ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి రామన్న
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అసెంబ్లీని రద్దు చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పడు ఉన్న ఉత్సాహం కాలక్రమేణా తగ్గుతోంది. ఎన్నికల యుద్ధంలో ఎవరితో పోరాడాలో తెలియని స్థితిలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఉమ్మడి జిల్లాలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఎవరికి సీటిస్తుందోనని ఆ పార్టీ ఆశావహుల్లో ఉన్న టెన్షన్ కన్నా రంగంలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల టెన్షనే ఎక్కువవుతోంది.
బీజేపీ నాలుగు సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, వాటిలో రెండింటిలోనే ప్రత్యర్థికి పోటీ ఇచ్చే స్థాయి వారున్నారు. మిగతా చోట్ల ఆ పార్టీ కూడా ఎవరికి సీటిస్తుందో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన టీఆర్‌ఎస్ నేతలు ప్రత్యర్థి ఎవరో తెలియకుండా ప్రజల్లోకి వెళ్లి ఎవరిని విమర్శించాలో తెలియక... నామమాత్రపు ప్రచారంతో ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రభుత్వ విజయాలను వివరించి నెలన్నర రోజుల తరువాత జరిగే పోలింగ్ నాడు తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఆశావహుల తిరుగుబాట్లు..
సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అదేరోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన 10 మంది కూడా ఉన్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపించారు. చెన్నూరులో సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును కాదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సీటివ్వడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఏకంగా నల్లాల ఓదెలు గృహనిర్బంధంలోకి వెళ్లిపోయి అధిష్టానానికి నిరసన తెలియజేశారు. ఓదెలు అభిమాని, ఎంమ్మార్పీఎస్ నాయకుడు గట్టయ్య ఆత్మాహుతికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన వారిలో మరో వ్యక్తి కూడా చనిపోయారు.
అనంతరం అధిష్టానం జోక్యంతో సుమన్ కోసం ఓదెలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సుమన్‌కు షాకిచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఖానాపూర్‌లో సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేష్ తిరుగుబాటు చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి, సిట్టింగ్ అభ్యర్థి రేఖానాయక్ ఓటమే లక్ష్యంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
సిర్పూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్పను ప్రకటించిన తరువాత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మ య్య తిరుగుబావుటా ఎగరవేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌లో ఉన్న మండలాల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మంచిర్యాలలో ఎంపీపీ బేర సత్యనారా యణ బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నిర్మల్‌లో గత ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ యానికి తీవ్రంగా కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ గణేష్ చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు 22 మంది కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్‌లో కలిపేశారు. బోథ్‌లో అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు వ్యతిరేకంగా ఎంపీ గోడం నగేష్ వర్గం పనిచేస్తోంది. ముథోల్‌లో కూడా అదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి వర్గం ముథోల్ అభ్యర్థి విఠల్‌రెడ్డితో కలిసి రావ డం లేదు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ప్రస్తుతానికి అసమ్మతి పోటు లేదు.
కేసీఆర్ వస్తేనే జోష్!
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు టికెట్లు వచ్చిన తరువాత పదిరోజులపాటు ఓ వైపు ఉత్సవాలు నిర్వహించుకుంటూనే అసమ్మతి, వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. వినాయక చవితి మొదలు దసరా వరకు నియోజకవర్గాల్లో మండలాల వారీగా అడపాదడపా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు దసరా తరువాత ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలకుండా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటూ పోయేకన్నా పోటీలో ఉండేదెవరో తేలాకే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఉమ్మడి జి ల్లాలో పర్యటిస్తే ఊపు వస్తుందని అంచనా వేస్తూ, ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. కేటీఆర్‌తోనైనా బహిరంగసభలు ఏర్పాటు చేయిస్తే ఫలితం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాలలో నామ్‌కే వాస్తేగా ప్రచారం జరిపి అయిందనిపిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు హైదరాబాద్, జిల్లా హెడ్‌క్వార్టర్లకే పరిమితం అవుతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించమని కేసీఆర్ చెప్పినా, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల అధికార ప్రకటన తరువాతే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
తడిసి మోపెడవుతున్న ఖర్చు
నెలన్నర రోజుల క్రితమే టికెట్లను ప్రకటించ డంతో అభ్యర్థుల వద్దకు నాయకుల, కార్యకర్తల తాకిడి పెరిగింది. ప్రచారం కోసం జనాలను తీసుకురావడానికి, భోజన వసతి ఏర్పాటు చేయడానికే ప్రతిరోజు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యువజన, కుల సంఘాలు, మహిళా గ్రూపులు, ఇతర పార్టీల నాయకులు బేరాలకు దిగుతుండడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా, ఈ ప్రభావం అంతగా లేదు. సీటు తమకే అనే నమ్మకంతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధికారికంగా తమకు సీటు కేటాయించిన తరువాత ‘చూసుకుంటాం’ అనే మాటలతో తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్ష పార్టీల సీట్ల ప్రకటన కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment