ఉట్నూర్, న్యూస్‌లైన్ :
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి 13వ రోజు పల్లె నిద్ర చేపట్టారు. మండలంలోని పెర్కగూడ, హస్నాపూర్, చాందూరి, రాజులగూడ, నడ్డంగూడ, యెంక, నాగాపూర్, శ్యాంపూర్, సాకెర, నర్సాపూర్(బి), ఉమ్రి, యెందా, కుమ్మరితండా, సాలెవాడ(కె), సాలెవాడ(బి), తాండ్ర గ్రామాల్లో పర్యటించి రాత్రిపూట కోపర్‌ఘట్ గ్రామంలో ప్రజలతో కలిసి నిద్రించారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పెర్కగూడలో మురికి కాలువ, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరారు. హస్నాపూర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఎంపీ హామీనిచ్చారు. మోటారుసైకిల్‌పై రాజులగూడకు చేరుకున్నారు.
గ్రామంలో త్రీఫేజ్ సౌకర్యంతోపాటు వ్యవసాయ మోటార్లు ఇప్పిస్తానని తెలిపారు. నాగాపూర్‌లో రూ.7లక్షలతో తలపెట్టిన ఎస్సీ వసతిగృహం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ లేఖ ఫలితంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తుంటే.. టీఆర్‌ఎస్ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగితే కేసీఆర్ పుణ్యమే అవుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వితంతువులకు రూ.600, వికలాంగులకు రూ.1,500 పింఛన్ ఇస్తామని, ఇళ్లు లేని వారికి రూ.1.50లక్షలతో నిర్మించి ఇస్తామని అన్నారు. ఎంపీ తనయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితీష్‌రాథోడ్, పార్టీ మండల అధ్యక్షుడు సాడిగే రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కుటికెల ఆశన్న, మాజీ జెడ్పీటీసీ గంగన్న, మాజీ ఎంపీపీ ధన్‌లాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్
Published Fri, Nov 8 2013 1:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement