నార్నూర్, న్యూస్‌లైన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయి. సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్పందించిన ఏపీడీ బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏపీడీ జాదవ్ గణేశ్ అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు మండలంలో చేపట్టిన పనులు, సిబ్బంది అక్రమాలను వేదిక దృష్టికి తెచ్చారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల పధిలో రూ.2.16 కోట్ల విలువైన పనులు చేపట్టగా రూ.5,05,772 నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు.
స్పందించిన ఏపీడీ ఆ నిధులను సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి రూ.55,800 జరిమానా విధించారు. నార్నూర్ పంచాయతీ పరిధిలో కూలీలకు చెల్లింపులు సక్రమంగా చేయడంలేదని, పనులు సరిగా కేటాయించడంలేదని కూలీలు ఆరోపించగా.. ఫీల్డ్ అసిస్టెంట్ సాంబాను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీడీ ప్రకటించారు. డాబా పంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.2500 చొప్పున వసూలు చేసినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణను సస్పెండ్ చేశారు. కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపకపోవడంపై ఎంసీవో రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిహత్నూర్, మహగావ్, కొలామా సీఎస్పీలు కూలీల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని బృందం సభ్యులు పేర్కొనగా కొలామా, మహగావ్ సీఎస్పీలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కూలీలకు పేస్లిప్ ఇవ్వని తాడిహత్నూర్ ఎఫ్‌ఏ మోతిరామ్‌కి రూ.7 వేల జరిమానా విధించారు. మాన్కాపూర్ ఎఫ్‌ఏ సూరత్‌సింగ్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. ప్రతీ కూలీకి పేస్లిప్ ఇచ్చాకే డబ్బులు చెల్లించాలని ఏపీవో రజినీకాంత్‌ను ఏపీడీ ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీడీ అనిల్ చౌహాన్, జిల్లా విజిలెన్స్ అధికారి నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు
Published Wed, Jun 4 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement