బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే.
అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది.
రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్‌లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్‌లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment