National Rural Employment Guarantee Scheme
-
‘ఉపాధి’కి తగ్గిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రతి ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపులకు తోడు ఆధార్ అనుసంధానిత చెల్లింపులు, ఆన్లైన్ హాజరు వంటి చర్యలతో పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు ప్రధాన ఆర్థిక భద్రతగా ఉంటూ ఆసరాగా నిలిచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తోంద కేంద్ర గణాంకాలు చాటుతున్నాయి. కోవిడ్ సమయంలో 2020–21లో రికార్డు స్థాయిలో 7.55 కోట్ల కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందాయి. ఆ తర్వాత 2021–22 వచ్చేసరికి ఈ సంఖ్య 7.25కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి 6.19 కోట్లకు పడిపోయింది. తగ్గిన కుటుంబాలకు తోడు పనిదినాల సంఖ్య కుచించుకుపోవడం ఆందోళనకరం. 2020–21లో సగటు పనిదినాల సంఖ్య 51.42 రోజులుకాగా, ఆ సంఖ్య 2022–23 ఏడాదికల్లా 47.84 రోజులకు పడిపోయింది. 2021–22లో కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.98,467కోట్లు కేటాయించారు. 2022–23లో ఆ కేటాయింపులు కేవలం రూ.89వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లే విదిల్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లేక పనిదినాలను కుదిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
నిధులు కోసి, కార్డులు తగ్గించేసి 'ఇదేం పని'! గడ్డు రోజులు మొదలయ్యాయా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో, తీవ్రమైన కరువుల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకుని, వారి జీవితాలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గడ్డు రోజులు మొదలయ్యాయా? పలు రాష్ట్రాల్లో ఇది క్రమంగా నిర్వీర్యమైపోతోందా? పేదలకు కనీస వేతనంతో కూడిన వంద రోజుల ఉపాధి కల్పనకు గుర్తింపు పొందిన ఈ పథకం కాస్తా.. నెమ్మది నెమ్మదిగా తన ప్రాధాన్యతను, గుర్తింపును కోల్పోతోందా?..అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ పథకం మార్గదర్శకాలకు భిన్నంగా అమలు చేస్తున్న విధానాలు, కొత్తగా విధిస్తున్న కఠిన నిబంధనలు, బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించడం, జాబ్‌కార్డుల కోత.. ఇందుకు ప్రధాన కారణాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు గతంలో ఉపాధిహామీ అమల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలోనూ ఈ పథకం ప్రాబల్యాన్ని కోల్పోతూ నీరుగారిపోతోంది. అన్నీ అవరోధాలే..: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల తీసుకొచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఉపాధి హామీ పథకానికి ప్రతిబంధకంగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో భాగంగా మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ప్రదేశాల్లోనే రోజుకు రెండుసార్లు కూలీల అటెండెన్స్ నమోదు (ఉదయం ఒకసారి, మధ్యాహ్నం తర్వాత రెండోసారి), ఆధార్ కార్డుతో జాబ్ కార్డుల సీడింగ్, అథెంటికేషన్, బ్రిడ్జి పేమెంట్స్ లాంటి విధానాల కారణంగా ఉపాధి వర్కర్లు పని, కూలీ పొందడంలో ఇబ్బందులు పడడం.. ఈ పథకం మౌలిక సూత్రాలకే ఉల్లంఘనగా నిలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు పనుల నమోదు, కూలీ లెక్కింపు, జాబ్ కార్డుల జారీ, ఇతర అంశాల నమోదుకు రాష్ట్రస్థాయిలో ఉపయోగించిన రాష్ట్ర వెబ్సైట్ రాగా సాఫ్ట్‌కు బదులు, జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో కూలీల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ విధంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పు, చేర్పులు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు, పని కోసం కూలీలు ముందుకు వచ్చేందుకు ఆటంకంగా మారాయి. మరోవైపు రాష్ట్రంలో దీని అమలు పూర్తి సామర్థ్య స్థాయిలో జరగడం లేదు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్లు (ఉద్యోగిత సూచిలు) కూడా దిగజారాయి. అత్యధిక స్థాయిలో జాబ్ కార్డుల్లో కోతతో పాటు ఆధార్ సీడింగ్, అథెంటికేషన్, ఆధార్ బ్రిడ్జి పేమెంట్స్ విధానం, ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తప్పనిసరి చేయడం వంటివి ప్రభావం చూపినట్టుగా ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షక, పరిశీలన సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ జరిపిన కూలంకష పరిశీలనలో వెల్లడైంది. 5 లక్షల జాబ్ కార్డుల కోత ఈ నెల 7వ తేదీ వరకు ఉపాధిహామీ పథకం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన గణాంకాలు, సమాచారం ఆధారంగా గత మూడేళ్ల డేటాను విశ్లేషిస్తూ లిబ్టెక్ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మార్చి 31తో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5 లక్షల జాబ్ కార్డుల కోత (ఇది ఇక్కడి మొత్తం జాబ్ కార్డుల్లో 8.2 శాతం) పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 24.3 శాతం, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా 2.7 శాతం తొలగింపునకు గురయ్యాయి. 17.3 లక్షల కూలీల పేర్లు కూడా ఈ కార్యక్రమంలో లేకుండా పోయాయి. జాబ్ కార్డుల కోత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్‌పైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి, సామర్ధ్యం పెంపుదలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడలేదు. అధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కంటే కూడా బ్యాంక్ ఖాతా ఆధారిత పేమెంట్ సిస్టమే మెరుగైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్రం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని, పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడిచిన రెండేళ్లలో బడ్జెట్లో రూ.55 వేల కోట్ల మేర కోత విధించడాన్ని గుర్తు చేస్తోంది. మరోవైపు పని దినాలు తగ్గిపోవడం, పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ కూడా తరిగిపోవడంపై కేంద్ర మంత్రులను కలిసి మౌఖికంగా, లేఖల ద్వారా విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ధ్వజమెత్తుతోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించిన ఉపాధి హామీపై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇటీవల ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి వంద రూపాయలకు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, తట్టలు వంటివి అందించడం లేదని విమర్శలు గుప్పించారు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేక పోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు. గణనీయంగా తగ్గిన పని దినాలు తెలంగాణలో గత రెండేళ్లతో పోల్చితే 2022–23లో హోస్‌హోల్డ్ పనులు, పర్సన్ డేస్, సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. కేంద్రం తగిన ప్రణాళిక లేకుండా క్లిష్టమైన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఉపాధి పనులు చేసే కుటుంబాల సంఖ్య తగ్గడం శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కనీసం వందరోజుల పనిదినాల కల్పన భారీగా పడిపోవడందారుణం. ఇది ఎందుకు జరిగిందనే దానిపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముంది. జాబ్ కార్డుల పునరుద్ధరణ, పనికి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కల్పన ప్రభుత్వం చేపట్టాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేందం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చింది. కోట్లాది మంది రైతు కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హమీ పథకానికి (నరేగా) ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నరేగా సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో ఉపాధి హమీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల ధర్నా జరుగుతోంది. సోమవారం నాటికి 54 రోజులు పూర్తయ్యాయి. ధర్నాలో తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొన్నారు. – పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ -
చెంచులకు ‘ఉపాధి హామీ’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల బతుకు దెరువు కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మారిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది చెంచులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో అత్యల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధి హామీ కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ప్రత్యేక పథకంగా ఉపాధి హామీని 2009 నుంచి వర్తింపజేసి 180 రోజుల పనిదినాలు కల్పించారు. దీనికి తోడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధన కాకుండా సడలించి.. ముగ్గురికి జాబ్‌కార్డ్ ఇచ్చారు. ఆ ముగ్గురికి మొత్తంగా 540 పనిదినాలు ఇచ్చేవారు. పోషకాహారలోపంతో బలహీనంగా ఉండే చెంచులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇచ్చారు. 70 % పని చేస్తే వంద శాతం పనిచేసినట్టు చూపి చెల్లింపులు జరిపేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 గ్రామాల్లోని చెంచు కుటుంబాల బతుక్కి భరోసా దక్కేది. వారికి కేటాయించే పని దినాలను లెక్కగట్టి ఉపాధి కూలి మొత్తంలో పని చేయకముందే సగం డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చేవారు. మిగిలిన సగం పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేవారు. మొత్తం పనిదినాల్లో మొత్తం కూలిని సగం నగదుగాను, మిగిలిన సగాన్ని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కందిపప్పు, బియ్యం, చింతపండు, బెల్లం, చక్కెర వంటి 20 రకాల సరుకులు ఇచ్చేవారు. దీన్నే ఫుడ్ బాస్కెట్ అని పిలిచేవారు. కాగా, ఫుడ్ బాస్కెట్ పద్ధతి 2012తో ఆగిపోవడంతో మొత్తం నగదును ఇవ్వడం ప్రారంభించారు. వారికి నిర్ణయించిన రోజువారీ వేతనం డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ చెంచు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు లీడర్లకు ఉపాధి హామీ పనుల నగదు చెల్లింపులు బాధ్యతలు అప్పగించేవారు. ఇలా అన్ని రకాలుగా ఊతమిచ్చిన ఉపాధి హామీ కేంద్రం నిబంధనలతో గతేడాదిలో ఆగిపోవడంతో చెంచులు ఆవేదన చెందుతున్నారు. చెంచులకు ఉపాధి కోసం కేంద్రాన్ని కోరాం దేశంలో అత్యంత అల్ప సంఖ్యాకులుగా ఉన్న చెంచుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టాం. వారికి ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిలిపివేయడం ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని 171 చెంచు గూడెంలలో ప్రజలకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సానుకూలంగా ఆలోచించి చెంచులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని కోరాం. ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన శాఖలతో నిర్వహించిన సమావేశంలోను కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌ముండాకు చెంచుల పరిస్థితిని వివరిస్తూ ఉపాధి కొనసాగింపు కోసం నివేదిక ఇచ్చాం. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి -
మండుటెండలోనూ తప్పని పని.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కూలీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ పంపిణీ వంటి అదనపు సౌకర్యాల్లో కోత పెట్టిన కేంద్రం తాజాగా మరో ఇబ్బందికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు పూటల పని విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిని కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే పనికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు ఇప్పటికే వేసవి భృతి రద్దు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం అ«దీనంలోకి వెళ్లినప్పటి నుంచీ వేసవి భృతిని రద్దు చేశారు. దీంతో వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. రెండు పూటలా సాధ్యమా? ఉపాధి పనులు ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి మండల పరిధిలోని నాలుగు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. ఈ పరిణామం ఉపాధి పనులకు వచ్చే కూలీలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తృతంగా పనులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రం విధించిన ఇటువంటి నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారనున్నాయి. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండు చేస్తున్నారు. కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తోంది. కొత్త ఉత్తర్వులను ఏప్రిల్ 1 నుంచి తప్పకుండా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. కచ్చితంగా పని చేయాలని మేం బలవంతం చేయడం లేదు. ఉదయం, సాయంత్రం మస్టర్ అంటే కొంత ఇబ్బందే. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది. – ఎ.ముఖలింగం, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
పిటిషనర్లందరికీ వారం రోజుల్లో ‘ఉపాధి’ బిల్లులు
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు వారం రోజుల్లో చెల్లించాలని మంగళవారం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ హైకోర్టులో దాదాపు 500 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పిటిషనర్లు సమర్పించిన బిల్లులను రెండు వారాల్లో చెల్లించాలంటూ గత నెల 23న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరు తమ క్లయింట్లలో కొందరికి పూర్తి మొత్తాలు అందాయంటూ ఆ వివరాలను న్యాయమూర్తికి అందచేశారు. పలువురు న్యాయవాదులు తమ క్లయింట్లకు ఇంకా పూర్తి బిల్లులు రాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి మొత్తాలు అందిన వారి వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని, ఆ వ్యాజ్యాల్లో విచారణను ముగిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తమ బిల్లుల్లో కేవలం 79–80 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, 20–21 శాతం మొత్తాలను విజిలెన్స్ విచారణ పేరుతో ఆపుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు. ఆ సర్పంచుల పేర్లివ్వండి.. పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ స్పందిస్తూ.. ఉపాధి హామీ పనుల్లో చాలా చోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. అక్రమాలు రుజువైన చోట చెల్లింపులు పూర్తిగా నిలిపేస్తున్నామని, విజిలెన్స్ విచారణ జరుగుతున్న చోట 20 శాతం బిల్లుల మొత్తాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తున్నామని తెలిపారు. బిల్లుల చెల్లింపునకు మరో నాలుగు వారాల గడువునివ్వాలని కోరుతూ ఇప్పటికే అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల నిధుల విడుదలకు సర్పంచ్‌లు సహకరించడం లేదని, చెక్కులపై సంతకాలు చేయడం లేదన్నారు. ఇలాంటి చోట సర్పంచులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారని కోర్టుకు నివేదించారు. అలా సహకరించని సర్పంచుల వివరాలు ఇవ్వాలని, వారిపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని న్యాయమూర్తి తెలిపారు. సర్పంచులుగా కొనసాగేందుకు అలాంటి వారు ఎంత మాత్రం అర్హులు కారని వ్యాఖ్యానించారు. స్పందించకపోతే సుమోటోగా ధిక్కార చర్యలు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో 80 శాతం బిల్లులు మాత్రమే చెల్లించడం సరికాదని న్యాయమూర్తి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ చెల్లింపులు చేస్తున్నామని, ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నామని న్యాయవాది వివరించారు. తమ ఆదేశాల మేరకు వారం రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తమ ఆదేశాల మేరకు ఎంత మందికి చెల్లింపులు చేశారో ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. కాగా, గతంలో 32 వ్యాజ్యాల్లో చెల్లింపుల గడువును నాలుగు వారాల పాటు పెంచాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. -
పశుగ్రాసానికి 'ఉపాధి' ఊతం
సాక్షి, అమరావతి: పచ్చిమేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పశువులకు అవసరమైన మేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు పచ్చిమేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఫలితంగా పచ్చిమేత సాగు చేసే రైతులు మూడేళ్ల పాటు రాయితీ పొందవచ్చు. పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గంగునాయుడు పచ్చిమేత సాగుపై పలు విషయాలను వెల్లడించారు. ఖరీఫ్ సీజనే అనువు.. పచ్చిమేత సాగునకు ఖరీఫ్ సీజనే అనువైనది. పాడి రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేతల్లో సూపర్ నేపియర్‌తో పాటు అజొల్లా, హైడ్రోపోనిక్స్‌ను సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ పంటల సాగుకు పనికిరాని భూమిని పచ్చిమేత కోసం ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత పుష్కలంగా ఉంటే ఐదు లీటర్ల పాలిచ్చే పశువుకు మరింకే దాణా వేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా పశు పోషణలో 70 శాతం ఖర్చు మేపుదే. అవిశ, సుబాబుల్ లాంటి చెట్లను నాటిన నాటి నుంచి 40, 50 రోజుల్లోపు పది కిలోల గడ్డి అందుబాటులోకి వస్తుంది. సూపర్ నేపియర్ అన్ని విధాలా మంచిది. ఎకరానికి సాలీనా వంద నుంచి 120 టన్నుల దిగుబడి సాధించవచ్చు. ఆరేడు కోతలు కోయవచ్చు. ఒకసారి నాటితే 6 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. పాడిరైతులు నేపియర్ గడ్డి కణుపుల కోసం కృష్ణా జిల్లా గన్నవరం, తిరుపతిలోని పశువైద్య కళాశాల ఫారాలను, గరివిడి వ్యవసాయ క్షేత్రం అధికారులను సంప్రదించవచ్చు. భూమి తక్కువగా ఉన్న రైతులు ధాన్యపు, పప్పుజాతి పశుగ్రాసాలను 2:1 నిష్పత్తిలో మిశ్రమ పంటగా సాగు చేయవచ్చు. జొన్న, అలసందలతో కలిపి పశుగ్రాసాలను పెంచవచ్చు. ప్రభుత్వ సాయం ఇలా.. పాడి రైతులు పచ్చిమేతను పెంచుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. లబ్ధిదారులు నిర్ణీత ప్రాంతంలో మూడేళ్లు పచ్చిమేతను పెంచాలి. ఈ కాలంలో ఉపాధి హామీ నిధుల నుంచి ఎకరానికి రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి విడతగా రూ.35,204, మిగతా రెండు విడతల్లో రూ.21 వేల చొప్పున లబ్ధిదారునికి ప్రభుత్వ సాయం అందుతుంది. -
మేం కోరిన వివరాలివ్వరా?
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఇంకెంత ఇవ్వాలి? తదితర పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించినా పట్టించుకోలేదంటూ కేంద్రంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలిచ్చేందుకు సైతం సిద్ధమైంది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) హరినాథ్‌రెడ్డి పలుమార్లు అభ్యర్థించడంతో మెత్తబడిన న్యాయస్థానం.. తదుపరి విచారణకల్లా తాము కోరిన వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయకుంటే, సంబంధిత కార్యదర్శి తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. కేంద్రం ఓ మెమోను న్యాయమూర్తి ముందు ఉంచింది. అందులో తాము కోరిన వివరాలు లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్జీ హరినాథ్‌రెడ్డిని పిలిపించి వివరణ కోరారు. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, చివరి అవకాశం ఇవ్వాలని హరినాథ్‌రెడ్డి అభ్యర్థించారు. -
20 వేల ఎకరాల్లో పచ్చిమేత
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను మరింతగా ప్రోత్సహించటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పాడి రైతులు పచ్చిమేత (పశుగ్రాసం) పెంచడానికి ఉపాధిహామీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేయనుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ, పశుసంవర్ధకశాఖ సంయుక్తంగా చేపడతాయి. పశుసంవర్ధకశాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. లబ్ధిదారుడు నిర్ణీత పొలంలో మూడేళ్లు పచ్చిమేత పెంచాలి. ఈ మూడేళ్లలో ఉపాధిహామీ పథకం నిధుల నుంచి ఎకరాకు రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంది. పొలంలో గడ్డి విత్తనాలు చల్లడానికి ముందు భూమిని తయారు చేయడం మొదలు, విత్తనాల కొను గోలు, విత్తడానికి అయ్యే ఖర్చు, ఎరువులు, ఏడాదికి 20 నీటితడులకు అయ్యే ఖర్చు, గడ్డి పెరిగిన తరువాత కోత ఖర్చులతో సహా అన్నింటికి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. 18 సార్లు కోతకొచ్చే పచ్చిమేత ఒక విడత విత్తితే మూడేళ్ల పాటు పచ్చిగడ్డి వచ్చే విత్తనాలనే లబ్ధిదారుడు వినియోగించాలి. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి ఏడాది రూ.35,204, మిగిలిన రెండేళ్లు రూ.21 వేల చొప్పున లబ్ధిదారుడికి అందజేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి అనుమతి ఇవ్వాలన్నది పశుసంవర్ధకశాఖ నిర్ణయిస్తుంది. ఒక్కొక్కరు కనిష్టంగా 25 సెంట్ల నుంచి గరిష్టంగా 2.5 ఎకరాల వరకు పచ్చిమేత పెంపకం చేపట్టేందుకు అనుమతి ఇస్తారు. లబ్ధిదారుడు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండాలి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కూడా ఒక్కోచోట గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో పచ్చిమేత పెంపకానికి ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. గ్రామ సచివాలయంలోని పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న మహిళల్లో 4.21 లక్షలమంది పాడి పశువుల మీద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో పెరిగే పశుసంపద అవసరాలకు తగినట్లు పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
‘ఉపాధి’లో వ్యవసాయానికే పెద్దపీట
ఒకపక్క.. ‘వరి పంట కోతకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయ్యింది. ఒక్కొక్కరికి కనీసం రూ.500 కూలీ ఇస్తేగానీ గ్రామాల్లో పనికి వచ్చే పరిస్థితి లేదు. ఉపాధి హామీ పథకం పనుల వల్లే గ్రామాల్లో వ్యవసాయ కూలీ రేట్లు పెరిగాయి..’ అని రైతుల ఆరోపణలు. మరోవైపు.. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో అట్టడుగు స్థాయిలో ఉండే నిరుపేద కుటుంబాల్లో పిల్లలను చదివించుకునే శక్తి పెరగడంతో పాటు ఇంటిలో ఫ్యాను, టీవీ వంటి వస్తువులను కూడా సమకూర్చుకోగలుగుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఈ పరిస్థితుల్లో మధ్యే మార్గంగా.. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుండగా.. అలా చేస్తే ఉపాధి హామీ పథకం ఉద్దేశాలే పక్కదారి పడతాయన్న భావనతో కేంద్రం ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పరిస్థితులన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మన రాష్ట్రంలో రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా, ఉపాధి హామీ చట్టానికి లోబడి అనుమతి ఉన్న పనుల మేరకే.. వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన పనుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పెడుతున్న ఖర్చులో 70 శాతం నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన పనులకే వ్యయం చేస్తోంది. ఈ విధంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రంలో ఈ పథకం ద్వారా రూ.7,111 కోట్లు ఖర్చు చేస్తే, అందులో రూ.4,944 కోట్ల మేర వ్యవసాయం, అనుబంధ రంగాలపనులకే ఖర్చు పెట్టింది. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చాక వ్యవసాయ పనులకు ఇంత శాతం ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనులకు గాను 2017–18లో 52 శాతం, 2018–19లో 47 శాతం మాత్రం ఖర్చు చేయడం గమనార్హం. 165 రకాల పనులకు ప్రాధాన్యం పార్లమెంట్లో ఆమోదం పొందిన ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం.. మొత్తం 260 రకాల పనులు ఈ పథకం ద్వారా చేపట్టవచ్చు. అందులో 165 పనులను వ్యవసాయ, వాటి అనుబంధ రంగాలకు సంబంధించినవిగా వర్గీకరించారు. దీనితో నిధుల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం ఈ 165 రకాల పనులకే అధిక ప్రాధాన్యత నిస్తోంది. ఈ ఏడాది వ్యవసాయ కేటగిరీలో రూ.6,709 కోట్ల విలువ చేసే 6,82,022 పనులను చేపట్టాలని ప్రతిపాదించగా.. ఈ నెల 10వ తేదీ వరకు 4,23,781 పనులకు గాను రూ.రూ.4,944 కోట్లు ఖర్చు చేశారు. పంటకు ముందు.. పంట తర్వాత పనులన్నీ.. కొన్ని రకాల పండ్ల తోటల పెంపకానికి మినహా పంటకు సంబంధించిన పనులు ఉపాధి హామీ పథకం కింద చేయడానికి నిబంధనలు అంగీకరించవు. అయితే, అన్ని రకాల పంటలకు సంబంధించి ఆ పంట వేయడానికి ముందు, పంట కోత అనంతరం రైతుకు అవసరమైన దాదాపు అన్ని రకాల పనులను చేపట్టవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు చేసేలా.. పంట వేయడానికి ముందు వ్యవసాయ భూమిని చదును చేసుకోవడానికి, పొలానికి నీరు వచ్చే చిన్న చిన్న సాగునీటి కాల్వల్లో పూడిక తీయడం వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపడుతోంది. పండిన పంట దాచుకోవడానికి గిడ్డంగుల నిర్మాణానికీ వీలు కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. -
పారదర్శకతలో ఏపీ ఫస్ట్
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. దేశం మొత్తమ్మీద 2019 –20 ఆర్థిక ఏడాదిలో రూ.68,300 కోట్లు ఖర్చు జరిగితే, ఈ ఏడాది ఇప్పటికి రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ పథకం కింద చేపట్టిన పనులు సక్రమంగా జరిగాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ఏడాదికి రెండుసార్లు గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి చర్చించాలి. కానీ చాలా రాష్ట్రాల్లో ఏడాదికి ఒక్కసారి కూడా సామాజిక తనిఖీ జరగడం లేదు. మన రాష్ట్రంలో మాత్రం ప్రతి గ్రామంలో ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఆడిట్ జరుగుతోంది. పాలనలో పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలోని గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పనుల ఆడిట్ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏడాది కొకసారి కాకుండా ఎప్పుడు జరిగే పనులపై అప్పుడే.. గరిష్టంగా పని జరిగిన నెల రోజుల్లోపే ఆడిట్ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమల్లోకి రానుంది. సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులకు ప్రభుత్వం విడుదల చేసే కూలి డబ్బులు.. ఎక్కడా అవినీతికి తావులేకుండా అసలైన లబ్ధిదారులకు చేరాయా? లేదా? జరిగిన పని నాణ్యతతో చేశారా.. లేదా? అన్న అంశాలపై సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో.. వివిధ రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ నిర్వహణపై రాష్ట్రాల వారీగా మార్కులను కేంద్రం ప్రకటించింది. సమావేశానికి ముందు కేంద్రం నిర్దిష్ట పద్ధతిలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకుంది, ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆయా రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ అమలు ఆధారంగా మార్కులు కేటాయించింది. సోషల్ ఆడిట్ అమల్లో రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు, అందుకోసం సిబ్బంది నియామకం, వారికి అందజేస్తున్న శిక్షణ తదితర అంశాల వారీగా కేంద్రం రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది. ఆడిట్‌కు నాంది పలికిన వైఎస్సార్ 2006లో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టినప్పుడు దేశంలో ఎక్కడా సోషల్ ఆడిట్ విభాగాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా ఈ విధానానికి నాంది పలికారు. గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించేందుకు 15,856 మంది మహిళలను విలేజ్ రిసోర్స్ పర్సన్లుగా నియమించి, వారందరికీ శిక్షణ ఇప్పించారు. 575మంది రిసోర్స్ పర్సన్లు కేంద్రం నిర్వహించే 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2009లోనే ఈ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. 94.5 శాతం ఆడిట్ పూర్తి గత ప్రభుత్వ హయాంలో 2018–19 ఆర్థిక ఏడాదిలో ఉపాధి పనులు జరిగిన ప్రాంతాల్లో అధికారిక లెక్కల ప్రకారం 80.52 శాతం మాత్రమే సోషల్ ఆడిట్ నిర్వహించగా, 2019–20 చివర్లో కరోనా కారణంగా ఇబ్బంది ఏర్పడినా 94.5 శాతం ఆడిట్ పూర్తి చేయడం గమనార్హం. కూలీల ఇళ్లకీ వెళ్లి వివరాలు సరిపోల్చుకునే ప్రక్రియ 2018–19లో 90.9శాతం మేర జరగ్గా, 2019–20లో 96.6 శాతం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ ఆడిట్ ప్రక్రియకు ఏడాదికి రూ.21 కోట్లు ఖర్చుపెట్టగా.. ఇప్పుడు సోషల్ ఆడిట్ స్థాయి పెరిగినప్పటికీ వ్యయం మాత్రం రూ.17 కోట్లకే పరిమితం చేశారు. ఇతర సంక్షేమ పథకాలకూ వర్తింపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సోషల్ ఆడిట్ ప్రక్రియను కేవలం ఉపాధి హామీ పథకం అమలుకే పరిమితం చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ వర్తింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలన్నింటితో పాటు ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే, ఆయా జాబితాలను ముందుగా సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి, అనంతరం ఆయా జాబితాల్లోని లబ్ధిదారులపై గ్రామస్తులందరి సమక్షంలో గ్రామసభలో చర్చకు చేపట్టి తుది జాబితా ప్రకటించడం తప్పనిసరి చేశారు. -
కరువు సీమలో సిరులు
రాయలసీమలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్ భూముల పంపిణీ చేపట్టారు. అదే వేలాది పేద కుటుంబాల జీవితాలను ఊహించని మలుపుతిప్పింది. ఈ రైతు పేరు వెంకట్రాముడు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువ గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయ కూలీగా జీవించేవాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 4.49 ఎకరాల అసైన్డ్ భూమిని వెంకట్రాముడుకు అందించి.. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద మామిడి మొక్కలు నాటించారు. దీంతో వెంకట్రాముడు ఉపాధి హామీ పథకం కింద సమీపంలోని వాగు నుంచి బిందెలతో నీటిని తెచ్చి చెట్లకు పోసేవాడు. ఇలా చేసినందుకు అతడికి మూడేళ్లలో రూ.1.10 లక్షలను అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడా మామిడి తోట వెంకట్రాముడుకు ఏటా రూ.3 లక్షల వరకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తోంది. గడచిన ఐదేళ్లలో రూ.15 లక్షల వరకు ఆదాయం లభించిందని, తానిప్పుడు దర్జాగా బతుకుతున్నానని వెంకట్రాముడు చెబుతున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన భూ పంపిణీ, డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకాల వల్ల తనలాంటి బడుగు జీవులెందరో బాగుపడ్డారని ఆనందంగా చెబుతున్నాడు. కర్నూలు (అగ్రికల్చర్): సహజ వనరులు క్షీణించడం.. ప్రకృతి వైపరీత్యాల వల్ల సరైన దిగుబడులు రాక 2004 సంవత్సరానికి ముందు రాయలసీమ ప్రాంత రైతులు కూలీలుగా మారారు. మరోవైపు జీవనోపాధి లేక నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇతర కారణాల వల్ల కరువు తాండవించింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాలు అనేక సామాజిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయాన్ని పండగ చేయాలనే సంకల్పంతో ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్ భూముల పంపిణీ చేపట్టారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను ఇది ఊహించని మలుపుతిప్పింది. భూములను ఉపాధి నిధులతో చదును చేసి 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయడంతోపాటు పేద కుటుంబాలకు ఆర్థిక సుస్థిరత కల్పించారు. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ కింద కర్నూలు జిల్లా ఓర్వకల్, బేతంచెర్ల మండలాల్లో చేపట్టిన పండ్ల తోటలపై కథనం.. 2.90 లక్షల ఎకరాల్లోపండ్ల తోటల అభివృద్ధి 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2.90 లక్షల ఎకరాల పండ్ల తోటలు వేయించారు. రాయలసీమ జిల్లాల్లోనే 2007–08, 2008–09 సంవత్సరాల్లో 50వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. మామిడి, జామ, చీనీ, నిమ్మ, దానిమ్మ వంటి తోటలతో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కళకళలాడుతున్నాయి. ఆ రెండేళ్లలో ఉపాధి నిధులతో పండ్ల తోటలకు చేసిన పాదులు నేడు రైతుల్లో నేడు భరోసా నింపుతున్నాయి. ఐదారేళ్లుగా పండ్ల తోటలు అధిక దిగుబడులనిస్తూ రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఎకరం తోటలో ఏడాదికి సగటున రూ.లక్ష వరకు సుస్థిర ఆదాయం వస్తోంది. రైతు హుస్సేన్‌బీ నిమ్మతోటను పరిశీలిస్తున్న ఉపాధి అధికారులు ఏటా 5 వేల టన్నుల పండ్లు విదేశాలకు ఎగుమతి ► సాధారణంగా పండ్ల తోటల పెంపకాన్ని నీటి వసతి ఉన్న భూముల్లోనే చేపడతారు. కానీ.. నీటి వసతి లేని రాయలసీమ రైతులు సమీపంలోని వంకలు, వాగులు, కుంటల నుంచి పండ్ల తోటలకు మూడేళ్ల పాటు బిందెలతో నీళ్లు తెచ్చి తడులు ఇచ్చారు. ► నీళ్లు మోసుకున్నందుకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు చెల్లించారు. రైతుల మూడేళ్ల కష్టం ఫలించింది. పండ్ల మొక్కలు చెట్లుగా అభివృద్ధి చెంది రైతులను కరువు నుంచి దూరం చేశాయి. ► అనంతరం 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించి పండ్ల తోటలను శాశ్వతం చేశారు. ► దీంతో రాయలసీమ జిల్లాలు పండ్ల తోటలకు హబ్‌గా అభివృద్ధి చెందాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో యాపిల్ తప్ప అన్నిరకాల పండ్లు ఉత్పత్తి కావడం మొదలైంది. ► ఇక్కడి రైతులు పండిస్తున్న మామిడి, చీనీ, దానిమ్మ తదితర పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే పండ్ల తోటల అభివృద్ధికి వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమైందని చెబుతున్నారు. ► రాయలసీమ జిల్లాల నుంచి ఐదారేళ్లుగా ఏటా 5 వేల టన్నుల వరకు వివిధ రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వైఎస్ తనయుడిగా.. ► రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం కొరవడింది. గత టీడీపీ ప్రభుత్వం ఉద్యాన పంటలను పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోయారు. ► 2007–08, 2008–09 సంవత్సరాల్లో కేవలం రాయలసీమ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందితే 2014 నుంచి 2018 వరకు 10 వేల ఎకరాల్లో కూడా తోటలు వేసిన దాఖలాలు లేవు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాజశేఖరరెడ్డి తనయుడు సీఎం వైఎస్ జగన్ తిరిగి పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాలో 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేశారు. వర్షాలు పడుతున్న తరుణంలో గుంతలు తవ్వుకునే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మా జీవితంలో వెలుగులు నింపారు మాకు సెంటు భూమి కూడా లేదు. కూలీ పనులు చేసుకునేవాళ్లం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భూ పంపిణీ కింద ఎకరం భూమి ఇచ్చారు. 2007లో ఉపాధి హామీ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ కోసం భూమిని అభివృద్ధి చేసే పనులు చేయించారు. దీంతో ఆ భూమిలో 110 నిమ్మ మొక్కలు నాటుకున్నాం. వాటిని బతికించినందుకు ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలై ఆదాయం వస్తోంది. ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.2 లక్షల నికరాదాయం లభిస్తోంది. మా జీవితంలో వెలుగులు నింపిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. – హుసేన్‌బీ,పాలకొలను, ఓర్వకల్లు మండలం చీనీ తోటలో రైతు ఇ.మద్దయ్య అయిష్టంగా నాటిన మొక్కలే ఆదుకుంటున్నాయి ప్రభుత్వ అధికారులు చెప్పారని అప్పట్లో అయిష్టంగానే 1.85 ఎకరాల్లో చీనీ మొక్కలు నాటాం. మొక్కలు పెరిగే కొద్దీ మాలో పట్టుదల పెరిగింది. మొక్కలు బాగా పెరిగాయి. నాటిన ఐదేళ్ల నుంచి పంట రావడం మొదలైంది. ఏటా రెండు పంటలు పండుతున్నాయి. ఒక్కో పంటపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నాడు వైఎస్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మా గ్రామంలో 150 ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. డ్రైల్యాండ్ హార్టీకల్చర్ మమ్మల్ని ఇంతలా ఆదుకుంటుందని ఊహించలేదు. మా ఊళ్లో కరవు పోయింది. – ఇ.మద్దయ్య, బైనపల్లి, బేతంచెర్ల మండలం -
‘ఉపాధి’లో దేశంలోనే ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లోనూ గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించేందుకు గత 15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 25,940 కుటుంబాలకు ప్రభుత్వం జాబ్ కార్డులను జారీ చేసింది. ప్రత్యేక నైపుణ్యం ఉండి నగరాల్లో వివిధ పరిశ్రమల్లో పనిచేసే వందల మంది వలస కూలీలు కొద్ది రోజులుగా వారి సొంత గ్రామాలకు తిరిగి రావడం తెలిసిందే. అలా సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వారికీ ఈ విపత్కర రోజుల్లో జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 4,353, కృష్ణాలో 3,704, ప్రకాశం జిల్లాలో 3,510, చిత్తూరులో 2,610, విజయనగరం జిల్లాలో 2,405 కుటుంబాలకు కొత్తగా ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు జారీ చేసి పనులు కల్పించారు. రోజూ రూ.30 కోట్ల మేర కూలీలకు పనుల కల్పన రూ.703 కోట్ల లబ్ధి.. లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి పథకం ద్వారా రోజూ రూ.30 కోట్ల వరకు ప్రభుత్వం పనులు కల్పిస్తోంది. కరోనా భయంతో ఏప్రిల్ మొదట్లో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అప్పట్లో పనుల కల్పన తక్కువగా ఉన్నా, రానురాను పనుల కల్పనను ప్రభుత్వం భారీగా పెంచింది. గత 45 రోజుల వ్యవధిలో 23.96 లక్షల కుటుంబాలు మొత్తం రూ.703.28 కోట్ల విలువైన ఉపాధి హామీ పథకం పనులు చేసి లబ్ధి పొందారు. మన రాష్ట్రంలోనే అత్యధికం ► లాక్డౌన్ అమలు తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గత 45 రోజులుగా గ్రామాల్లో నిరుపేద కూలీలకు ఉపాధి హామీ çపథకం ద్వారా పనులు కల్పించడంలో మన రాష్ట్రం పూర్తి ముందంజలో ఉంది. ► 45 రోజుల వ్యవధిలో దేశమంతటా 1.06 కోట్ల కుటుంబాలకు 13.60 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పథకం ద్వారా çకూలీలకు పనులు కల్పిస్తే.. అందులో దాదాపు నాలుగో వంతు అంటే, 23.96 లక్షల కుటుంబాలకు 3.09 కోట్ల పనిదినాల పాటు మన రాష్ట్రంలోని నిరుపేద కూలీలు ‘ఉపాధి’ పొందారు. ► గత 15 రోజుల్లో కొత్తగా జారీ చేసిన జాబ్ కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డులున్న కుటుంబాల సంఖ్య మొత్తం 63.07 లక్షలకు చేరింది. -
ఉపాధి హామీ.. నిధుల లేమి
రైతు కూలీలు జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే పనులు కల్పించేందుకు గాను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అమలులో నిర్లక్ష్యం కారణంగా కూలీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పనులకు వెళ్లినా సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెండింగ్ బిల్లుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో 22,018 శ్రమ శక్తి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 3,54,985 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందులో మహిళలు 1,93,364 మంది, పురుషులు 1,61,621 మంది ఉన్నారు. 2,15,554 కుటుంబాలు ఉపాధి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అందులో ఇప్పటివరకు 20,288 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో రూ.641.67 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 260.59 కోట్ల మేరకు వెచ్చించారు. అందని వేతనాలు గత నెల 26వ తేదీ నుంచిఇప్పటివరకు ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 49,793 మంది కూలీలకు 5.54 లక్షల పనిదినాలకు గాను రూ.16,04,04,475 మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.40.76 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపొనెంట్ కలిపి రూ.56.80 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు వారాలుగా ఉపాధి వేతనాలు చేతికందకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు వారాల్లో సంక్రాంతి పండుగ వస్తున్నందున ఇప్పటి నుంచే గుబులు పట్టుకుంది. అప్పటికైనా వేతనాలు చేతికందేనా అన్న ఆందోళనలో కూలీలు కొట్టుమిట్టాడుతున్నారు. పనులు అంతంత మాత్రమే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడం అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాదికి గాను రూ.641.67 కోట్లు వెచ్చించి 1,24,012 పనులు చేపట్టాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు 75,961 పనులు మాత్రమే చేపట్టారు. వాటిలో 30,896 పనులు పూర్తి చేయగా, 45,065 పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇందుకుగాను ఇప్పటివరకు రూ.260.59 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఉపాధి పనుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన మేరకు లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారు. రోజుకు కనీసం లక్ష మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలుపుతోంది. ఆచరణలో కనిపించడం లేదు. రోజుకు కేవలం 49 వేల మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. పనుల్లేక .. వేతనాలు అందక ఉపాధి హామీ పనుల వేతనాలు వారాల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అవి కూడా తూర్పు మండలాల్లోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో కూలీలకు ఆశించిన మేరకు పనులు దొరకడం లేదు. ఉపాధి పనులకు వెళ్లినా వేతనాలు సకాలంలో అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను మంజూరు చేసి, పనులు విరివిగా కల్పించి, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పది రోజుల్లో బిల్లులు వస్తాయి పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు మరో పది రోజుల్లో మంజూరయ్యే అవకాశముంది. ప్రస్తుతం రబీ సీజన్‌కు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో కూలీలు ఉపాధి పనులకు రావడం కొంతమేరకు తగ్గింది. జనవరి నుంచి ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతుంది. రోజుకు కనీసం లక్ష మందికి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.– బి.చంద్రశేఖర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ -
ఉపాధిహామీలో ఉత్తమ పనితీరుకు రాష్ట్రానికి 5 పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను సాధించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావుతోపాటు పలువురు అధికారులు ఈ పురస్కారాలు అందుకున్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు గాను జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినందుకు ఓ అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని రఘునందన్‌రావు అందుకున్నారు. ప్రతిభ చూపిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జాతీయస్థాయిలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. -
ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది. కూలీలకు పనికల్పనతో పాటు ఉపాధి హామీ పథకం నిర్వహణలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు పదికోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అందులో ఇప్పటికే 9.85 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది. ఈ ఏడాది కేటాయించిన పనుల లక్ష్యాలను చేరుకుంటుండడం తో పాటు పనుల కల్పనలో పురోగతిని అంచనా వేసి, దాదాపు రెండు నెలల క్రితమే మరో రెండుకోట్ల పనిదినాలని అదనంగా కల్పించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈమేరకు రాష్ట్రానికి మరో రెండుకోట్ల పనిదినాలకు అదనంగా అనుమతినిచ్చింది. 14 రాష్ట్రాలు 50 శాతం లోపే.. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాలు ఉపాధి పనుల కల్పనలో 50% లోపే లక్ష్యాలను చేరుకోగా, 9.85 కోట్ల పని దినాలతో 87.38% ప్రగతితో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 23.61 లక్షల కుటుంబాల్లోని 38.97 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రోజుకు రూ. 150 చొప్పున ఒక్కో కూలీకి సగటున వేతనం అందింది. ఇప్పటివరకు రోజువారీ వేతనాలుగా కూలీలకు రూ. 1,477 కోట్ల మేర వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకున్నారు. పనుల కల్పనలో జోగుళాంబ గద్వాల జిల్లా 77%తో అట్టడుగున నిలవగా.. నిర్మల్ జిల్లా 92%తో, ఆదిలాబాద్ జిల్లా 90%తో అగ్రభాగాన నిలిచాయి. -
బోర్డుల పేరుతో బొక్కేశారు!
ఈ చిత్రంలో కనిపించే ఫాంపాండ్ వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోనిది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్మించారు. దీనిని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించినట్లు వర్క్‌సైట్ బోర్డును విధిగా పెట్టాలి. బోర్డులో వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. అధికారుల రికార్డుల్లో వర్క్‌సైట్ బోర్డు పెట్టినట్లుగా ఉన్నా.. ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. ఇటువంటివి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రతి పని దగ్గర బోర్డు ఏర్పాటు చేయాలి. అందులో పని విలువ, పని ఐడీ నంబరు, పనిదినాలు తదితర పూర్తి వివరాలు ఉండాలి. ఫలితంగా అక్రమాలకు తావు ఉండదు. జిల్లాల్లో ఎన్ఆర్ఈజీఎస్(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)నిధులతో వేలాది పనులు నిర్వహిస్తున్నప్పటికీ వాటి దగ్గర బోర్డులు కనిపించడం లేదు. రికార్డుల్లో మాత్రం అవి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి పేరుతో కొందరు ఉపాధి సిబ్బంది భారీగా నిధులు కొల్లగొట్టారనే విమర్శలు ఉన్నాయి. సుమారుగా రూ.7.63 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ల సహాయంలో ఈ నిధులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు కొందరు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. పలువురు ఏపీవోలు, సాంకేతిక సహాయకుల ఖాతాలకు నిధులు మళ్లినట్లు తెలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అంటేనే అక్రమాల పుట్ట అనే పేరుంది. పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, ఇతర అభివృద్ధి పనులను కూడా ఉపాధి నిధులతో చేపట్టినట్లు చూపి అక్రమార్కలు నిధులు కొల్లగొట్టిన సంఘటనలు కోకొల్లలు. ఇటువంటి అక్రమాలకు తావు ఉండరాదనే ప్రతి పనిదగ్గర వర్క్‌సైట్ బోర్డు పెట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే బోర్డుల పేరుతో కూడా నిధులు కొల్లగొట్టడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. పనులు ఇలా.. ఎన్ఆర్ఈజీఎస్ కింద 2017–18లో 51,423 పనులు చేపపట్టారు. అలాగే 2018–19లో 82,231 పనులు పూర్తి చేశారు. 2019–20లో 99,855 పనులు చేపట్టగా... 19,289 పనులు పూర్తి అయ్యాయి. మిగతా 80,566 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం పని మొదలైన వెంటనే బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎటువంటి బోర్డులు పెట్టాలి.. వాటి సైజు ఎంత... వాటికి చేయాల్సిన ఖర్చుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. సైజును బట్టి రూ.850 నుంచి రూ.2,500 వరకు ఖర్చు చేయవచ్చు. ఐదు రకాల బోర్డులు పెట్టేందుకు అనుమతులు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పనులతో పాటు ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్ల కింద చేపట్టిన పనుల దగ్గర కూడా వర్క్‌సైట్ బోర్డులు పెట్టాల్సి ఉంది. అయితే బోర్డులు పెట్టడంలో నిర్లక్ష్యం చోటు చేసుకోగా... అక్రమాలు కూడా వెల్లువగానే ఉన్నాయి. 50,873 వర్క్‌సైట్ బోర్డులు పెట్టినట్లు లెక్కలు... 2017–18 నుంచి 2019–20 వరకు 2,33,509 పనులు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఈ పనులన్నింటి దగ్గర బోర్డులు పెట్టాల్సి ఉంది. అయితే 50,873 పనుల దగ్గర ఏర్పాటు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇవి కనిపించవు. సామాజిక తనిఖీల బృందాలు విధిగా వర్క్‌సైట్ బోర్డులు ఉన్నాయో..లేదా పరిశీలించాలి. ఒక్కోదానికి సగటున రూ.1500 ప్రకారం లెక్కించినా జిల్లాలో 50,873 బోర్డులకు రూ.7.63 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చేరువలోని మండలంలో పనిచేసే ఓ ఏపీవో దాదాపు రూ.1.50 లక్షల వర్క్‌సైట్ బోర్డుల నిధులను తమ ఖాతాలోకి ట్రాన్స్పర్ చేయించుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. పర్యవేక్షణ శూన్యం... జాతీయ గ్రామీణ ఉపాధి పనుల నిర్వహణలో ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏపీవో, సాంకేతిక సహాయకులు, పీల్డ్ అసిస్టెంట్లు పనితీరు, పనుల పురోగతి, వర్క్‌సైట్ బోర్డుల ఏర్పాటు తదితర వాటిపై పర్యవేక్షించాల్సిన బాధ్యత అసిస్టెంటు ప్రాజెక్టు డైరెక్టర్లపై ఉంది. ప్రతి క్లస్టర్‌కు ఏపీడీలు ఉన్నా.. పర్యవేక్షణ లోపించిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొంతమంది ఏపీడీలు కూడా అక్రమాల్లో మునిగితేలుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ‘ఉపాధి’లో అక్రమాలు సర్వసాధారణం అవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం నిబంధనల ప్రకారం ప్రతి పని దగ్గర బోర్డు ఉండాల్సిందే. ఈ మేరకు అదేశాలు ఇచ్చాం. వీటి ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే చాలా చోట్ల బోర్డులు పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు. – వెంకటసుబ్బయ్య ,పీడీ, డ్వామా -
రైతులే.. కూలీలు..!
పుడమితల్లిని నమ్ముకున్న అన్నదాతను అనుక్షణం కష్టాలు వెంటాడుతున్నాయి..వరుణదేవుడు కరుణ చూపకపోవడం..ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కుదేలవుతున్నాడు.పది మందికి అన్నం పెట్టి పోషించిన రైతులే నేడు కుటుంబీకులను పోషించడానికి కూలి బాట పడుతున్నారు. సాక్షి కడప : కరువు రక్కసి కాటు నుంచి అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. పంటలు పండక..అప్పుల పాలై..ఉపాధి కోసం కొందరు ఉన్న ఊరు వదిలి వలస వెళితే.. మరికొందరు ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతు కుటుంబాలు కూడా కరువు కోరల్లో చిక్కి తల్లడిల్లిపోతున్నాయి. పెద్ద రైతులు సైతం కూలీబాట పడుతుండటం బాధాకరం. ప్రభుత్వాలు ఆదుకోనంత కాలం..పాలకులు పాలసీలలో మార్పులు తేనంత కాలం అన్నదాత ఏదో ఒక సమస్యతో కునారిల్లి చేసేదిలేక వద్దురా ఈ వ్యవసాయమంటూ తప్పుకుంటున్నారు. జిల్లాలో 5.50లక్షల నుంచి 6లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రకృతి సహకరించకపోవడం..వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోవడం.. పనులకు యాంత్రీకరణ ఖర్చులు పెరగడం.. తెగుళ్లు, చీడ, పీడలతో లాభసాయం లేకపోగా అన్నదాతకు అప్పులు చేతికొస్తుండటంతో వ్యవసాయంపై అనాసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వరుస కరువులు కూడా వారిని ప్రత్యామ్నాయం వైపు నడిపించాయి. అనేక పల్లెల్లో చాలామంది వలసబాట పట్టగా.. మరికొంతమంది పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకంవైపు అడుగులు వేశారు. ఉపాధి హామీ పథకం ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లకుండా స్థానికంగా కొందరు కూలీలుగా మారి దినసరి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి. కరువు పాట.. ఉపాధి బాట.. జిల్లాలో వరుస కరువుల వల్ల అన్నదాత ఉపాధి వైపు అడుగులు వేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా మారిపోయారు. 3ఎకరాల నుంచి 10ఎకరాల ఉన్న వారు కూడా ఉపాధి పనులకు వెళుతున్నారు. పొలంలో ఎంత కష్టపడినా లాభాలు రాకపోవడంతో ఉపాధి పనులు చేసుకుంటే రూ.180లనుంచి రూ.200ల వరకు గిట్టుబాటు అవుతుందని పలుగు, పార చేత పట్టారు. ఒకప్పుడు ఐదారు ఎకరాల పొలం ఉన్న అసామి రోజు 20, 30మంది కూలీలతో పనులు చేయించేవారు. ప్రస్తుతం తానే పనులు చేసే పరిస్థితికి కాలం నడిపించింది. కలిసిరాని వ్యవసాయం అన్నదాతకు వ్యవసాయం కలిసి రాకుండా పోతోం ది. ఒకప్పుడు ఎకరా, రెండుఎకరాలు ఉంటే జీవ నం గడిచే పరిస్థితి. ప్రస్తుతం 10ఎకరాలు ఉన్నా కూడా కుటుంబం గడవడం గగనంగా మారింది. ఒకప్పుడు పశువులు, ఎద్దులతో కళకళలాడిన పల్లెలు నేడు కళావిహీనంగా మారుతున్నాయి. రైతుల గోడు పట్టని ప్రభుత్వం నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. వర్షాలు సక్రమంగా కురవక పోవడం, పంటలు పండడక పోవడంతో ఉపాధి కూలీ పని చేస్తూ బతకాల్సిన పరిస్థితి. నాతో పాటు భార్య, కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు గంగమ్మ తల్లి గ్రూపు జాబ్‌కార్డు నెంబర్ 6010101లో పని చేసుకుటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా సహాయం అందిచడం లేదు. రైతుల గురించి పట్టించుకోవడం లేదు.ఉపాధి కూలీ పనికి వెళ్లాలంటే పెద్ద రైతులకు సిగ్గుగా ఉంది. కానీ పరిస్థితుల కారణంగా తప్పడంలేదు. –ఎం.లక్ష్మినారాయణరెడ్డి, పెండ్లిమర్రి మండలం చెన్నంరాజుపల్లె గ్రామం ఉపాధి పనులకు వెళుతున్నా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 60 రోజులు దాటినా చినుకు జాడ లేదు. పొలాల్లో పనులు లేకపోవడంతో ప్రతిరోజు ఉపాధి పనికి వెళుతున్నా. నాకున్న మూడు ఎకరాల పొలంలో పత్తి, వరి సాగు చేస్తాను. ఈఏడాది ఇప్పటి వరకు పదునైన వాన పడకపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. పత్తిపంట అదును దాటిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – రవీంద్రారెడ్డి, రైతు, రాజుపాళెం -
హరితహారానికి ‘ఉపాధి’ నిధులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనులు మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతి దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేయించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ఆదివారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించారు. ‘‘కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకోవాలి. ప్రతి గ్రామంలో నర్సరీ పెంచాలి. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయడం లాంటి పనులన్నీ వ్యవసాయ కూలీలతో చేయించండి. నరేగా నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని కచ్చితంగా చెప్పాయి. కాబట్టి నరేగా నిధులను తెలంగాణ హరితహారం కోసం వినియోగించడం సముచితంగా, ఉభయ తారకంగా ఉంటుంది’’ అని సీఎం చెప్పారు. పచ్చదనం తిరిగి రావాలి... అడవులు, చెట్ల నరికివేత వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం హరితహారంతో తిరిగి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ‘‘అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయి. మానవ జీవితం కల్లోలం అయింది. అడవిలో చెట్ల పండ్లు తిని బతికే కోతులు ఊళ్లమీద పడ్డాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. వంటింట్లోకి కూడా చొరబడి మన తిండిని కూడా ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు అడవులు, చెట్లు లేకపోవడమే కారణం. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల పునరుద్ధరణ జరగాలి. గ్రామాల్లో కూడా విరివిగా చెట్లుండాలి. పండ్ల చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నర్సరీల్లో పెంచే మొక్కల్లో 25 శాతం పండ్ల మొక్కలుండాలి. కోతులు, పక్షులు, ఇతర అడవి జంతువులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి పంపిణీ చేయాలి. అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాలలో వాటిని పెంచాలి. దీనివల్ల కోతులు, ఇతర అడవి జంతువులు జనావాసాల మీద పడకుండా ఉంటాయి. మనుషులు తినే పండ్ల మొక్కలను కూడా సిద్ధం చేస్తే అందరూ తమ ఇళ్లలోనే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఎస్.కె. జోషి, పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి ఉత్తిమాటేనా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేదల కడుపు నింపడం, వలసల నివారణ కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు ఉన్నచోటే పనులు కల్పించి జీవనోపాధికి భరోసా ఇవ్వాల్సిన ఈ పథకం అమలు పేరుగొప్ప ఊరు దిబ్బలా మారుతోంది. సరైన ఉపాధి లభించక గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 61.42 లక్షల మంది నమోదు చేసుకోగా.. 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు దొరికాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూలీ పని కోసం ఎంతదూరమైనా వెళుతున్నారు. అలా పత్తి ఏరే పని కోసం కరీంనగర్ జిల్లా చామనపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపల్లెకు ఆటోలో వెళుతున్న కూలీలు.. ప్రమాదంలో మరణించారు. భరోసా ఇవ్వని ‘ఉపాధి’ ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ ఏడాది ఉపా«ధి హామీ కింద పనుల కోసం 61.42 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో ఇప్పటివరకు 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు లభించాయి. అంటే సుమారు 20 లక్షల మందికి మొత్తానికే ‘ఉపాధి’పనులు లభించలేదు. ఇక పని దొరికినవారిలోనూ హామీ మేరకు ‘వంద రోజుల పని’పూర్తి చేసుకున్న కుటుంబాలు 1,31,103 మాత్రమే. ముఖ్యంగా పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధి హామీ పనులు కూలీలకు భరోసా ఇవ్వడం లేదు. తగిన వేతనమూ దిక్కులేదు పని లభించని ఉపాధి కూలీల మాటేమోగానీ.. పనులకు వెళ్లినవారికీ తగిన వేతనం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు కూలీ సగటున రూ.194కు తగ్గకుండా చూడాలి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఉపాధి కూలీలకు అందిన సగటు రోజు కూలీ రూ.139.8 మాత్రమే. దీంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కూలీలకు రెండు నెలలుగా సొమ్ము చెల్లించలేదని చెబుతున్నారు. ఉపాధి హామీ అమలు తీరు.. జారీ అయిన మొత్తం జాబ్‌కార్డులు: 66.84 లక్షలు ఈ ఏడాది పనుల కోసం నమోదు చేసుకున్న వారు: 61.42 లక్షలు పనిపొందినవారు: 41.49 లక్షలు 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు: 1,31,103 అందాల్సిన కూలీ: రూ.194 సగటున లభించిన కూలీ: రూ.139.80 పని లేదు.. పైసలూ రాలేదు ‘‘ఈ ఏడాది ఉపాధి హామీ పనులు సరిగా దొరకలేదు. దీంతో పత్తి ఏరేందుకు వెళ్తున్నా. ఉపాధి హామీలో చేసిన పనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. అధికారులు చొరవ చూపి ఊళ్లోనే ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలి..’’ – గోపరవేన రాజమ్మ, ఉపాధి కూలీ, దమ్మక్కపేట కరీంనగర్ జిల్లా దూరం పోతే.. ప్రాణాలు పోతున్నాయి ‘‘ఉపాధి పని దొరకక పత్తి ఏరేందుకు, వేరే కూలీ పనుల కోసం దూరంగా ఉన్న ఊళ్లకు పోవాల్సి వస్తోంది. పనికోసం తీసుకెళ్లేవారు.. ఆటోలు, ట్రాక్టర్లలో ఇష్టం వచ్చినంత మందిని ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి..’’ – ఎన్.సాంబశివారెడ్డి, కూలీ, పెద్దపాపయ్యపల్లి, కరీంనగర్ జిల్లా -
ఉపాధి అక్రమాలపై నజర్..
►అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు ►1,813 మందిపై అభియోగాలు.. ►జిల్లాకు అంబుడ్స్‌మెన్ కమిటీ ►త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన ►అవినీతి పరుల్లో గుబులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి దుమ్ముపట్టిన ఫైళ్లను వెలికితీయడానికి ప్రతీ జిల్లాకు అంబుడ్స్‌మెన్ కమిటీని (న్యాయ నిపుణుల సంఘం) నియమించనుంది. వీరు జిల్లాలోని ఉపాధిహామీ కార్యాలయాల్లో ఉన్న దస్త్రాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టనున్నారు. ఉపాధిహామీలో సామాజిక తనిఖీల ద్వారా నమోదైన అభియోగాలు, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, వేతనాలు, పనిదినాలు తదితర అంశాలపై వీరు దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్‌సిటీ: 2006–07 ఏడాది నుంచి ఉమ్మ డి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు చూపుతున్నా రు. వలసలు నివారించాలనే ఉద్దేశంతో అప్ప టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. అయితే.. పనుల్లో అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సామాజిక తనిఖీ ల పేరిట అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా ఆగ లేదు. అవినీతి సొమ్ము రికవరీ కావడం లేదు. బాధ్యులపై చర్యలు తూ తూమంత్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ప్రతీ జిల్లాకో అంబుడ్స్‌మెన్ కమిటీ (న్యాయ నిపుణుల సంఘం) నియమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దీర్ఘకాలిక సమస్యలపై కమిటీ సభ్యులు దృష్టి సారించనున్నారు. ఏటా ఉమ్మ డి జిల్లాలో రూ.350 కోట్ల వరకు ఉపాధి పనులు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగిన అక్రమాలు, అవినీతిపై నివేదికలను సిద్ధం చేశారు. ప్రక్రియలో ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏఈఈలు, టీఏలు, సీవోలు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వీవోలు, బీపీఎంలు, శ్రమశక్తి సంఘాల నాయకులు, మేట్లు భాగస్వాములుగా ఉన్నారు. అక్రమార్కులకు ఉపాధి.. 2006 నుంచి 2017 వరకు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా జరిగిన ఉపాధిహామీ అవినీతిలో ఎక్కు వ అభియోగాలు మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టె క్నికల్ అసిస్టెంట్లపైనే నమోదై ఉన్నాయి. ఏటా అన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. అన్ని గ్రామాల్లోనూ తనిఖీలు చేపడుతారు. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లా అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అన్ని రికార్డులను పరిశీలించి పనిచేసిన దినాలకు, ఖర్చు చేసిన నిధులకు లెక్కలు సక్రమంగా కుదరకపోతే నివేదికల్లో రాస్తారు. ఆ ప్రతులను ఆయా ఉపాధిహామీ కార్యాలయాలకు పంపిస్తారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సామాజిక తనిఖీల ప్రక్రియ మందగించింది. 2006 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా తొమ్మిది సార్లు సామాజిక తని ఖీలు నిర్వహించారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్రే ఎక్కువగా ఉందని నిర్ధారించారు. ఇప్పటివరకు 23,478 మందిపై అభియోగాలు రా గా.. అందులో 10,200 పరిష్కారమయ్యాయి. ఇంకా 13,278 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,813 మంది ఉపాధిహామీ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని సామాజిక తనిఖీ ల్లో గుర్తించారు. రూ.81.54 లక్షల అవినీతి జరి గినట్లు గుర్తించగా ఇప్పటివరకు రూ.53.45 ల క్షలు రికవరీ చేయగలిగారు. ఎంపీడీవోలు 6, ఏపీవోలు 31, ఏఈలు 14, టీఏలు 243, సీవో లు 127, ఎఫ్‌ఏలు 1054, ఈసీలు 52, పీఎస్ లు 5, సర్పంచులు 7, వీవోలు 20, బీపీఎంలు 45, గ్రేడ్ లీడర్లు 10, మేట్లు 149, ఇతరులు 50 మంది అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. రికవరీ తక్కువ.. ఖర్చు ఎక్కువ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో వచ్చిన నిధులను ఈ ఏడాది ప్రారంభం నుంచి చేస్తున్న పనులకు సంబంధించిన కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. మూడు, నాలుగు నెలల నుంచి వేతనాలు ఇ వ్వకపోవడంతో కూలీలు నిరుత్సాహంతో ఉన్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు పనులపై ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ కూలీ పనులు పూర్తిస్థాయిలో దొరక్క.. ఉపాధిహామీ వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ఉపాధి అక్రమాలను నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం తాత్సారం చేస్తోంది. సామాజిక తనిఖీల పేరిట చేసిన ఖర్చులు రికవరీ సొమ్మకు సరిపడా ఉంటున్నాయి. వాహనాలు, పెట్రోలు, భోజనాలు తదితర ఖర్చుల పేరిట సామాజిక తనిఖీలకయ్యే ఖర్చే అధికంగా ఉంటుందే తప్ప రికవరీ కావడం లేదన్న ఆరోపణలూ లేకపోలేదు. అంబుడ్స్‌మెన్ కమిటీ రాకతో అక్రమాలకు అడ్డుకట్ట పడేనా? తిన్న సొమ్మ రికవరీ అయ్యేనా..!! -
నత్తే నయం
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు) : జిల్లాలో 2016–17 ఏడాదికి 11,200 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో శ్లాబులు, పూర్తి అయినవి కలిపి 4,450 ఉన్నాయి. రూఫ్లెవల్లో 888 ఉండగా, బేస్‌మట్టానికే పరిమితమయినవి 2,264 ఇళ్లు ఉన్నాయి. అసలు నేటికీ ప్రారంభించకుండా 2,992 ఇళ్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గృహాల నిర్మాణం ఏ మేరకు జరుగుతుందో తెలుస్తోంది. ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. దీనికి ప్రకారం ఇళ్లు కట్టడం ఎంత కష్టమో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఇల్లు కట్టుకోవడం అంత సులువుకాదు. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది రూ.1.5 లక్షలు మాత్రమే. అందులోను రూ.95వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రూ.55 వేలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు నేటికీ లబ్ధిదారుల ఖాతాల్లో జమకాలేదు. పెరిగిన ధరలతో బెంబేలు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇటుక, ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు ఆకాశాన్నంటాయి. రెండేళ్లలో ధరలు గణనీయంగా పెరిగాయి. వెయ్యి ఇటుకపై రూ.1,000 పెరిగింది. సిమెంట్‌పై బస్తాకు రూ.50 నుంచి రూ.100 పెరిగింది. ఇనుముపై టన్నుకు రూ.7వేల నుంచి రూ.10వేలకు పెరిగింది. ఇక లారీ ఇసుక రూ.25వేలు పలుకుతోంది. ఈ క్రమంలో రూ.1.5 లక్షలతో ఇళ్లు ఎలా పూర్తి చేయాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల జాడేదీ? ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు ఇవ్వగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారుడికి రూ.55వేలు రావాలి. రెండు కలిపి రూ.1.5 లక్ష మంజూరు చేస్తారు. అయితే రూ.95వేలు మంజూరులో జాప్యం లేకపోయినా ఎన్ఆర్ఈజీఎస్ నిధులపై నేటికీ స్పషత లేదు. జిల్లాలో రూ.50 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. నేటికీ వీటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలేకుంది. అప్పుల బాటలో లబ్ధిదారులు పేరుకే ఎన్టీఆర్ గృహాలే తప్ప పునాదుల నుంచి లబ్ధిదారులు అప్పుల వేటలో పడాల్సిందే. పునాదులు తవ్వడం మొదలు బేస్మట్టం కట్టే వరకు అయ్యే ఖర్చు సైతం అప్పు చేయాల్సిందే. బేస్మట్టం కట్టిన తరువాత వచ్చే బిల్లు తీసుకుని అప్పు చెల్లించినా, మళ్లీ రూఫ్ లెవల్ నిర్మాణం వరకు అప్పు చేయాల్సిందే. అనంతరం శ్లాబు నిర్మాణానికి బయట అప్పు తెచ్చి నిర్మించి బిల్లు వచ్చిన తరువాత వడ్డీతో సహా కట్టాల్సిందే. ఇలా ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారుడు అప్పుల బాటలో నడవాల్సిన దౌర్భాగ్యం తలెత్తింది. -
‘ఉపాధి’కి కొత్త జాబ్‌కార్డులు
► కార్డులో క్యూఆర్ కోడ్, ఆధార్ లింకు ► ఉపాధి హామీలో అక్రమాలకు చెక్ ► 11 ఏళ్ల తర్వాత కార్డుల మార్పు ► కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ► జాబ్‌కార్డులు 1.50 లక్షలు ► సభ్యులు 3.20 లక్షలు ఆదిలాబాద్:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మంచి రోజులొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కూలీలకు ప్రత్యేక కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 1.50 లక్షల జాబ్‌కార్డుల ఉండగా.. 3.20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి రూ.కోట్లు మంజూరు చే స్తోంది. ప్రస్తుతం జిల్లాలో నీటి నిల్వకుంటలు, వర్మీకంపోస్టు తయారీ, భూ అభివృద్ధి కందకాలు, తదితర పనులు చేపడుతున్నారు. 2006 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తర్వాత అప్పటి ప్రభుత్వం కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేసింది. ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధిక నిధులు వెచ్చిస్తుండడంతో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంఖ్య పెరుగుతున్నా కొత్త జాబ్‌కార్డులు మాత్రం జారీ చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది. సాంకేతికతో జాబ్‌కార్డులు.. ప్రభుత్వం కూలీలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకునే విధంగా సాంకేతికతతో కూడిన జాబ్‌కార్డులను అందజేస్తోంది. కొత్తగా పనిచేస్తున్న వారితోపాటు పాత వారికీ జాబ్‌కార్డులు ఇస్తున్నారు. వీటిపై క్యూఆర్‌కోడ్ ముద్రించారు. నూతన జాబ్‌కార్డుల్లో సాంకేతికత జోడించి ఇవ్వడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్డుపై జాబ్‌కార్డు నెంబర్‌తోపాటు ఆధార్ నంబర్, పొటో, కూలీ చెల్లింపు ఖాతా నంబర్, బ్యాంకు ఖాతా, పోస్టల్ శాఖ ఖాతా నంబరు ముద్రించి ఉంటాయి. ఒక కుటుంబం నుంచి ఎంత మంది కూలీ పనికి వచ్చినా అందరికి కలిపి ఒక కార్డు మాత్రమే ఇస్తారు. కూలీలు తమ సెల్ఫోన్లో ఈజీఎస్ యాప్‌డౌన్‌లోడ్ చేసుకుని ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ రోజు ఎన్ని గంటలు పనిచేశారు, ఎంత కూలీ వస్తుంది తదితర వివరాలు తెలుసుకోవచ్చు. జాబ్‌కార్డుకు ఆధార్ నంబర్ లింకు చేశారు. అక్రమాలకు చెక్.. ఉపాధి హామీ పథకంలో కొందరు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడేవారు. ఒకరికి బదులు మరొకరికి హా జరు వేయడం, పని గంటలు తక్కువ నమోదు చేయ డం వంటివి చేసేవారు. దీంతో సామాజిక తనిఖీల సమయంలో ఈజీఎస్ సిబ్బంది అక్రమాలు బయటకు వచ్చేవి. జరిమానా దాన్ని సరిపెట్టేవారు. ఇక నూతన జాబ్‌కార్డులతో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాబ్‌కార్డులో ఆధార్‌లింకు, క్యూఆర్‌కోడ్ ముద్రించడం వల్ల అక్రమాలకు తావులేకుండా చేయవచ్చని డీఆర్డీవో రాజేశ్వర్ రాథోడ్ తెలిపారు. కొత్త కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు.. జాబ్‌కార్డు కోసం మ్యానువల్‌గా దరఖాస్తు చేసుకుని అధికారులు చుట్టూ తిరిగే కూలీలకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఇందులో భాగంగానే జాబ్‌కార్డు ప్రక్రియ ఆన్లైన్లో చేసింది. కొత్తగా జాబ్‌కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో అందజేస్తారు. తద్వారా కూలీలకు సమయం ఆదాతోపాటు వేగంగా కార్డు పొందే అవకాశం ఏర్పడింది. మారుతున్న కాలానుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా మార్పులు చేస్తూనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకుని కూలీలు, రైతులకు సులభతరంగా సేవలందిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో చాలా సేవలను ఆన్లైన్లో చేసిన ప్రభుత్వం తాజాగా జాబ్‌కార్డు ప్రక్రియను కూడా మీసేవ కేంద్రాలతోపాటు ఇంటర్నెట్ లో దరఖాస్తు చేసుకునేందుకు అనుసంధానం చేసింది. గతంలో జాబ్‌కార్డు కా>వాలంటే తొలుత అధికారులకు దరఖాస్తులు చేసుకుని అధికారుల కోసం వేచి చూడాల్సి వచ్చేది. దీంతో వారి ఇబ్బందులను తొలగించేందుకు కార్డుల దరఖాస్తు, మంజూరు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులుగా గుర్తిస్తారు. ఈ దరఖాస్తులను డీఆర్డీవోకు పంపించి అక్కడి అధికారులు పరిశీలించిన తర్వాత మీసేవ కేంద్రం ద్వారా జాబ్‌కార్డులు జారీ చేస్తారు. -
వంద రోజులు పని కల్పించాల్సిందే..
పన్నులు పూర్తిగా వసూలు చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూప్రసాద్ సంగెం(పరకాల) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వంద రోజులకు పైగా పని కల్పించాల్సిందేనని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నీతూప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని ఉత్తమ గ్రామపంచాయతీ అయిన తీగరాజుపల్లి గ్రామాన్ని శనివారం ఆమె కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టి, ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఇంకుడు గుంత, రైతులు నిర్మించుకున్న నాడెపు కంపోస్టు పిట్, ఇంటి ఆవరణలోని ఇంకుడు గుంత, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం హరితహరం, నీటి తొట్టి, నాడెపు కంపోస్టు పిట్, పాఠశాలలోని ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనాలను రైతులు, సర్పంచ్‌ను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా నీతూప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలు ఎక్కువగా పనికి హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈజీఎస్ ద్వారా వచ్చిన నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, గ్రామానికి మంజూరయ్యే నిధులను సక్రమంగా ఉపయోగించుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుకోవాలన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా వెచ్చిస్తున్నారో సర్పంచ్ రంగరాజు నర్సింహస్వామిని ఆరా తీసిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణాలు లేవు..చెక్‌డ్యాంల నాణ్యత లేదు
విజిలెన్స్ అధికారి తనిఖీల్లో తేలిన నిజాలు త్వరలో పూర్తి స్థాయి తనిఖీలు చేపడతామన్న అధికారి దుత్తలూరు(ఉదయగిరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపి నిధులు కాజేశారు. కొన్ని రోడ్లు సగం మాత్రమే వేసి పూర్తి నిధులు దోచేశారు. నూతన చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతులు నాసిరకంగా ఉన్నాయి. ఇదీ శనివారం జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులురెడ్డి తనిఖీల్లో వెల్లడైన నిజాలు. దుత్తలూరు మండలంలో జరిగిన అవినీతిపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రాగా స్పందించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం తనిఖీలు చేపట్టారు. బోడవారిపల్లిలో కొన్ని పనులను తనిఖీ చేయగా మూడు రోడ్లు నిర్మించుకుండానే లక్షల రూపాయలు కాజేసినట్లు వెల్లడైంది. ఎస్సీ కాలనీ నుండి ఎర్రయ్యబావి వరకు రోడ్డు నిర్మించినట్లు కాగితాలలో చూపించి ఐడీ నెం.0126 మీద రూ.87481 నిధులు కాజేశారు. అలాగే అప్పసముద్రం మెయిన్ రోడ్డు నుంచి ఎర్రవాగు చేల వరకు రోడ్డు నిర్మించకుండానే రూ.86278 మెటీరియల్ బిల్లు డ్రా చేశారు. ఇలాగే మరికొన్ని పనులను పరిశీలించగా ఇదేస్థాయిలో అక్రమాలు జరగడంతో ఎందుకు ఈ విధంగా చేశారని సస్పెండైన ఈసీ వెంకటేశ్వరరెడ్డి, టీఏ సుబ్రహ్మణ్యంలను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సమాధానం కరువైంది. చెక్‌డ్యాంల మరమ్మతులు నాసిరకంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు అందుబాటులో ఉంచకపోవడంతో ఆయన విచారణకు సహకరిస్తారా లేదా కేసులు నమోదు చేయమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే తనిఖీ కోసం ఒక్క అధికారి మాత్రమే రావడంతో తనిఖీలు నామమాత్రంగా జరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను సంప్రదించకుండానే తనిఖీలు చేయడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం, బోడవారిపల్లిలో కొన్ని చెక్‌డ్యాంలు లొకేషన్ చేంజ్ పేరుతో వేరే చోట నిర్మించామని ఈసీ తెలపడంతో ఆ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పరిశీలించిన పనుల వివరాలను డ్వామా పీడీకి అందజేస్తామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఉపాధిహామీలో జరిగిన ప్రతి పనిని వచ్చే మంగళ, బుధ వారాల్లో రెండు తనిఖీ బృందాలు తనిఖీ జరుపుతాయన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కాగా మంగళవారం నాటికి తాము పరిశీలించడానికి అనుకూలంగా రికార్డులన్నీ పూర్తిస్థాయిలో ఉంచాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో పిచ్చిబాబు తదితరులు ఉన్నారు. -
‘ఉపాధి’లో జాతీయ రికార్డు
లక్ష కుటుంబాలకు వంద రోజుల పనిఅరుదైన ఘనత సాధించిన విశాఖ పనులు తక్కువ.. పనిదినాలెక్కువ5.62 లక్షల మందికూలీలకు పనులు రికార్డు స్థాయిలో 2.96 లక్షల పనిదినాలు విశాఖపట్నం:జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో విశాఖ జిల్లా అరుదైన ఫీట్ సాధించింది. అత్యధిక కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించిన జిల్లాగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కువమంది కూలీలకు పనులు కల్పించడమే కాదు.. అత్యధిక పనిదినాలు కల్పించిన జిల్లాగా కూడా విశాఖ ఖ్యాతినార్జించింది. జిల్లాలో 4,70,162 కుటుంబాలకు జాబ్ కార్డులుండగా..38,550 శ్రమశక్తి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 7,17,597 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పనిదినాలు కల్పించడంలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పగలిగారు. కాగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.157 కోట్లకు రూ.57 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ఏడాది రూ.298 కోట్లకు రూ.159 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగారు. గతేడాది వంద కోట్లు మురిగి పోగా.. ఈఏడాది రూ.141 కోట్లు మురిగిపోయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అయిన ప్పటికీ పనులు కల్పించడంలో మాత్రం ఆలిండియా రికార్డును సాధించారు. ప్రస్తుతం 50 వేలకు పైగా పనులు జరుగుతుండగా.. రోజుకు 1.80 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. గతేడాది పనితీరు.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 3.03 లక్షల కుటుంబాలకు చెందిన 5.44 లక్షల మంది కూలీలకు పనులు, లక్షా 95 వేల పనిదినాలు కల్పించారు. వేతనాల రూపంలో వీరికి రూ.236 కోట్లు చెల్లించారు. గతేడాది ప్రతి కుటుంబానికి గరిష్టంగా 64 రోజుల పనికల్పించగా.. ఒక్కో కూలీ రూ.121కు తక్కువ కాకుండా సరాసరి వేతనం పొందగలిగారు. ఈ ఏడాది అన్నీ రికార్డులే.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 3.13 లక్షల కుటుంబాలకు చెందిన 5,62,315 మంది కూలీలకు ఏకంగా 2.26 లక్షల పనిదినాలు కల్పించి వేతనాల రూపంలో రూ.299 కోట్లను పొందేలా చేశారు. ఈ ఏడాది ప్రతి కుటుంబానికి సరాసరిన 72 రోజులు పని కల్పించగా, ఒక్కో కూలీ సరాసరిన రూ.132.13 చొప్పున వేతనం పొందగలిగారు. లక్షా 575 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించిన ఏకైక జిల్లాగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉపాధి హామీ సిబ్బందికి అభినందనలు అత్యధిక కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించిన ఏకైక జిల్లాగా విశాఖ రికార్డు పుటల్లోకి ఎక్కడం ఆనందంగా ఉంది. ఇందుకోసం ఈ ఏడాది ఉపాధి హామీ సిబ్బంది కృషి అభినందనీయం. ముఖ్యంగా పనుల గుర్తింపు.. ప్రణాళికాబద్ధంగా పనులు కల్పించడంలో పీడీ శ్రీరాములు నాయుడు కృషి ప్రశంసనీయం. -డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ చాలా ఆనందంగా ఉంది వంద రోజుల పనిదినాలు కల్పించడంలో జిల్లా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్‌తో సహా ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది సమష్టి కృషి ఇది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా పనిచేస్తాం. -శ్రీరాములు నాయుడు, పీడీ, డ్వామా -
ఉపాధి వెతలు
⇒ కరువు నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న కూలీల సంఖ్య ⇒ అప్పుడే ప్రతాపం చూపుతున్న భానుడు ⇒ పని ప్రదేశాల్లో మౌలిక వసతులు నిల్.. మెడికల్ కిట్లు, పరదాల కరువు ⇒ 35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ⇒ పలు చోట్ల ఫీల్డ్అసిస్టెంట్లు, సీఓలు, ఏపీఓల కొరత ⇒ పాతబడిన కంప్యూటర్లు, ప్రింటర్లు.. నెమ్మదించిన నెట్వర్క్ జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెరుగుతోంది. గ్రామాల్లో కరువు పరిస్థితులు రోజురోజుకూ తారాస్థాయికి చేరడంతో కూలీలు ఉపాధి పనుల కోసం ఎగబడుతున్నారు. రెండు, మూడు రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య పెరుగుతోంది. అయితే.. వేసవి సీజన్ ఆరంభానికి ముందే ఎండ తీవ్రత పెరగడంతో సాధారణ ప్రజలతోపాటు ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీప రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినా.. ఎండల తీవ్రత నుంచి ఉపాధి కూలీలకు రక్షణ కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పని జరుగుతున్న ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగేళ్ల క్రితం కూలీలకు మౌలిక వసతులు కల్పించేందుకు సరఫరా చేసిన టెంట్లు, మెడికల్ కిట్లు కంటికి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం పనిజరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగేందుకు గుక్కెడు నీరు కూడా కరువైంది. మరో పలు మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో పనులు గుర్తింపు ప్రక్రియ ఆగిపోయింది. పెరుగుతున్న కూలీలు ....నాలుగు రోజుల నుంచి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. జనవరి 29న 1.71లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా...30న 1.74 లక్షలు, ఫిబ్రవరి ఒకటిన 1.68 లక్షలు, ఫిబ్రవరి రెండున 1.77 లక్షల మంది కూలీలు పనులకు హాజరయ్యారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఫిబ్రవరి 2న కూలీలు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం మీద 3,94,448 కుటుంబాలకు ఉపాధి కల్పించగా.. ఇందులో వంద రోజుల ఉపాధి పొందిన కుటుంబాలు 12,782 మాత్రమే ఉన్నాయి. ఉపాధి నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున వంద రోజుల ఉపాధి కల్పించాలి. కానీ.. ఒక్కో కుటుంబానికి ఫిబ్రవరి నాటికి 37 రోజుల పని మాత్రమే కల్పించారు. కొంతకాలంగా ఉపాధి పథకం అమలు స్తబ్దుగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. జాడలేని మెడికల్ కిట్లు, పరదాలుపనులు జరిగే ప్రదేశాల్లో ఉపాధి కూలీల సౌకర్యార్థం మెడికల్ కిట్లు, పరదాలు, గడ్డపారలు అందించాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. 2012లో చివరి సారిగా పరదాలు సరఫరా చేశారు. గడ్డపారలు 25 వేలు, మెడికల్ కిట్లు 16 వేలను జిల్లా వ్యాప్తంగా అప్పుడున్న గ్రూపులకు అందజేశారు. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన సామాగ్రి ఎప్పుడో మాయమైంది. మెడికల్ కిట్లలో మందులు, బ్యాండేజీ, కత్తెర, కాటన్ వంటివి లేకపోవడంతో బాక్సులను మూలనపడేశారు. పనిజరిగే ప్రదేశంలో తప్పనిసరిగా కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చిక్సిత కోసం మెడికల్ కిట్లు తప్పనిసరి అవసరం. ఎండ వేడి నుంచి కాస్తాంత ఉపశమనం పొందేందుకు పరదాల అవసరం ఉంటుంది. గతంలో తాగేందుకు నీటిని సరఫరా చేయడాన్ని కూడా ఉపాధి కిందనే పరిగణించేవారు. ఇప్పుడు అలాంటి వసతులు ఏమీ కల్పించిన దాఖలాల్లేవు. సిబ్బంది కొరత...పనుల గుర్తింపులో జాప్యం మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. ఏడేళ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే సుదీర్ఘకాలం నుంచి పాతుకుని పోయారు. దీంతో పనులు చేయించడంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. మూడు మండలాలకు ఏపీఓలు లేరు. 20 గ్రా మాలకు ఫీల్డ్ అసిస్టెంట్ల అవసరం ఉంది. మండ లాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపని కొంతమంది ఉపాధి సిబ్బంది పైరవీలతో పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు. దీంతో 204 గ్రామాల్లో 50-75 శాతం మాత్రమే పనులు అందుబాటులో ఉన్నాయి. 100-200 శాతం పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 646 ఉన్నాయి. 200 శాతానికి పైబడి పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 236 మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1170 గ్రామ పంచాయతీలకు గాను 1095 పంచాయతీల్లో 1,28,098 పనులు.. అంటే దాదాపు 119 శాతం పను లు అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
‘సోలార్’ రాయితీ 5 వేల కోట్లు
కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ ఐదేళ్లలో 4,200 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలు ♦ రైల్వే ప్రాజెక్టుల అమలుకు రైల్వే-రాష్ట్రాల జాయింట్ వెంచర్ ♦ స్మార్ట్ సిటీల అభివృద్ధికి బ్లూమ్‌బర్గ్ సంస్థతో ఒప్పందానికి ఓకే న్యూఢిల్లీ: స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంపొందించే కృషిలో భాగంగా.. ఇంటి పైకప్పులు, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లను అనుసంధానించే గ్రిడ్‌కు అందించే ఆర్థిక సాయాన్ని (రాయితీని) రూ. 600 కోట్ల నుంచి దాదాపు పది రెట్లు పెంచుతూ రూ. 5,000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ సోలార్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 4,200 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు స్థాపించటానికి ఈ నిధులు దోహదం చేస్తాయి. ఈ పథకం కింద సాధారణ తరగతి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 30 శాతం పెట్టుబడి రాయితీ, ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 70 శాతం పెట్టుబడి రాయితీ అందిస్తారు. ప్రైవేటు రంగంలో వాణిజ్య, పారిశ్రామిక ప్లాంట్ల స్థాపనకు ఇతరత్రా ప్రయోజనాలు ఉన్నందున వాటికి రాయితీలు వర్తించవు. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. వివిధ విభాగాలు వేర్వేరుప్రకటనల్లో తెలిపిన వివరాల ప్రకారం కేబినెట్ నిర్ణయాలివీ... ► రైల్వే ప్రాజెక్టుల అమలులో రాష్ట్రాలు మరింత ఎక్కువగా ఆర్థిక పాత్ర పోషించేలా.. వివిధ రాష్ట్రాలతో రైల్వే శాఖ జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికింద రైల్వే శాఖ ఒక్కో రాష్ట్రానికి అందించే ఆరంభ పెట్టుబడిపై రూ. 50 కోట్లకు పరిమితి విధించారు. ప్రాజెక్టును బట్టి మొత్తం రూ. 100 కోట్ల ఆరంభ పెట్టుబడితో జాయింట్ వెంచర్‌ను ప్రారంభిస్తారు. ప్రాజెక్టుకు అనుమతి వచ్చాక అవసరమైన నిధులను ఆ సంస్థకు అందిస్తారు. ► భారత్-కెనడాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారానికి గల శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ.. సహకారంపై అవగాహనా ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు. ► ‘బ్రిక్స్’ దేశాల మధ్య వర్సిటీల అనుసంధానంపై గత నవంబర్‌లో మాస్కోలో జరిగిన బ్రిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రులు, సీనియర్ అధికారుల సమావేశంలో చర్చించి సంతకాలు చేసిన ఎంఓయూకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ► ఆఫ్రికా, యురేసియాల్లో రాబందులు, గద్దలు, గుడ్లగూబలు, డేగలు తదితర 76 జాతుల వలస పక్షుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ‘రాప్టర్ ఎంఓయూ’పై భారత్ సంతకం చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ► స్మార్ట్ సిటీల అభివృద్ధికి మద్దతు కోసం న్యూయార్క్‌కు చెందిన బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రపీస్ సంస్థతో భాగస్వామ్యంపై ఎంఓయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ - జోర్డాన్‌ల మధ్య సహకారానికి కుదిరిన ఎంఓయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► ఈ ఏడాది నవంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య పౌర అణు సహకార ఒప్పందం అమలు కోసం పరిపాలనాపరమైన ఏర్పాట్లను కేంద్ర మంత్రివర్గం సమీక్షించింది. సత్వరమే పూర్తి చేయాలి హైదరాబాద్ మెట్రోపై మోదీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లోని వివిధ రోడ్డు, రైల్వే, మెట్రో రైల్, విద్యుత్, ఆహార శుద్ధి రంగాల్లోని కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఆయన బుధవారం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ‘ప్రగతి (క్రియాశీల పాలన, నిర్దిష్ట సమయంలో అమలు)’ ఎనిమిదో సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సత్వరమే ఉత్తమ నాణ్యతతో పూర్తిచేయాలని సంబంధిత అధికారులందరికీ నిర్దేశించారు. అలాగే ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఢిల్లీ - హరియాణా - ఉత్తరప్రదేశ్ ఈస్ట్రన్ పెరిఫెరల్ కారిడార్ల పైనా సమీక్షించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నేరుగా ప్రయోజన బదిలీ (నగదు బదిలీ)లో, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా కంప్యూటరీకరించటంలో ప్రగతిపైనా ప్రధాని సమీక్షించారు. -
పచ్చ చొక్కాలకే ఎఫ్ఏ పోస్టులు!
ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్ఏ)ను మూకుమ్మడిగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఆ స్థానాల్లో కొత్తగా చేపట్టే నియామకాలకు రాజకీయ రంగు పులుముతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. కానీ, చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖలో పనిచేసే వారిని ఎంపిక చేయాల్సిన బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ కమిటీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సభ్యులుగా నియమించారన్న ఆరోపణలున్నాయి. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. 1,660 గ్రామాల్లో కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది రోజులల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ)లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డులో ఉంచుతారు. దరఖాస్తు చేసుకున్న వారి లో ముగ్గురి పేర్లను టీడీపీ కార్యకర్తలతో కూడిన గ్రా మ జన్మభూమి కమిటీ ఎంపిక చేస్తుంది. ఎంపీడీవో ద్వారా ఆ వివరాలను జిల్లా పీడీలకు పం పుతారు. కమిటీ సభ్యులు సూచించిన ముగ్గురిలో ఒకరిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా పీడీ నియమిస్తారు. ఈ విధానం వల్ల టీడీపీ నేతల అనుచరులే ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం కార్యాలయ పర్యవేక్షణలో గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, వారి స్థానంలో కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి నిరంతరం గ్రామీణాభివృద్ధి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాల వారీగా ఎంత మందిని తొలగించారు, కొత్తగా ఎంతమందిని నియమించారంటూ ప్రతిరోజూ ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
‘ఉపాధి’లో ప్రక్షాళన
- ప్రతి ఆవాసంలోనూ తప్పని సరిగా పనులు - పని కావాలన్నా.. వద్దన్నా డిమాండ్ లెటర్ ఇవ్వాల్సిందే - బిల్లుల చెల్లింపుల్లోనూ సమూల మార్పులు - పంచాయతీ కార్యాలయాల నోటీసులో బిల్లుల జాబితా అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. గ్రామాల్లో ఉపాధి లేక వలస పోతున్నామనే మాట ప్రజల నుంచి వినిపించకూడదు అనే లక్ష్యంతో డ్వామా అధికారులు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వివరాల్లోకి వెలితే... జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలు కాని ప్రాంతాల్లో ఎక్కువశాతం మంది పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ అపవాదును దూరం చేయడానికి అధికారులు ప్రక్షాళనతంత్రం చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆవాసప్రాంతాల్లో పనుల కల్పనకు డిమాండ్ లెటర్‌ను కూలీల నుంచి సేకరిస్తున్నారు. అలాగే పనులు వద్దు అన్నా కూడా నో డిమాండ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఉపాధి పనులు లేకనే వలస పోతున్నారనే మాట రాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూలీలు పని కావాలని డిమాండ్ లెటర్ ఇచ్చినా పని కల్పించకపోతే 24 గంటల్లో సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని కఠినతరమైన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. పోస్టల్‌శాఖ ద్వారా చేపడుతున్న బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా కూలీల వేతనాలకు సంబందించి స్లిప్పులు జారీ చేసేవారు. ఇక నుంచి శ్రమశక్తిసంఘాల ద్వారా ఇవ్వనున్నారు. స్లిప్‌లపై తప్పనిసరిగా మండల ఏపీఓ సంతకం, సీల్ వేయాలనే నిబందన విధించారు. దీని వలన బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులకు అడ్డుకట్ట పడనుంది. కూలీలు డబ్బులు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా స్లిప్‌లను జాబ్‌కార్డు, నోట్‌బుక్‌లో అతికించుకోవాలి. అలాగే ప్రతి వారం బిల్లులు తీసుకున్న కూలీల జాబితా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసుబోర్డులో అతికించాలనే నిబందన కూలీలకు ఉపయుక్తంగా మారనుంది. ఎవరెవరు బిల్లులు తీసుకుంటున్నారు.. నకిలీల పేర్లు ఉన్నాయా ? అని అంశాలపై ప్రజలు సైతం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యం : ఉపాధిజాబ్కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ఉన్నాం. పనిలేక వలస పోతున్నామనే మాట కూలీల నుంచి రాకూడదు. పని అడిగిన 24 గంటల్లో పని కల్పించలేకపోతే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిర్దాక్షిణంగా తొలగిస్తాం. కావున ప్రతి అవాసప్రాంతం నుంచి డిమాండ్, నో డిమాండ్ లెటర్లను కూలీల నుంచి సేకరిస్తున్నాం. ఈ ఏడాది నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వలస పోకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాగభూషణం,ప్రాజెక్టు డైరక్టర్, డ్వామా -
‘ఉపాధి హామీ’ ఇక పంచాయతీలకు!
{V>-Ò$-×ాభివృద్ధి నుంచి తప్పించాలని సర్కారు యోచన ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఉన్నతాధికారుల కసరత్తు 16 వేల మంది ఉద్యోగులకు తప్పని ఉద్వాసన హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించాలని సర్కారు భావిస్తోంది. కొన్నేళ్లుగా ఉపాధి హామీ పనులను గ్రామీణాభివృద్ధి విభాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూలీలకు ఏడాది పొడవునా కనీసం వందరోజుల పని కల్పించడం ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 16 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో పథకం అమలు బాధ్యతలను పంచాయతీరాజ్‌కు బదలాయించాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దశాబ్దకాలంగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.15 వేలకు పెంచాలంటూ సమ్మె చేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాక, సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాజాగా ఈ పథకాన్ని పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పంచాయతీలకు అప్పగిస్తే.. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను అప్పగించడం ద్వారా పంచాయతీలకు మరిన్ని అధికారాలు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపిక చేసే బాధ్యతను సర్పంచులకు, వార్డు సభ్యులకు అప్పగిస్తేనే పథకం సక్రమంగా అమలవుతుందని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒక రోజ్‌గార్ సేవక్‌ను నియమిస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. దీని ద్వారా నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గుతుందని అధికారులు లెక ్కలు వేస్తున్నారు. ప్రస్తుతం అధికారుల స్థాయిలో జరుగుతున్న ఈ కసరత్తు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు పంచాయతీరాజ్ శాఖలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఇదే జరిగితే నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన తప్పదంటున్నారు. -
ఆదాయ అసమానతలు భారత్‌లోనే తక్కువ
ఓఈసీడీ నివేదిక వెల్లడి ప్యారిస్/లండన్: మిగతా వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఆదాయపరమైన అసమానతలు తక్కువ స్థాయిలో ఉన్నాయని ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. అయితే, సంపన్న దేశాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని వివరించింది. ఇటు వర్ధమాన, అటు సంపన్న దేశాలన్నింటితో పోలిస్తే రష్యా, చైనా, బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికాలో సంపన్నులు, సామాన్యుల ఆదాయాల మధ్య వ్యత్యాసాలు అత్యధికంగా ఉన్నాయి. డెన్మార్క్, స్లొవేనియా, నార్వేల్లో అత్యంత తక్కువగా ఉన్నాయి. సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసం అత్యంత సంపన్న దేశాల్లో మూడు దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉందని ఓఈసీడీ పేర్కొంది. చాలా మటుకు వర్ధమాన దేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. పేదరికం తగ్గింపు, ఏడాది పొడవునా గ్రామీణులకు ఉపాధి, ఆదాయం కల్పించడంలోనూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొంది. -
ఉపాధికి వంద కోట్లు
ఏలూరు :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించారు. సోమవారం నుంచి ఈ పనులు ప్రారంభిం చేందుకు డ్వామా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ ప్రతి కూలీకి కనీసం 100 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా, ఇకపై దానిని 150 రోజులకు పెంచారు. కేవలం కూలి పనులపైనే ఆధారపడి జీవించేవారికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారైనా పనులు పూర్తయ్యేనా! జిల్లాలో 2008లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఏటా ఘనమైన లక్ష్యాలు విధిస్తున్నా ప్రయోజనం కలగటం లేదు. మార్గదర్శకాలను అనుసరించి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించటం లేదు. ఫలితంగా కూలీలకు తగిన స్థాయిలో పనులు దొరకటం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్లతో పనులు చేపట్టారు. మొత్తం 46 బ్లాకులో 888 గ్రామాల్లో 6.10 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. కార్డులు పొందిన కుటుంబాల్లో 12.94 లక్షల మంది కూలీలు ఉన్నారు. మొత్తం కార్డుదారుల్లో ఇప్పటివరకు కేవలం 1.67లక్షల కుటుంబాలకే పనులు చేసే అవకాశం దక్కింది. ఇందులో 8వేల మందికి మాత్రం 100 రోజుల పని దినాలు కల్పించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, మరో 7వేల కుటుంబాలకు 75-100 రోజుల మధ్య పని దొరికింది. అప్పట్లో మిగిలిన పనులను సోమవారం నుంచి చేపట్టి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇకపై కూలీలకు 150 రోజుల పనులు కల్పించాలని నిర్ణయించగా, 150 పనిదినాల చొప్పున 6 లక్షల మంది జాబ్ కార్డుదారుల్లో కేవలం 15వేల మందికి మాత్రమే పనులు దొరికే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించే విషయంలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 136 రకాల పనులు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2015-16 సంవత్సరంలో రూ.100 కోట్ల విలువైన పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 48 మండలాల్లో 136 రకాల పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నెలాఖరు నాటికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. -
చిన్న చేపలపై క్రిమినల్ దెబ్బ
►మిర్యాలగూడ క్లస్టర్ సిబ్బందిపై ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసులు ►మరి ప్రాజెక్టు డెరైక్టరు... డబ్బులు బొక్కిన ఫర్మ్‌ల సంగతేంటో? ►హడావుడిగా క్షేత్రస్థాయి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు ►పెద్దలపై చర్యలు తీసుకుంటారనే చర్చ ►నేడు కోదాడ క్లస్టర్ సిబ్బందిపై కేసుల నమోదు? నల్లగొండ : ఇందిర జలప్రభ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ క్లస్టర్లో ప్రభుత్వ ధన దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 32 మంది సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన 32 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ కె. దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఆరుపోలీసు స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. త్రిపురారం, నిడమనూరు, మిర్యాలగూడ, దామరచర్ల, నేరేడుచర్ల, గరిడేపల్లి పీఎస్‌లో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. వీరిలో అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్లయ్యతో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జియాలజిస్టులు ఉన్నారు. ఈ కేసులన్నింటిలోనూ ఏపీడీ మల్లయ్యను మొదటి నిందితుడు (ఏ1)గా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, చట్టపరమైన చర్యలు చేపట్టడంలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరిపై కేసులు నమోదు చేశామని చెపుతున్న అధికారులు... అసలు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన ఫర్మ్‌ల నిర్వాహకులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది చర్చనీయాంశంగా మారుతోంది. తమ శాఖ పరిధిలో రిజిస్టర్ చేసుకుని, తమ శాఖ డబ్బులను అడ్డంగా దిగమింగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదనేది అటు డ్వామా సిబ్బందితో పాటు జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. మరి వారిని ఏమీ అనరా సారూ...! అయితే, ఈ కుంభకోణం విషయంలో ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ... పెద్ద తలకాయలను వదిలి చిన్న చేపలపై ఇంత త్వరగా క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నదే ప్రశ్నగా మిగులుతోంది. వాస్తవానికి ఈ కుంభకోణంలో అప్పటి ప్రాజెక్టు డెరైక్టర్ సునందతో పాటు దాదాపు 22 మంది ప్రైవేటు వ్యక్తులు ఫర్మ్‌ల పేరిట ఈ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. ప్రాథమిక విచారణలో కూడా ఈ అంశం తేలింది. అయితే, సునంద స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడం తమ చేతిలో లేదని, ఏం చేయాలన్న దానిపై శాఖా పరమైన విచారణ జరుగుతోందని అధికారులు చెపుతున్నారు. నిధులను డ్రా చేయడంలో ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఆమె బాధ్యత ఏ మేరకు ఉందో తెలుసుకోవాల్సి ఉంటుందని వారంటున్నారు. అదే విధంగా ఫర్మ్‌ల పేరిట వచ్చిన ప్రైవేటు వ్యక్తులపై కూడా కనీస చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదన్నది మరో ప్రశ్న. వీరిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, మరో 3,4 రోజుల్లో 22 ఫర్మ్‌లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెపుతున్నారు. మరి ఈ నాలుగు రోజులకే ఆగకుండా 32 మంది సిబ్బందిపై కేసులు ఎందుకు నమోదు చేయాలని, అందరిపై కేసులు ఒకేసారి పెట్టి చర్యలు తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ కేసులో ఉన్న సిబ్బందికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఫోన్ సర్వీసులను కూడా గురువారం మధ్యాహ్నం నుంచి అధికారులు కట్ చేసినట్టు తెలుస్తోంది. సీసీఎస్ విచారణ లేదంట! ఈ కేసును విచారించే అంశాన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులకు అప్పగించే విషయాన్ని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. సీసీఎస్ విచారణ జరిపే అంశంపై సీనియర్ కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకోగా, సీసీఎస్ విచారణ కన్నా ఎక్కడికక్కడ స్థానిక స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారని అధికారులు చెపుతున్నారు. అయితే, ఈ కుంభకోణంలో డ్వామా సిబ్బంది దుర్వినియోగం చేసిన దాని కన్నా ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉందన్న ఆరోపణలున్న నేపథ్యంలో సీబీసీఐడీకి ఈ కేసు విచారణ అప్పగించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. కానీ, కనీసం సీసీఎస్‌కు కూడా అప్పగించకుండా స్థానిక పోలీసులకు ఈ కేసు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోదాడ క్లస్టర్లో మరో 43 మందిపై మిర్యాలగూడ క్లస్టర్‌తో పాటు కోదాడ క్లస్టర్ పరిధిలో కూడా ఇందిర జలప్రభ నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రాథమిక విచారణలో తేలింది. క్లస్టర్ వ్యాప్తంగా రూ.22లక్షల మేర కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై 43 మందిని సస్పెండ్ చే స్తూ డ్వామా పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు క్లస్టర్ పరిధిలోని అన్ని ఎంపీడీఓల కార్యాలయాలకు వెళ్లాయి. ఈ సస్పెన్షన్‌కు గురైన వారిపై శుక్రవారం క్రిమినల్ కేసులు నమోదు కానున్నాయి. వీరిలో కూడా ఏపీడీలు వెంకటేశ్వర్లు, రమేశ్‌తో పాటు 41 మంది క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేదు- దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ క్రిమినల్ కేసుల నమోదు విషయంలో ఎవరి జోక్యం లేదని, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చేస్తున్న సూచనలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇందిర జలప్రభ నిధుల దుర్వినియోగం విషయంలో నిబంధనలకు అనుగుణంగా ముందుకెళుతున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. -
ఉపాధి కూలీలకు ఉచిత బీమా సౌకర్యం
కర్నూలు(అగ్రికల్చర్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలను ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2013-14 సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరైన కూలీల్లో 50 రోజులు ఆపైబడి పనిచేసిన వారికే బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ వివరాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ పుల్లారెడ్డి విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల కంటే పైబడి పనిచేసినవారు జిల్లాలో 46,235 మంది ఉన్నారని, వీరిని కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేయనున్నామన్నారు. ఇందువల్ల కార్మికులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. సభ్యులుగా నమోదు అయినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షలు పరిహారం లభిస్తుందని తెలిపారు. సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు పరిహారం లభిస్తుందని వివరించారు. మెటర్నరీ బెన్ఫిట్ కింద రూ.10 వేలు, మ్యారేజ్ గిఫ్ట్ కింద రూ.5 వేలు, ప్రమాదాల్లో గాయపడి పనిచేయలేకపోతే రూ.4,500, దహన సంస్కారాలకు రూ.10 వేలు ప్రకారం లభిస్తాయని తెలిపారు. ఉపాధి కూలీలు నైపుణ్యతను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణ పొందేందుకు ఒక్కొక్కరిపై రూ.8 వేలు కార్మిక శాఖ వ్యయం చేయనుందని వివరించారు. కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో నమోదు కానివారికి రూ.50 వేలకు ఉచిత ప్రమాద బీమా, అంగవైకల్యం ఏర్పడితే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పరిహారం లభిస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు కార్మిక శాఖ పెన్షన్ స్కీమ్ కూడా ప్రవేశపెడుతోందని వివరించారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు కార్మిక శాఖ కల్పిస్తున్న ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రావాల్సి ఉందన్నారు. -
ఇదేం ‘ఉపాధి’ హామీ
కలెక్టర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఎంపీడీవోల తీరుపై మండిపడ్డ మంత్రి సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు దారుణంగా ఉందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద అన్ని గ్రామాల్లో వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధి కల్పన సగటు దారుణంగా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులుగా ఎంపీడీవోలు ఏమాత్రం బాధ్యత వహించినట్టు కన్పించడం లేదని మంత్రి మండిపడ్డారు. గ్రామాలకు వెళ్లండి: ఎంపీడీవోలు గ్రామాలకు వెళ్లి ఉపాధి పథకానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎంపీడీవోలతో కలెక్టర్లు తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలోనూ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కరువు ప్రాంతాల్లో పేదలకు 100 రోజుల పని కల్పించాలన్నారు. పథకం అమలులో అవినీతికి పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఉపాధి పనులను కల్పించని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు 18002001001కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులున్నారు. -
‘అనంత’ ఆక్రందనలపై కదలిన యంత్రాంగం
‘సాక్షి’ కథనంపై స్పందించిన అనంతపురం కలెక్టర్, డ్వామా జాబితాను పరిశీలించి అర్హులను గుర్తించాలని ఆదేశం అనంతపురం: అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాల దయనీయతపై సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. ఆదుకునేందుకు అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) సిద్ధమైంది. జాతీయ ఉపాధి హామీ పథకం, సమగ్ర వాటర్‌షెడ్ కార్యక్రమాల ద్వారా బాధిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రైతు ఆత్మహత్యలపై సాక్షిలో ఈనెల 23వ తేదీన ‘అనంత ఆక్రందన’ శీర్షికన ప్రచురితమైన కథనంపై డ్వామా అధికారులు స్పందించారు. సాక్షిలో ప్రచురితమైన 40 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను సేకరించి ఆదుకోవటంపై చర్చలు జరుపుతున్నారు. అర్హులను గుర్తించాలని ఆదేశించామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ నాగభూషణం ‘సాక్షి’కి తెలిపారు. ఆత్మహత్యలను అరికడతాం: కలెక్టర్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. జిల్లాలో రైతాంగం పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేస్తామన్నారు. ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యల వివరాల సేకరణకు త్వరలో రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. -
కొండను తవ్వి..!
నల్లగొండ టుటౌన్ :జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. పథకం అమలులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కేవలం సామాజిక తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉపాధి పనుల్లో దాదాపు రూ.9.78 కోట్లు పక్కదారి పట్టినట్లు ఇప్పటి వరకు చేపట్టిన సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. కానీ ఈ డబ్బులను రికవరీ చేయడంలో సంబంధిత అధికారులు మొహం చాటేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో చిత్రమేమిటంటే.. సామాజిక తనిఖీల కారణంగా ఇప్పటి వరకు రూ. రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రికవరీలో కనిపించని నిబద్ధత ఉపాధి హామీ పథకంలో కల్పించిన పనులపై సామాజిక తనిఖీ చేపట్టిన అధికారుల బృందం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ పథకం జిల్లాలో 2007లో ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు నిర్వహించిన సామాజిక తనిఖీల్లో 6 వేల 900 పనుల్లో రూ.13 కోట్లకు పైగా నిధులపై అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో కేవలం రూ. కోటి 35 లక్షల వరకు రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత విచారణలో కొన్ని పనులు సక్రమంగానే జరిగాయని మరో 2 కోట్ల రూపాయలకుపైగా తొలగించారు. 2007 నుంచి నేటి వరకు సామాజిక తనిఖీల నిర్వహణకు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఒక మండలంలో ఒకసారి సామాజిక తనిఖీ ఖర్చు రూ. 1.50 లక్షలు అవుతుంది. ప్రతి మండలంలో ఒక రోజంతా తనిఖీ నిర్వహించి దుర్వినియోగమైన నిధులను రాబట్టకపోతే ఈ సామాజిక తనిఖీ వల్ల ఉపయోగమేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. క్షేత్రస్థాయి సిబ్బందినుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ఈ అక్రమాల తంతులో భాగస్వామ్యం ఉండడంతోనే రికవరీ చేయడంలేదనే విమర్శలకు బలం చేకూరుతోంది. అక్రమాలకు పాల్పడే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకీ అలసత్వం ... ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూ.9.78 కోట్లు పక్కదారి పట్టినా నిధుల రికవరీకి గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. సంబంధిత అధికారులు.. అక్రమాలకు పాల్పడిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడంతో వారిలో అవినీతి అంటే ఏమాత్రం భయంలేకుండా పోతోంది. అక్రమాల ద్వారా సంపాదించిన దాంట్లో కాసింత పైవారికి ముట్టజెపితే వారే చూసీ చూడనట్లు సర్దుకుంటారనే అపవాదు కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. నిధులు రికవరీ చేస్తాం : దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలో దుర్వినియోగమైనట్లు తేలిన నిధుల ను రికవరీ చేస్తాం. ఇటీవల కొన్ని కారణాల వల్ల దానిపై దృష్టి పెట్టలేదు. పనులు ఎంత వేగంగా చేస్తామో అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా అంతే వేగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోం. అంతా ఉత్తుత్తి షోకాజ్ నోటీసులు... ఉపాధి హామీ పనులలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారి నుం చి సంజాయిషీ తీసుకుని నిధులను రికవరీ చేయకుండా వదిలేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు.. మొత్తంగా చేపట్టిన పనులు 6,900 అభ్యంతరాలు వచ్చిన పనుల విలువ రూ. 13,37,81,000 సక్రమమైనవిగా గుర్తించి తొలగించినవి రూ. 2,04,45,000 ఎటూ తేల్చనివి రూ. 1,54,53,000 దుర్వినియోగమైనట్టు తేల్చినవి రూ. 9,78,83,000 రికవరీ అయినవి రూ. 1,35,89,000 రికవరీ చేయాల్సినవి రూ. 8,42,94,000 ఒక మండలంలో ఒకసారి తనిఖీకి రూ. 1,50,000 మొత్తం అయిన ఖర్చు రూ. 6,00,00,000 -
ఉపాధికి ఎసరుతెచ్చే పథకం!
పల్లెసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసమంటూ తొమ్మిదేళ్లక్రితం అమల్లోకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఏ)అటకెక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. పనిచేసే హక్కునూ, జీవనభద్రతనూ కలగజేసే ఉద్దేశంతో 2006లో ఈ పథకానికి పురుడు పోసి, చట్టబద్ధతనుకూడా కల్పించిన యూపీఏ సర్కారే... క్రమేపీ దాని ఊపిరి తీసే ప్రయత్నం చేయగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 650 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇకపై వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు పథకరచన సిద్ధమైందన్న కథనాలు ఇటీవలికాలంలో వెలువ డుతున్నాయి. దానికితోడు వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి నిష్పత్తిని ఇప్పుడున్న 60:40నుంచి 51:49కి మార్చదల్చుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచన మంచిదికాదని...పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చేయ త్నాలు చేయడంవల్ల పల్లెసీమలు మళ్లీ ఆకలితో నకనకలాడతాయని ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో ఇప్పటికే హెచ్చరించారు. ఉపాథి హామీ పథకం సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగ లిగారు. ఉన్న ఊరునూ, అయినవారినీ విడిచిపెట్టి పొట్టచేతబట్టుకుని ఎక్కడె క్కడికో వలసపోవలసివచ్చే దిక్కుమాలిన రోజులుపోయి ఉన్నచోటనే వారికి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్లో ఆసరాగా నిలిచింది. లబ్ధిదారుల్లో సగంకంటే ఎక్కువమంది దళిత కులాలకు చెందినవారుగనుక ఆ వర్గాలకు ఎంతో ప్రయోజ నకరంగా మారింది. పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు రెట్టింపయ్యాయి. రోజుకు రూ. 120 వచ్చేచోట రూ. 250 వరకూ రావడం మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది. పథకానికయ్యే వ్యయంలో కేంద్రానిది 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతంకాగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఈ పథకం వాటా 0.3 శాతం. అయితేనేం ఇది ఏటా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా మూడు నెలలపాటు భరోసా కల్పించింది. శ్రమదోపిడీనుంచి వారిని కాపాడింది. పథకం కింద చేసే పనుల్లో వేతనాల వాటా ఖచ్చితంగా 60 శాతం ఉండాలన్న నిబంధనవల్ల శ్రామికులకుఎంతగానో మేలు కలిగింది. బెంగళూరు ఐఐఎం 2009లో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ప్రభావంపై సర్వే చేసినప్పుడు అక్కడ వలసలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల్ని చేపట్టడంలో, అవతవకలు జరిగినచోట రికవరీలు చేయడంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముందుందని సర్వే తేల్చింది. ఈ పథకంవల్లనే యూపీఏ 2009లో వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత యూపీఏ సర్కారు దీని పీకనొక్కడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఎన్నికలు లేవుగదానన్న భరోసాతో కేటాయింపులను కత్తిరించడం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులో అలవిమాలిన జాప్యమూ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పేద జనానికి ప్రభుత్వం రూ. 4,800 కోట్లు బకాయిపడిందని ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్ చెబుతున్నదంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో సులభంగానే అర్థమవుతుంది. అంతేగాదు...ఈ ఎనిమిదేళ్లలోనూ ఆ పథకానికి రూ. 33,000 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. బకాయి పడితే శ్రామికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్న చట్ట నిబంధన తర్వాత కాలంలో ఎగిరిపోయింది. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది. మరోపక్క అనేక రాష్ట్రాల్లో భారీయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు దారిమళ్లించాయి. ఈ ఎనిమిదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 2.60 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్ల రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే. పథకం అమలులో తగినంత జవాబుదారీతనం, పారదర్శకత ప్రవేశపెడితే ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా అనుత్పాదక పనులు చేపట్టిన పక్షంలో గట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరిస్తే మంచిదే. వ్యవసాయ పనులకు దాన్ని అనుసంధానించడం ఎలాగో ఆలోచించవచ్చు. సామాజిక ఆడిట్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయొచ్చు. ఇంకేమి సంస్కరణలు చేస్తే అది మరింతగా మెరుగుపడుతుందో చర్చించవచ్చు. కానీ, ఎలుకలు జొరబడ్డాయని కొంపకు నిప్పెట్టుకున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి మూలనపడేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది. అసలు దీన్ని చట్టంగా చేయడమేమిటి, పథకంగా ఉంచితే నష్టమేమిటని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రశ్నించారు. పథకం మొదలైననాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాబల్య వర్గాలు సణుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఆలోచనలు అలాంటి వర్గాల ప్రయోజనాలను నెరవేర్చేలా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టరూపంలో ఉన్నది గనుక పార్లమెంటులో చర్చ తర్వాతే దానికి సవరణలు సాధ్యమవుతాయి. పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చడం చేయక దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడమెలాగో ప్రభుత్వం ఆలోచించాలి. -
‘ఉపాధి’ డబ్బు ఏమైంది..?
మంచాలః మంచాల మండలంలో ఉపాధిహామీ పథకం పనితీరు కంచె చేను మేసిన చందంగా తయారైంది. కూలీల కు అందాల్సిన డబ్బు మాయం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి,రెండు కాదు...లక్షలాది రూపాయలు నేటికీ కూలీలకు అందక వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంచాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 983 శ్రమ శక్తి సంఘాలు ఉన్నాయి. 20,778 మంది కూలీలు వీటిలో నమోదై ఉన్నారు. ఇందులో లోయపల్లిలో 1200 మంది కూలీలు ఉన్నారు. వారందరూ ఈ పథకం కింద పని చేశారు. పనిచేసి ఏడాదైనా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. అధికారులు సైతం కూలీలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోయపల్లిలోనే ఈ ఏడాది ఆగస్టు 14వరకు కోటి 19లక్షల35వేల268 రూపాయలు పని జరిగింది.వాటిలో 55శాతం మాత్రమే కూలి డబ్బులు వచ్చాయి. మిగిలిన 45శాతం కూలీలకు కూలి డబ్బులు రాలేదు. వస్తాయోరావో కూడా తెలియక కూలీ లు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా లోయపల్లిలోనే 2013 జూన్ వరకు కూలీలకు రూ.26,07,243ల కూలి డ బ్బులు రావాల్సి ఉంది. అంతలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కూలీల డబ్బును సంబంధితాధికారులు వాపసు తీసుకెళ్లారు. గ్రామా ల్లో ఎక్కడా సక్రమంగా తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల డబ్బులు పంపిణీ వ్యవహారం యాక్సిస్ బ్యాంకు నుండి మణిపాల్ బ్యాంకుకు మారింది. ఈ క్రమంలోనే కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు మాయమయ్యాయి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది అందినకాడికి చేజి క్కించుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ గ్రామస్తులు ఈ డబ్బుల వ్యవహారం లో యాక్సిస్ బ్యాంకు వారిని నిలదీ యగా తాము ఇచ్చామని 26 పే ఆర్డర్ల తో పాటు ఎఫ్టీఓ నంబర్లు కూడా ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన డ బ్బులు కూలీలకు అందలేదు. కూలీలు నేటికీ కూలి డబ్బుల కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో కూలీలకు ఎనిమిది నుండి పది వేల రూపాయల వరకు కూలి డబ్బులు రావాల్సి ఉంది. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. చివరకు ప్లేస్ల్విప్పుల జిరాక్స్ తీసి అధికారులకు అందజేశారు. డబ్బు మాయంపై విచారణ జరిపించి కూలీ లకు రావాల్సిన కూలిని తక్షణం చెల్లిం చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఏపీఓ వీరాంజనేయులును వివరణ కోరగా రూ. 10లక్షల వ రకు కూలీలకు కూలి డబ్బు రావాల్సి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెల 25న గ్రామానికి వెళ్లి పూర్తి స్థా యిలో విచారణ చేసి అందరికీ డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
రికవరీ ఏదీ?
సాక్షి ప్రతినిధి, కడప: వలస జీవితాలకు స్వస్తి పలికి స్వగ్రామాల్లోనే ఉపాధి పనుల ద్వారా కూలీలకు భృతి కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి కల్పతరువుగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని ఫీల్డ్అసిస్టెంట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నా రికవరీ చేయకుండా జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.7.5 కోట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు స్వాహా చేశారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. అందుకు నిదర్శనం వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ ఉదంతం. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన పీడీ.. జిల్లాలో ఇప్పటివరకు 8సార్లు సోషల్ ఆడిట్ నిర్వహించారు. అందులో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి రికవరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. అందులో సుమారు రూ.2.5 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీలో జాప్యం జరుగుతోంది. అందుకు కారణం మండల స్థాయిలో ఉండే ఏపీఓలేనని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంపై వీరబల్లి మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం రూ.18.53 లక్షల రికవరీకి డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం ఆదేశించారు. మే 24న ఆమేరకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఐదుమంది ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి రిక వరీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అందులో రమేష్‌బాబు అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరే రూ.16లక్షలు స్వాహా చేశారు. ఇప్పటి వరకూ స్థానిక ఏపీఓ చిన్నపాటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఉన్నతాధికారులకు మాత్రం ఫీల్డ్అసిస్టెంట్ పరారీలో ఉన్నట్లు రికార్డులు పొందుపర్చినట్లు సమాచారం. అయితే రమేష్‌బాబు యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసి దర్జాగా స్థానిక రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అధికారపార్టీ అండతో స్వాహా మొత్తంలో చిల్లిగవ్వ కూడా రికవరీ కాకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. రమేష్‌బాబు వ్యవహారం పరిశీలిస్తాం... పీడీ బాలసుబ్రమణ్యం జిల్లాలో ఉపాధి సొమ్ము స్వాహాపై రికవరీ చేస్తున్నాం. సోషల్ ఆడిట్లో తప్పు చేశారని తేలిన సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. ఏ ఒక్కరినీ వదలడంలేదు. వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ రమేష్‌బాబు వ్యవహారాన్ని పరిశీలిస్తా. తన ఆదేశాలను ఏపీఓ ఎందుకు అమలు చేయలేదో పరిశీలిస్తాను. -
వ్యవసాయంతో ‘ఉపాధి’ వట్టిమాటే
ఏలూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది పాత పనులతోనే కాలక్షేపం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే జిల్లా నీటి యూజమాన్య సంస్థ (డ్వామా) రూ.450 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అరుుతే, వీటిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులేమీ లేవు. ఇదిలావుండగా, ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో 60 శాతం నిధులను వ్యవసాయ అనుబంధ పనుల కోసం ఖర్చు చేయాలని సర్కులర్ జారీ అయ్యింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. గత ప్రభుత్వ హయూంలో అటవీ, ఉద్యాన, వ్యవసాయ, ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ తదితరు శాఖల సమన్వయంతో గ్రామాల్లో 26రకాల పనులను చేసుకోవడానికి అవకాశం లభించింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని అటుఇటుగా మార్చి ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తున్నట్టుగా చెబుతోంది. గతంలో మార్గదర్శకాలు ఉన్నా గ్రామా ల్లో పంటబోదెలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడిక తొలగింపు, పుంత రోడ్లు, శ్మశానవాటికల్లో మెరక పనులు, పొలం గ ట్లపై మొక్కలు నాటడం, మెట్టప్రాంత మంచినీటి చెరువుల్లో పూడిక తొలగిం పు పనులు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిం చడం ద్వారా పనులు చేపట్టే అవకాశాలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నారుు. తాజా సర్క్యులర్ ప్రకారం ఏదో రకంగా పనులు చేద్దామన్నా.. వర్షాల కారణంగా కూలీలతో చెరువులు, పొలం గట్ల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా పథకం అనుసంధానం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
ఆలూరు రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల గట్లపై మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు అయినా ఎలాంటి ప్రయోజనం కనబడడం లేదంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ గురువారం ఆలూరు ఉపాధి హామీ ఏపీడీ వీరన్న, ఏపీఓ బొజ్జప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ కొంతమంది రైతులు పొలాల గట్లపై వేసిన టేకు, తదితర మొక్కలను ఆయన పరిశీలించారు. కొంతమంది రైతులు ఉపాధి హామీ సిబ్బంది రైతులకు మొక్కలను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారే తప్పా తమకు మొక్కలు ఇవ్వడం లేదన్నారు. అలాగే గతంలో ఇంకుడు గుంతలను కూలీలు తవ్వినా వారికి కూడా కూలీ డబ్బులు పంపిణీ చేయలేదన్నారు. గ్రామంలో దాదాపు ఉపాధి కూలీలకు గతేడాదిగా రూ.1.35 లక్షలకు పైగా డబ్బులను సంబంధిత అధికారులు పంపిణీ చేయలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం టేకు, ఎర్రచందనం తదితర మొక్కలను ఆలూరు జీవనోపాదుల వనరుల కేంద్రంలో పెంచిన చెట్లను ఏయే రైతులకు పంపిణీ చేశారో తనకు వివరాలు తెలపాలని ఆదేశించారు. పొలం గట్లపై రైతులు చెట్లను పెంచడం వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు. కనీసం రైతులకు చెట్ల వల్ల ప్రయోజనాలను కూడా వివరించకపోవడం సిగ్గుచేటన్నారు. మూడు నెలల తరా్వాత తిరిగి పెద్దహోతూరు గ్రామంలో పర్యటిస్తానన్నారు. ప్రతి రైతు పొలం గట్లపై మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రతి ప్రజా, రైతు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తానన్నారు. ప్రజలు, రైతులను నిర్లక్ష్యంచేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఇళ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధులు
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం రూ.4,000 కోట్ల నిధుల వెచ్చింపు 13 లక్షల పని దినాలు, పూర్తి కూలీ సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఆస్తుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా గ్రామాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో బేస్మెంట్ వరకు అవసరమైన పనిని ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టనుంది. మూడు లక్షల రూపాయలతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి నిధులను ప్రభుత్వం దీనికి ఉపయోగించనుంది. గ్రామాల్లో ఆస్తుల కల్పనలో భాగంగా ఉమ్మడి కమ్యూనిటీ హాళ్లు, కల్లాలు, మినీ గోడౌన్లతో పాటు పశు వైద్యశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణరుుంచారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.4,000 కోట్లతో ఉపాధి హామీ పనులను అమలు చేయనున్నారు. తద్వారా కూలీలకు 13 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ‘‘కూలీలకు 100 పని దినాలు కల్పించాల్సిన చోట కుటుంబానికి కేవలం 48 రోజులే కల్పించారు. అంటే ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే ఒక్కొక్కరికి కేవలం 16 పని దినాలే దొరికారుు’’ అని అధికారులు మంత్రికి వివరించారు. పైగా కూలీలకు కేంద్రం నిర్ణరుుంచి రేటు రోజుకు రూ.169 కాగా వారికి తెలంగాణలో రూ.106 మాత్రమే లభిస్తున్నట్టు చెప్పారు. దాంతో కూలీలకు రావాల్సిన రేటు పూర్తిగా వచ్చేలా చూడడంతో పాటు, 100 పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు
నార్నూర్, న్యూస్‌లైన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయి. సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్పందించిన ఏపీడీ బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏపీడీ జాదవ్ గణేశ్ అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు మండలంలో చేపట్టిన పనులు, సిబ్బంది అక్రమాలను వేదిక దృష్టికి తెచ్చారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల పధిలో రూ.2.16 కోట్ల విలువైన పనులు చేపట్టగా రూ.5,05,772 నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. స్పందించిన ఏపీడీ ఆ నిధులను సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి రూ.55,800 జరిమానా విధించారు. నార్నూర్ పంచాయతీ పరిధిలో కూలీలకు చెల్లింపులు సక్రమంగా చేయడంలేదని, పనులు సరిగా కేటాయించడంలేదని కూలీలు ఆరోపించగా.. ఫీల్డ్ అసిస్టెంట్ సాంబాను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీడీ ప్రకటించారు. డాబా పంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.2500 చొప్పున వసూలు చేసినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణను సస్పెండ్ చేశారు. కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపకపోవడంపై ఎంసీవో రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిహత్నూర్, మహగావ్, కొలామా సీఎస్పీలు కూలీల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని బృందం సభ్యులు పేర్కొనగా కొలామా, మహగావ్ సీఎస్పీలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కూలీలకు పేస్లిప్ ఇవ్వని తాడిహత్నూర్ ఎఫ్ఏ మోతిరామ్కి రూ.7 వేల జరిమానా విధించారు. మాన్కాపూర్ ఎఫ్ఏ సూరత్సింగ్కు రూ.5 వేల జరిమానా విధించారు. ప్రతీ కూలీకి పేస్లిప్ ఇచ్చాకే డబ్బులు చెల్లించాలని ఏపీవో రజినీకాంత్‌ను ఏపీడీ ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీడీ అనిల్ చౌహాన్, జిల్లా విజిలెన్స్ అధికారి నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసినా పస్తులే..
ఖమ్మం, న్యూస్‌లైన్ : వలసలు నివారించడంతో పాటు కూలీలకు పని కల్పించేదుకు ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో మిథ్యగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు పనులు చేసినా సకాలంలో డబ్బులు రాక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి నిరీక్షించినా డబ్బులు ఎప్పుడొస్తాయో..? అసలు వస్తాయో.. ? రావో..? అనే అనుమానం వారిని వేధిస్తోంది. దీంతో గత్యంతరం లేక తక్కువ కూలీకి ఇతర పనులకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బును కూలీలకు అందించకుండా కాజేసిన పలువురు జీరోమాస్ సిబ్బందిపై పోలీసు కేసులు పెట్టి రికవరీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. అందని కూలి.. తప్పని అవస్థలు.. జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది రెండు నెలల డబ్బులు అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో డబ్బు విడుదల కాకపోవడంతో పంపిణీ నిలిచిపోయినట్లు తెలిసింది. పనిచేసిన వారం రోజుల్లో కూలి డబ్బులు ఇవ్వాలని ఒక వైపు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా.. జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బూర్గంపాడు మండలంలోని 1800 మంది కూలీలకు రూ.6 లక్షలు, పినపాక మండలంలోని 1700 మంది కూలీలకు రూ. 17లక్షలు పంపిణీ చేయకుండా జీరోమాస్ సిబ్బంది కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని వరంగల్‌లోని ఎపీఎన్జీవీబీ ప్రదాన కేంద్రం నుంచి జీరో మాస్ సంస్థ డ్రా చేసింది. అయితే వాటిని కూలీల ఖాతాల్లో జమచేయలేదు. వైరా మండలంలో గత ఏడాది మే 15 నుంచి జూన్ 12 వరకు 9 గ్రామపంచాయితీల్లో 243 మంది కూలీలకు రూ.1.40 లక్షలు వేతనాలు చె ల్లించాల్సి ఉంది. ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామ పంచాయితీలో 250 మంది కూలీల వేతనాలు రూ.57 వేలు చెల్లించలేదు. వీటిని ఓ కస్టమర్ సర్వీస్ కో ఆర్డినేటర్ (సీఎస్సీ- వీరిని జీరోమాస్ సంస్థ నియమించింది) వాడుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి సదరు సీఎస్సీపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అలాగే జూలూరుపాడు మండలంలో 3200 మంది కూలీలకు 14 వారాలకు సంబంధించిన రూ.8 లక్షలు నగదు చెల్లించాల్సి ఉంది. దమ్మపేట మండలం గణేష్‌పాడులో రూ.2 లక్షలు, నాచారంలో రూ.లక్ష కూలీలకు చెల్లించకుండానే మాయమయ్యాయి. గణేష్‌పాడులో ఆ డబ్బు తీసుకున్న సీఎస్సీ కూలీలకు పంచకుండానే మృతిచెందింది. దీంతో ఆ నిధులు ఏమయ్యాయో అధికారులకే తెలియాలి. నాచారంలో సీఎస్సీ విధుల నుంచి తప్పుకున్నాడు. అయితే అతడి నుంచి ఈ మొత్తం రికవరీ చేయలేదు. చింతూరు మండలంలో 2014 ఏప్రిల్ చివరి నాటికి సుమారు రూ. 72 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎంత పంపిణీ చేశారో అధికారులకే అంతుపట్టడం లేదు. భద్రాచలం మండలంలో ఈఏడాది మార్చి 4 నుంచి ఇప్పటివరకు 5500 మంది కూలీలకు రూ 77.67 లక్షలు అందజేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 9 వరకు కూలీలకు ఇవ్వాల్సిన సుమారు రూ.56 లక్షల వేతనాలు స్మార్ట్కార్డుధారులకు ఇచ్చేందుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెపుతున్నారు. కానీ నేటికి ఒక్కరికి కూడా వేతనాలు మంజూరు చేయలేదు. ఇలా జిల్లాలోని పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సరం డబ్బులు ఇప్పటికీ అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల్లో అందజేస్తాం: డ్వామా పీడీ ఉపాధి కూలీలకు అందాల్సిన డబ్బును వారం రోజుల్లో అందజేస్తామని డ్వామా పీడీ వెంకటనర్సయ్య తెలిపారు. గత రెండు నెలలుగా జిల్లాలో సుమారు రూ. 1.45 కోట్ల చెల్లింపులు నిలిచి పోయాయని చెప్పారు. వీటిని సకాలంలో అందించేందుకు సీఆర్డీ(కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 65లక్షలు జీరోమాస్ సిబ్బంది నిర్లక్ష్యంతో పంపిణీ చేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర అధికారులు జీరోమాస్ సంస్థ నిర్వాహకులపై పోలీసు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. -
ఉపాధి కూలీ... జేబు ఖాళీ
నిజాంసాగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తున్న కూలీలు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. వారం రోజుల్లో చేతికందాల్సిన కూలీ డబ్బులు రెండు నెలలైనా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో రెక్కలు వంచి ఉపాధి పనులు చేస్తున్నా.. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. జిల్లాలో 718 గ్రామపంచాయతీల కు గాను 620 పైగా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రోజుకు 1.5 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొం టున్నారు. గత మార్చి 2వ వారం నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూలీల కు ఇంతవరకు డబ్బులు రాలేదు. వారం వారం కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా, అధికారులు డబ్బులు మం జూరు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.కుంటుంబ పోషణ కోసం కూలీ పనులు చేస్తున్న వారికి సకాలంలో డబ్బులు అందకపోవడంతో అప్పులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీల సంఖ్యను పెంచాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేస్తున్న అధికారులు, కూలీ డబ్బుల చెల్లింపుపై శ్రద్ధ చూపడం లేదు. కూలి డబ్బుల కోసం గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో, సీఎస్పీ కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన కూలీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు పెండింగ్‌లో ఉండటంతో కూలీలు ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కూలీలకు దాదాపు 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్ఆర్ఈ జీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కొరత వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందని ఈజీఎస్ జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. -
‘ఉపాధి’లో అయోమయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గందరగోళం నెలకొంది. దాదాపు పది రోజులుగా చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. చివరకు పథకం అమలులో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం ఈ నెలలో వేతనాలు అందలేదు. దీంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అయితే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవంగా తలెత్తిన సమస్య ఏమిటనే అంశంపై వారికి కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 24 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ పథకానికి సంబంధించి చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ.. నిధులను జిల్లా ప్రాజెక్టులకు విడుదల చేయకుండా రాష్ట్ర కార్యాలయం నుంచే ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తున్నారు. కూలిడబ్బులు మొదలు సిబ్బంది వేతనాలు, వివిధ కార్యక్రమాల కింద చేపట్టే ఖర్చులన్నీ ఆన్లైన్ ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఆకస్మికంగా చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోవడంతో క్షే త్రస్థాయిలో కూలీల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా? సిబ్బంది వేతనాలు, కూలీలకు డబ్బులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు ఒక్కసారిగా నిలిచిపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు సైతం వివరించినప్పటికీ.. రెండు,మూడు రోజుల్లో పరిష్కరిస్తామని బదులిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తి ఉంటాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘ఉపాధి’ కూలీ పెంపు
{పస్తుత దినసరి వేతనం రూ. 149 నుంచి రూ. 169కు.. పంజాబ్, కర్ణాటక, కేరళ, హర్యానాల కంటే తక్కువగా నిర్ధారణ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు {పస్తుతం అందుతున్న సగటు వేతనం రూ. 112 మాత్రమే.. కనిష్టంగా రూ. 69 సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందజేసే దినసరి వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాని ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో కూలీలకు ఇస్తున్నట్లుగా చెబుతున్న దినసరి వేతనం రూ. 149 నుంచి రూ. 169కి పెరగనుంది. ఈ పెంపును ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం సగటున దినసరి వేతనం రూ. 112కు మించి అందడం లేదని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. కనిష్ఠంగా రూ. 69 మాత్రమే అందుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఇదివరకే వెల్లడించింది. కూలీలు చేసే పని కొలతల ఆధారంగా వేతనాలు చెల్లించాలన్న ఉత్తర్వుల కారణంగా.. ప్రభుత్వం ప్రకటించిన దానికంటే దాదాపు రూ. 35 నుంచి రూ. 80 వరకు తక్కువగా దినసరి వేతనం అందుతోంది. గట్టి నేలలు ఉన్నచోట.. కూలీలు ఎంత పనిచేసినా.. గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. దాంతో ఇప్పుడు దినసరి వేతనం పెంచినా.. కూలీలకు అందే ప్రయోజనం స్వల్పమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘పని’ తక్కువ.. ప్రచారం ఎక్కువ.. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంచినట్లుగా ప్రకటించినా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కూలీలకు వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటకలో ‘ఉపాధి’ కూలీలకు దినసరి వేతనం రూ. 197 ఉండగా... కేరళ, హర్యానాల్లో రూ. 212, పంజాబ్‌లో రూ. 200గా నిర్ధారించారు. ఆయా రాష్ట్రాల్లోని ధరల సూచిక ఆధారంగా ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కూలీలకు చెల్లిస్తున్నట్లుగా ప్రకటిస్తున్న వేతనం ఘనంగా కనిపిస్తున్నా.. వాస్తవంగా కూలీలకు అందేది చాలా తక్కువ. రాష్ట్రంలో 1.20 కోట్ల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్‌కార్డులు మంజూరు చేసినా.. ఏనాడూ 50 లక్షల నుంచి 60 లక్షల కుటుంబాలకు మించి ఉపాధి పథకం ప్రయోజనాలు అందలేదు. కూలీలకు పని కల్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు, అధికారులు విఫలమవుతున్నారు. ఏడాదిలో ఒక కుటుంబానికి వంద రోజుల కంటే ఎక్కువ పని కల్పిస్తే.. దానికి అయ్యే వ్యయాన్ని సంబంధిత రాష్ట్రాలే భరించాలని కేంద్రం పేర్కొనడంతో.. ఎక్కువ పని కల్పించేందుకు ఆయా రాష్ట్రాలు సాహసించడం లేదు. ఇక ఏటా కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నా.. వాటిని వినియోగించుకోలేని స్థితిలో మన రాష్ట్రం ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,300 కోట్లు కేటాయిస్తే.. ఇప్పటికి కేవలం రూ. 4,300 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. -
పస్తులుంటున్నాం.. పైసలివ్వండి
యాచారం,న్యూస్‌లైన్: కష్టపడి పనులు చేసి పస్తులుంటున్నాం.. వెంటనే బకాయిలు చెల్లించాలని ‘ఉపాధి’ కూలీలు ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. సోమవారం తక్కళ్లపల్లి, పిల్లిపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని ఎంపీపీ చాంబర్లో మండల ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో కూలీలకు అందాల్సిన బకాయిలు రూ. 30 లక్షలకు పైగానే ఉన్నాయన్నారు. పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ఓ బ్యాంక్ పేదల డబ్బులను స్వాహా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్, ఈజీఏస్ నాగభూషణాన్ని పిలిపించుకొని బకాయిల వివరాల గురించి తెలుసుకున్నారు. వెంటనే బకాయిలు కూలీలకు అందేలా కృషి చేయాలని సూచించారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రత్యేకాధికారి హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కూలీలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
ఉపాధి మిథ్యే..?
ఖమ్మం, న్యూస్‌లైన్ : వలసల నివారణ, కూలీలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో మిథ్యగా మారింది. ఈజీఎస్‌లో పనిచేస్తున్న పలువురు అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు సకాలంలో వేతనం అందక పోవడం, జీరోమాస్ కంపెనీల చేతివాటంతో వేలాది రూపాయలు గల్లంతు కావడంతో.. కూలీలు డబ్బుల కోసం వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఇలా విసిగి వేసారి.. చివరకు ఉపాధి పనులంటేనే చిరాకు పడుతున్నారు. దీనికి తోడు సగటున రోజు కూలీ రూ.149 ఇవ్వాల్సి ఉండగా, అధికారులు రూ.100కు మించి ఇవ్వడం లేదు. దీంతో మరో 55 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. ఇప్పటి వరకు 70 శాతం పనులు కూడా చేపట్టలేదు. లక్ష్యానికి దూరంగా... ఉపాధి హామీ పనుల్లో జిల్లా ఘోరంగా వెనుకబడింది. జిల్లాలో 5,82,759 జాబ్ కార్డులు ఉండగా, 14,41,083 మంది కూలీలు పనిచేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని మండాలాల్లో 1.75 కోట్ల పనిదినాలు కల్పించాలని, ఇందుకు ప్రతి ఒక్కరికి రోజుకు రూ.137 చొప్పున రూ. 385 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఫిబ్రవరి నాలుగో తేదీ నాటికి జిల్లాలో 1.09 కోట్ల పనిదినాలు కల్పించి, రూ. 112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వీటితో పాటు మరో రూ. 86 కోట్లు వివిధ రకాల పనిముట్ల కొనుగోలు, ఇతర ఖర్చులకు ఉపయోగించారు. అంటే మార్చి చివరి నాటికి ఇంకా సుమారు 65 లక్షల పనిదినాలు కల్పించి వాటి ద్వారా రూ.190 కోట్ల ఖర్చు చేయాల్సింది. ఇంతకాలం ఖర్చు చేయని నిధులు ఈ 55 రోజుల్లో ఏవిధంగా వినియోగిస్తారో అధికారులకే తెలియాలి. అలాగే జిల్లాలో 1,13,765 ఎస్సీ, 2, 21,265 ఎస్టీ కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా ఫిబ్రవరి నాటికి ఎస్సీలకు 85 వేలు, ఎస్టీలు 2.12 లక్షల మంది కూలీలకు మాత్రమే పని కల్పించారు. రాష్ట్రంలో ప్రతి మనిషికి రోజు కూలి రూ. 149 చెల్లించాలని నిబంధన ఉండగా, అధికారులు దీనిని రూ. 137కు కుదించారు. అందులోనూ సగటున రూ. 102 -37 పైసలు మాత్రమే చెల్లించారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి 100 రోజుల పనికల్పించాలనే నిబంధన ఉండగా, వీటిని 150 రోజులకు పెంచాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే జిల్లా అధికారులు మాత్రం ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 42.49 రోజుల పనిదినాలు మాత్రమే కల్పించడం గనమార్హం. జిల్లాలో కేవలం 19,487 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పూర్తి చేశాయి. పనుల పట్ల కూలీల వెనుకడుగు.. ఉపాధి పని అంటేనే జిల్లాలోని కూలీలు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో 29 మండలాలు గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసించే గిరిజను లు రోజువారీగా పనిచేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. అయితే ఉపాధి కూలీకి వెళ్తే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియడం లేదు. మస్టర్లలో తప్పులు, ఇష్టానుసారంగా కొలతలు వేస్తుండడంతో చేసిన పనికి సరైన కూలి కూడా రావడం లేదు. అలాగే జీరోమాస్ అధికారుల చేతివాటంతో జిల్లాలో ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు కూలీలకు అందడం లేదు. పనులు చేసి డబ్బు కోసం తిరగడం కంటే తక్కువ కూలీ వచ్చినా.. ఇతర పనులకు వెళ్లడమే మేలని కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పనికి తగిన వేతనం చట్టాన్ని అమలు చేయడంతోపాలు డబ్బు పంపిణీలో జాప్యాన్ని నివారిస్తే తప్ప.. ఉపాధి హామీ పథకం పేదల ఆకలి తీర్చదని, వలసల నివారణ ఆగదని పలు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
‘స్త్రీశక్తి’కి గూడుగోడు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఆచరణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మహిళల సాధికారత ఎండమావిగానే మారుతోంది. జిల్లాలో 56 మండల సమాఖ్యలు, వీటి పరిధిలో 47,400 గ్రూపులున్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు కనీసం కూర్చోవడానికి స్థలం కూడా లేని పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ భవనాల్లోనే జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఇందిరా క్రాంతి పథం సిబ్బంది కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి. జిల్లాలోని మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి సమస్యలను చర్చించుకోవడానికి ప్రతి మండల పరిధిలోని మండల సమాఖ్యలకు స్త్రీ శక్తి భవనాలు నిర్మించాలని 2010 వ సంవత్సరంలో నిర్ణయించారు. ఈ మేరకు 2011లో శిలాఫలకాలు వేశారు. 2014 వచ్చినా ఇప్పటి వరకూ కేవలం 2 భవనాలు మాత్రమే పూర్తి అయి ప్రారంభానికి నోచుకున్నాయి. స్త్రీశక్తి భవనాల తీరుతెన్నులపై ‘న్యూస్‌లైన్’ బృందం శనివారం జిల్లావ్యాప్తంగా పరిశీలించింది. స్త్రీ శక్తి భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. చాలాచోట్ల శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి. 56 మండలాలకు గాను 52 మండలాల్లో స్త్రీ శక్తి భవనాలకు అనుమతులు వచ్చాయి. వాటిలో 34 భవనాలకు నిధులు విడుదలయ్యాయి. ఇందులో 18 భవనాలకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. మూడేళ్ల క్రితం అంచనా వేసిన నిర్మాణ వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిపోయింది. అద్దంకి నియోజకవర్గంలో భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో గత 27 నెలల నుంచి నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. వేటపాలెంలో నిధులు లేక పనులు మొదలు కాలేదు. దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 12 భవనాలు మంజూరయ్యాయి. ఆరు భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్త్రీ శ క్తి భవనాల నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిర్మాణ పనులు మొదలు కాలేదు. మరికొన్నిచోట్ల బిల్లులు సకాలంలో అందించక పనులు నిలిచిపోయాయి. కనిగిరి నియోజక వర్గ పరిధిలో కనిగిరిలో మినహా మిగిలిన 5 మండలాల్లో స్త్రీశక్తి భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. నిధుల జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల గడచినా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో ఒక్క భవనం కూడా నిర్మాణ దశలో లేదు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిధులు మంజూరైనా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నిధులు మంజూరైనా అధికారుల మధ్య సమన్వయం లేక ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల అనువైన స్థలం లేదని, మరోచోట నిధులు చాలవని నిర్మాణాలు చేపట్టలేదు. -
వీఆర్వో కూడా ‘ఉపాధి’ కూలీయేనట !
సైదాపురం, న్యూస్‌లైన్: జాతీయ ఉపాధి హామీ పథకంలో కొందరు సిబ్బంది చేస్తున్న అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పనులపై నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో వారి లీలలు బయటపడుతున్నాయి. గ్రామంలో లేని వారిని, చనిపోయిన వారిని ఉపాధి కూలీలుగా చూపి కూలి కాజేసిన ఘటనలు గతంలో వెలుగులోకి రాగా తాజాగా అలాంటి వాటితో పాటు ఓ వీఆర్వోనే కూలీగా చూపి అక్రమాలకు పాల్పడిన వైనం వెలుగుజూసింది. ప్రజల డిమాండ్‌కు తలొగ్గిన అధికారులు ఓ ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగిం చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ బృందాలు సోమవారం ప్రజావేదిక నిర్వహించాయి. డ్వామా ఏపీడీ రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిబ్బంది అక్రమాలను పలువురు వెల్లడించడంతో రచ్చరచ్చగా మారింది. సైదాపురం పంచాయతీలో సుమారు రూ.16 లక్షల నిధులతో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అక్రమాలు జరి గినట్లు ఫీల్డ్అసిస్టెంట్ రామకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్నేళ్ల క్రితం చనిపోయిన వారు కూడా పనులు చేసినట్లు చూపుతూ తమ కూలి కాజేస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కువైట్‌కు వెళ్లిన వారితో పాటు వీఆర్వోను సైతం పనులకు వస్తున్నారని లెక్కలు రాస్తే డబ్బులు ఎలా ఇస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు పనులు చూపాలని ఐదు నెలలుగా కోరుతున్నా ఫలితం కరువైందని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి చెప్పారు. ఏపీడీ భాస్కర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎన్జీఓ సంఘం నాయకుడు గంగిరెడ్డి ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు అక్రమాలపై స్పందించిన డ్వామా ఏపీడీ, విచారణాధికారి రామకృష్ణంరాజు ఫీల్డ్అసిస్టెంట్ రామకృష్ణను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. దుర్వినియోగం అయిన రూ.1.60 లక్షలను ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. ఫీల్డ్అసిస్టెంట్ బాధ్యతలను టీఏ రమకు అప్పగించారు. రూ.4 లక్షల రికవరీకి ఆదేశం మండలంలోని 31 పంచాయితీల్లో 2012-13లో రూ.2.86 కోట్లతో జరిగిన పనులకు సంబంధించి రూ.4 లక్షల వరకు అవినీతి చోటుచేసుకున్నట్లు గుర్తించామని రామకృష్ణంరాజు వెల్లడించారు. తురిమెర్లలో రూ.10,790, పెరుమాళ్లపాడులో రూ.21,636, దేవరవేమూరులో రూ.23,125, కేజీఆర్పాళెం లో రూ.4,211, మర్లపూడిలో రూ.3,006, సైదాపురంలో 1,62,286, రామసాగరంలో రూ.5,825, చాగణంరాజుపాళెం లో రూ. 15,023, జోగిపల్లిలో రూ.136, కృష్ణారెడ్డిపల్లిలో రూ. 494, గులించెర్లలో రూ.4,168,పాలూరులో రూ.16,369, అనంతమడుగులో రూ.10,230, రాగనరామాపురంలో రూ.3,440, చాగణంలో రూ.53,968, పోతేగుంటలో రూ.8,714, కొమ్మిపాడులో రూ.592, చీకవోలులో రూ. 5,443, లింగనపాళెంలో రూ.1,243 రికవరీకి ఆదేశించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అధికారి ఇ.దయాకర్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోలర్ వెంకటయ్య, ఏపీడీ భాస్కర్, ఎంపీడీఓ సుబ్రమణ్యం, ఏపీఓ వరలక్ష్మి, ఎస్ఆర్పీ ప్రసాద్ పాల్గొన్నారు. -
రూ కోటి నేలపాలు
నడిగూడెం, న్యూస్‌లైన్: నడిగూడెం మండలం రామాపురం రెవెన్యూ గ్రామంలోని 190 సర్వేనంబర్ పరిధిలో దాదాపు 2900 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2200 ఎకరాల్లో కొంతమేర భూమి ఉండగా, 700 ఎకరాల్లో గుట్టలున్నాయి. రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, తెల్ల బెల్లి, మునగాల మండలం బరాఖత్‌గూడెం, ముకుందాపురం, ఆకుపాములు, కోదండరా మాపురం గ్రామాల పరిధిలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఏక్‌సాల్ పట్టాలు పొందుతూ మెట్ట పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని భూములు బీళ్లుగా ఉన్నాయి. నిధులు ఖర్చుచేసినా.. దశాబ్దాల క్రితం ఈ భూముల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా అప్పటి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. భూములను అభివృద్ధి పర్చడం కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, బీసీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, మాడా నుంచి రూ 5 లక్షలు, ఫలసాగర్ పథకం కింద రూ 10 లక్షలు, వర్షాధారంగా పండ్ల తోటల సాగు పథకం కింద రూ 5 లక్షలు, పనికి ఆహార పధకం కింద రూ 10 లక్షలు, ఇందిర జలప్రభ మొదటి దఫా కింద రూ 25 లక్షలు, రెండో దఫా కింద రూ 10 లక్షలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ 10 లక్షలు, మరో రెండు పథకాల ద్వారా రూ 20 లక్షలు ఖర్చు చేశారు. బావులు తీయించడం, బోర్లు, చేతి పంపులు వేయించడం తదితర పనుల ద్వారా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు. అయినా అధికారుల పర్యవేక్షణలేకపోవడంతో ఈ భూములు అభివృద్ధికి నోచుకోలేదు. బావులు అడుగంటాయి. చేతి పంపులు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చెంతనే సాగర్ కాల్వ ఉన్నా.. 190 సర్వేనంబర్‌లో గల భూములకు రెండు కిలోమీటర్ల దూరంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. అయినా ఈ భూములకు చుక్క నీరు అందే పరిస్థితి లేదు. 20 ఏళ్ల కిందట ఈ భూముల మీదుగా ఆర్-9 ఎత్తిపోతల పథ కాన్ని నిర్మించారు. క్రిష్ణానగర్ మీదుగా రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, ఆకుపా ముల, ముకుందాపురం గ్రామాలకు సాగు నీరందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ ప్రకారం నీరందకపోవడంతో వందల ఎకరాల భూము లు బీళ్లుగానే ఉంటున్నాయి. హామీ ఏమైంది? నడిగూడెం మండలం నిమ్మసాగుకు ప్రసిద్ధి. దాదాపు 2500 ఎకరాలకు పైగానే ఈ పంట సాగులో ఉంది. నిమ్మ ఆధారిత పరిశ్రమను పెట్టాలని ఎప్పటి నుంచో ఈ మండల రైతులు కోరుతున్నారు. గతంలో పనిచేసిన ఓ కలెక్టర్ కూడా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ నేటికీ నెరవేరలేదు. ఈ 190 సర్వేనంబర్ పరిధిలోని భూముల్లో నిమ్మ ఆధారిత పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నడిగూడెం, మునగాల, కోదాడ మండలాలకు చెందిన ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు చెబుతున్నారు. పాసుపుస్తకాల పంపిణీలో అవకతవకలు ఈ సర్వేనంబర్ భూముల్లోని రైతులకు ఏక్‌సాల్ పట్టాలనిస్తున్నారు. అంటే ఒక ఏడాది మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇస్తుంటారు. వీటిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి. ఈ పాస్‌పుస్తకాల పంపిణీలో సంబంధిత వీఆర్ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో వారు భూములు లేనివారికి పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారని పలువురు రైతులంటున్నారు. ఎక్కువ భూములున్నవారికి తక్కువ ఉన్నట్టు, తక్కువ భూములున్న వారికి ఎక్కువున్నట్టు రికార్డుల్లో చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది రామాపురం, ఎక్లాస్కాన్పేట, తెల్లబెల్లి గ్రామాలకు చెందిన బడా రైతులు ఈ సర్వేనంబరు భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పలువురు రైతులు పాస్‌పుస్తకాలు లేకున్నా వారి పరిధి లోని భూములను అక్రమంగా విక్రయి స్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పం దించి ఈ భూములను అభివృద్ధ్ది చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.