haritaharm
-
మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
జిల్లాను మెుదటిస్థానంలో నిలుపుదాం ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ రూరల్: మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ మండలం చామన్‌పల్లిలో గురువారం నిర్వహించిన హరితహారంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కలు నాటి సంరక్షించి బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు జమిలొద్దీన్, సర్పంచు గంట శంకరయ్య, ఎంపీటీసీ సభ్యులు అశోక్, బాలయ్య, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్‌రాజు పాల్గొన్నారు. హరితహారం లఘుచిత్ర షూటింగ్ ప్రారంభం తిమ్మాపూర్: రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలో చిత్రీకరిస్తున్న తెలంగాణకు హరితహారం లఘుచిత్రాన్ని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలుపుదామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2.50 కోట్ల మొక్కలు నాటామని, వర్షాలు లేక ఆలస్యమవుతున్నా ఇంకా 1.50కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఖాళీల స్థలాలను గుర్తించి వర్షాలు పడగానే లక్ష్యం మేరకు మొక్కలు నాటి రక్షించుకుందామన్నారు. జిల్లాలో మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటాయని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ చెట్టుతో ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఆగస్టు 15వరకు పూర్తి చేసి విడుదల చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీ పద్మ, తహశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముకరంపుర: హరితహారం కార్యక్రమంలో జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈనెల 15లోగా మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమంలో వేగం పెంచాలన్నారు. అవసరమైన ఈత, పండ్లు, టేకు మొక్కలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలకు నీరు పోసి రక్షించేందుకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలన్నింటికీ రక్షణగా ట్రీగార్డులు, కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను వచ్చే వర్షాకాలం వరకు నీరు పొసి రక్షించుటకు కావాల్సిన నిధులు 2017 మార్చి వరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు వీలుగా ప్రజలకు కావాల్సిన మొక్కలను మాత్రమే నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ నుంచి న ర్సరీలో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయేల్ డేవిస్, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.బాబురావు, డీఎఫ్‌వోలు రవికిరణ్, వినోద్‌కుమార్, మహేందర్‌రాజు, ఏజేసీ నాగేంద్ర, డ్వామా పీడీ వేంకటేశ్వర్ రావు, జెడ్పీ సీఈవో సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
ఈ నెలాఖరు వరకు మరో రెండు కోట్ల మొక్కలు నాటాలి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తిమ్మాపూర్/బెజ్జంకి : హరితహారం కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్ష్యం మేరకు నాలుగు కోట్ల మెుక్కలు నాటి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని ఎల్ఎండీ హెడ్ రెగ్యులేటర్ సమీపంలోగల ఎస్సారెస్పీ స్థలంలో మెుక్కలు నాటారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని బుడిగజంగాలకు చెందిన 16 ఎకరాల భూముల్లో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారంలో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తరువాత కరీంనగర్ నాలుగో స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని సగం మంది ఎమ్మెల్యేలు అమెరికాలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాలు హరితహారంలో వెనుకబడ్డాయని అన్నారు. జిల్లాలో నాలుగు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 2.45కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. మిగతా రెండు కోట్ల మెుక్కలు నాటే లక్ష్యాన్ని ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబరు దాకా.. కలెక్టర్ నుంచి అటెండర్ దాకా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం వేగం పెంచండి
మొక్కలు నాటడం ఆపొద్దు కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర: హరితహారం కార్యక్రమం వేగం పెంచి జిల్లాలో విరివిగా మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో హరితహారం అమలుపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఆదివారం వరకు 1.81కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. వివిధ నర్సరీల్లో ఇంకా 1.70 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతీ గ్రామంలో 40వేల మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వస్థలాల్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, వాటి రక్షణకు బోర్వెల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో 28మండలాల నుంచి హరితహారం మండల ప్రణాళికలు అందలేదని, వెంటనే పంపించాలని ఆదేశించారు. గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశ్చిమ, తూర్పు డీఎఫ్‌వోలు వినోద్‌కుమార్, రవికిరణ్, డ్వామా పీడీ వెంకటేశ్వర్రావు, డీఆర్వో వీరబ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ దశరథం, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ పాల్గొన్నారు.