ప్రియమణి.. ‘అభి’మతం ఒకటే | Ramzan Special Interview With Actress Priyamani | Sakshi
Sakshi News home page

అభి‘మతం’ ఒకటే

Published Sun, Jun 2 2019 12:17 AM | Last Updated on Sun, Jun 2 2019 10:46 AM

Ramzan Special Interview With Actress Priyamani  - Sakshi

కాషాయ వర్ణం అందమే అందం. ఆకుపచ్చ సౌందర్యమే సౌందర్యం.గుడిలో గంట మంగళప్రదమైన తరంగాలు సృష్టిస్తుంది.‘అల్లాహో అక్బర్‌’... అని పిలిచే అజాన్‌ మనసుకు శాంతినిస్తుంది.పావురాలు గోపుర కలశం పైనా.. మినార్‌ చంద్రవంక పైనా వాలుతాయి.మతాలు ఏమైనా మనుషులంతా ఒక్కటే.ప్రియమణి పుట్టింటి మతం వేరు. అత్తింటి మతం వేరు.పెళ్లయ్యాక రెండు మతాల పండుగలు ఆ ఇంట జరుగుతున్నాయి. ఈ రంజాన్‌ మాసంలో భర్త ఉపవాసాలకు తన వంతు ఆధ్యాత్మిక తోడు అందిస్తున్నారు ప్రియమణి.

రంజాన్‌ మాసంలో మీ అత్తగారింట్లో పాటించే ఆచారాల గురించి చెబుతారా?
ప్రియమణి: అత్తామామలు ప్రస్తుతం ఇక్కడ లేరు. వాళ్లు యు.ఎస్‌లో ఉన్నారు. నేను, మా ఆయన (ముస్తఫా) మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఆయన మాత్రం ‘రోజా’ (ఉపవాసం) పాటిస్తున్నారు. 30 రోజులుగా ఫాస్టింగ్‌ ఉంటున్నారు. రోజూ వాళ్ల కమ్యూనిటీ హాల్‌కి వెళ్లి సాయంత్రం ఉపవాసం విరమించుకుని, ఇంటికి వస్తున్నారు. ఉదయాన్నే నాలుగున్నరకు లేచి నమాజ్‌ చేస్తున్నారు.

అప్పటి నుంచి ఉపవాసం మొదలుపెడతారు. మా పెళ్లయ్యాక వచ్చిన రెండో రంజాన్‌ ఇది. తెల్లవారుజాము నిద్ర లేవడం, నమాజు చేసుకుని ఉపవాసం మొదలుపెట్టడం, పనులు చేసుకోవడం, సాయంత్రం 5–6.30 మధ్యలో వాళ్ల కమ్యునిటీ హాల్‌కు వెళ్లడం, ఫాస్టింగ్‌ని బ్రేక్‌ చేసి రాత్రికి 8.30కి ఇంటికి  తిరిగి రావడం. రాత్రి ఇద్దరం కలసి డిన్నర్‌ చేస్తాం. ఈ మాసంలో మా ఆయన రోజువారి జీవితం ఇలా ఉంటుంది.

ఫాస్టింగ్‌ (ఉపవాసం) చేయడం చాలా కష్టం కదా? అది కూడా రోజంతా నీళ్లు తాగకుండా, లాలాజలం కూడా మింగకుండా అంటే చాలా చాలా కష్టం...
నా భర్త అని మాత్రమే కాదు... ఫాస్టింగ్‌ ఉండే ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్‌. ఎంతో మనో నిబ్బరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. బహుశా దైవ ఆరాధనలో ఉన్నాం అన్న భావనే ఆ శక్తి ఇస్తుందనుకుంటా. నిత్యం ‘రోజా’ మొదలెట్టాక కొద్ది సమయం గడిచాక ‘ఇవాళ రోజా ఉండగలను’ అని అనిపించి సంకల్పం చెప్పుకుంటారు.

ఈ సంకల్పం చెప్పుకోని ముందు ఏవైనా అవాంతరాలు వస్తే రోజాను బ్రేక్‌ చేయవచ్చు. కాని సంకల్పం చెప్పుకున్నాక ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాణం పోతున్నా సరే రోజాను బ్రేక్‌ చేయకూడదు. ఇవాళ రోజా ఉంటున్న కోట్లాది మంది నిత్యం సంకల్పం చెప్పుకుంటున్నవాళ్లే. ఇంత ఎండల్లో ఎంత ఇబ్బంది ఉన్నా వారు ఇఫ్తార్‌ సమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టక ఉపవాసం ఉండటం చాలా గొప్ప. ఇది దైవం నుంచి శక్తి పొందడమే అని అనుకుంటాను.

ఈ మాసంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందట కదా?
నాకు తెలిసి ఈద్‌కి వారం పదిరోజులు ముందు ఏదైనా అడిగితే జరుగుతుందని నమ్ముతారు. అది వాళ్ల మత సంప్రదాయం. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఆ నమ్మకానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. దేవుడి ధ్యానంలో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడు న్యాయమైన కోరికలను భగవంతుడు తీరుస్తాడని అనుకోవచ్చు. అన్ని మతాలకూ ఇది వర్తిస్తుంది.

మీరు హిందువు. మరి ఇస్లామ్‌ సంప్రదాయం గురించి మీకు ముందే తెలుసా? మ్యారేజ్‌ అయిన తర్వాతే తెలుసుకున్నారా?
నాకు ముందే తెలుసు. నాకు ముస్లిమ్‌ ఫ్రెండ్స్‌ చాలామందే ఉన్నారు. మా స్కూల్‌లో చాలా మంది స్కూల్‌మేట్స్‌ ముస్లిమ్‌లే. అయితే పెళ్లయిన తర్వాతే ఇంకా డెప్త్‌గా తెలిసింది. ముస్లిమ్‌లలో కమ్యూనిటీ డిఫరెన్స్‌ ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతి పాటిస్తారు. మా భర్త వాళ్లు ‘బొహ్రా’ ముస్లిమ్‌లు. వీళ్ల పద్ధతి ఎలా ఉంటుందంటే..  హైదరాబాద్, బెంగళూరు.. వేరే చోటుకి ట్రావెల్‌ చేశారంటే ఆ ప్రాంతాల్లో వాళ్ల రక్తసంబంధీకులు ఉంటేనే ఉపవాసం ఉంటారు. లేదంటే చేయరు.

ముస్లిమ్‌లు రోజుకు ఐదు సార్లు నమాజ్‌ చేయాలంటారు. ముస్తఫాగారు క్రమం తప్పకుండా చేస్తుంటారా?
అలా ఏం లేదనుకుంటా. వీలుండి చేసే వాళ్లు చేస్తుంటారు. మా అత్తా మావయ్య మూడు సార్లకు తగ్గకుండా నమాజ్‌ చేస్తుంటారు. ఉదయం, మ«ధ్యాహ్నం, సాయంత్రం చేస్తుంటారు. ఇది కేవలం నా ఫ్యామిలీ గురించి చెబుతున్నాను. అందరి గురించి కాదు.

ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుదురుతుందా? నమాజ్‌ చేయాలంటే మనం ఉన్న చోటు అందుకు అనువుగా ఉండాలేమో?
ముస్తఫా అయితే దగ్గర్లో ఉన్న మసీద్‌ లేదా కమ్యూనిటీ హాల్, రిలేటివ్స్‌ ఇంటికి వెళతారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. అలాగే ట్రావెల్‌ చేసేటప్పుడు చుట్టాలుంటే వాళ్ల ఇంట్లో చేస్తారు. కాని శుభ్రమైన చోటు ఉంటే ఎక్కడైనా సరే నమాజు వేళలో ఒక వస్త్రం పరుచుకుని నమాజు చేసుకోవచ్చని చెబుతారు.

రంజాన్‌కు సంబంధించిన బాధ్యత కలిగిన విషయం ఏంటంటే ‘జకాత్‌’ (దానం). దాని గురించి?
కేవలం రంజాన్‌ సమయంలో మాత్రమే  కాదు అన్ని సమయాల్లో మేం చారిటీ చేస్తుంటాం. అయితే రంజాన్‌ నెలలో ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాం. చిన్నపిల్లలకు ఫుడ్‌ ఇస్తాం. చదువుకోవడానికి సహాయం చేస్తాం. పెద్దవాళ్లకి హెల్ప్‌ చేస్తుంటాం. ఆహారం సమకూర్చడం, ఆర్థిక సహాయం, బట్టలివ్వడం... ఇలా ఏదంటే అది చేసేస్తాం. చాలా తృప్తిగా ఉంటుంది.

రంజాన్‌ వంటకాల్లో మీకు నచ్చిన వంటకం ఏది?
ముంబైలో ‘భేండి బజార్‌’ అనే ఒక ప్లేస్‌ ఉంది. అక్కడ దొరికే స్వీట్స్‌ చాలా ఇష్టం. రంజాన్‌ టైమ్‌లో ఆ బజార్‌లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తారు. ఈ సీజన్‌లో తప్ప వేరే సమయాల్లో అలాంటి స్వీట్స్‌ దొరకవు. ముస్లిమ్‌లకు శుక్రవారాలు ముఖ్యమైనవి. ఆ రోజున నా భర్త పొద్దునే మసీద్‌కు వెళ్లి నమాజ్‌ ముగించుకుని అక్కడికెళ్లి ఎక్కువ స్వీట్స్‌ తీసుకు వస్తారు. ఫాస్టింగ్‌ బ్రేక్‌ చేసిన తర్వాత స్వీట్స్‌ తింటాం. ఈ సీజన్‌లో అక్కణ్ణుంచి స్వీట్స్‌ తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. అవి ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగే అక్కడ తయారు చేసే ఫలూదా చాలా టేస్టీగా ఉంటుంది. ఫలూదాని అక్కడ ‘మాహిమ్‌’ అంటారు.

ఇంట్లో ఒకరు ఉపవాసం ఉంటే పక్కవాళ్లకి తినడం ఇబ్బందిగా ఉంటుందా?
అలా ఏం లేదండి. నేను నా ఆహారాన్ని స్కిప్‌ చేయను. మనం తింటున్నామని వాళ్ల ఫాస్టింగ్‌కి భంగం కలగదు. వాళ్ల ఆలోచన ఫుడ్‌ వైపు వెళ్లదు. నేనైతే అంత సిన్సియర్‌గా ఫాస్టింగ్‌ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. అందుకే వాళ్ల విల్‌ పవర్‌కి నిజంగా హ్యాట్సాఫ్‌.

సినిమా స్టార్స్‌కి కొత్త బట్టలంటే పెద్ద విషయం కాదు. కానీ ఈద్‌ టైమ్‌లో కొత్త బట్టలు కొనుక్కుంటారా?
ఫాస్టింగ్‌ ఉంటున్న రోజుల్లో షాపింగ్‌ చేయం. ఈద్‌ సెలబ్రేట్‌ చేసుకునే ముందు రోజు మాత్రం బట్టలు కొనుక్కుంటాం. నేను సల్వార్‌లు కొనుక్కుంటాను.

పెళ్లయిన వాళ్లనందరినీ అందరూ కామన్‌గా అడిగేదే.. పిల్లలు ఎప్పుడు ?
ఇప్పుడైతే లేదు (నవ్వుతూ).

పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి?
రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ మారింది అంతకుమించి ఏమీ లేదు.  పెళ్లికి ముందు ఒక ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు రెండు ఫ్యామిలీలు. బాధ్యత ఇంకాస్త పెరిగింది.

ఎప్పుడైనా నమాజ్‌ చేశారా ?
లేదు.
అత్తింటివాళ్లు మతం మార్చుకోమని అడగలేదా?
అస్సలు లేదు. పెళ్లికి ముందే మేం ఒకరి కోసం మరొకరు మారాలని అనుకోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని అనుకున్నాం. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అని కూడా డిసైడ్‌ అయ్యాం. మా పెద్దవాళ్లు దానికి అంగీకరించారు. మా అత్తామామలైతే  ‘ఇన్నేళ్లుగా ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా.. సడన్‌గా మార్పు అంటే కష్టం. ఇన్నేళ్లూ ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి’ అన్నారు. మా అత్తమామయ్యలు చాలా బ్రాడ్‌ మైండెడ్‌. అర్థం చేసుకున్నారు. మా అమ్మానాన్న కూడా మాలో మార్పు కోరుకోలేదు. మతాలు ఏవైనా సాటి మనిషి పట్ల మానవత్వంతో ఉండటమే మా అభిమతం. అందరి అభిమతం అదే కావాలి. అప్పుడే అందరం బాగుంటాం.

ఇక íసినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సిరివెన్నెల’ చేస్తున్నారు. ఇంకేమైనా చేస్తున్నారా?
కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను. అమేజాన్‌ ప్రైమ్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ అనే  వెబ్‌ సిరీస్‌ చేశాను. త్వరలో ఈ సిరీస్‌ సీజన్‌ 2 కూడా స్టార్ట్‌ కాబోతోంది. తెలుగులో ‘ఢీ’ టీవీ షో చేస్తున్నాను. అలాగే మలయాళంలో కూడా టీవీ షోలు చేస్తున్నా.

వెబ్‌ సిరీస్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
బావుంది. సినిమా షూటింగ్‌లానే ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుంది. రోజుకు 6–7 సీన్లు షూట్‌ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్‌ మొత్తం డిజిటల్‌ అని నేను నమ్ముతాను.

ఫైనల్లీ.. సినిమాలు, సిరీస్‌లు, షోలతో బిజీ స్టార్‌గానే కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది?
ఐయామ్‌ గ్లాడ్‌. రోజులు మారుతున్నాయి. చాలా మంది అంటుంటారు పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. నేను 18–19 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో వర్క్‌ చేస్తున్నాను. సడన్‌గా ఇప్పుడు ఆపేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. వర్క్‌ ఉన్నప్పుడు వర్క్‌ చేస్తాను. మా అత్తమామలు, హస్బెండ్‌ నన్ను బాగా సపోర్ట్‌ చేస్తుంటారు. నువ్వు వర్క్‌ చేయి... ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మాకే ఏదోలా అనిపిస్తుంటుంది అంటారు. అంత సపోర్ట్‌ ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకేం కావాలి. అయితే సినిమాలలో పాత్రలు ఆఫర్‌ చేసేటప్పుడు పెళ్లయిన హీరోయిన్లను కేవలం కొన్ని పాత్రలకే పరిమితం చేయడం కరెక్ట్‌ కాదు. ప్రస్తుతం ఆ విధానం మారుతున్నట్టుగా కనిపిస్తుంది.
– డి.జి. భవాని

ప్రేమకు కుల మతాలు ఉండవు. మనసులు కలిస్తే చాలు. ప్రియమణి, ముస్తఫా రాజ్‌ల మనసులు కలిశాయి. అయితే ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి అనుకున్నారు. హిందు–ముస్లింల మధ్య పెళ్లి. తమిళ, ఉర్దూ భాషల మధ్య పెళ్లి. ఏమవుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. కాని రెండు కుటుంబాల వాళ్లు అంగీకరించారు. అబ్బాయి తరపువారు ‘నువ్వు ముస్లిం అమ్మాయిగా మారితేనే’ అని ప్రియమణికి కండీషన్‌ పెట్టలేదు.

అమ్మాయి తరపువారు ‘నువ్వు హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవుతావా’ అని ముస్తఫాని అడగలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముస్తఫా ముంబైలో ఈవెంట్స్‌ మేనేజర్‌. మంచి పలుకుబడి ఉంది. నటిగా దక్షిణ, ఉత్తరాదిన ప్రియమణి ఫేమస్‌. 2017 అగస్ట్‌ 23న వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ‘మా మ్యారీడ్‌ లైఫ్‌ హ్యాపీగా సాగుతోంది’ అన్నారు ప్రియమణి. రంజాన్‌ మాసంలో భర్త ఆచరిస్తున్న నియమాల గురించి ‘సాక్షి’తో చెప్పారు.

ఇండస్ట్రీలో ఉండే పోటీ వల్ల ఒత్తిడికి గురవుతుంటారా? మీ సక్సెస్‌ మంత్ర?
లేదు. నాకెప్పుడూ స్ట్రెస్‌ అనిపించలేదు. ఎందుకంటే పోటీ అవసరం అని నా ఫీలింగ్‌. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా సక్సెస్‌ మంత్ర ఏంటంటే ‘స్లో అండ్‌ స్టడీ విన్స్‌ ది రేస్‌’. ఇవాళ కాకపోయినా ఏదో రోజు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతాను. దక్కుతుందో లేదో అని సందేహించి కష్టపడటం మానేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే మిగిలిపోతాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement