సాక్షి, కరీంనగర్: హలీం.. రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ముస్లింల సంప్రదాయ వంటకంగా పేరొందినా.. కాలక్రమంలో అన్ని మతాలవారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోనూ హైదరాబాద్ రుచిని మరిపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి.
రుచికి సలాం..!
ఇరాన్‌కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో హైదరాబాద్‌లోని మదీనా సర్కిల్‌లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించాడు. తర్వాత కాలంలో 1956లో రంజాన్‌మాసం ప్రారంభమైన తొలిరోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి 25పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది. తొలిరోజుల్లో అంతగా ఆదరణ లభించకపోవడంతో బిర్యానీకి హలీం ఫ్రీ అని ప్రకటించారు.
తర్వాత సంవత్సరం హలీం విశిష్ఠతను తెలియజేస్తు పోస్టుకార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న అడ్రస్‌లకు పోస్టుకార్డులు రాశారు. దీంతో కొంత మేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టుకార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి 1998 వరకు మదీనా హోటల్‌లో హలీం విక్రయాలు జరిగాయి. అదే సంవత్సరం హుస్సేన్ మరణించాడు.
ఇలా తయారు చేస్తారు..
గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ (బోన్‌లెస్), పుట్నాల పప్పు (తినే శెనగ పప్పు), గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తివీుర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకూ పొడవైన కర్రలతో రుబ్బుతారు.
కరీంనగర్‌లో 5 క్వింటాళ్ల హలీం
కరీంనగర్ నగరవ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజూ 5 క్వింటాళ్ల హలీం తయారు చేస్తుండగా విక్రయాలతో రోజూ రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో రూ.5లక్షల వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాళ్ల మేక మాసం ఉపయోగిస్తుండగా హరీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసం అవసరం అవుతుంది. రోజూ ఒక్కో హలీం సెంటర్‌లో 15 నుంచి 50కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హరీస్‌ను తయారు చేస్తారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్యంగా 20 హలీం సెంటర్లు ఉండాగా వాటిలో అధిక భాగం గోదావరిఖనిలో ఉన్నాయి. రోజూ రెండు క్వింటాళ్ల హరీస్ విక్రయాలు జరుగుతుండగా, 500 కిలోల హలీం అమ్మకాలు సాగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో రెండు, వేములవాడలో రెండు హలీం కేంద్రాలున్నాయి. నాలుగు కేంద్రాల్లో మొత్తం 60 కిలోల హరీస్, 20కిలోల హలీం అమ్మకాలు జరుగుతాయి. ఇక జగిత్యాల జిల్లా పరిధిలో మొత్తం 20 హలీం సెంటర్లు ఉండగా అత్యధికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఈ సెంటర్లలో మొత్తం 10 క్వింటాళ్ల హరీస్ అమ్మకాలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment