- రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి
Published Tue, Aug 2 2016 10:53 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
ముకరంపుర: హరితహారం కార్యక్రమంలో జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈనెల 15లోగా మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమంలో వేగం పెంచాలన్నారు. అవసరమైన ఈత, పండ్లు, టేకు మొక్కలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలకు నీరు పోసి రక్షించేందుకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలన్నింటికీ రక్షణగా ట్రీగార్డులు, కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను వచ్చే వర్షాకాలం వరకు నీరు పొసి రక్షించుటకు కావాల్సిన నిధులు 2017 మార్చి వరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు వీలుగా ప్రజలకు కావాల్సిన మొక్కలను మాత్రమే నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నుంచి న ర్సరీలో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయేల్ డేవిస్, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.బాబురావు, డీఎఫ్‌వోలు రవికిరణ్, వినోద్‌కుమార్, మహేందర్‌రాజు, ఏజేసీ నాగేంద్ర, డ్వామా పీడీ వేంకటేశ్వర్ రావు, జెడ్పీ సీఈవో సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement