
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది. కూలీలకు పనికల్పనతో పాటు ఉపాధి హామీ పథకం నిర్వహణలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు పదికోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అందులో ఇప్పటికే 9.85 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది. ఈ ఏడాది కేటాయించిన పనుల లక్ష్యాలను చేరుకుంటుండడం తో పాటు పనుల కల్పనలో పురోగతిని అంచనా వేసి, దాదాపు రెండు నెలల క్రితమే మరో రెండుకోట్ల పనిదినాలని అదనంగా కల్పించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈమేరకు రాష్ట్రానికి మరో రెండుకోట్ల పనిదినాలకు అదనంగా అనుమతినిచ్చింది.
14 రాష్ట్రాలు 50 శాతం లోపే..
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాలు ఉపాధి పనుల కల్పనలో 50% లోపే లక్ష్యాలను చేరుకోగా, 9.85 కోట్ల పని దినాలతో 87.38% ప్రగతితో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 23.61 లక్షల కుటుంబాల్లోని 38.97 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రోజుకు రూ. 150 చొప్పున ఒక్కో కూలీకి సగటున వేతనం అందింది. ఇప్పటివరకు రోజువారీ వేతనాలుగా కూలీలకు రూ. 1,477 కోట్ల మేర వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకున్నారు. పనుల కల్పనలో జోగుళాంబ గద్వాల జిల్లా 77%తో అట్టడుగున నిలవగా.. నిర్మల్ జిల్లా 92%తో, ఆదిలాబాద్ జిల్లా 90%తో అగ్రభాగాన నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment