దండేపల్లి(మంచిర్యాల) : ఎన్నికల ప్రచారం నాటికి, నేటికీ ఎంతో మారింది. రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల్లో ప్రచారం ఎలా ఉండేదంటే.. బరిలో ఉండే అభ్యర్థులు గ్రామంలోని నలుగురు ముఖ్యులను కలిసి వారితో మాట్లాడి, ఎన్నికల ప్రచార తేదీలు, ప్రచార కరపత్రాలు అందించి వెళ్లేవారు. అలాంటిది నేడు అందరిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రతీ గ్రామంలో కులాల వారీగా పెద్దలతో సమావేశమై మనకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతర పార్టీలకు ఎన్ని వస్తాయని అడిగి తెలుసుకునేవారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎన్నికలకు ముందు ఓ వాహనంలో వచ్చి నలుగురు అనుచరులతో కలిసి అనుకూలంగా ఉన్న పెద్దలతో మాట్లాడి వెళ్లేవారు. వీలైతే ప్రధాన కూడలిలో ఓ సారి ప్రచారం చేసేవారు. ఆ తర్వాత స్థానిక పెద్దలే అభ్యర్థుల హామీతో అన్నీ వారై ఎన్నికల తేదీ వరకు అతి తక్కువ ఖర్చుతో గ్రామంలో ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసేది.
మరీ నేడు..
ఎన్నికల ప్రచార తీరు నేడు పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రతీ గ్రామానికి అభ్యర్థులు నాలుగైదు సార్లు వచ్చి వెళ్తున్నారు. వాడవాడ, ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారి వెంట వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా తరలివస్తున్నారు. వెంట వచ్చిన వారికి విందు, మందుతోపాటు అద్దె కార్యకర్తలకు రోజు వారీ కూలీ కూడా చెల్లిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు ప్రచార ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇవే కాకుండా, కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరించి, వారి పెద్దలతో మాట్లాడటం, చర్చించడం చేస్తూ, వినూత్న రీతిలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారాల్లో హంగులు, ఆర్భాటాలు కూడా ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. లెక్కలేనంతగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి ప్రచార తీరును చూస్తున్న కొందరు వృద్ధులు గత ప్రచారాన్ని గుర్తు చేసుకుని, ప్రచార తీరు ఎంతా మారిపోయింది అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment