
మంచిర్యాలలో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్.దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి తదితరులు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మలివిడత పర్యటన ఖరారైంది. ఈనెల 22న ఖానాపూర్, బోథ్(ఇచ్చోడ), నిర్మల్, ముథోల్‌లలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిని ఆరు నియోజకవర్గాల్లో 29న ఉదయం 11.30 గంటల నుంచి 3.15 వరకు సుడిగాలి పర్యటన జరుపనున్నారు. అన్ని ఎన్నికల ప్రచార సభలను హెలికాప్టర్ ద్వారా చుట్టివేయనున్న కేసీఆర్ ఒక్కో సభలో 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆదిలాబాద్ నుంచి మొదలు..
ఈనెల 22న తొలిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేసీఆర్ పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్ మినహా మిగతా నాలుగు చోట్ల సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 29న తొలిసభ ఆదిలాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్ సభలో ప్రసంగించే సీఎం అక్కడినుంచి కాగజ్‌నగర్ (సిర్పూరు), ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి (చెన్నూరు)లలో సభల్లో పాల్గొని మధ్యాహ్నం 3.15 గంటలకు మంచిర్యాల సభతో ముగించనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా సాయంత్రం 4గంటలకు రామగుండం సభలో పాల్గొంటారు. ప్రతి సభకు మధ్య 45 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించడంతో హెలికాప్టర్ ద్వారా ప్రయాణం పోను 15 నిమిషాలు మాత్రమే సభలో ఉంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఏర్పాట్లలో అభ్యర్థులు, టీఆర్‌ఎస్ శ్రేణులు
ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో విశాలమైన స్థలాలను సీఎం సభల కోసం ఎంపిక చేశారు. మంగళవారం సభా ప్రాంగణాలను శుభ్రం చేయించే పనిలో మునిగారు. ఈ సభల ద్వారా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ ఓటింగ్ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment