haleem
-
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
విజయవాడ : రంజాన్ ఘుమఘుమలు (ఫొటోలు)
-
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్‌తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్‌ను బ్రెడ్‌లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్‌లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్‌లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్‌ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్‌ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్‌తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్‌లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్‌ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్‌ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
Haleem : వారెవ్వా హలీం.. తిని చూడాల్సిందే
ఉట్నూర్ రూరల్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు పట్టణ కేంద్రాలతో గ్రామ గ్రామాల్లో సైతం మార్కెట్లో సందడి వాతావరణం ఏర్పడుతోంది. అయితే రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం హలీమే. ఏటా రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హలీం ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీంతో హలీం సెంటర్లు బిజీగా మారుతాయి.. ఇది ముస్లింలకే కాదు, ప్రతీ ఒక్కరికి ఫేవరెట్ డిష్, దీని రుచి చూడాలని కొందరు.. కొత్తగా ట్రై చేసే వారు మరికొందరు.. ఏళ్ల తరబడి సీజన్లో దీని రుచిని ఆస్వాదించే వారు ఇంకొందరు.. ఇలా హలీంకు రంజాన్ సీజన్లో అందరూ గులాం అయిపోవాల్సిందే.. చికెన్(హరీస్), మటన్(హలీం)లతో చేసే ఈ వంటకాన్ని ఆరగించాలని చాలా మంది ఉవ్విల్లూరుతుంటారు. హలీం.. అరబ్ దేశాల సంప్రదాయం.. ఘుమఘుమలాడే రుచికలిగిన హలీం అరబ్ దేశాల సంప్రదాయ వంటకంగా ప్రఖ్యాతి. ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ తదితర ముస్లిం దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ హైదరాబాద్ హలీంకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పరిశుభ్రమైన మాంసం, స్వచ్చమైన నెయ్యి, గోదుమలు, పిస్తా, కాజు, బాదం, కిస్మిస్, మిరియాలు, లవంగాలు, యాలకులు తదితర గరం మసాల దినుసులు వేసి సుమారు 12గంటల పాటు ఉడికించి తయారు చేయడం దీని ప్రత్యేకత. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే ప్రత్యేక వంటకం ఇది. రంజాన్ రుచులు రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉన్న ముస్లింలు ఇఫ్తార్ వేళలో తీసుకునే ఆహారం ఎంతో ప్రాధానాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా హలీం, ఖుర్బానీకా మీఠా, కద్దుకాఖీర్ తదితర వంటకాలను తినడానికి ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేస్తారు. అందుకే ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ముధోల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఆసిఫాబాద్, ఉట్నూర్ లాంటి ఏరియాల్లో ప్రత్యేక వంటకాలను తయారు చేసే దుకాణాలను నెలకొల్పి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు. -
ఫ్రీ హలీమ్ ఎఫెక్ట్: భారీ జనంతో గందరగోళం
హైదరాబాద్: మలక్పెట్లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మలక్‌పేటలో ఓ హోటల్లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా జనాలు ఎగబడ్డారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. Chaos over free #Haleem in #Hyderabad, police used mild force to disperse the crowd. Marking the first roza of holy #Ramadan month, a famous eatery announced #FreeHaleem for 1 hour today. Hundreds of people gathered outside their outlet, which led to #TrafficJam.#Ramadan2024 pic.twitter.com/NlFYSkSkPL — Surya Reddy (@jsuryareddy) March 12, 2024 -
రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నో రెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. భగవత్ ఆశీస్సులు అందించే పవిత్ర రంజాన్ కోసం ముస్లింలు సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెల పొడుపు కనిపిస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ప్రారంభవుతుందని, మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు. రోజా (ఉపవాస దీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు(సహర్) నుంచి సూర్యాస్తమయం(ఇఫ్తార్) వరకు ఉపవాసదీక్షలు పాటిస్తారు. రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారు. దీనికి అదనంగా రాత్రి 8.30 నుంచి 10గంటల వరకు సాగే ‘తరావీహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యం: రంజాన్ మాసాన్ని దివ్య ఖురాన్ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెలలో ‘సఫిల్’ చదివితే ‘ఫరజ్’ చదివినంతగా... అంటే 70సార్లు నమాజ్ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు) ప్రాధాన్యతనిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలని నియమం. హలీం రుచులు సిద్ధం: రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వరకే పరిమితమైన హలీం దశాబ్ద కాలంగా ఆంధ్రాలోని అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో పెద్ద ఎత్తున రంజాన్ స్పెషల్ హలీం విక్రయాల కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మానవులను సంస్కరించే మాసం మానవులను సంస్కరించి మంచి మార్గంలో పయనింపజేసేందుకు రంజాన్ మాసం దోహదపడుతుంది. మానవులు ఏ విధంగా నడుచుకోవాలి, దైవం, సమాజం పట్ల ఎటువంటి బాధ్యతలను నిర్వర్తించాలనే అంశాలను కూడా ఈ మాసం తెలియజేస్తుంది. మానవాళికి సర్వశుభాలను చేకూరుస్తుంది. – షేక్ ఆసిఫ్, చైర్మన్, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ -
Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు. గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్ ద్వారానే ఇంత ఫుడ్ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. హలీమ్‌కు గులామ్.. రంజాన్ మాసంలో ఎప్పటిలాగే హలీమ్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా బిర్యానీకి క్రేజ్ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయి. మరిన్ని వంటకాలకూ డిమాండ్ రంజాన్ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్ పెరిగింది. ఈ స్పెషల్ ఐటమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. రుచులకు చిరునామాలివీ.. హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. -
విశాఖ: హలీం.. రుచికి సలాం
రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు ముస్లింలకు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలే కాదు.. అనేక పోషక విలువలున్న హలీం గుర్తుకొస్తుంది. మాంసంతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలను మిళితం చేసి గంటల కొద్దీ ఉడకబెట్టి తయారు చేసే హలీంకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా విశాఖలో హాలీం వంటకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. నెల రోజుల పాటు నగరంలోని జగదాంబ, జ్యోతి థియేటర్ జంక్షన్, అక్కయ్యపాలెం, రేసపువానిపాలెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో పాటు మసీదుల వద్ద కూడా హలీమ్ విక్రయిస్తున్నారు. ఉపవాస దీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లింలే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ వంటకం తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మన విశాఖలో జగదాంబ సెంటర్, లీలామహల్ జంక్షన్‌తో పాటు పలు ప్రాంతాల్లో హలీం సెంటర్లు వెలిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ రుచులను విశాఖ వాసులకు చూపించేందుకు అక్కడ నుంచి హలీం తయారు చేసే నిపుణులను ఇక్కడకు తీసుకొచ్చారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుమారు 14 గంటలకు పైగా ఉపవాస దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహారంతో పాటు ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోరు. ఉపవాస దీక్ష ముగించే సరికి శరీరానికి తగిన శక్తి అవసరమవుతుంది. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌తో ఉపావాస దీక్ష విరమించిన ఆ తర్వాత తీసుకునే ఆహారంలో హలీంకు ప్రాధాన్యమిస్తారు. హలీంలో మంచి పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమయ్యే గుణం ఉండడమే ఇందుకు కారణం. కేవలం సాయంత్రం లభించే హలీం రుచులను ఆస్వాదించడానికి నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముస్లింలే కాకుండా మిగిలిన వారు కూడా ఈ రుచికి సలాం అంటున్నారు. హలీం పుట్టింది అరబ్ దేశాల్లో అయినా ప్రాచూర్యం పొందింది మాత్రం హైదారాబాద్‌లోనే అని చెప్పుకొవచ్చు. అలాంటి ఈ వంటకం నేడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు తదితర 18 రకాల మసాలా దినుసులు, కొత్తిమీర, పొదీనా ఆకులు, నూనె, బాదం, పిస్తా, జీడిపప్పు తదితర డ్రైఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు, జాఫ్రాన్, సొంపు, పాలు తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. తగిన నెయ్యి, డాల్డా తీసుకుని గరమసాలన్నీ వేయించాక.. కడిగిన గోధుమ రవ్వను సమపాళ్లలో నీరు, పాలు వేసి కలుపుతారు. ఆ మిశ్రమాన్ని ఒకే ఉష్ణోగ్రతలో ఉడికిస్తారు. అప్పటికే ఉడికిన మాసం వేసి మిశ్రమాన్ని పెద్ద తెడ్డులాంటి కర్రతో రుబ్బుతూనే ఉంటారు. ఇలా ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెడితే.. సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ మిశ్రమం అంతా ముద్దగా తయారై హాలీంగా మారుతుంది. చికెన్‌తో అయితే మిశ్రమం తయారీకి సమయం తక్కువగా ఉంటుంది. మటన్‌తో అయితే సమయం ఎక్కుగా తీసుకుంటుంది. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. కద్దూ–ఖా–ఖీర్ కద్దూ–కా– ఖీర్ హలీం తర్వాత స్వీకరించే అత్యంత రుచికరమైన స్వీట్. ఆనపకాయ, సెమీయా, సగ్గు బియ్యం, పంచదారతో ఈ తియ్యని పదార్థాన్ని (పాయసం) తయారు చేస్తారు. ఉపవాస దీక్ష ఆచరించిన వారికి శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఈ పాయసం ఎంతో ఉపయోగపడుతుంది. కూలింగ్‌లో పెట్టుకుని.. హలీం తర్వాత ఈ స్వీట్ తింటే మధురానుభూతి పొందుతారు. -
Haleem: నోరూరించే హలీం ఎలా తయారు చేస్తారో తెలుసా?
సాక్షి, కరీంనగర్: హలీం.. రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ముస్లింల సంప్రదాయ వంటకంగా పేరొందినా.. కాలక్రమంలో అన్ని మతాలవారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోనూ హైదరాబాద్ రుచిని మరిపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. రుచికి సలాం..! ఇరాన్‌కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో హైదరాబాద్‌లోని మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించాడు. తర్వాత కాలంలో 1956లో రంజాన్‌మాసం ప్రారంభమైన తొలిరోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి 25పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది. తొలిరోజుల్లో అంతగా ఆదరణ లభించకపోవడంతో బిర్యానీకి హలీం ఫ్రీ అని ప్రకటించారు. తర్వాత సంవత్సరం హలీం విశిష్ఠతను తెలియజేస్తు పోస్టుకార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న అడ్రస్‌లకు పోస్టుకార్డులు రాశారు. దీంతో కొంత మేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టుకార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే సంవత్సరం హుస్సేన్ మరణించాడు. ఇలా తయారు చేస్తారు.. గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ (బోన్‌లెస్), పుట్నాల పప్పు (తినే శెనగ పప్పు), గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తివీుర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకూ పొడవైన కర్రలతో రుబ్బుతారు. కరీంనగర్లో 5 క్వింటాళ్ల హలీం కరీంనగర్ నగరవ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజూ 5 క్వింటాళ్ల హలీం తయారు చేస్తుండగా విక్రయాలతో రోజూ రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో రూ.5లక్షల వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాళ్ల మేక మాసం ఉపయోగిస్తుండగా హరీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసం అవసరం అవుతుంది. రోజూ ఒక్కో హలీం సెంటర్లో 15 నుంచి 50కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హరీస్‌ను తయారు చేస్తారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్యంగా 20 హలీం సెంటర్లు ఉండాగా వాటిలో అధిక భాగం గోదావరిఖనిలో ఉన్నాయి. రోజూ రెండు క్వింటాళ్ల హరీస్ విక్రయాలు జరుగుతుండగా, 500 కిలోల హలీం అమ్మకాలు సాగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో రెండు, వేములవాడలో రెండు హలీం కేంద్రాలున్నాయి. నాలుగు కేంద్రాల్లో మొత్తం 60 కిలోల హరీస్, 20కిలోల హలీం అమ్మకాలు జరుగుతాయి. ఇక జగిత్యాల జిల్లా పరిధిలో మొత్తం 20 హలీం సెంటర్లు ఉండగా అత్యధికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఈ సెంటర్లలో మొత్తం 10 క్వింటాళ్ల హరీస్ అమ్మకాలు జరుగుతాయి. -
రంజాన్ వేళ.. బిర్యానీ, హాలీం ప్రియుల సందడి (ఫొటోలు)
-
వెజిటేరియన్ హలీమ్.. ఎలా చేయాలో తెలుసా?
కావలసినవి: వేయించిన ఉల్లిపాయ తరుగు – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పాలు – కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, గులాబీ రేకులు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అరకప్పు, ఓట్స్ – పావు కప్పు, బాదం – ఆరు, పచ్చిశనగపప్పు – టీస్పూను, ఎర్ర కందిపప్పు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పెసరపప్పు – టీస్పూను, నువ్వులు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, లవంగాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, యాలకులు – ఎనిమిది, షాజీరా – టేబుల్ స్పూను, తోకమిరియాలు – టీస్పూను, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, పుదీనా తరుగు – టేబుల్ స్పూను, సన్నగా తరిగిన జీడిపప్పు – 20 గ్రా., పిస్తా పలుకులు – 20 గ్రా., బాదం పలుకులు – 20 గ్రా., మీల్మేకర్ – 100 గ్రా., నిమ్మరసం – టీస్పూను. తయారీ: ► ముందుగా మీల్‌మేకర్‌ను ఇరవై నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. నానాక బరకగా రుబ్బుకోవాలి. ► మిక్సీజార్‌లో.. తోక మిరియాలు, షాహజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులన్నీ, ఆరు బాదం పప్పులు, ఓట్స్, గోధుమ రవ్వ, నువ్వులు అన్నీ కలిపి పొడిచేయాలి. ► స్టవ్ మీద కుకర్ గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇవివేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బరకగా గ్రైండ్ చేసిన మీల్ మేకర్ మిశ్రమాన్ని కలపాలి. ►ఇప్పుడు పెరుగు, పాలు, గులాబి రేకులు, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలిపి, పొడిచేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటమీద ఉడికించాలి. ►ఉడికిన మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు చూసి చూసి వేసుకుంటే వేడివేడి వెజ్ హలీమ్ రెడీ. -
హైదరాబాదీ మటన్ హలీమ్‌ని ఇలా చేసుకొని తింటే..
రంజాన్ మాసంలో రోజా ఉన్నవారంతా ఉపవాస దీక్ష ముగించాక, బలవర్థక ఆహారం తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారంలో హలీమ్ ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను రోజా ఉన్నవారే గాక, ఇతరులు కూడా ఇష్టంగా తింటారు. మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే హలీమ్‌ను ఇంట్లో ఎలా వండుకోవచ్చో చూద్దాం. కావలసినవి: మటన్ ఖీమా – ముప్పావు కేజీ, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – అర టేబుల్ స్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, సోంపు – టేబుల్ స్పూను, ► మిరియాలు – టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, గోధుమ రవ్వ – అరకప్పు, మినప్పప్పు – టేబుల్ స్పూను, కందిపప్పు – టేబుల్ స్పూను, పచ్చిశనగ పప్పు – టేబుల్ స్పూను, పెసరపప్పు – టేబుల్ స్పూను, బియ్యం – టేబుల్‌స్పూను. ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, ►ఉల్లిపాయలు – నాలుగు( సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు – పావుకప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు – రెండు, మిరియాలపొడి – అర టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, పెరుగు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ గార్నిష్‌కు సరిపడా. తయారీ: ∙కుకర్ గిన్నెలో మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి. ►దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి కలిపి, సన్నని మంటమీద ఐదారు విజిల్స్ రానివ్వాలి. ►మరో కుకర్ గిన్నెతీసుకుని గోధుమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►ఉడికిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి ►సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి. ►ఇవన్నీ వేగాక మిరియాలపొడి, పసుపు, పెరుగు ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. -
ధరల కొలిమిలో హలీం.. తినే ఉత్సాహం, మూడు మాటాష్!
చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు. ఇవి వాడతారు? ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు. ఇలా పెరిగాయి.. ► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. గత రెండేళ్లలో కరోనా ప్రభావం.. 2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గిన గిరాకీ.. పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండ్రోజులకోసారే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా. – షేక్ నదీం, శాలిబండ తినడం మానేశా.. ప్రతి రంజాన్‌లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్‌లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది. – ఫహీం, అలీనగర్ -
తింటే.. వదలరంతే.. ఏటా రూ.కోటి వ్యాపారం
సాక్షి, భీమవరం (ప్రకాశంచౌక్): రంజాన్ మాసంలో దర్శనమిచ్చే ప్రత్యేక వంటకం హలీమ్. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా దీనిని ఇష్టపడుతుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్నవారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. దీంతో ఏటా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటుచేసి హలీమ్ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. జిల్లాలో 15 ఏళ్ల నుంచి హలీమ్ విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రధానంగా భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్ అవుట్లెట్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తయారీదారులను తీసుకువచ్చి ఇక్కడ హలీమ్‌ను తయారు చేయిస్తున్నారు. వారికి నెలకు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. హలీమ్ తయారీ శ్రమతో కూడుకున్న పని. సుమారు 6 గంటలపాటు సమయం పడుతుంది. పరిసర ప్రాంతాలకు సరఫరా చికెన్, మటన్ హలీమ్‌లను తయారుచేస్తారు. వీటిని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుండటంతో హలీమ్ సెంటర్లకు జనం క్యూకడుతున్నారు. దీంతో ఏటేటా జిల్లాలో హలీమ్ విక్రయాలు పెరుగుతున్నాయి. భీమవరం, ఏలూరు కేంద్రాలుగా హలీమ్‌ను తయారుచేసి పరిసర ప్రాంతాలకు సరఫరా చేసి అక్కడ ఏర్పాటుచేసిన అవుట్లెట్లలో విక్రయిస్తున్నారు. భీమవరం కేంద్రంగా నరసాపురం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాలకు హలీమ్‌ను సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.కోటి: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఏటా రూ.కోటికి పైగా హలీమ్ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజులపాటు ఒక్కో హలీమ్ కేంద్రంలో ఐదుగురి నుంచి ఆరుగురు ఉపాధి పొందుతున్నారు. నాకు చాలా ఇష్టం నాకు హలీమ్ అంటే చాలా ఇష్టం. రంజాన్ మాసంలో ఎక్కువ సార్లు తింటాను. ఏటా హలీమ్ కోసం ఎదురుచూస్తుంటా. భీమవరంలో హలీమ్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్ హలీమ్ రెండూ కూడా నాకు ఇష్టం. – ఎస్కే.షాజహన్, భీమవరం ఏటా ఏర్పాటు చేస్తున్నాం భీమవరం పెద్ద మసీద్ సెంటర్ వద్ద ఏటా హలీమ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. హలీమ్ తయారీలో చేయి తిరిగిన వారిని హైదరాబాద్ నుంచి తీసుకువస్తాం. భీమవరంలో హలీమ్‌ను చాలా ఇష్టంగా తింటున్నారు. వ్యాపారం బాగుంది. – ఎస్కే బాబు, హలీమ్ సెంటర్ నిర్వాహకులు, భీమవరం -
హలీమ్‌కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. –మదనపల్లె సిటీ / రాయచోటిటౌన్ / రాజంపేటటౌన్ హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ’తయారీ ప్రత్యేకమే.... సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు ► మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ► రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. గతంలో హైదరాబాదుకు ఎవరైనా వెళితే వారితో ప్రత్యేకంగా తెప్పించుకునే వాడిని. ఇప్పుడు ఇక్కడే దొరుకుతుండటంతో ప్రతిరోజు సంతోషంగా ఆరగిస్తున్నాను. – మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె. ’క్వాలిటీలో రాజీపడకుండా తయారీ.. హలీం వంటకంపై ఆహారప్రియులకు ఓ విశేషమైన అభిప్రాయం ఉంది. వారి అంచనాలకు తగ్గట్లుగా హలీంను తయారుచేస్తేనే ఆదరణ ఉంటుంది. అందుకే తయారీలో ఏమాత్రం రాజీపడకుండా నాణ్యమైన దినుసులను, స్వచ్ఛమైన పదార్థాలను వాడుతూ ప్రజలకు నాణ్యమైన వంటకాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు దీనిపై మక్కువ చూపడమే కాకుండా ఆహారంగా తీసుకునేందకు ఆసక్తి కనపరుస్తున్నారు. – చాంద్‌బాషా, షాన్ కేటరింగ్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం రుచికి ఉన్న పేరును దృష్టిలో ఉంచుకొని దీని తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అందువల్ల టేస్ట్ విషయంలో ఎక్కడ కూడా రాజీపడటం లేదు. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న వారికి హలీం మంచి శక్తిని ఇస్తుంది. – డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
హలీమ్ కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. మదనపల్లె సిటీ/రాయచోటిటౌన్ / రాజంపేట టౌన్: హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ►మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ►రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. ►రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. హలీం తయారీలో నిమగ్నుడైన వంట కార్మికుడు , హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు 8 తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పు లు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. – మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. – డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
ఆహా.. హలీం: భలే టేస్ట్ గురూ
తెనాలి/పాతగుంటూరు: రంజాన్ నెల రాగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఈ పేరు వినగానే మాంసప్రియుల నోరు రసార్ణమవుతుంది. మధుర పదార్థాల మేళవింపుతో.. ఘుమఘుమలాడుతూ.. నోటికి సరికొత్త రుచులనందించే ఈ ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదించేందుకు ఆహారప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. వెయ్యిమందికి ఉపాధి రంజాన్ నెలలో రోజంతా ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉండే హలీం తప్పనిసరిగా తీసుకుంటారు. దీనివల్ల నీరసించిన శరీరానికి వెంటనే శక్తి వస్తుందని చెబుతారు. ఇరాన్ నుంచి దిగుమతి అయిన ఈ వంటకాన్ని హైదరాబాదీయులు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు జోడించి మరింత రుచికరం చేశారు. దాదాపు 20ఏళ్ల క్రితం హలీం ఘుమఘుమలు గుంటూరు వాసులను పలరించాయి. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. ప్రస్తుతం గుంటూరు, తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్లలో వీటి తయారీ కేంద్రాలు, అమ్మకం పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా సుమారు వెయ్యిమందికి ఉపాధి లభిస్తోందని అంచనా. ఏటా రంజాన్ నెలలో హలీం ద్వారా రూ.12కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని సమాచారం. తెనాలిలో హలీం తయారీ వాడే పదార్థాలివీ.. గొర్రెపోతు మాంసంతో చేసిన హలీంకు జిల్లాలో ఆదరణ ఎక్కువ. ఆ మాంసంతోపాటు గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ, నెయ్యి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర, జీలకర్ర, పచ్చి మిర్చి, కొత్తిమీరతో సహా 21 వస్తువులతో హలీం తయారు చేస్తారు. ప్లేటు రూ.100 కొన్నిచోట్ల హలీం తయారీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంట మాస్టర్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ప్లేటు రూ.100, అర కిలో రూ.200, కిలో రూ.400కు విక్రయిస్తున్నారు. బలవర్ధకం కూడా హలీం అంటే ఎంతో ఇష్టం. ఇది రుచికరమే కాదు.. బలవర్ధకం కూడా. కరోనా వల్ల గత రెండేళ్లు రుచిచూడలేకపోయా. ఈ ఏడాది అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. – షేక్ అహ్మద్ హుస్సేన్, తెనాలి గిరాకీ పెరిగింది గుంటూరు నగరంలో ఎన్నాళ్ల నుంచో హలీం తయారు చేస్తున్నాను. అప్పట్లో ప్లేటు రూ.25 ఉండేది. కాలక్రమేణా సరుకుల ధరలు పెరిగాయి. హలీం ప్రియులూ పెరిగారు. ప్రస్తుతం ప్లేటు రూ.100కు విక్రయిస్తున్నాం. ఏడాదిలో ఒక నెల మాత్రమే తయారు చేస్తుండటంతో వినియోగం బాగా పెరిగింది. చాలామంది వస్తున్నారు. – మహమ్మద్ జాఫర్, నిర్వాహకుడు, గుంటూరు ఎంతో ఇష్టం హలీం అంటే నాకు ఎంతో ఇష్టం. రంజాన్ నెలలో దీనిని ఇంటిల్లిపాదీ రుచి చూస్తుంటాం. హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. దీంతోపాటు ఈనెలలో చికెన్ తందూరీ, ఫలుదాను ఆరగిస్తుంటాం. – సాధిక్, హలీం ప్రియుడు, గుంటూరు గుంటూరుకు పరిచయం చేసింది నేనే హైదరాబాద్ హలీంను గుంటూరుకు పరిచయం చేసింది నేనే. 20 ఏళ్ల క్రితం వంటవాళ్లను తీసుకొచ్చి హలీం రుచులను నగరవాసులకు చూపించాను. తెనాలిలో ఏటా రంజాన్ నెలలో హలీమ్ వ్యాపారం చేస్తున్నా. కరోనా వల్ల రెండేళ్లుగా వీలుపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆరంభించా. చాలా సంతోషంగా ఉంది. – షేక్ అబ్దుల్ వహీద్, తెనాలి -
హోమ్ మేడ్... మటన్ హలీమ్
కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ –500 గ్రాములు; నెయ్యి– అరకప్పు; జీలకర్ర – ఒకస్పూన్; తోక మిరియాలు –ఒకస్పూన్; దాల్చిన చెక్క –మీడియం సైజు ఒకటి; లవంగాలు – మూడు; సాజిరా –ఒక స్పూన్; యాలకులు – మూడు; పెద్ద ఉల్లిపాయలు –మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు –రెండు స్పూన్లు; గరం మసాల–ఒక స్పూన్; పచ్చిమిర్చి –నాలుగు; పెరుగు –ఒక కప్పు; పసుపు –ఒక స్పూను; గోధుమ రవ్వ –ఒకటిన్నర కప్పు; శనగపప్పు –ఒకస్పూన్; పెసరపప్పు –ఒక స్పూన్; ఎర్ర పప్పు(మసూరి పప్పు) –ఒక స్పూన్; కొత్తిమీర – మీడియం సైజు కట్ట ఒకటి; పుదీనా – మీడియం సైజు కట్ట ఒకటి; నిమ్మకాయ –ఒకటి; అల్లం –చిన్న ముక్క; నీళ్లు– 12 కప్పులు; ఉప్పు – తగినంత; జీడిపలుకులు– కొద్దిగా. తయారీ విధానం: ► ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. రాత్రి నానపెట్టుకోవడం కుదరనివారు కనీసం రెండు గంటలైనా నానపెట్టాలి. తరువాత మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, గరం మసాల వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలపాటు నెయ్యిలో మటన్ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. ► మటన్ ఉడికిన తరువాత చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, జీలకర్ర, సాజిరా వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్‌ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గోధుమ రవ్వ, పప్పులన్నింటిని కలిపి గ్రైండ్ చేసిన ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి కలిపితే హలీమ్ తయారైనట్లే. స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పలుకులను పైన చల్లి వడ్డిస్తే హలీమ్ చాలా రుచిగా ఉంటుంది. -
నగరంలో హలీమ్ సందడి...
-
హలీమ్.. వియ్ వాంట్ యూ..
హలీమ్...రంజాన్ సీజన్లో నగరవాసులను మురిపించే వంటకం. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది దీన్ని మిస్సవుతున్నామని చాలా మంది ఫీలవుతున్నారు. కొందరు డైహార్డ్ హలీమ్ ఫ్యాన్స్ మాత్రం మిస్సయ్యే ఛాన్సే లేదంటూ కొత్తదారులు వెతుక్కుంటున్నారు. హోమ్ చెఫ్స్‌ను సంప్రదిస్తూ హోమ్ మేడ్ హలీంను రుచి చూస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ కొందరు హలీమ్‌ను విక్రయిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, హైదరాబాద్ : అరబ్ పర్షియన్ ప్రాంత మూలాలున్న వంటకమైనప్పటికీ స్థానిక ముడిదినుసులు, సుగంధ ద్రవ్యాలతో హైదరాబాదీ హలీమ్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోనే జియోగ్రాఫిక్ ఇండికేషన్(జిఐ) సర్టిఫికెట్ అందుకున్న తొలి మాంసాహార వంటకం హైదరాబాద్ హలీమ్. దేశవిదేశాలకు సైతం హలీమ్ ఎగుమతులు చేస్తున్న మన నగరంలో 50ఏళ్లుగా హలీమ్ లభించని తొలి ఏడాది ఇదే. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హలీమ్ తయారు చేయబోమని ది హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్(హెచ్హెచ్ఎమ్ఏ), ట్విన్ సిటీస్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. హలీమ్‌ను అందించే దాదాపు 6వేల రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ ఇవన్నీ కలిపి ఈ ఏడాది రూ.500 కోట్ల విలువైన హలీమ్ విక్రయాలను కోల్పోయినట్టు అంచనా. (లాక్డౌన్: తీవ్ర నిరాశలో హలీమ్ ప్రియులు) రంజాన్ పండుగ గురించి ముస్లిం సమాజం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ సమయంలో మాత్రమే అందుబాటులోకి వచ్చే హలీమ్ గురించి హైదరాబాద్ మొత్తం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏడాదికి ఒకే ఒక్కసారి తమను పలకరించి జిహ్వలను పులకరింపజేసే హలీమ్ కోసం ఏడాది మొత్తం వెయిట్ చేసే ఫుడ్ లవర్స్ ఆశలపై ఈ సారి కరోనా నీళ్లు చల్లింది. మొత్తం మీద పండుగ ముగిసే సమయంలో ఫుడ్ డోర్ డెలివరీకి ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో హలీమ్ ఫ్యాన్స్‌కు ఊపొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాలి. అంతమాత్రాన సిటిజనులు పూర్తిగా హలీమ్‌కు దూరంగా లేరని సమాచారం. లాక్‌డవున్ టైమ్‌లో హలీమ్ హంటర్స్ ఏం చేశారు? ఓ రౌండప్.. – సాక్షి, సిటీబ్యూరో హోమ్ చెఫ్స్.. హలీమ్ రెడీ.. మరోవైపు ఎలాగైనా హలీమ్ తినాల్సిందే అన్నట్టు ఆరాటం చూపే వారి కోసం నగరంలో కొందరు హలీమ్ తయారీదార్లు, హోమ్చెఫ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. బంజారాహిల్స్‌కు చెందిన ఓ హోమ్చెఫ్ ఈ నెల 15 నుంచి హలీమ్ విక్రయించడానికి నిర్ణయించగా, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని రోజుకు కనీసం 30 ఆర్డర్లు సర్వ్ చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ వరకూ డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. వీరిలో కొందరు అదనపు ఛార్జీలతో డోర్ డెలివరీ చేస్తుండగా మరికొందరు కస్టమర్లే వచ్చి తీసుకెళ్లాలని కోరుతున్నారు. కాస్త పేరున్న వారి దగ్గర కొనాలంటే ఒక హలీమ్ రూ.300.. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ.1000 ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. అలాగే హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న ఫుడ్ జాయింట్ కొన్ని రోజులుగా హలీమ్ తయారు చేసి 3 కి.మీ పరిధిలో అందిస్తోంది. రోజుకు 40 కిలోల దాకా మటన్ హలీమ్‌ను విక్రయిస్తున్నట్టు సమాచారం. (మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం) మార్కెట్ ఉండాలే గానీ మార్గాలనేకం.. కొందరు ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్స్ ద్వారా కస్టమర్లకు చేరువవుతుంటే చాలామంది మౌత్ టాక్ ద్వారానే బిజినెస్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హలీమ్ విక్రయిస్తున్న టోలీచౌకికి చెందిన మహిళా చెఫ్ తాను నగదు చెల్లింపులను అంగీకరించడం లేదన్నారు. అపరిచితులు తనకు వేరే మార్గాల ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తేనే సరుకు అందిస్తామన్నారు. కొన్ని హోటళ్లు బాహాటంగానే తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రచారం చేస్తూ హలీమ్‌ను అందిస్తున్నాయి. పైగా తమకు ఎస్సెన్షియల్ సర్వీసెస్ పాస్ ఉందంటోంది. అయితే వంటకాలు తయారు చేసి విక్రయాలు జరపడం చట్టవ్యతిరేకమని తాజాగా హలీమ్ విక్రయించిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న మొఘల్‌పురా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ హలీమ్ కొనడం ప్రమాదకరమని నగరానికి చెందిన పిస్తాహౌజ్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అత్యధిక కేసులు నమోదైన జియాగూడ నుంచే వీరిలో ఎక్కువ మంది జంతు మాంసం కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్లోకి నటుడు ) ఇల్లే పదిలం.. ఈ నేపథ్యంలో పలువురు హలీమ్ ప్రియులు ఇంట్లోనే హలీమ్‌ను తయారు చేసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ‘ఏటేటా హలీమ్‌ను మిస్సవ్వకుండా టేస్ట్ చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది కుదరకపోవడంతో ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది’ అని చెప్పారు నగరానికి చెందిన రాజేశ్వరి కరణమ్. హలీమ్ పట్ల ఇంట్లో ఉండే మగవారి ఇష్టం తెలిసున్న కొందరు మహిళలు కష్టపడి నేర్చుకుని మరీ అందిస్తున్నారు. ‘మా అమ్మాయి ఈ ఏడాది నా కోసం మటన్ హలీమ్ చేసి పెట్టింది చాలా అద్భుతంగా అనిపించింది’ అంటూ యూసఫ్‌గూడలో నివసించే రాంబాబు వర్మ ఆనందం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన హలీమ్‌ని ఈ సారి మిస్ అవకూడదని కష్టపడి యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని, తాను చేసిన చికెన్ హలీమ్‌ని ఇంటిల్లిపాదీ ఆస్వాదించారని చందానగర్ వాసి డేనియల్ అంటున్నాడు. -
లాక్డౌన్: తీవ్ర నిరాశలో హలీమ్ ప్రియులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ హలీమ్ ప్రియులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. లాక్డౌన్ కారణంగా రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని చెప్పడంతో హలీమ్ తయారీదారులు వెనకడుగేశారు. కానీ, లాక్డౌన్ సడలింపుల్లో ఏదైనా అవకాశం ఉంటుందేమోనన్న హలీమ్ ప్రియుల ఆశలు పూర్తిగా అడియాశలు అయ్యాయి. మామూలుగా రంజాన్ నెల ప్రారంభం కాగానే హలీమ్ కోసం జనాలు హోటళ్ల ముందు క్యూ కట్టేవారు. ఇంట్లో చేసుకోవటానికి వీలులేకో లేదా బయట షాపుల్లో అమ్మేంతగా రుచిగా ఇళ్లలో వండకో హలీమ్ దుకాణాల ముందుకు చేరేవారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాకడౌన్ కారణంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన హలీమ్ అమ్మే ప్రముఖ దుకాణాలు సైతం చేతులెత్తేశాయ్. ఈ సంవత్సరం హలీమ్ అమ్మటం లేదని స్పష్టం చేశాయి. ( దలీమ్‌గా మారుతోన్న హలీం ) కొద్ది రోజుల క్రితం పిస్తా హౌస్ యజమాని, హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అబ్ధుల్ మజీద్ మాట్లాడుతూ.. ‘‘ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 6వేల మంది హలీమ్ తయారీదారులు ఈ సంవత్సరం హలీమ్ అమ్మకూడదని నిర్ణయించాము. లాక్డౌన్లో ప్రభుత్వానికి సహకరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రజల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని హలీమ్ అమ్మడాన్ని రద్దు చేసుకున్నా’’మని చెప్పారు. అయితే బయట హలీమ్ దొరక్కపోయినా ఇంట్లోనే ఉండి రుచికరమైన, సురక్షితమైన హలీమ్‌ను తయారుచేసుకోవటం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. -
ఇప్పటికింతే.. మళ్లీ వచ్చే ఏడాదే!
-
సారీ.. హలీమ్
హలీమ్.. ఈ పేరు వినగానే జిహ్వ జివ్వుమంటుంది. నోరు రసార్ణవమవుతుంది. లాగిస్తుంటే మరింత లాగించాలనిపిస్తుంది. రుచుల సంగమానికి చిరునామా ఇది. మధుర పదార్థాల మేళవింపు ఇది. బలవర్ధక, పోషకాల పోహళింపు ఇది. కులమతాలకు అతీతంగా ఆనందంగా ఆరగించే అరుదైన వంటకం ఇది. హైదరాబాద్ హలీమ్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. సినీ తారల నుంచి సామాన్యుల దాకా.. క్రికెట్ స్టార్ల నుంచి గల్లీ ఆటగాళ్ల దాకా.. అమాత్యుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల దాకా.. ఎంపీలు.. ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల దాకా.. ఇలా ఒకరేమిటి ఎందరో.. ఎందరెందరో హలీమ్ ప్రియులే. కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్‌ను ఆనందంగా ఆరగిస్తూ సరదాగా గడుపుతారు. ఇది ఒకవైపు.. మరోవైపు ప్రస్తుతం కరోనా మహమ్మారి నగరాన్ని వణికిస్తోంది. హలీమ్ ఘుమఘుమల మధురిమలకు లాక్డౌన్ చెక్ పెట్టింది. విందుకు, బహు పసందుకు ఈసారి నోచుకోని పరిస్థితి నెలకొంది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని చెప్పడంతో హలీమ్ తయారీదారులు వెనుకడుగు వేశారు. ఇది వేలాదిమంది ఉపాధిపై ప్రభావం చూపనుంది. కోట్లాది రూపాయల వ్యాపారం కుదేల్ కానుంది. చార్మినార్: హలీమ్ పర్షియా వంటకం. కుతుబ్‌షాహిల కాలంలో మనకు పరిచయమైందీ వంటకం. ప్రస్తుతం ఇరానీయులు సైతం పాతబస్తీ హలీమ్ కోసం ఆరాటపడుతుంటారు. నగరంలోని పలువురు సినీ నటులు, క్రికెట్ స్టార్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్ తినేందుకు వస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హైదరాబాద్ హలీమ్‌పై కోవిడ్–19 ప్రభావం పడింది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు తదితర కార్యక్రమాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేయడంతో హలీమ్ తయారీ నిలిపివేయాలని నిర్వాహకులు భావించారు. ప్రస్తుతం నగరంలో హలీమ్ తయారీ నిలిచిపోతుండటంతో ఇక దేశంలోని ఢిల్లీ, కలకత్తా, ముంబై, పుణె, బెంగళూర్, త్రివేండ్రం, కోయంబత్తూర్, చెన్నై, విజయవాడ తదితర నగరాలకు ఈసారి పాతబస్తీ నుంచి హలీమ్ సరఫరా ఉండదు. ప్రతి రంజాన్ మాసంలో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు పాతబస్తీ నుంచి హలీమ్ ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి ఈ నగరాలకు కూడా హైదరాబాద్ హలీమ్ అందుబాటులో ఉండదు. అంతేగాకుండా స్విగ్గీ, జోమాటో తదితర ఆన్లైన్ డెలివరీలు కూడా ఉండవు. కార్మికుల జీవనోపాధిపై ఎఫెక్ట్ కోట్లాది రూపాయల వ్యాపారం దెబ్బతింటోంది. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోనున్నారు. దీని ప్రభావం అన్ని అనుబంధ వ్యాపారాలపై పడనుంది. నెలరోజుల పాటు జంటనగరాల్లోని దాదాపు 4 వేల హోటల్స్‌లలో ఈ హలీమ్ తయారీ నిలిచిపోనుంది. రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు మరో తాత్కాలిక ఉద్యోగాలను నిర్వహించే మరో లక్ష మందికి జీవనోపాధి కష్టకాలంగా మారనుంది. రంజాన్ మాసంలో తమ మేకపోతులు, మేకలకు మరింత డిమాండ్ ఉంటుందని తెలంగాణ జిల్లాలోని రైతులు ఆశపడుతుంటారు. హలీమ్ తయారీలో పొట్టేలు, మేక మాసం ఎక్కువగా వినియోగిస్తుండటంతో రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. హలీమ్ మేకర్స్ తమకు కావాల్సిన మాంసాన్ని స్లాటర్ హౌజ్‌ల నుంచి ఖరీదు చేసి హలీమ్ తయారు చేస్తుంటారు. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు రంజాన్ మాసంలో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్‌లో హలీమ్‌ను తింటారు. పోషక విలువలు అధికంగా ఉండే హలీమ్ తినడం ద్వారా శరీరంలో కేలరీలు పెరిగి వెంటనే శక్తి వస్తుంది. హలీమ్ తిన్న అనంతరమే బిర్యానీ, ఇతర పిండివంటలను ఆరగిస్తారు. దీంతో రంజాన్ మాసంలో హలీమ్‌కు ఎంతో గిరాకీ. పిస్తాహౌజ్ తయారు చేసే ప్రత్యేక హలీమ్ రుచి చూసేందుకు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం అమెరికా, దుబాయ్‌లలో పిస్తాహౌజ్ హోటల్స్ ఏర్పాటు చేసి అక్కడే హలీమ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన స్వచ్ఛమైన నేతి, పొట్టేలు మాంసంతో హలీమ్ తయారవుతుంది. హలీమ్ తిని.. ఇఫ్తార్ ముగింపు ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో నోరూరించే రంజాన్ వంటకాలను ఇష్టంగా తింటారు. పిండి వంటలు, శాఖాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. కర్జూరంతో ఉపవాస దీక్షలను వదిలి అన్ని రకాల పళ్లను తీసుకుంటారు. అనంతరం హలీమ్‌ను ఆరగిస్తారు. హలీమ్ తినందే.. ఇఫ్తార్ విందును ముగించరు. అందుకే హలీమ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది పిస్తాహౌజ్ హలీమ్‌లో బ్లాక్‌రైస్ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసే బ్లాక్‌రైస్‌ను మొదటిసారి పిస్తాహౌజ్ యజమాన్యం 2019లో రంజాన్ మాసం సందర్భంగా హలీమ్‌లో వినియోగించారు. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు బ్లాక్రైస్తో తయారు చేసిన హలీమ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా మారిందని పిస్తాహౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ మాజిద్ తెలిపారు. ఇదీ స్పెషల్ ♦ గత 40 ఏళ్లలో హలీమ్ తయారు చేయకపోవడం ఇదే తొలిసారి ♦ ఈ వంటకాన్ని వండేవారు సుమారు 6వేల మందికిపైగా.. ♦ యూఎస్, యూరప్, గల్ఫ్ తదితర దేశాలకు యేటా ఎగుమతి ♦ దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల దాకా వ్యాపారం ♦ రంజాన్ సీజన్లో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు ♦ సిటీలో హలీమ్ ధర రూ.140– రూ.170 కొన్నిచోట్ల రూ.200పైనే ♦ జంట నగరాల్లో దాదాపు 4 వేల హోటళ్లలో నిలిపివేత ♦ నిర్ణయం తీసుకున్న సుమారు 22 హోటళ్ల యజమానులు ♦ 21 వస్తువులతో హలీమ్ తయారీ.. ఇలాచీ, దాల్చిని చెక్క, లవంగం, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, కాజు, వేయించిన ఉల్లిగడ్డ, కొత్తమీర తదితర 21 వస్తువులతో ఈ హలీమ్‌ను తయారు చేస్తారు. ఔషధ గుణాలు కలిగిన ఈ ముడిసరుకులను ఎక్కువగా కేరళ రాష్ట్రంతో పాటు ముంబై, ఢిల్లీ నగరాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా నాణ్యమైన షాజిరాను ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి తెప్పించుకుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో హలీమ్ తయారీకి వినియోగించే ఈ 21 రకాల స్పైసీస్ సకాలంలో అందుబాటులో ఉండవని హలీమ్ మేకర్స్ ఉంటున్నారు. దిగుమతుల్లో చాలా ఆంక్షలు ఉండబోతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు మసాల దినుసులు అందుబాటులో ఉండవని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గోధుమలతో పాటు పొట్టేలు మాంసాన్ని డేక్చా నీటిలో ఉడక బెట్టి.. ప్రత్యేకంగా తయారు చేసిన పొడవాటి కర్రలతో గిలక్కొడతారు. గంటల తరబడి గోధుమలు, మాంసాన్ని మెత్తగా చేసిన అనంతరం మసాల దినుసులను వేసి గిలక్కొడతారు. ఇలా తయారైన మిశ్రమంలో నెయ్యి, కొత్తిమీర, వేయించిన ఉల్లిగడ్డలు వేసి వేడివేడిగా తయారు చేస్తారు. తక్షణ శక్తి ఇచ్చే డ్రైఫ్రూట్స్, ఫలాలు రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించే ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. ఉపవాస దీక్షల అనంతరం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందులో తక్షణం శక్తినిచ్చే కర్జూరం, అంజీర్, కిస్మిస్, వాల్నట్, ఆక్రోట్, బాదం తదితర డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉండటమే కారుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు. తెల్లవారు జామున సహార్‌లో కోకోనట్ వాటర్‌లో బనానా మిక్స్ చేసుకుని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను మెయింటన్ చేస్తాయంటున్నారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పూర్తిస్థాయి మినరల్స్ ఉంటాయంటున్నారు. ఇక సి విటమిన్ కోసం మోసంబీ, సంత్రా, ఉసిరి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సి విటమిన్ ఎంతో అవసరం అంటున్నారు. సోషల్ డిస్టెన్స్..ముడిసరుకు కొరత.. సామాజిక దూరం, హలీమ్ తయారీ ముడిసరుకు కొరత తదితర కారణాలతో హలీమ్ తయారు చేసేందుకు హలీమ్ మేకర్స్ నిరాకరిస్తున్నారు. ప్రజల రక్షణ ముఖ్యమని, హలీమ్ ఖరీదు చేయడం కోసం ప్రజలు గుంపులుగా ఎగబడటం సామాజిక దూరం పాటించకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయని.. అందుకే ఈ ఏడాది హలీమ్ వంటకాలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ మాజిద్, జంట నగరాల హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాఫర్ అజీజ్‌ల అధ్యక్షతన సోమవారం రాత్రి పాతబస్తీలో అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో జంటనగరాలకు చెందిన మేజర్ 22 హోటల్స్ యజమానులు, నిర్వాహకులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేవి తీసుకోవాలి.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారంతో పాటు తక్షణం శక్తినిచ్చే పండ్లు, ఫలాలు, డ్రైఫ్రూట్స్ విరివిగా తీసుకోవాలి. పొద్దంతా ఉపవాస దీక్షలో ఉండే వారి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ మెయింటనెన్స్ ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన మినరల్స్ ఉండే పండ్లు, ఫలాలు ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి. హలీం తినకపోయినా.. పర్వాలేదు.. కానీ పండ్లు, ఫలాలు అధిక మొత్తంలో తీసుకోవాలి. శరీరానికి సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ఉపవాస దీక్షలోని ప్రజలు ప్రయత్నించాలి. – డాక్టర్ సురేందర్శర్మ, ఆయుర్వేద వైద్య నిపుణులు రంజాన్ హలీం అంటే ఎంతో ఇష్టం.. హలీం అంటే ఎంతో ఇష్టం. రంజాన్ మాసంలో తయారయ్యే హలీం అంటే మహా ఇష్టం. ఏడాదికోసారి రంజాన్ మాసంలోనే హలీం తింటాం. రంజాన్ మాసంలోని హలీంకు అంత ప్రత్యేకత ఉంటుంది. రోజంతా ఉపవాస దీక్షలు చేసిన అనంతరం సాయంత్రం ఇప్తార్ విందులో హలీం తింటాం. ఇంట్లోనే కాకుండా శాలిబండలోని ఫిస్తాహౌజ్ వద్ద హలీం ఖరీదు చేసి తినడం ఎంతో బాగుంటుంది. ఒక్కోసారి రెండు, మూడు ప్లేట్లు తిన్న సందర్భాలున్నాయి. ఈసారి హలీం లేదంటే బాధగా ఉంది. వీధుల్లో కాలక్షేపం చేస్తూ హలీం తినడం అలవాటుగా మారింది – మహ్మద్ ఇస్మాయిల్, ఖాజీపురా వ్యాపారం కాదు.. ప్రాణాలు ముఖ్యం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోంది. ఒకవైపు మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. ఏప్రిల్ చివరి వారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. హలీమ్ అందుబాటులో ఉంటే వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.అందుకే ఈసారి హలీమ్ తయారీని నిలిపేస్తున్నాం – మహ్మద్ అబ్దుల్ మాజీద్,హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
దలీమ్‌గా మారుతోన్న హలీం
సాక్షి, కోల్‌కతా: కార్మికులు, ఇతర వర్గాల ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉండే కోల్‌కతా నగరంలోని ఓ రోడ్డులో ‘సైకా’ రెస్టారెంట్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘బీఫ్ దలీమ్ 60 రూపాయలు, చికెన్ దలీమ్ 70, మటన్ దలీమ్ 110 రూపాయలకు ప్లేట్’ అని ఇక్కడ ఉన్న ప్రకటనను చూసిన మీడియా కూడా కించిత్తు ఆశ్చర్యానికి గురైంది. రెస్టారెంట్ లోపలికెళ్లి ‘దలీమ్’ అనే కొత్త వంటకాన్ని ప్రవేశపెట్టారా ? అని ప్రశ్నించగా, ‘కొత్తదేమీ కాదండీ, దలీమ్ అంటే పాత హలీమేనండీ’ అని యజమాని కుమారుడైన మొహమ్మద్ అస్గార్ అలీ తెలిపారు. అదేంటీ పేరెందుకు మార్చారంటూ మీడయా ప్రశ్నించగా, తామొక్కరే కాదని, నగరంలోని పలు మొఘల్ హోటళ్లు హలీమ్ పేరును దలీమ్‌గా మార్చివేశాయని, అందుకు సోషల్ మీడియానే కారణమని ఆయన తెలిపారు. ‘హలీమ్’లో అల్లా పేరు ధ్వనిస్తోందని, అలా అల్లా పేరుతో ఆహార వంటకం ఉండడం మంచిది కాదంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. హలీమ్‌ను దలీమ్‌గా మార్చడం కోల్‌కతాలోని కొన్ని హోటళ్లకే పరిమితం కాలేదు. దక్షిణాసియాలోని కొన్ని దేశాల్లో కూడా ఇలాగే పేరు మార్చారు. మార్చాలా, లేదా అన్న విషయమై పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో విస్తతంగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 2017లో కూడా హైదరాబాద్ కేంద్రంగా హలీమ్ పేరు మార్చడంపై సోషల్ మీడియా చర్చను లేవదీసింది. ఎందుకోమరి, అది అంతటితోనే ఆగిపోయింది. ఇక, దలీమ్ అని పేరే ఎందుకు పెట్టారని మీడియా ప్రశ్నించగా, దాల్‌తో తయారు చేస్తారు కనుక దలీమ్ అని నామకరణం చేసినట్లు అస్గార్ అలీ తెలిపారు. కీమాలో ఉపయోగించేది దాల్ కాదుకదా, గోధుమ గదా? అని ప్రశ్నించగా గోధుమ కూడా ఒకరకమైన దాలేనండంటూ సమాధానం ఇచ్చారు. కోల్‌కతాలో అనేక మొగులాయ్ రెస్టారెంట్ల చైన్‌ను కలిగిన హోటల్ ‘ఆర్సలన్’ మాత్రం హలీమ్ పేరును మార్చలేదు. ఇదే విషయమై ప్రశ్నించగా, ‘లాయర్‌ను ఉర్దూలో వకీల్ అని పిలుస్తాం. అల్లాకు మరో పేరు వకీల్. అంతమాత్రాన వకీల్ పేరు మారుస్తామా?’ అని హోటల్ నిర్వాహకుల్లో ఒకరైన మొహమ్మద్ గులామ్ ముస్తఫా వ్యాఖ్యానించారు. ‘రోజూ నమాజ్ చదవని వాళ్లు, ఖురాన్ గురించి తెలియని వాళ్లు, తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో సోషల్ మీడియాలో ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అవన్ని నమ్మితే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు. అరేబియా నుంచి భారత్‌కు హలీమ్ అనేది ప్రాచీన అరబ్ వంటకం. 8 శతాబ్దానికి చెందిన అబ్బాసిద్ కాలిఫత్ హయాంలో ఈ వంటకం చాలా ప్రసిద్ధి చెందినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ వంటకాన్ని ‘హరీసాహ్’ అని పిలిచేవారు. గోధుమ, మటన్ మిశ్రమాన్ని అరబ్‌లో అలా పలుకుతారట. అది భారత్‌కు వచ్చాక హలీమ్‌గా మారింది. పశ్చిమాసియా దేశాల్లో, ఇరానీలో ఈ వంటకం ఎంతో ప్రసిద్ధి. హలీమ్‌కు ప్రపంచ రాజధానిగా మన హైదరాబాద్‌ను పేర్కొంటారు. -
హలీం, పలావ్ ఈటింగ్ పోటీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్లో సోమవారం హలీమ్ – పలావ్ ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్ లాగించి భరత్ విజేతగా నిలవగా బాసిత్ అలీ రన్నరప్‌గా నిలిచాడు. 2.5 కేజీల పలావ్ ఆరగించి సౌమ్య ప్రకాష్ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్ తిని అమిత్నాయర్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. గత రెండేళ్ల నుంచి ఈటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొన్న ఆశావహులు