సాక్షి, భైంసా : నేరుగా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే క్రాస్ ఓటింగ్ ఒక్కోసారి సత్ఫలితాలనిచ్చినా.. కొంప ముంచే అవకాశాలే ఎక్కువ! నచ్చిన నాయకున్ని గెలిపించాలనే తాపత్రయంలో లెక్క గానీ తప్పితే.. ఆ నాయకుడు మరో ఐదేళ్ల దాకా పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిందే! 2009 ఎన్నికలప్పుడు ముథోల్ నియోజకవర్గంలో ఈ విషయమే తేటతెల్లమైంది!
2009 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేణుగోపాలాచారి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్, ప్రజారాజ్యం అభ్యర్థిగా విఠల్‌రెడ్డి శాసనసభ బరిలో దిగారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడంతో లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, ప్రజారాజ్యం అభ్యర్థిగా నాగోరావు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ సామాజికవర్గీయుల్లో చాలా మంది విఠల్‌రెడ్డి మద్దతుదారులు.
విఠల్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో అంతా కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అప్పుడు తన సామాజికవర్గం ఓట్ల కోసం రాథోడ్ రమేశ్ ప్రజారాజ్యం పార్టీలో చేరిన విఠల్‌రెడ్డి మద్దతుదారుల సాయం కోసం అభ్యర్థించారు. ఇందులో భాగంగా వారిని ఎమ్మెల్యే స్థానానికి ఎవరికి ఓటేసినా.. ఎంపీ స్థానానికి మాత్రం తనకే ఓటేయాలని మాట తీసుకున్నట్లు సమాచారం! దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారికి కష్టమొచ్చింది.
రాథోడ్ రమేశ్ కూడా అంతా సాఫీగానే జరుగుంతుందని అనుకున్నారు. కానీ, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ సామాజికవర్గ నాయకుడిని ఎంపీగా గెలిపించాలన్న ఆలోచనలో ఓటు వేసేటప్పుడు చాలా మంది ఓటర్లు పొరపాటుపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డికి అనుకుని వేసిన ఓటు ఎంపీ అభ్యర్థి నాగోరావుకు.. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు అనుకున్న ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలాచారికి పడ్డాయి. ఫలితాలు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు.
గెలుపు తమదేనని ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ధీమాగా ఉంది. కానీ, కౌంటింగ్ రోజున అసలు విషయం తేలిపోయింది. 16 మే 2014న ఆదిలాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నాగోరావుకు 6,114 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఒకరు గెలుస్తారనుకుంటే ఇంకొకరు గెలిచారు. ఇలా క్రాస్ ఓటింగ్ ఆనాడు తీవ్ర ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment