- {పస్తుత దినసరి వేతనం
- రూ. 149 నుంచి రూ. 169కు..
- పంజాబ్, కర్ణాటక, కేరళ, హర్యానాల కంటే తక్కువగా నిర్ధారణ
- ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు
- {పస్తుతం అందుతున్న సగటు వేతనం రూ. 112 మాత్రమే.. కనిష్టంగా రూ. 69
- ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంచినట్లుగా ప్రకటించినా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కూలీలకు వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటకలో ‘ఉపాధి’ కూలీలకు దినసరి వేతనం రూ. 197 ఉండగా... కేరళ, హర్యానాల్లో రూ. 212, పంజాబ్‌లో రూ. 200గా నిర్ధారించారు.
- ఆయా రాష్ట్రాల్లోని ధరల సూచిక ఆధారంగా ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది.
- కూలీలకు చెల్లిస్తున్నట్లుగా ప్రకటిస్తున్న వేతనం ఘనంగా కనిపిస్తున్నా.. వాస్తవంగా కూలీలకు అందేది చాలా తక్కువ.
- రాష్ట్రంలో 1.20 కోట్ల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్‌కార్డులు మంజూరు చేసినా.. ఏనాడూ 50 లక్షల నుంచి 60 లక్షల కుటుంబాలకు మించి ఉపాధి పథకం ప్రయోజనాలు అందలేదు. కూలీలకు పని కల్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు, అధికారులు విఫలమవుతున్నారు.
- ఏడాదిలో ఒక కుటుంబానికి వంద రోజుల కంటే ఎక్కువ పని కల్పిస్తే.. దానికి అయ్యే వ్యయాన్ని సంబంధిత రాష్ట్రాలే భరించాలని కేంద్రం పేర్కొనడంతో.. ఎక్కువ పని కల్పించేందుకు ఆయా రాష్ట్రాలు సాహసించడం లేదు.
- ఇక ఏటా కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నా.. వాటిని వినియోగించుకోలేని స్థితిలో మన రాష్ట్రం ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,300 కోట్లు కేటాయిస్తే.. ఇప్పటికి కేవలం రూ. 4,300 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు.
‘ఉపాధి’ కూలీ పెంపు
Published Mon, Feb 17 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందజేసే దినసరి వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాని ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో కూలీలకు ఇస్తున్నట్లుగా చెబుతున్న దినసరి వేతనం రూ. 149 నుంచి రూ. 169కి పెరగనుంది. ఈ పెంపును ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం సగటున దినసరి వేతనం రూ. 112కు మించి అందడం లేదని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. కనిష్ఠంగా రూ. 69 మాత్రమే అందుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఇదివరకే వెల్లడించింది. కూలీలు చేసే పని కొలతల ఆధారంగా వేతనాలు చెల్లించాలన్న ఉత్తర్వుల కారణంగా.. ప్రభుత్వం ప్రకటించిన దానికంటే దాదాపు రూ. 35 నుంచి రూ. 80 వరకు తక్కువగా దినసరి వేతనం అందుతోంది. గట్టి నేలలు ఉన్నచోట.. కూలీలు ఎంత పనిచేసినా.. గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. దాంతో ఇప్పుడు దినసరి వేతనం పెంచినా.. కూలీలకు అందే ప్రయోజనం స్వల్పమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘పని’ తక్కువ.. ప్రచారం ఎక్కువ..
Advertisement
Advertisement