టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారం జోరందుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనపై ఆపార్టీ అభ్యర్థులు గంపె డాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న అభ్యర్థులు.. ఎక్కడైనా తేడా వచ్చినా కేసీఆర్ సభలతో సర్దుకుంటుందని భావిస్తున్నారు. పోలింగ్‌కు వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన మేలు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేసేందుకు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఆరు సభలకు సంబంధించి గుర్తించిన ప్రాంతాల్లో హెలీప్యాడ్‌లు, బహిరంగసభ వేదికలు సిద్ధమయ్యాయి. అభ్యర్థులు, పార్టీ నాయకులు బుధవారం దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షించారు.
తొలివిడత సభలతోనే జోష్..
పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తొలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని అప్పటివరకు కొంత నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ఖానాపూర్, బోథ్ (ఇచ్చోడ), నిర్మల్, భైంసాలలో సాగిన బహిరంగసభలు విజయవంతం కావడంతో అభ్యర్థులతో పాటు పార్టీ యంత్రాంగంలో కూడా జోష్ వచ్చింది.
ఆయా నియోజకవర్గాల్లో స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ, నాలుగేళ్ల పాలనలో ఎమ్మెల్యేల నేతృత్వంలో జరిగిన అభివృద్ధిను గుర్తు చేస్తూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను తూర్పారా పడుతూ ప్రజలను ఆకట్టుకొనే ప్రసంగాలు చేశారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా పథకం, కల్యాణలక్ష్మి వంటి నేరుగా ప్రజలకు లబ్ధి జరిగిన విషయాలపైనే దృష్టి కేంద్రీకరించడం అభ్యర్థులకు అనుకూలంగా మారిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ‘మేమంతా మైకులు పట్టి ఎంత మొత్తుకున్నా జనం సాదాసీదాగా తీసుకుంటున్నారు. అదే కేసీఆర్ తన శైలిలో నాలుగు మాటలు మాట్లాడితే సీన్ మారిపోతుంది’ అని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ సభ జరిగేలా ప్లాన్ చేశారన్నాడు.
మలివిడత ప్రచారం...ఉమ్మడి జిల్లాపై ప్రభావం
తొలి విడత ప్రచారం తరువాత సరిగ్గా పదిరోజులకు మరోసారి ఉమ్మడి జిల్లాకు వస్తున్న కేసీఆర్ తన ప్రసంగాలతో ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేస్తారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు తొలి బహిరంగసభ ద్వారా పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలకు మరోసారి ఊపు వస్తుందని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆదిలాబాద్‌లో జరిగిన అభివృద్ధి పనుల గురించి సీఎం చెపితే అది పూర్వ జిల్లా మొత్తం మీద ప్రభావితం చూపుతుందని పేర్కొంటున్నారు.
ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చడం, సిర్పూరులో ఎస్‌పీఎం పునరుద్ధరణ, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలలో సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమం గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాను ఆనుకొని గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల వల్ల ఒనగూరే ప్రయోజనాలను మంచిర్యాల జిల్లా వాసులకు వివరిస్తారని భావిస్తున్నారు. కార్మికులకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల వల్ల అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టేనని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment