కేసీఆర్, అమిత్ షా, బీఎస్పీ నేత మాయవతి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. డిసెంబర్ 7న పోలింగ్ జరుగనున్న దృష్ట్యా 5వ తేదీ సాయంత్రం వరకే అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ అగ్రనేతలను పిలిపించి సభలు ఏర్పాటు చేయిస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థుల తరుపున కుటుంబసభ్యులు సైతం రంగంలోకి దిగి ఊరువాడ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ, ఒకటి రెండు నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు కూడా ప్రధాన పోటీదారులుగా మారడం గమనార్హం. వారం రోజులే గడువు ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
హోరెత్తుతున్న టీఆర్‌ఎస్ ప్రచారం
ఉమ్మడి జిల్లాలో మంత్రులు జోగు రామన్న, అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో పాటు తొమ్మిది మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ నుంచి పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగిపోయారు. రెండున్నర నెలలుగా ప్రజల మధ్యనే ఉంటూ తమను గెలిపించాలని కోరుతూ ఊరువాడా తిరుగుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అసంతృప్తులకు గాలం వేసి, ఇప్పటికే ప్రతి గల్లీ, ఊరు రెండు మూడుసార్లు చుట్టి వచ్చారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటివల్ల జరిగిన లబ్ధిని వివరించే ప్రయత్నాలు చేశారు. పనిలో పనిగా పార్టీ ముఖ్య నేతలను కూడా ఆయా నియోజకవర్గాల్లో తిప్పారు. మంత్రులు జోగు రామన్న, అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి విరామం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. మంచిర్యాలలో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సహకారంతో అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ప్రచారానికి కొత్త ఊపు తీసుకొచ్చారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య స్థానిక నినాదంతో కిందిస్థాయి నుంచి తనకున్న పరిచయాలతో ప్రత్యర్థులకు అందకుండా దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాత వేడి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఈనెల రెండు, మూడు వారాల్లోనే జరిగాయి. అప్పటికే కొందరు నాయకులు టికెట్టు తమకేనన్న నమ్మకంతో ప్రచారం జరిపినప్పటికీ, అధికారిక ప్రకటన తరువాత వేడి పెరిగింది. టికెట్లు లభించిన కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకునే పనిలో పడగా, నిరాశకు గురైన ఆశావహులు పక్క పార్టీల వైపు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే ఇండిపెండెంట్లుగా, బీఎస్‌పీ తదితర పార్టీల గుర్తుల మీద పోటీ చేస్తుండగా మరికొందరు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ అభ్యర్థులు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), ఎలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), గండ్రత్ సుజాత (ఆదిలాబాద్), సోయం బాపూరావు (బోథ్), రామారావు పటేల్ (ముథోల్) తదితరులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు.
ప్రధాన పార్టీలకు దీటుగా వినోద్
టీఆర్‌ఎస్ నుంచి చెన్నూరు సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి వినోద్ బెల్లంపల్లి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు తా నే ప్రధాన పోటీ అనే స్థాయిలో ప్రచారం ఊపు పెంచారు. టీఆర్‌ఎస్ అసంతృప్తి వాదులు, కాంగ్రెస్ నాయకులు బాహటంగానే ఎన్నికల ప్రచారంలో ముందుండి సాగుతున్నారు. ఈ పరి ణామంతో మహాకూటమి తరుపున పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి గుండ మల్లేష్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కొయ్యల ఏమాజీ నిరాశ నిస్పృహలకు లోన వుతున్నారు.
నేడు అమిత్‌షా, మాయావతి... రేపు కేసీఆర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ఉదయం 11గంటలకు ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఆదివారం నిర్మల్ సభకు హాజ రైన ఆయన స్థానికంగా జోష్ పెంచారు. ఆదిలా బాద్ సభతో తన అవకాశాలు మెరుగుపడతాయ ని బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ భావిస్తున్నారు. కాగా బీజేపీ అగ్రనేతలను మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు కూడా తీసుకొచ్చేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
ఇక బుధవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్మల్, మంచిర్యాల సభలకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్, సాయంత్రం 3 గంటలకు మంచిర్యాలలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు హెలి కాప్టర్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలా బాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment