ఆదిలాబాద్‌లోని రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు
ఆదిలాబాద్‌కల్చరల్: విజయదశమిని పురస్కరించుకుని గురువారం జిల్లాలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. శమి పూజ, రావణాసుర దహనం కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల అధికారులు, మరి కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు రావణాసురుడి ప్రతిమకు నిప్పు అంటించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం దసరా ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టుకు పూజ చేయడంతోపాటు పనిముట్లు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలు జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
సంఘటితంతోనే విజయం
ఎన్నో కులాలు, మతాలు ఉన్న మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా పేరొందిందని, సంఘటితంగా ఉండడం ద్వారా ప్రతి పనిలో విజయం సాధించవచ్చని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న అన్నారు. సనాత హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అంతకుముందు శ్రీగోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు ఖడ్గాన్ని అందజేశారు. వేడుకల్లో భాగంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రావణుని బొమ్మను దహనం చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, ప్రమోద్‌ఖత్రి, నాయకులు దుర్గం రాజేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫూల్ వఝే సభ్యులు బండారి దేవన్న, కందుల గజేందర్, పడకంటి సూర్యకాంత్, మేకల అశోక్, సతీష్ మిత్తల్, జగదీశ్వర్, బాసెట్టి గజేందర్, అంజుకుమార్, గెడం మాధవ్, భవానీ సంతోష్, రేనికుంట రవీందర్, నర్సోజి, గాలే నర్సింగ్, లోలపు శ్రీనివాస్, కె.సంజీవ్, గజానన్, రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.
చెడుపై విజయానికి ప్రతీక
ఆదిలాబాద్‌రూరల్: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే దసరా వేడుకలు జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, సన్మార్గంలో సాగితే తప్పకుండా విజయం కలుగుతుందని అన్నారు.
హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో శాంతియుతంగా నిర్వహించిన, మట్టి విగ్రహాలను ప్రతిష్టాపించిన నిమజ్జన యాత్రలో విగ్రహాలను అందంగా అలంకిరించిన గణేష్ మండలి నిర్వాహకులకు ఆయన చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. అంతకుముందు శమి, ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ దహనాన్ని నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ఆదిలాబాద్ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఆర్డీవో సూర్యనారాయణ, ఆశన్న, రాజేశ్వర్, కాసర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment