Narnoor
-
ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని
నార్నూర్: పరువు కత్తికి మరో ప్రాణం బలైంది. కనిపెంచిన తల్లిదండ్రులే.. కన్నప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించారు. కూతురు వేరే మతం యువకుడిని ప్రేమించిందని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌కొండకి చెందిన పవార్ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని సమయంలో రాజేశ్వరి తరచూ పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని మందలించారు. తమను పెద్దలు కలవనీయరని భావించిన వారు మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువతి తండ్రి పవార్ దేవీదాస్.. సలీంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజులుగా అతడు ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు. ఆత్మహత్యగా నమ్మించే యత్నం... శుక్రవారం ఉదయం దేవీదాస్ సర్పంచ్ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. చదవండి: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి.. -
మూడేళ్లలో 24గంటలూ విద్యుత్
నార్నూర్ : వచ్చే మూడేళ్లలో 24గంటలూ విద్యుత్ సరఫరా చేసే విధంగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మండలంలోని అర్జుని గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో రూ.75లక్షలతో నిర్మించిన సిబ్బంది నివాస సముదాయం, లోకారి-బి గ్రామంలో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.1.60లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం, పర్సువాడలో సీసీడీపీ పథకం కింద రూ.10లక్షలతో నిర్మించిన భవనం, గాదిగూడలో రూ.12లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ పౌండేషన్ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించి తీరుతామని అన్నారు. ఈ నెల 8 నుంచి రూ.200 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.వెయ్యి, రూ.500 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.1,500 పెంపును ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.51వేలు ఇస్తుందని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఝరిలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిప్రీ గ్రామ పంచాయతీ పరిధి అంద్‌గూడ, కొలాంగూడ, కుండి, చిన్నకుండి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడానికి బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఖడ్కి నుంచి లోకారి-బి గ్రామం వరకు బీటీ రోడ్దు మంజూరు చేస్తామన్నారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు రూపావంతిజ్నానోబా పుస్కర్, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, సర్పంచ్‌లు జంగుబాయి, కన్ను, మేస్రం లచ్చు, జాకు కొడప, ఇంద్రభాను, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంతరావ్, డీఈ తానాజీ, జేఈ ఇందల్, నాయకులు లోఖండే చంద్రశేఖర్, ఉర్వేత రూప్‌దేవ్, మోతే రాజన్న, సయ్యద్‌ఖాశీం, దాదేఆలీ పాల్గొన్నారు. -
జ్వరంతో ఐదుగురు మృతి
నార్నూర్ : జ్వరం పంజా విసురుతోంది. జిల్లా ప్రజల పాలిట మృత్యువుగా మారుతోంది. ఆదివారం మరో ఐదుగురు చిన్నారులను జ్వరంతో మృత్యుఒడికి చేర్చింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. నార్నూర్ మండలంలో జ్వరంతో బాధపడుతూ ముగ్గురు, రక్తహీనతో ఒకరు చనిపోయారు. మాన్కాపూర్ గ్రామానికి చెందిన ఎళ్లగుర్తి ఆనంద్‌రావు, పద్మబాయి దంపతుల కుమారుడు కల్యాణ్(14) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. మలేరియాగా వైద్యులు నిర్దారించారు. చికిత్స పొందుతూ రిమ్స్‌లోనే ఆదివారం చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన మేస్రం సోము, అనసూయ దంపతుల కుమారుడు శేకు(ఏడాది) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా జ్వరం తగ్గక ఇంట్లోనే కన్నుమూశాడు. మండలంలోని లొకారి-కే గ్రామానికి చెందిన హెచ్‌కే.దేవురావ్, సుమిత్ర దంపతుల కూతురు స్వర్ణ(2) ర క్తహీనతతో ఆదివారం మృతిచెందింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. వైద్య పరీక్షల అనంతరం రక్తం తక్కువగా ఉందని వైద్యులు నిర్దారించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. రేగులగూడలో.. కాసిపేట : మండలంలోని రేగులగూడ గ్రామానికి చెందిన కుంరం తిరుపతి, లలిత దంపతుల కూతురు గంగోత్రి(9) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంచిర్యాలలో వైద్యులను ఆశ్రయించగా రక్తపరీక్షలు చేయించారు. రక్తకణాలు తక్కువగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాంపూర్‌లో.. దహెగాం : మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓండ్ర రాజారాం కుమారుడు మధూకర్(12) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం జ్వర తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి బయల్దేరారు. గ్రామానికి రవాణా సదుపాయం లేకపోవడంతో గెర్రె గ్రామం వరకు ఎడ్లబండిపై తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో తరలిస్తున్నారు. 108 సమాచారం అందించి కుంచవెల్లి వరకు వెళ్లగానే.. మరణించాడు. కాగా, మధూకర్ స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. -
కేటరింగ్ బాయ్ TO సీబీఐ ఎస్సై వరకు..
నార్నూర్ : ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెం దిన చాటే విఠల్, లక్ష్మీబాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరు ఆరేళ్ల క్రితం నార్నూర్ మండల కేంద్రానికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతు రు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సంతోష్, రెండో కుమారుడు కృష్ణ. సంతోష్ వ్యాపారం నిర్వహిస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కృష్ణకు చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. తమ్ముడి ఆసక్తిని గమనించిన సంతోష్ పట్టుదలతో చదివించి, ఎల్లవేళలా ప్రోత్సహిం చాడు. కృష్ణ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ముత్నూర్ ప్రభుత్వ పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు ఇంద్రవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో 518 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్మల్ ఎన్బీఆర్ జూని యర్ కళాశాలలో ఇంటర్ చదివి 948 మార్కులు సాధిం చి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తిం చిన హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం ఒక సంవత్సరం ఉచితంగా ఎంసెట్‌లో కోచింగ్ ఇచ్చింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకుతో హైదరాబాద్‌లోని సీవీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాడు. చదువు.. పని.. ఇంజినీరింగ్ చదువుతూనే సొంత ఖర్చుల నిమిత్తం కేటరింగ్ పనికి వెళ్లేవాడు. పగలు కళాశాలకెళ్లి.. రాత్రి కేటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. కేటరింగ్ ద్వారా రోజు రూ.150 సంపాదించేవాడు. ఆ డబ్బుతో చదువు, సాధారణ ఖర్చులకు ఇబ్బంది ఉండేదికాదు. ఇలా.. చదివి బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తార్నాకలోని వంజారి సంఘం హాస్టల్లో ఉంటూ సినీ హీరో శ్రీకాంత్ కుమారులకు హోం ట్యూషన్ చెబుతూ ఏడాదిపాటు పోటీ పరీక్షలకు సొంతంగా ప్రిపేర్ అయ్యాడు. 2012లో ఎస్ఎస్సీ(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) డిగ్రీ అర్హతతో ప్రకటన వెలువడడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా మొదటి దశకు పది లక్షల మంది హాజరవగా రెండో దశకు 1.12 లక్షల మంది అర్హత సాధించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఐదు వేల మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియం అయినప్పటికీ కృష్ణ ఇంగ్లిష్‌లో జరిగిన ఇంటర్వ్యూలో సునాయాసంగా విజయం సాధించాడు. దేశవ్యాప్తంగా 34 మంది సీబీఐ ఎస్సైగా ఎంపికైతే వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణ ఒక్కడే కావడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అంతేకాదు ఎస్బీఐ, ఎస్బీడబ్ల్యూ, ఆంధ్రాబ్యాంక్, ఆర్ఆర్బీ, ఎఫ్‌సీఐ తదితర ఉద్యోగాలను ఒకే ప్రయత్నంలో సాధించాడు. గాజియాబాద్ (యూపీ)లోని సీబీఐ అకాడమీలో 8 నెలల శిక్షణ పూర్తి చేశాడు. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం సీబీఐ ముంబయి బ్రాంచిలో అవినీతి నిరోధక విభాగంలో సీబీఐ ఎస్సైగా పనిచేస్తున్నాడు. -
జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్
నార్నూర్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పట్నం పిల్లలకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు గ్రామీణ విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని రాజులాగూడకు చెందిన 8వ తరగతి గిరిజన విద్యార్థి జాదవ్ సాయికిరణ్ పలు ప్రయోగాల ద్వారా హీటర్లు, మీక్సీలు తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. నడ్డంగూడ గ్రామానికి జాదవ్ గణేశ్, శారదబాయిలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. సాయికిరణ్ తండ్రి అనారోగ్యంతో మూడేళ్లక్రితం మరణించారు. తల్లి శారదబాయి రాజులాగూడలోని తల్లి కౌసల్యబాయి ఇంట్లో ఉంటూ చిన్న కిరాణం దుకాణం నడుపుతూ ఇద్దరు పిల్లలను చదిస్తోంది. ఆమె వీరికి మార్కెట్ నుంచి రిమోట్లతో నడిచే కారు, జీపులు, విమనాలాంటి ఆట బొమ్మలను ఆడుకోవడానికి తీసుకొవచ్చేది. సాయికూమార్ వీటితో ఆడుతూ అందులో ఉండే మోటర్లను ఉపయోగించి హీటర్, మీక్సీలు తయారుచేశాడు. అతను తయారు చేసిన మీక్సీతో అరకిలో వరకు ఏదైనా పొడిని మిక్సీ పట్టవచ్చంటున్నాడు. హీటర్ ద్వారా 5 లీటర్ల వరకు నీళ్లు వేడి చేసుకోచ్చని ఆయన చేసి చూపెడుతున్నాడు. హీటర్ తయారీ.. పొడవువైన రేకును తీసుకోని, సగం విరగ్గొట్టి రెండు రంధ్రాలు చేయాలి. అందులో విద్యుత్ వైర్లను అమర్చి, బ్యాటరీ సెల్స్‌కు పెట్టినట్లైతే అది వే డెక్కి గిన్నెలో ఉన్న 5 లీటర్ల నీళ్లు వేడి చేస్తుంది. మిక్సీ తయారీ.. ఒక డబ్బాను తీసుకొని, కింద రంధ్రం చేయాలి. దానికి కిందభాగంలో ఆట వస్తువులకు వాడే రిమోట్ కారు మోటర్‌ను బిగించాలి. మోటర్ పై భాగాన లేజర్ బ్లెడ్‌ను అమర్చిన తరువాత మోటర్‌కు విద్యుత్ తీగలతో కనెక్షన్ ఇచ్చి, ఆ తీగలను బ్యాటరీ సెల్‌కు పెడితే మిక్సీ పనిచేస్తుంది. దీంతో అరకిలో ధనియాల పొడి పట్టవచ్చు. ఇలాంటి ప్రయోగాలు చేసి చూపెడుతూ.. అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్న సాయికిరణ్.. భవిష్యత్‌లో ఈ ప్రయోగాలతో రాణించాలన్నదే తన లక్ష్యమంటున్నాడు. -
‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు
నార్నూర్, న్యూస్‌లైన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయి. సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్పందించిన ఏపీడీ బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏపీడీ జాదవ్ గణేశ్ అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు మండలంలో చేపట్టిన పనులు, సిబ్బంది అక్రమాలను వేదిక దృష్టికి తెచ్చారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల పధిలో రూ.2.16 కోట్ల విలువైన పనులు చేపట్టగా రూ.5,05,772 నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. స్పందించిన ఏపీడీ ఆ నిధులను సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి రూ.55,800 జరిమానా విధించారు. నార్నూర్ పంచాయతీ పరిధిలో కూలీలకు చెల్లింపులు సక్రమంగా చేయడంలేదని, పనులు సరిగా కేటాయించడంలేదని కూలీలు ఆరోపించగా.. ఫీల్డ్ అసిస్టెంట్ సాంబాను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీడీ ప్రకటించారు. డాబా పంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.2500 చొప్పున వసూలు చేసినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణను సస్పెండ్ చేశారు. కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపకపోవడంపై ఎంసీవో రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిహత్నూర్, మహగావ్, కొలామా సీఎస్పీలు కూలీల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని బృందం సభ్యులు పేర్కొనగా కొలామా, మహగావ్ సీఎస్పీలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కూలీలకు పేస్లిప్ ఇవ్వని తాడిహత్నూర్ ఎఫ్ఏ మోతిరామ్కి రూ.7 వేల జరిమానా విధించారు. మాన్కాపూర్ ఎఫ్ఏ సూరత్సింగ్కు రూ.5 వేల జరిమానా విధించారు. ప్రతీ కూలీకి పేస్లిప్ ఇచ్చాకే డబ్బులు చెల్లించాలని ఏపీవో రజినీకాంత్‌ను ఏపీడీ ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీడీ అనిల్ చౌహాన్, జిల్లా విజిలెన్స్ అధికారి నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.