కేసీఆర్, పరిపూర్ణానంద స్వామి, రాజ్‌నాధ్ సింగ్, స్తృతి ఇరానీ
అగ్రనేతల ప్రచారాలతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేడెక్కగా.. మరిన్ని సభలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు వేదికలు సిద్ధం చేసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్–ప్రజాకూటమి, బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు వేగం పెంచాయి. రోజురోజుకూ అభ్యర్థులు దూకుడు పెంచుతున్నారు. తాము గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రచారపర్వాన్ని తారాస్థాయికి చేర్చడానికి రానున్న రెండు రోజుల్లో టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అగ్రనేతలు మరోమారు ఉమ్మడి జిల్లాను చుట్టుముట్టనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు తమ అభ్యర్థులను గెలిపించాలని సభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మారోమారు సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, ప్రజాకూటమిలు సైతం రాహుల్‌గాంధీ సభను ఉమ్మడి కరీంనగర్‌లో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, లేదంటే టీపీసీసీ, టీటీడీపీ, టీజేఎస్, సీపీఐ రాష్ట్ర నేతలతో ఓ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్ కంచుకోటలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 స్థానాలకు 12 స్థానాలను గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్‌ను కంచుకోట మలచుకుంది. జగిత్యాల మినహా అన్ని స్థానాల్లో పాగా వేసిన టీఆర్‌ఎస్.. ఈసారి మొత్తంగా 13 స్థానాలను గెలవాలని భావిస్తోంది. అయితే.. గత ఎన్నికల్లో ఒకటితో సరిపెట్టుకోవాల్సి రాగా, ఈసారి జగిత్యాలతోపాటు ఓడిన ప్రతిచోటా గెలవాలని కోరుకుంటోంది.
ప్రజాకూటమిలో భాగంగా మొత్తం 13 స్థానాల్లో ఒకటి మాత్రమే సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 12 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులనే బరిలోకి దింపింది. 2014లో కరీంనగర్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి బీజేపీ సైతం ఈసారి కనీసం మూడు స్థానాలనైనా సాధించుకుంటామని భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్–ప్రజా కూటమి, బీజేపీలు పోటీపోటీగా అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాగా.. ఈసారి గత ఎన్నికల్లో కోల్పోయిన జగిత్యాల నియోజకవర్గంపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది.
కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించాలని పావులు కదుపుతోంది. ఇదే సమయంలో తమ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ముందుకెళ్తున్నారు. చొప్పదండిలో ముక్కోణపు పోటీ జరుగుతుండగా సుంకె రవిశంకర్ (టీఆర్‌ఎస్), బొడిగె శోభ (బీజేపీ), మేడిపల్లి సత్యం(కాంగ్రెస్) నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇక్కడి బీజేపీ, కూటమి పోటాపోటీగా సభలు పెడుతున్నాయి. ఇదే తరహాలో రామగుండం, పెద్దపల్లి, వేములవాడ, కోరుట్ల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్‌లలో సైతం అన్ని పార్టీల అగ్రనేతల అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉమ్మడి కరీంనగర్‌లో ఆయా పార్టీల అగ్రనేతల రాకతో ప్రచారం మరింత హోరెత్తనుంది.
Comments
Please login to add a commentAdd a comment