అమాత్యుల హస్తంతోనే.. | KCR MLA Candidates Announced Adilabad | Sakshi
Sakshi News home page

అమాత్యుల హస్తంతోనే..

Published Sun, Sep 9 2018 8:40 AM | Last Updated on Sun, Sep 9 2018 8:40 AM

KCR MLA Candidates Announced Adilabad - Sakshi

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జోగు రామన్న

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘నాలుగేళ్లలో అనేకసార్లు సర్వేలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేశాం. ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఇచ్చాం. కేవలం ఇద్దరికి తప్ప సిట్టింగులద్దరికి సీట్లు ఇవ్వడం జరిగింది.’ ఈనెల 6న శాసనసభ రద్దు తరువాత 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలివి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొందరి టికెట్ల విషయంలో మంత్రులు, ముఖ్య నేతల మాట చెల్లుబాటు అయినట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశించిన నాయకులు, వారి అనుచరులు సైతం అదే నిజమని చెబుతుండడం గమనార్హం.

జిల్లాకు చెందిన మంత్రులతో పాటు వచ్చే ప్రభుత్వంలో కీలక పదవులు పొందాలని భావి స్తున్న కొందరు నేతలు, ఓ ఎమ్మెల్సీ ముందు జాగ్రత్తగా సీనియర్‌ నాయకులకు టికెట్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపణ. ప్రధానంగా ఎస్టీ రిజర్వుడు సీట్‌లైన ఖానాపూర్, బోథ్‌ నియోజకవర్గాల్లో పార్టీ సిట్టింగ్‌లనే కొనసాగించడానికి కారణమదేనని చెపుతున్నారు. చెన్నూర్‌లో ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలును తొలగించి ఎంపీ బాల్క సుమన్‌ను తీసుకురావడంలో కూడా నేతల అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. పార్టీలో, జిల్లాలో ఆధిపత్యం తగ్గకుండా ప్రణాళికబద్ధంగా సీనియర్‌లకు చెక్‌ పెట్టారని టికెట్లు రాని నేతల అనుచరులు ఆరోపిస్తున్నారు.

రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరకుండా ...
కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తరువాత జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో అనతికాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు రాథోడ్‌ రమేష్‌. ఎస్టీ రిజర్వుడు ఖానాపూర్‌ నుంచి తొలుత గెలిచి, తరువాత ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచారు. ప్రతికూల పరిస్థితుల్లో 2009లో టీడీపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అయితే 2010 నుంచి మారిన రాజకీయ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన నాయకులంతా ఒక్కొక్కరిగా టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరినా, ఆయన అక్కడే కొనసాగారు. చివరికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓడిపోయినా, పార్టీని వీడలేదు. చివరికి 2017లో ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ద్వారా టీఆర్‌ఎస్‌లో చేరారు.

అది కూడా తదుపరి ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి పార్టీ టికెట్టు ఖాయమనే హామీతో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రమేష్‌ రాథోడ్‌ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అంతకు ముందు చేసిన ప్రయత్నాలను ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు సాగనీయలేదు. కాంగ్రెస్, బీజేపీల నుంచి రాథోడ్‌కు ఆహ్వానాలు అందుతున్న తరుణంలో తుమ్మల ప్రోద్భలంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్‌ టికెట్టు హామీ ఇచ్చారని ప్రకటించడం గమనార్హం. అయితే ఇప్పుడు టికెట్టు రాకపోవడానికి మంత్రులతో పాటు కొందరు టీఆర్‌ఎస్‌ నేతలే చక్రం తిప్పినట్లు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

మంత్రిగా అడ్డు కాకూడదనేనా...?
నాలుగేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో బీసీ, అగ్ర వర్ణాలకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహించారు. ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజనులకు కేటాయించినవే. సాధారణంగా ఆదిలాబాద్‌ నుంచి ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బోథ్‌ అసెంబ్లీ నుంచి మూడుసార్లు గెలిచిన గోడం నగేష్‌ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన ఎమ్మెల్యే అయితే సీనియారిటీ, కుల సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం లభించడం ఖాయం. ఇక్కడే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చక్రం తిప్పారని బోథ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆదివాసీ, లంబాడా ఉద్యమం ఉచ్ఛస్థితికి చేరుకున్న సమయంలో ఓ పథకం ప్రకారం ఆదివాసీకి చెందిన నగేష్‌ను ఎంపీగానే కొనసాగిస్తారని పార్టీ వర్గాల్లో లీక్‌ చేశారని ఆయన అనుయాయుల ఆరోపణ. ఇదే వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికల రూపంలో చేరేలా పార్టీ ముఖ్య నేతలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లు ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మంత్రుల నివేదికల్లో సిట్టింగ్‌లపై  సానుకూలత 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కాగజ్‌నగర్‌ వచ్చిన సందర్భంలో ఆయన కొందరు ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల్లో సిట్టింగ్‌ల్లో చెన్నూర్‌ నుంచి ఓదెలుకు మినహా తొమ్మిది మందికి సీట్లు ఖాయమనే ప్రచారం అప్పుడే ముఖ్య నాయకులు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. ఖానాపూర్, బోథ్‌లలో సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వబోతున్న విషయం కూడా మంత్రులకు ముందే తెలుసని సమాచారం . అలాగే ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరించే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జోగు రామన్న సైతం ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పట్ల అధిష్టానానికి సానుకూల నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే బోథ్, ఖానాపూర్‌లలో సిట్టింగ్‌లను మారిస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని ముఖ్య నాయకులు స్కెచ్‌ గీసినట్లు అర్థమవుతోంది.
 
సుమన్‌ కోరిక మేరకే చెన్నూర్‌
సిట్టింగులకు సీట్లు ఇచ్చే క్రమంలో చెన్నూర్‌ నుంచి ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన నల్లాల ఓదెలుకు సీటు రావాలి. పెద్దపల్లి లోక్‌సభ సీటును ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్‌కు ఇవ్వడం అనివార్యం. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎంపీ సుమన్‌ను అసెంబ్లీకి పంపించాలనేది వ్యూహం. సుమన్‌కు 2014లోనే చొప్పదండి ఎమ్మెల్యే సీటు ఇస్తారని భావించిగా, వివేక్‌ చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరడంతో సుమన్‌కు ఆ అవకాశం లభించింది. మారిన పరిస్థితుల్లో వివేక్‌కు ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే చొప్పదండి సుమన్‌కు కేటాయించాలి. కుల సమీకరణల విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు. కానీ చొప్పదండి నుంచి పోటీ చేయడం ఇష్టం లేని సుమన్‌ చెన్నూర్‌ కోరడంతో ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన సుమన్‌ వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి టార్గెట్‌గానే ఆదిలాబాద్‌ జిల్లాను ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement