేసేటప్పుడు చాలా మంది ఓటర్లు పొరపాటుపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డికి అనుకుని వేసిన ఓటు ఎంపీ అభ్యర్థి నాగోరావుకు.. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు అనుకున్న ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలాచారికి పడ్డాయి. ఫలితాలు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. గెలుపు తమదేనని ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ధీమాగా ఉంది. కానీ, కౌంటింగ్ రోజున అసలు విషయం తేలిపోయింది. 16 మే 2014న ఆదిలాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నాగోరావుకు 6,114 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఒకరు గెలుస్తారనుకుంటే ఇంకొకరు గెలిచారు. ఇలా క్రాస్ ఓటింగ్ ఆనాడు తీవ్ర ప్రభావం చూపింది. -
అప్పుడు వాళ్లే..ఇప్పుడు వాళ్లే
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు లోక్‌సభ బరిలోకి దిగి మరోసారి తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరుపు నుంచి పోటీ పడుతున్న రాథోడ్ రమేష్ ఖానాపూర్ అసెంబ్లీకి, బీజేపీ నుంచి ఎంపీ బరిలో దిగిన సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి లోక్‌సభ బరిలోనూ టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వెంకటేష్ నేతకాని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నుంచి పోటీ పడి ఓటమి చెందిన వారే. వీరితోపాటు మరో ఐదుగురు ఇతర అభ్యర్థులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన వారుండటం గమనార్హం! మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీరిని వెక్కిరించిన అదృష్టం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా వరిస్తుందో లేదో వేచిచూడాలి. ఖానాపూర్ నుంచి రాథోడ్ రమేష్.. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,49,380 ఓట్లు పోలవగా, రాథోడ్ రమేష్‌కు 46,428 వచ్చాయి. రేఖానాయక్‌కు 67,138 ఓట్లు వచ్చాయి. 20,710 ఓట్ల తేడాతో రమేష్ రాథోడ్ ఓటమి చెందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభకు టీడీపీ నుంచి పోటీ చేయగా, 1.84 లక్షల ఓట్లు రావడంతో రమేష్ రాథోడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈయనకు 3.72 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో అప్పుడు ఎంపీ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బోథ్ నుంచి సోయం బాపూరావు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 1.54 లక్షల ఓట్లు పోలవగా, సోయం బాపూరావుకు 54,639 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రాథోడ్ బాపూరావుకు 61,125 ఓట్లు రావడంతో ఆ ఎన్నికల్లో సోయం బాపూరావు 6,486 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాపూరావు 35,218 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నూర్ నుంచి వెంకటేష్ నేతకాని.. చెన్నూర్ అసెంబ్లీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన వెంకటేష్ నేతకాని టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వెంకటేష్ నేతకానికి 43,848 ఓట్లు వచ్చాయి. చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్‌కు 71,980 ఓట్లు రావడంతో 28,132 ఓట్ల తేడాతో వెంకటేష్ నేతకాని ఓటమి పాలయ్యారు. తద్వారా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానంలోకి వచ్చి లోక్‌సభకు పోటీపడుతుండటం విశేషం. ఇతరులు కూడా.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సిర్పూర్ నుంచి పోటీ చేసిన గంట పెంటన్నకు అప్పుడు 595 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్‌సభ బరిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన సబ్బని క్రిష్ణకు ఆ ఎన్నికల్లో 1812 ఓట్లు వచ్చాయి. అదే నియోజకవర్గానికి అసెంబ్లీ బరిలో నిలిచిన అంబాల మహేందర్‌కు 706 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రామగుండం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఇరికిల్ల రాజేష్‌కు ఆ ఎన్నికల్లో 299 ఓట్లు వచ్చాయి. ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేసిన కుంటాల నర్సయ్యకు 13,114 ఓట్లు వచ్చాయి. వీరు నలుగురు ప్రస్తుతం పెద్దపల్లి లోక్‌సభ బరిలో ఉన్నారు. -
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి 13వ రోజు పల్లె నిద్ర చేపట్టారు. మండలంలోని పెర్కగూడ, హస్నాపూర్, చాందూరి, రాజులగూడ, నడ్డంగూడ, యెంక, నాగాపూర్, శ్యాంపూర్, సాకెర, నర్సాపూర్(బి), ఉమ్రి, యెందా, కుమ్మరితండా, సాలెవాడ(కె), సాలెవాడ(బి), తాండ్ర గ్రామాల్లో పర్యటించి రాత్రిపూట కోపర్ఘట్ గ్రామంలో ప్రజలతో కలిసి నిద్రించారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పెర్కగూడలో మురికి కాలువ, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరారు. హస్నాపూర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఎంపీ హామీనిచ్చారు. మోటారుసైకిల్‌పై రాజులగూడకు చేరుకున్నారు. గ్రామంలో త్రీఫేజ్ సౌకర్యంతోపాటు వ్యవసాయ మోటార్లు ఇప్పిస్తానని తెలిపారు. నాగాపూర్‌లో రూ.7లక్షలతో తలపెట్టిన ఎస్సీ వసతిగృహం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ లేఖ ఫలితంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తుంటే.. టీఆర్ఎస్ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయమంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగితే కేసీఆర్ పుణ్యమే అవుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వితంతువులకు రూ.600, వికలాంగులకు రూ.1,500 పింఛన్ ఇస్తామని, ఇళ్లు లేని వారికి రూ.1.50లక్షలతో నిర్మించి ఇస్తామని అన్నారు. ఎంపీ తనయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితీష్‌రాథోడ్, పార్టీ మండల అధ్యక్షుడు సాడిగే రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కుటికెల ఆశన్న, మాజీ జెడ్పీటీసీ గంగన్న, మాజీ ఎంపీపీ ధన్లాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.