కరీంనగర్: ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ముమ్మరవుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటుచేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు.
అన్ని సామాజిక వర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు.. ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్ల ఏయే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములను నిర్దారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అభ్యర్థులు సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ తయారు చేసుకుని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు.
గెలుపుబాటలో పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేశారు. అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకుంటే విజయం సునాయాసంగా వరిస్తుందనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజిక వర్గాన్ని గుర్తించి వారి మద్దతు ను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతి నియోజక వర్గంలో 40 నుంచి 45 శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
కులపెద్దలతో మంతనాలు
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాలవారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సహాయంతో మంతనాలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాజికవర్గాలకు చెందిన పెద్దల సెల్ నంబర్లను సేకరిస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని ఆప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నరూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజికవర్గాలు వ్యవహరిస్తున్నాయి.
పెద్దలను ముందువరుసలో నిలబెట్టి ప్రచారానికి వచ్చే అభ్యర్థులను అదిచేయాలి.. ఇది చేయాలి.. తమ ఇబ్బందులను తొలగించే వారికే ఓటేస్తామంటూ తెగేసి చెబుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెలగారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది.
రెండు వైపులా వారే...
పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరిని నమ్మాలో..? ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం ఓ అభ్యర్థి ప్రచారంలో కనిపిస్తున్న వ్యక్తులు చీకటి కాగానే మరో అభ్యర్థి శిబిరంలో చేరిపోతున్నారు. తమకే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగితేలుతున్నారు. ఒక్కరుగా వెళ్లకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. మరికొందరు ఇప్పటికే ఫిరాయింపులకు పాల్పడి చేరిన పక్షం వైపు చక్రం తిప్పుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment