ఆదిలాబాద్‌టౌన్: అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రచార గడువు సమీపిస్తుంది. ఈనెల 5న సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ఉంది. ఈ లెక్కన సోమ, మంగళ, బుధ మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ప్రచారంలో మునిగితేలుతున్నారు. నిన్న, మొన్నటి వరకు గ్రామాలను చుట్టిన అభ్యర్థులు ప్రస్తుతం రోడ్ షోలపై దృష్టి సారించారు. మరోవైపు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమైన నాయకులను వెంటబెట్టుకుని ప్రచార జోరును పెంచారు.
అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్
ఈనెల 7న పోలింగ్ జరగనుండడంతో ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా యువకులను మచ్చిక చేసుకోవడంతో పాటు ఆయా కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, మత పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తాము గెలిస్తే అన్నివిధాలా సహకరిస్తామని, కమ్యూనిటీ భవనాలు, తదితర వాటిని నిర్మించి ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
కాగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి జోగు రామన్న, కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్రత్ సుజాత, బీజేపీ నుంచి పాయల్ శంకర్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బోథ్‌లో టీఆర్‌ఎస్ తరపున రాథోడ్ బాపురావు, కాంగ్రెస్ నుంచి సోయం బాపూరావ్, బీజేపీ నుంచి మడావి రాజు, స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్‌తో పాటు పలువురు ఎన్నికల బరిలో ఉన్నారు.
అయితే ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొననున్నట్లు తెలస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సట్ల అశోక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కులసంఘాల వారితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గెలుపుకోసం సర్వశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
చివరి రోజులు కీలకం..
గత కొన్ని రోజులుగా ఆయా పార్టీల నాయకులు ప్రచారం చేసినప్పటికీ అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో పలు పార్టీలు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు అయితే చివరి రోజుల్లో ప్రచారంపై ఫోకస్ పెట్టారు. పోలింగ్‌కు ముందు రెండు, మూడు రోజులను కీలకంగా భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సమీకరణాలు ఎటు మారుతాయోనని చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ రెండు రోజులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. కాగా ఆఖరు రోజుల్లో మద్యం, డబ్బుల ప్రవాహం పారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతుచిక్కని ఓటరు నాడీ..
గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది స్పష్టంగా కనబడటం లేదు. ఎవరినైనా అడిగితే గెలిచేవారికే ఓటు వేస్తామని సమాధానం ఇస్తున్నారు. ఆయా కూడలీలు, బస్టాండ్ ప్రాంతాలు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రస్తావనే ఉంటుంది. కనబడిన వారందరిని ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చర్చించుకుంటున్నారు. అయితే ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు మాత్రం తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవిత తేలనుంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment