ఒక పార్టీ సమావేశంలో భోజనాలు చేస్తున్న కార్యకర్తలు
సాక్షి, నెన్నెల : ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. నియోజకవర్గంలో ప్రచారపర్వం హోరెత్తుతుంది. నిత్యం అన్ని పార్టీల అభ్యర్థులు బల ప్రదర్శనలు, భారీగా బైక్ ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు సమావేశాలతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలో వెనుక నడిచేందుకు యువతను ప్రధానంగా చేరదీస్తున్నారు. అయితే వారు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మోటారు సైకిల్ తెస్తే కనీసం రూ.100 పెట్రోల్ పోయించాలి. సమయానికి చికెన్, బిర్యాని తినిపించాలి. ఒక మద్యం క్వార్టర్ అందించాలి. లేదంటే రేపు మళ్లీ వస్తారో రారో అనే సందేహం నాయకుల మదిలో మెదులుతుంది. దీంతో కార్యకర్తలకు, నాయకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారంలో ఎంత మంది బైక్ ర్యాలీ తీస్తారు, వారికి అవసరమైన ఏర్పాట్లు ఎవరూ చూసుకుంటారు, ఎంత మొత్తం అడుగుతున్నారు, మనం ఎంత చెల్లిద్దాం అనేది ముందు రోజే అభ్యర్థులు వారి సన్నిహితులతో చర్చిస్తున్నారు. దీంతో ర్యాలీ అనగానే పెట్రోల్‌బంక్‌ల వద్ద అభ్యర్థికి సంబంధించిన నేతలు ఒకరు ప్రత్యక్షమవుతున్నారు. ర్యాలీకి వచ్చే వాహనాలను గుర్తించేందుకు ముందుగానే పార్టీ జెండాలు కట్టిస్తున్నారు. జెండా ఉన్న బండికి నిర్ణీ త కొలమానం ప్రకారం పెట్రోల్ పోయిస్తున్నారు.
భోజనాల ఏర్పాటు..
అదే క్రమంలో కార్యకర్తలందరికీ భోజనాలు ఏర్పాటు చేసే బాధ్యతలను మరికొందరికి అప్పగిస్తున్నారు. ఎంత మంది జనాభా తరలిస్తున్నారనే విషయం ముందుగానే వారికి సమాచారం అందిస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో హోటళ్లకు గిరాకీ పెరిగింది. ఇదిలా ఉంటే ఎండన పడి తిరిగి వచ్చిన కార్యకర్తలు కాస్త సేద తీరేందుకు సాయంత్రం అయితే మద్యం తప్పనిసరి. ఇలా కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి గొడవలు జరుగుతున్నాయి. ప్రచారానికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు రూ.500 నుంచి రూ.వెయ్యి ఖర్చు చేస్తున్నారు. రోడ్ షోలో పాల్గొనలన్నా, బైక్ ర్యాలీలు తీయాలన్న, భోజ నం, పెట్రోల్, మద్యం ఎన్నికల్లో తప్పనిసరైంది.
Comments
Please login to add a commentAdd a comment