Honour Killing In Adilabad: Parents Killed Daughter Over Her Intercaste Marriage At Adilabad - Sakshi
Sakshi News home page

Honour Killing In Adilabad: పరువు కత్తికి మరో ప్రాణం బలి 

Published Fri, May 27 2022 3:04 PM | Last Updated on Sat, May 28 2022 12:22 AM

Honour Killing: Parents Assassinated Daughter For Intercaste Marriage At adilabad - Sakshi

నార్నూర్‌: పరువు కత్తికి మరో ప్రాణం బలైంది. కనిపెంచిన తల్లిదండ్రులే.. కన్నప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించారు. కూతురు వేరే మతం యువకుడిని ప్రేమించిందని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రవికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌కొండకి చెందిన పవార్‌ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.

ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది.

క్రమంగా అది ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని సమయంలో రాజేశ్వరి తరచూ పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని మందలించారు. తమను పెద్దలు కలవనీయరని భావించిన వారు మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువతి తండ్రి పవార్‌ దేవీదాస్‌.. సలీంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజులుగా అతడు ఆదిలాబాద్‌ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు.

ఆత్మహత్యగా నమ్మించే యత్నం...  
శుక్రవారం ఉదయం దేవీదాస్‌ సర్పంచ్‌ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు.

అనుమానం వచ్చిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. 
చదవండి: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement