ramzan special
-
రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా తయారీ!
-
Haleem: నోరూరించే హలీం ఎలా తయారు చేస్తారో తెలుసా?
సాక్షి, కరీంనగర్: హలీం.. రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ముస్లింల సంప్రదాయ వంటకంగా పేరొందినా.. కాలక్రమంలో అన్ని మతాలవారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోనూ హైదరాబాద్ రుచిని మరిపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. రుచికి సలాం..! ఇరాన్‌కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో హైదరాబాద్‌లోని మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించాడు. తర్వాత కాలంలో 1956లో రంజాన్‌మాసం ప్రారంభమైన తొలిరోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి 25పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది. తొలిరోజుల్లో అంతగా ఆదరణ లభించకపోవడంతో బిర్యానీకి హలీం ఫ్రీ అని ప్రకటించారు. తర్వాత సంవత్సరం హలీం విశిష్ఠతను తెలియజేస్తు పోస్టుకార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న అడ్రస్‌లకు పోస్టుకార్డులు రాశారు. దీంతో కొంత మేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టుకార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే సంవత్సరం హుస్సేన్ మరణించాడు. ఇలా తయారు చేస్తారు.. గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ (బోన్‌లెస్), పుట్నాల పప్పు (తినే శెనగ పప్పు), గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తివీుర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకూ పొడవైన కర్రలతో రుబ్బుతారు. కరీంనగర్లో 5 క్వింటాళ్ల హలీం కరీంనగర్ నగరవ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజూ 5 క్వింటాళ్ల హలీం తయారు చేస్తుండగా విక్రయాలతో రోజూ రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో రూ.5లక్షల వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాళ్ల మేక మాసం ఉపయోగిస్తుండగా హరీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసం అవసరం అవుతుంది. రోజూ ఒక్కో హలీం సెంటర్లో 15 నుంచి 50కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హరీస్‌ను తయారు చేస్తారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్యంగా 20 హలీం సెంటర్లు ఉండాగా వాటిలో అధిక భాగం గోదావరిఖనిలో ఉన్నాయి. రోజూ రెండు క్వింటాళ్ల హరీస్ విక్రయాలు జరుగుతుండగా, 500 కిలోల హలీం అమ్మకాలు సాగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో రెండు, వేములవాడలో రెండు హలీం కేంద్రాలున్నాయి. నాలుగు కేంద్రాల్లో మొత్తం 60 కిలోల హరీస్, 20కిలోల హలీం అమ్మకాలు జరుగుతాయి. ఇక జగిత్యాల జిల్లా పరిధిలో మొత్తం 20 హలీం సెంటర్లు ఉండగా అత్యధికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఈ సెంటర్లలో మొత్తం 10 క్వింటాళ్ల హరీస్ అమ్మకాలు జరుగుతాయి. -
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
వెజిటేరియన్ హలీమ్.. ఎలా చేయాలో తెలుసా?
కావలసినవి: వేయించిన ఉల్లిపాయ తరుగు – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పాలు – కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, గులాబీ రేకులు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అరకప్పు, ఓట్స్ – పావు కప్పు, బాదం – ఆరు, పచ్చిశనగపప్పు – టీస్పూను, ఎర్ర కందిపప్పు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పెసరపప్పు – టీస్పూను, నువ్వులు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, లవంగాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, యాలకులు – ఎనిమిది, షాజీరా – టేబుల్ స్పూను, తోకమిరియాలు – టీస్పూను, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, పుదీనా తరుగు – టేబుల్ స్పూను, సన్నగా తరిగిన జీడిపప్పు – 20 గ్రా., పిస్తా పలుకులు – 20 గ్రా., బాదం పలుకులు – 20 గ్రా., మీల్మేకర్ – 100 గ్రా., నిమ్మరసం – టీస్పూను. తయారీ: ► ముందుగా మీల్‌మేకర్‌ను ఇరవై నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. నానాక బరకగా రుబ్బుకోవాలి. ► మిక్సీజార్‌లో.. తోక మిరియాలు, షాహజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులన్నీ, ఆరు బాదం పప్పులు, ఓట్స్, గోధుమ రవ్వ, నువ్వులు అన్నీ కలిపి పొడిచేయాలి. ► స్టవ్ మీద కుకర్ గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ►ఇవివేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బరకగా గ్రైండ్ చేసిన మీల్ మేకర్ మిశ్రమాన్ని కలపాలి. ►ఇప్పుడు పెరుగు, పాలు, గులాబి రేకులు, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలిపి, పొడిచేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటమీద ఉడికించాలి. ►ఉడికిన మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు చూసి చూసి వేసుకుంటే వేడివేడి వెజ్ హలీమ్ రెడీ. -
హైదరాబాదీ మటన్ హలీమ్‌ని ఇలా చేసుకొని తింటే..
రంజాన్ మాసంలో రోజా ఉన్నవారంతా ఉపవాస దీక్ష ముగించాక, బలవర్థక ఆహారం తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారంలో హలీమ్ ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను రోజా ఉన్నవారే గాక, ఇతరులు కూడా ఇష్టంగా తింటారు. మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే హలీమ్‌ను ఇంట్లో ఎలా వండుకోవచ్చో చూద్దాం. కావలసినవి: మటన్ ఖీమా – ముప్పావు కేజీ, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – అర టేబుల్ స్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, సోంపు – టేబుల్ స్పూను, ► మిరియాలు – టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, గోధుమ రవ్వ – అరకప్పు, మినప్పప్పు – టేబుల్ స్పూను, కందిపప్పు – టేబుల్ స్పూను, పచ్చిశనగ పప్పు – టేబుల్ స్పూను, పెసరపప్పు – టేబుల్ స్పూను, బియ్యం – టేబుల్‌స్పూను. ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, ►ఉల్లిపాయలు – నాలుగు( సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు – పావుకప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు – రెండు, మిరియాలపొడి – అర టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, పెరుగు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ గార్నిష్‌కు సరిపడా. తయారీ: ∙కుకర్ గిన్నెలో మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి. ►దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి కలిపి, సన్నని మంటమీద ఐదారు విజిల్స్ రానివ్వాలి. ►మరో కుకర్ గిన్నెతీసుకుని గోధుమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►ఉడికిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి ►సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి. ►ఇవన్నీ వేగాక మిరియాలపొడి, పసుపు, పెరుగు ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. -
ప్రియమణి.. ‘అభి’మతం ఒకటే
కాషాయ వర్ణం అందమే అందం. ఆకుపచ్చ సౌందర్యమే సౌందర్యం.గుడిలో గంట మంగళప్రదమైన తరంగాలు సృష్టిస్తుంది.‘అల్లాహో అక్బర్’... అని పిలిచే అజాన్ మనసుకు శాంతినిస్తుంది.పావురాలు గోపుర కలశం పైనా.. మినార్ చంద్రవంక పైనా వాలుతాయి.మతాలు ఏమైనా మనుషులంతా ఒక్కటే.ప్రియమణి పుట్టింటి మతం వేరు. అత్తింటి మతం వేరు.పెళ్లయ్యాక రెండు మతాల పండుగలు ఆ ఇంట జరుగుతున్నాయి. ఈ రంజాన్ మాసంలో భర్త ఉపవాసాలకు తన వంతు ఆధ్యాత్మిక తోడు అందిస్తున్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో మీ అత్తగారింట్లో పాటించే ఆచారాల గురించి చెబుతారా? ప్రియమణి: అత్తామామలు ప్రస్తుతం ఇక్కడ లేరు. వాళ్లు యు.ఎస్‌లో ఉన్నారు. నేను, మా ఆయన (ముస్తఫా) మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఆయన మాత్రం ‘రోజా’ (ఉపవాసం) పాటిస్తున్నారు. 30 రోజులుగా ఫాస్టింగ్ ఉంటున్నారు. రోజూ వాళ్ల కమ్యూనిటీ హాల్‌కి వెళ్లి సాయంత్రం ఉపవాసం విరమించుకుని, ఇంటికి వస్తున్నారు. ఉదయాన్నే నాలుగున్నరకు లేచి నమాజ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఉపవాసం మొదలుపెడతారు. మా పెళ్లయ్యాక వచ్చిన రెండో రంజాన్ ఇది. తెల్లవారుజాము నిద్ర లేవడం, నమాజు చేసుకుని ఉపవాసం మొదలుపెట్టడం, పనులు చేసుకోవడం, సాయంత్రం 5–6.30 మధ్యలో వాళ్ల కమ్యునిటీ హాల్‌కు వెళ్లడం, ఫాస్టింగ్ని బ్రేక్ చేసి రాత్రికి 8.30కి ఇంటికి తిరిగి రావడం. రాత్రి ఇద్దరం కలసి డిన్నర్ చేస్తాం. ఈ మాసంలో మా ఆయన రోజువారి జీవితం ఇలా ఉంటుంది. ఫాస్టింగ్ (ఉపవాసం) చేయడం చాలా కష్టం కదా? అది కూడా రోజంతా నీళ్లు తాగకుండా, లాలాజలం కూడా మింగకుండా అంటే చాలా చాలా కష్టం... నా భర్త అని మాత్రమే కాదు... ఫాస్టింగ్ ఉండే ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్. ఎంతో మనో నిబ్బరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. బహుశా దైవ ఆరాధనలో ఉన్నాం అన్న భావనే ఆ శక్తి ఇస్తుందనుకుంటా. నిత్యం ‘రోజా’ మొదలెట్టాక కొద్ది సమయం గడిచాక ‘ఇవాళ రోజా ఉండగలను’ అని అనిపించి సంకల్పం చెప్పుకుంటారు. ఈ సంకల్పం చెప్పుకోని ముందు ఏవైనా అవాంతరాలు వస్తే రోజాను బ్రేక్ చేయవచ్చు. కాని సంకల్పం చెప్పుకున్నాక ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాణం పోతున్నా సరే రోజాను బ్రేక్ చేయకూడదు. ఇవాళ రోజా ఉంటున్న కోట్లాది మంది నిత్యం సంకల్పం చెప్పుకుంటున్నవాళ్లే. ఇంత ఎండల్లో ఎంత ఇబ్బంది ఉన్నా వారు ఇఫ్తార్ సమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టక ఉపవాసం ఉండటం చాలా గొప్ప. ఇది దైవం నుంచి శక్తి పొందడమే అని అనుకుంటాను. ఈ మాసంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందట కదా? నాకు తెలిసి ఈద్‌కి వారం పదిరోజులు ముందు ఏదైనా అడిగితే జరుగుతుందని నమ్ముతారు. అది వాళ్ల మత సంప్రదాయం. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఆ నమ్మకానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. దేవుడి ధ్యానంలో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడు న్యాయమైన కోరికలను భగవంతుడు తీరుస్తాడని అనుకోవచ్చు. అన్ని మతాలకూ ఇది వర్తిస్తుంది. మీరు హిందువు. మరి ఇస్లామ్ సంప్రదాయం గురించి మీకు ముందే తెలుసా? మ్యారేజ్ అయిన తర్వాతే తెలుసుకున్నారా? నాకు ముందే తెలుసు. నాకు ముస్లిమ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. మా స్కూల్లో చాలా మంది స్కూల్‌మేట్స్ ముస్లిమ్లే. అయితే పెళ్లయిన తర్వాతే ఇంకా డెప్త్‌గా తెలిసింది. ముస్లిమ్లలో కమ్యూనిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతి పాటిస్తారు. మా భర్త వాళ్లు ‘బొహ్రా’ ముస్లిమ్‌లు. వీళ్ల పద్ధతి ఎలా ఉంటుందంటే.. హైదరాబాద్, బెంగళూరు.. వేరే చోటుకి ట్రావెల్ చేశారంటే ఆ ప్రాంతాల్లో వాళ్ల రక్తసంబంధీకులు ఉంటేనే ఉపవాసం ఉంటారు. లేదంటే చేయరు. ముస్లిమ్‌లు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంటారు. ముస్తఫాగారు క్రమం తప్పకుండా చేస్తుంటారా? అలా ఏం లేదనుకుంటా. వీలుండి చేసే వాళ్లు చేస్తుంటారు. మా అత్తా మావయ్య మూడు సార్లకు తగ్గకుండా నమాజ్ చేస్తుంటారు. ఉదయం, మ«ధ్యాహ్నం, సాయంత్రం చేస్తుంటారు. ఇది కేవలం నా ఫ్యామిలీ గురించి చెబుతున్నాను. అందరి గురించి కాదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుదురుతుందా? నమాజ్ చేయాలంటే మనం ఉన్న చోటు అందుకు అనువుగా ఉండాలేమో? ముస్తఫా అయితే దగ్గర్లో ఉన్న మసీద్ లేదా కమ్యూనిటీ హాల్, రిలేటివ్స్ ఇంటికి వెళతారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు చుట్టాలుంటే వాళ్ల ఇంట్లో చేస్తారు. కాని శుభ్రమైన చోటు ఉంటే ఎక్కడైనా సరే నమాజు వేళలో ఒక వస్త్రం పరుచుకుని నమాజు చేసుకోవచ్చని చెబుతారు. రంజాన్‌కు సంబంధించిన బాధ్యత కలిగిన విషయం ఏంటంటే ‘జకాత్’ (దానం). దాని గురించి? కేవలం రంజాన్ సమయంలో మాత్రమే కాదు అన్ని సమయాల్లో మేం చారిటీ చేస్తుంటాం. అయితే రంజాన్ నెలలో ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాం. చిన్నపిల్లలకు ఫుడ్ ఇస్తాం. చదువుకోవడానికి సహాయం చేస్తాం. పెద్దవాళ్లకి హెల్ప్ చేస్తుంటాం. ఆహారం సమకూర్చడం, ఆర్థిక సహాయం, బట్టలివ్వడం... ఇలా ఏదంటే అది చేసేస్తాం. చాలా తృప్తిగా ఉంటుంది. రంజాన్ వంటకాల్లో మీకు నచ్చిన వంటకం ఏది? ముంబైలో ‘భేండి బజార్’ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ దొరికే స్వీట్స్ చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో ఆ బజార్లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తారు. ఈ సీజన్లో తప్ప వేరే సమయాల్లో అలాంటి స్వీట్స్ దొరకవు. ముస్లిమ్‌లకు శుక్రవారాలు ముఖ్యమైనవి. ఆ రోజున నా భర్త పొద్దునే మసీద్‌కు వెళ్లి నమాజ్ ముగించుకుని అక్కడికెళ్లి ఎక్కువ స్వీట్స్ తీసుకు వస్తారు. ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత స్వీట్స్ తింటాం. ఈ సీజన్లో అక్కణ్ణుంచి స్వీట్స్ తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. అవి ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగే అక్కడ తయారు చేసే ఫలూదా చాలా టేస్టీగా ఉంటుంది. ఫలూదాని అక్కడ ‘మాహిమ్’ అంటారు. ఇంట్లో ఒకరు ఉపవాసం ఉంటే పక్కవాళ్లకి తినడం ఇబ్బందిగా ఉంటుందా? అలా ఏం లేదండి. నేను నా ఆహారాన్ని స్కిప్ చేయను. మనం తింటున్నామని వాళ్ల ఫాస్టింగ్‌కి భంగం కలగదు. వాళ్ల ఆలోచన ఫుడ్ వైపు వెళ్లదు. నేనైతే అంత సిన్సియర్‌గా ఫాస్టింగ్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. అందుకే వాళ్ల విల్ పవర్‌కి నిజంగా హ్యాట్సాఫ్. సినిమా స్టార్స్‌కి కొత్త బట్టలంటే పెద్ద విషయం కాదు. కానీ ఈద్ టైమ్‌లో కొత్త బట్టలు కొనుక్కుంటారా? ఫాస్టింగ్ ఉంటున్న రోజుల్లో షాపింగ్ చేయం. ఈద్ సెలబ్రేట్ చేసుకునే ముందు రోజు మాత్రం బట్టలు కొనుక్కుంటాం. నేను సల్వార్లు కొనుక్కుంటాను. పెళ్లయిన వాళ్లనందరినీ అందరూ కామన్‌గా అడిగేదే.. పిల్లలు ఎప్పుడు ? ఇప్పుడైతే లేదు (నవ్వుతూ). పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? రిలేషన్షిప్ స్టేటస్ మారింది అంతకుమించి ఏమీ లేదు. పెళ్లికి ముందు ఒక ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు రెండు ఫ్యామిలీలు. బాధ్యత ఇంకాస్త పెరిగింది. ఎప్పుడైనా నమాజ్ చేశారా ? లేదు. అత్తింటివాళ్లు మతం మార్చుకోమని అడగలేదా? అస్సలు లేదు. పెళ్లికి ముందే మేం ఒకరి కోసం మరొకరు మారాలని అనుకోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని అనుకున్నాం. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యాం. మా పెద్దవాళ్లు దానికి అంగీకరించారు. మా అత్తామామలైతే ‘ఇన్నేళ్లుగా ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా.. సడన్‌గా మార్పు అంటే కష్టం. ఇన్నేళ్లూ ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి’ అన్నారు. మా అత్తమామయ్యలు చాలా బ్రాడ్ మైండెడ్. అర్థం చేసుకున్నారు. మా అమ్మానాన్న కూడా మాలో మార్పు కోరుకోలేదు. మతాలు ఏవైనా సాటి మనిషి పట్ల మానవత్వంతో ఉండటమే మా అభిమతం. అందరి అభిమతం అదే కావాలి. అప్పుడే అందరం బాగుంటాం. ఇక íసినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సిరివెన్నెల’ చేస్తున్నారు. ఇంకేమైనా చేస్తున్నారా? కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను. అమేజాన్ ప్రైమ్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలో ఈ సిరీస్ సీజన్ 2 కూడా స్టార్ట్ కాబోతోంది. తెలుగులో ‘ఢీ’ టీవీ షో చేస్తున్నాను. అలాగే మలయాళంలో కూడా టీవీ షోలు చేస్తున్నా. వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బావుంది. సినిమా షూటింగ్‌లానే ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుంది. రోజుకు 6–7 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ అని నేను నమ్ముతాను. ఫైనల్లీ.. సినిమాలు, సిరీస్‌లు, షోలతో బిజీ స్టార్‌గానే కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది? ఐయామ్ గ్లాడ్. రోజులు మారుతున్నాయి. చాలా మంది అంటుంటారు పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. నేను 18–19 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. సడన్‌గా ఇప్పుడు ఆపేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేస్తాను. మా అత్తమామలు, హస్బెండ్ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంటారు. నువ్వు వర్క్ చేయి... ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మాకే ఏదోలా అనిపిస్తుంటుంది అంటారు. అంత సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకేం కావాలి. అయితే సినిమాలలో పాత్రలు ఆఫర్ చేసేటప్పుడు పెళ్లయిన హీరోయిన్లను కేవలం కొన్ని పాత్రలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఆ విధానం మారుతున్నట్టుగా కనిపిస్తుంది. – డి.జి. భవాని ప్రేమకు కుల మతాలు ఉండవు. మనసులు కలిస్తే చాలు. ప్రియమణి, ముస్తఫా రాజ్‌ల మనసులు కలిశాయి. అయితే ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి అనుకున్నారు. హిందు–ముస్లింల మధ్య పెళ్లి. తమిళ, ఉర్దూ భాషల మధ్య పెళ్లి. ఏమవుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. కాని రెండు కుటుంబాల వాళ్లు అంగీకరించారు. అబ్బాయి తరపువారు ‘నువ్వు ముస్లిం అమ్మాయిగా మారితేనే’ అని ప్రియమణికి కండీషన్ పెట్టలేదు. అమ్మాయి తరపువారు ‘నువ్వు హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవుతావా’ అని ముస్తఫాని అడగలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముస్తఫా ముంబైలో ఈవెంట్స్ మేనేజర్. మంచి పలుకుబడి ఉంది. నటిగా దక్షిణ, ఉత్తరాదిన ప్రియమణి ఫేమస్. 2017 అగస్ట్ 23న వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ‘మా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది’ అన్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో భర్త ఆచరిస్తున్న నియమాల గురించి ‘సాక్షి’తో చెప్పారు. ఇండస్ట్రీలో ఉండే పోటీ వల్ల ఒత్తిడికి గురవుతుంటారా? మీ సక్సెస్ మంత్ర? లేదు. నాకెప్పుడూ స్ట్రెస్ అనిపించలేదు. ఎందుకంటే పోటీ అవసరం అని నా ఫీలింగ్. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా సక్సెస్ మంత్ర ఏంటంటే ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’. ఇవాళ కాకపోయినా ఏదో రోజు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతాను. దక్కుతుందో లేదో అని సందేహించి కష్టపడటం మానేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే మిగిలిపోతాం. -
స్వర్గవాసి ఆరాధన
ఒకసారి ప్రవక్త మహనీయులు మస్జిదె నబవీలో సహచరులతో సమావేశమై ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి మస్జిదులోకి ప్రవేశించాడు. ఆయన గడ్డం నుండి వజూ నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. అతన్ని చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇతను స్వర్గవాసి’ అన్నారు.ప్రవక్త స్వయంగా స్వర్గవాసి అని చెప్పారంటే, ఈయనలో ఏదోప్రత్యేకత ఉండి ఉంటుంది, తెల్లవార్లూ దైవారాధనలోనే గడుపుతాడేమోని భావించిన ఒక సహచరుడు, అదేమిటో తెలుసుకోవాలని ఆయన్ని అనుసరించాడు.కాని తన అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇషా నమాజ్ అనంతరం దువా చేసుకొని పడుకున్న పెద్దమనిషి ఫజర్ నమాజు అజాన్ పిలుపునకు మాత్రమే లేచాడు. రాత్రంతా కనీసం ఒక్క నఫిల్ నమాజు కూడా చేయలేదు! ఈ రోజు ఆరోగ్యం బాగోలేక చెయ్యలేదేమో.. అనుకొని రెండవరోజు గమనించాడు. రెండవరోజూ అదే పరిస్థితి. అలా నాలుగురోజులు గడిచి పొయ్యాయి.చివరికి ఉండబట్టలేక ‘ప్రవక్తవారు మిమ్మల్ని స్వర్గవాసి అన్నారు. మీ ఆరాధనల్లోని ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించాడు.దానికాయన, ‘ప్రత్యేకత ఏమీ లేదు బాబూ!’ అన్నాడు.‘లేదు.. లేదు.. ఏదో ఉంది. దయచేసి చెప్పండి’ అని బతిమాలాడు.దానికాయన, ‘బాబూ.. ఏమీ లేదు కాని ఒక చిన్న విషయం. అదేమిటంటే, మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకుంటాను. రవంత అసూయా ద్వేషాలు కూడా మనసులోకి రానివ్వను. ఇదొక్కటే.. ఇది తప్ప ఇంకెలాంటి ప్రత్యేకతా లేదు’ అన్నాడు.అందుకే ముహమ్మద్ ప్రవక్త వారు, ‘అగ్ని కట్టెల్ని భస్మం చేసినట్లు అసూయ సత్కార్యాలను భస్మం చేస్తుందని, నరకానికి తీసుకుపోతుందని చెప్పారు. మనసు స్వచ్ఛంగా నిష్కల్మషంగా లేకుండా ఎన్ని ఆరాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మనసులో ఎవరి పట్లా కుళ్లు, కుట్ర, ఈర్షా్యద్వేషాలు లేకుండా, నిష్కల్మష హృదయంతో అందరినీ ప్రేమించగలిగే వారికే స్వర్గం లభిస్తుందన్నది ఇందులోని సారాంశం. – మదీహా -
వాహ్..! హలీమ్
-
నోరూరించే.. హలీమ్
ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్. ఈ మాసంలో సంప్రదాయ వంటకం హలీమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మటన్, చికెన్ ఫ్లేవర్లలో లభించే హలీం ముస్లింలకే కాదు ఎవరికైనా నోరూరక తప్పదు. ఇంతటి పసందైన వంటను రుచి చూడటానికి హైదరబాద్కెళ్లే వారు. పెద్ద నగరాలలో మాత్రమే లభించే ఈ వంటకం ఇప్పుడు ‘అనంత’లో కూడా లభిస్తోంది. అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు ప్రాంతాల్లో ప్రత్యేకంగా హలీం సెంటర్లు వెలిశాయి. ముస్లింలు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత హలీం సెంటర్ల వద్దకు చేరుతున్నారు. అనంతపురంలోని పలు హలీం సెంటర్ల వద్ద ముస్లింల సందడి కనిపించింది. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రంజాన్ స్పెపల్