సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రతి ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపులకు తోడు ఆధార్ అనుసంధానిత చెల్లింపులు, ఆన్‌లైన్ హాజరు వంటి చర్యలతో పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు ప్రధాన ఆర్థిక భద్రతగా ఉంటూ ఆసరాగా నిలిచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తోంద కేంద్ర గణాంకాలు చాటుతున్నాయి.
కోవిడ్ సమయంలో 2020–21లో రికార్డు స్థాయిలో 7.55 కోట్ల కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందాయి. ఆ తర్వాత 2021–22 వచ్చేసరికి ఈ సంఖ్య 7.25కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి 6.19 కోట్లకు పడిపోయింది. తగ్గిన కుటుంబాలకు తోడు పనిదినాల సంఖ్య కుచించుకుపోవడం ఆందోళనకరం. 2020–21లో సగటు పనిదినాల సంఖ్య 51.42 రోజులుకాగా, ఆ సంఖ్య 2022–23 ఏడాదికల్లా 47.84 రోజులకు పడిపోయింది. 2021–22లో కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.98,467కోట్లు కేటాయించారు. 2022–23లో ఆ కేటాయింపులు కేవలం రూ.89వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.60వేల కోట్లే విదిల్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లేక పనిదినాలను కుదిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment