సైదాపురం, న్యూస్‌లైన్: జాతీయ ఉపాధి హామీ పథకంలో కొందరు సిబ్బంది చేస్తున్న అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పనులపై నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో వారి లీలలు బయటపడుతున్నాయి. గ్రామంలో లేని వారిని, చనిపోయిన వారిని ఉపాధి కూలీలుగా చూపి కూలి కాజేసిన ఘటనలు గతంలో వెలుగులోకి రాగా తాజాగా అలాంటి వాటితో పాటు ఓ వీఆర్వోనే కూలీగా చూపి అక్రమాలకు పాల్పడిన వైనం వెలుగుజూసింది. ప్రజల డిమాండ్‌కు తలొగ్గిన అధికారులు ఓ ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగిం చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ బృందాలు సోమవారం ప్రజావేదిక నిర్వహించాయి. డ్వామా ఏపీడీ రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిబ్బంది అక్రమాలను పలువురు వెల్లడించడంతో రచ్చరచ్చగా మారింది.
సైదాపురం పంచాయతీలో సుమారు రూ.16 లక్షల నిధులతో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అక్రమాలు జరి గినట్లు ఫీల్డ్‌అసిస్టెంట్ రామకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్నేళ్ల క్రితం చనిపోయిన వారు కూడా పనులు చేసినట్లు చూపుతూ తమ కూలి కాజేస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కువైట్‌కు వెళ్లిన వారితో పాటు వీఆర్వోను సైతం పనులకు వస్తున్నారని లెక్కలు రాస్తే డబ్బులు ఎలా ఇస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు పనులు చూపాలని ఐదు నెలలుగా కోరుతున్నా ఫలితం కరువైందని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి చెప్పారు. ఏపీడీ భాస్కర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎన్జీఓ సంఘం నాయకుడు గంగిరెడ్డి ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు
అక్రమాలపై స్పందించిన డ్వామా ఏపీడీ, విచారణాధికారి రామకృష్ణంరాజు ఫీల్డ్‌అసిస్టెంట్ రామకృష్ణను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. దుర్వినియోగం అయిన రూ.1.60 లక్షలను ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. ఫీల్డ్‌అసిస్టెంట్ బాధ్యతలను టీఏ రమకు అప్పగించారు.
రూ.4 లక్షల రికవరీకి ఆదేశం
మండలంలోని 31 పంచాయితీల్లో 2012-13లో రూ.2.86 కోట్లతో జరిగిన పనులకు సంబంధించి రూ.4 లక్షల వరకు అవినీతి చోటుచేసుకున్నట్లు గుర్తించామని రామకృష్ణంరాజు వెల్లడించారు. తురిమెర్లలో రూ.10,790, పెరుమాళ్లపాడులో రూ.21,636, దేవరవేమూరులో రూ.23,125, కేజీఆర్‌పాళెం లో రూ.4,211, మర్లపూడిలో రూ.3,006, సైదాపురంలో 1,62,286, రామసాగరంలో రూ.5,825, చాగణంరాజుపాళెం లో రూ. 15,023, జోగిపల్లిలో రూ.136, కృష్ణారెడ్డిపల్లిలో రూ. 494, గులించెర్లలో రూ.4,168,పాలూరులో రూ.16,369, అనంతమడుగులో రూ.10,230, రాగనరామాపురంలో రూ.3,440, చాగణంలో రూ.53,968, పోతేగుంటలో రూ.8,714, కొమ్మిపాడులో రూ.592, చీకవోలులో రూ. 5,443, లింగనపాళెంలో రూ.1,243 రికవరీకి ఆదేశించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అధికారి ఇ.దయాకర్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోలర్ వెంకటయ్య, ఏపీడీ భాస్కర్, ఎంపీడీఓ సుబ్రమణ్యం, ఏపీఓ వరలక్ష్మి, ఎస్‌ఆర్పీ ప్రసాద్ పాల్గొన్నారు.
వీఆర్వో కూడా ‘ఉపాధి’ కూలీయేనట !
Published Tue, Dec 31 2013 3:31 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
Advertisement
Advertisement