
మటన్ రేటు పెరగడంతో హలీం ధర పెరుగుదల
రంజాన్ నేపథ్యంలో భారీ డిమాండ్
నగరంలో ఇప్పటికే విక్రయాలు షురూ..
చార్మినార్: రంజాన్ మాసంలో ప్రత్యేకమైన హలీం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది రంజాన్ ప్రారంభానికి ముందే హలీం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మటన్ రేట్లు పెరగడంతో హలీం తయారీదారులు హలీం ధర పెంచేశారు. గతేడాది రూ.280లకు ప్లేట్ హలీం లభించగా..ప్రస్తుతం రూ.20 పెరిగి రూ.300 చేరుకుంది. ఇటీవల ముగిసిన నాంపల్లి ఎగ్జిబిషన్‌లో సైతం పిస్తాహౌజ్ ప్లేట్ హలీంను రూ.300 చొప్పున విక్రయించింది.
అయితే ఎగ్జిబిషన్ ముగిసినా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రూ.300కు విక్రయిస్తున్నారు. రేటు పెరిగినా హలీం ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 1న ఆకాశంలో నెల వంక కనిపిస్తే..2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో మాంసాహార వంటకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో హాలీంను తప్పనిసరిగా వడ్డిస్తారు.
పాతబస్తీ ప్రత్యేకం..
హలీం తయారీ, విక్రయాల్లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాతబస్తీలోని హాలీం హోటళ్లు వినియోగదారులతో కిటకిటలాడతాయి. పాతబస్తీలోని పిస్తాహౌజ్, మదీనా సర్కిల్‌లోని షాదాబ్ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment