జ్వరంతో ఐదుగురు మృతి
నార్నూర్ : జ్వరం పంజా విసురుతోంది. జిల్లా ప్రజల పాలిట మృత్యువుగా మారుతోంది. ఆదివారం మరో ఐదుగురు చిన్నారులను జ్వరంతో మృత్యుఒడికి చేర్చింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. నార్నూర్ మండలంలో జ్వరంతో బాధపడుతూ ముగ్గురు, రక్తహీనతో ఒకరు చనిపోయారు.
మాన్కాపూర్ గ్రామానికి చెందిన ఎళ్లగుర్తి ఆనంద్‌రావు, పద్మబాయి దంపతుల కుమారుడు కల్యాణ్(14) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. మలేరియాగా వైద్యులు నిర్దారించారు. చికిత్స పొందుతూ రిమ్స్‌లోనే ఆదివారం చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన మేస్రం సోము, అనసూయ దంపతుల కుమారుడు శేకు(ఏడాది) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.
చికిత్స చేయించినా జ్వరం తగ్గక ఇంట్లోనే కన్నుమూశాడు. మండలంలోని లొకారి-కే గ్రామానికి చెందిన హెచ్‌కే.దేవురావ్, సుమిత్ర దంపతుల కూతురు స్వర్ణ(2) ర క్తహీనతతో ఆదివారం మృతిచెందింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. వైద్య పరీక్షల అనంతరం రక్తం తక్కువగా ఉందని వైద్యులు నిర్దారించారు. చికిత్స పొందుతూ చనిపోయింది.
రేగులగూడలో..
కాసిపేట : మండలంలోని రేగులగూడ గ్రామానికి చెందిన కుంరం తిరుపతి, లలిత దంపతుల కూతురు గంగోత్రి(9) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంచిర్యాలలో వైద్యులను ఆశ్రయించగా రక్తపరీక్షలు చేయించారు. రక్తకణాలు తక్కువగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాంపూర్‌లో..
దహెగాం : మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓండ్ర రాజారాం కుమారుడు మధూకర్(12) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం జ్వర తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి బయల్దేరారు. గ్రామానికి రవాణా సదుపాయం లేకపోవడంతో గెర్రె గ్రామం వరకు ఎడ్లబండిపై తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో తరలిస్తున్నారు. 108 సమాచారం అందించి కుంచవెల్లి వరకు వెళ్లగానే.. మరణించాడు. కాగా, మధూకర్ స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.