జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
-
ఈ నెలాఖరు వరకు మరో రెండు కోట్ల మొక్కలు నాటాలి
-
ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్
తిమ్మాపూర్/బెజ్జంకి : హరితహారం కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్ష్యం మేరకు నాలుగు కోట్ల మెుక్కలు నాటి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని ఎల్‌ఎండీ హెడ్ రెగ్యులేటర్ సమీపంలోగల ఎస్సారెస్పీ స్థలంలో మెుక్కలు నాటారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని బుడిగజంగాలకు చెందిన 16 ఎకరాల భూముల్లో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారంలో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తరువాత కరీంనగర్ నాలుగో స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని సగం మంది ఎమ్మెల్యేలు అమెరికాలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాలు హరితహారంలో వెనుకబడ్డాయని అన్నారు. జిల్లాలో నాలుగు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 2.45కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. మిగతా రెండు కోట్ల మెుక్కలు నాటే లక్ష్యాన్ని ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబరు దాకా.. కలెక్టర్ నుంచి అటెండర్ దాకా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.