Mustafa Raj
-
సమంత బాటలో.. విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ హీరోయిన్?
ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. టాలీవుడ్లో చై-సామ్‌ల విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో హీరోయిన్ ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్‌తో విడిపోతున్నట్లు కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇప్పటికే ప్రియమణి టీం ఈ వార్తలను కొట్టిపారేసినా సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది. రీసెంట్గా 'రాకెట్రీ' సినిమా సక్సెస్ మీట్ పార్టీకి కూడా ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముస్తాఫాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకే అయేషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. ఒకనొక సమయంలో ముస్తాఫాపై అయేషా ఆరోపణలు చేసినా ప్రియమణి ఆ సమయంలో భర్తకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇన్‌స్టా ఐడీ భర్త పేరుతో కలిపి.. ప్రియమణి రాజ్ అనే ఉంది. దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకి ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి. View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) -
విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
Priyamani Break Silences Divorce Rumours: నటి ప్రియమణి.. భర్త ముస్తాఫా రాజ్నుంచి కొంత కాలంగా దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.చదవండి: రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తాఫాల మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రియమణి తన విడాకులకు సంబంధించిన రూమర్స్‌కు చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను పంచుకుంది. దీంతో విడాకుల రూమర్స్‌పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లయ్యింది. చదవండి:పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
ముస్తఫా మొదటి భార్య ఆరోపణలు... ప్రియమణి స్పందన
నటి ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ఆయన తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, చాలా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని(సెక్యూర్ రిలేషన్షిప్) అని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియాతో ప్రియమణి మాట్లాడుతూ.. తన వివాహంపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పింది. ‘ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి అడిగితే.. మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటీకి ఇద్దరం ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్, బాయ్ అయినా చెపుకుంటాం. ఆయన ఫ్రీగా ఉంటే నాతో చాట్ చేస్తాడు. నేను కూడా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉంటే అతనికి ఫోన్ చేస్తా. ఇలా ప్రతి రోజు మేం మాట్లాడుకుంటునే ఉంటాం. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. కాగా.. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. భేదాభిప్రాయాలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు. -
ప్రియమణితో నా భర్త పెళ్లి చెల్లదు గాక చెల్లదు
Priyamani, Mustafa Raj Marriage: ముస్తఫా రాజ్.. నటి ప్రియమణితో పెళ్లయ్యేనాటికి ఇతడికో భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ముస్తఫా 2017లో ప్రముఖ నటి ప్రియమణిని పెళ్లాడాడు. రెండో పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లల కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. అయితే తన భర్త పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందు వాపోయింది. దీంతో ఈ ఆరోపణలను ముస్తఫా తోసిపుచ్చాడు. 'నా మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు?' అని ప్రశ్నించాడు. మరోవైపు ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని పేర్కొంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇది అక్రమం కిందకే వస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? వీలైతే మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకోవాలని చూస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప మరో దిక్కు లేదు. కానీ ఇప్పుడతడు తన సమయాన్ని నాకు వ్యతిరేకంగా వాడాలని చూస్తున్నాడు' అని ఆయేషా అభిప్రాయపడింది. మరి ఈ వ్యవహారంపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇదిలా వుంటే ప్రియమణి ఇటీవలే నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'నారప్ప' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించి ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తోన్న ప్రియమణి దక్షిణాదిన టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించింది. -
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. వెంకీ సార్ అలా అనడం హ్యాపీ వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను. 99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను. తనని చూస్తే నాకు గర్వం విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే. అతను నా లక్కీ చార్మ్ నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు. మైండ్‌సెట్ మారింది! òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. -
ప్రియమణి.. ‘అభి’మతం ఒకటే
కాషాయ వర్ణం అందమే అందం. ఆకుపచ్చ సౌందర్యమే సౌందర్యం.గుడిలో గంట మంగళప్రదమైన తరంగాలు సృష్టిస్తుంది.‘అల్లాహో అక్బర్’... అని పిలిచే అజాన్ మనసుకు శాంతినిస్తుంది.పావురాలు గోపుర కలశం పైనా.. మినార్ చంద్రవంక పైనా వాలుతాయి.మతాలు ఏమైనా మనుషులంతా ఒక్కటే.ప్రియమణి పుట్టింటి మతం వేరు. అత్తింటి మతం వేరు.పెళ్లయ్యాక రెండు మతాల పండుగలు ఆ ఇంట జరుగుతున్నాయి. ఈ రంజాన్ మాసంలో భర్త ఉపవాసాలకు తన వంతు ఆధ్యాత్మిక తోడు అందిస్తున్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో మీ అత్తగారింట్లో పాటించే ఆచారాల గురించి చెబుతారా? ప్రియమణి: అత్తామామలు ప్రస్తుతం ఇక్కడ లేరు. వాళ్లు యు.ఎస్‌లో ఉన్నారు. నేను, మా ఆయన (ముస్తఫా) మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఆయన మాత్రం ‘రోజా’ (ఉపవాసం) పాటిస్తున్నారు. 30 రోజులుగా ఫాస్టింగ్ ఉంటున్నారు. రోజూ వాళ్ల కమ్యూనిటీ హాల్‌కి వెళ్లి సాయంత్రం ఉపవాసం విరమించుకుని, ఇంటికి వస్తున్నారు. ఉదయాన్నే నాలుగున్నరకు లేచి నమాజ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఉపవాసం మొదలుపెడతారు. మా పెళ్లయ్యాక వచ్చిన రెండో రంజాన్ ఇది. తెల్లవారుజాము నిద్ర లేవడం, నమాజు చేసుకుని ఉపవాసం మొదలుపెట్టడం, పనులు చేసుకోవడం, సాయంత్రం 5–6.30 మధ్యలో వాళ్ల కమ్యునిటీ హాల్‌కు వెళ్లడం, ఫాస్టింగ్ని బ్రేక్ చేసి రాత్రికి 8.30కి ఇంటికి తిరిగి రావడం. రాత్రి ఇద్దరం కలసి డిన్నర్ చేస్తాం. ఈ మాసంలో మా ఆయన రోజువారి జీవితం ఇలా ఉంటుంది. ఫాస్టింగ్ (ఉపవాసం) చేయడం చాలా కష్టం కదా? అది కూడా రోజంతా నీళ్లు తాగకుండా, లాలాజలం కూడా మింగకుండా అంటే చాలా చాలా కష్టం... నా భర్త అని మాత్రమే కాదు... ఫాస్టింగ్ ఉండే ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్. ఎంతో మనో నిబ్బరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. బహుశా దైవ ఆరాధనలో ఉన్నాం అన్న భావనే ఆ శక్తి ఇస్తుందనుకుంటా. నిత్యం ‘రోజా’ మొదలెట్టాక కొద్ది సమయం గడిచాక ‘ఇవాళ రోజా ఉండగలను’ అని అనిపించి సంకల్పం చెప్పుకుంటారు. ఈ సంకల్పం చెప్పుకోని ముందు ఏవైనా అవాంతరాలు వస్తే రోజాను బ్రేక్ చేయవచ్చు. కాని సంకల్పం చెప్పుకున్నాక ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాణం పోతున్నా సరే రోజాను బ్రేక్ చేయకూడదు. ఇవాళ రోజా ఉంటున్న కోట్లాది మంది నిత్యం సంకల్పం చెప్పుకుంటున్నవాళ్లే. ఇంత ఎండల్లో ఎంత ఇబ్బంది ఉన్నా వారు ఇఫ్తార్ సమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టక ఉపవాసం ఉండటం చాలా గొప్ప. ఇది దైవం నుంచి శక్తి పొందడమే అని అనుకుంటాను. ఈ మాసంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందట కదా? నాకు తెలిసి ఈద్‌కి వారం పదిరోజులు ముందు ఏదైనా అడిగితే జరుగుతుందని నమ్ముతారు. అది వాళ్ల మత సంప్రదాయం. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఆ నమ్మకానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. దేవుడి ధ్యానంలో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడు న్యాయమైన కోరికలను భగవంతుడు తీరుస్తాడని అనుకోవచ్చు. అన్ని మతాలకూ ఇది వర్తిస్తుంది. మీరు హిందువు. మరి ఇస్లామ్ సంప్రదాయం గురించి మీకు ముందే తెలుసా? మ్యారేజ్ అయిన తర్వాతే తెలుసుకున్నారా? నాకు ముందే తెలుసు. నాకు ముస్లిమ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. మా స్కూల్లో చాలా మంది స్కూల్‌మేట్స్ ముస్లిమ్లే. అయితే పెళ్లయిన తర్వాతే ఇంకా డెప్త్‌గా తెలిసింది. ముస్లిమ్లలో కమ్యూనిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతి పాటిస్తారు. మా భర్త వాళ్లు ‘బొహ్రా’ ముస్లిమ్‌లు. వీళ్ల పద్ధతి ఎలా ఉంటుందంటే.. హైదరాబాద్, బెంగళూరు.. వేరే చోటుకి ట్రావెల్ చేశారంటే ఆ ప్రాంతాల్లో వాళ్ల రక్తసంబంధీకులు ఉంటేనే ఉపవాసం ఉంటారు. లేదంటే చేయరు. ముస్లిమ్‌లు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంటారు. ముస్తఫాగారు క్రమం తప్పకుండా చేస్తుంటారా? అలా ఏం లేదనుకుంటా. వీలుండి చేసే వాళ్లు చేస్తుంటారు. మా అత్తా మావయ్య మూడు సార్లకు తగ్గకుండా నమాజ్ చేస్తుంటారు. ఉదయం, మ«ధ్యాహ్నం, సాయంత్రం చేస్తుంటారు. ఇది కేవలం నా ఫ్యామిలీ గురించి చెబుతున్నాను. అందరి గురించి కాదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కుదురుతుందా? నమాజ్ చేయాలంటే మనం ఉన్న చోటు అందుకు అనువుగా ఉండాలేమో? ముస్తఫా అయితే దగ్గర్లో ఉన్న మసీద్ లేదా కమ్యూనిటీ హాల్, రిలేటివ్స్ ఇంటికి వెళతారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు చుట్టాలుంటే వాళ్ల ఇంట్లో చేస్తారు. కాని శుభ్రమైన చోటు ఉంటే ఎక్కడైనా సరే నమాజు వేళలో ఒక వస్త్రం పరుచుకుని నమాజు చేసుకోవచ్చని చెబుతారు. రంజాన్‌కు సంబంధించిన బాధ్యత కలిగిన విషయం ఏంటంటే ‘జకాత్’ (దానం). దాని గురించి? కేవలం రంజాన్ సమయంలో మాత్రమే కాదు అన్ని సమయాల్లో మేం చారిటీ చేస్తుంటాం. అయితే రంజాన్ నెలలో ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాం. చిన్నపిల్లలకు ఫుడ్ ఇస్తాం. చదువుకోవడానికి సహాయం చేస్తాం. పెద్దవాళ్లకి హెల్ప్ చేస్తుంటాం. ఆహారం సమకూర్చడం, ఆర్థిక సహాయం, బట్టలివ్వడం... ఇలా ఏదంటే అది చేసేస్తాం. చాలా తృప్తిగా ఉంటుంది. రంజాన్ వంటకాల్లో మీకు నచ్చిన వంటకం ఏది? ముంబైలో ‘భేండి బజార్’ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ దొరికే స్వీట్స్ చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో ఆ బజార్లో ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తారు. ఈ సీజన్లో తప్ప వేరే సమయాల్లో అలాంటి స్వీట్స్ దొరకవు. ముస్లిమ్‌లకు శుక్రవారాలు ముఖ్యమైనవి. ఆ రోజున నా భర్త పొద్దునే మసీద్‌కు వెళ్లి నమాజ్ ముగించుకుని అక్కడికెళ్లి ఎక్కువ స్వీట్స్ తీసుకు వస్తారు. ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత స్వీట్స్ తింటాం. ఈ సీజన్లో అక్కణ్ణుంచి స్వీట్స్ తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. అవి ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగే అక్కడ తయారు చేసే ఫలూదా చాలా టేస్టీగా ఉంటుంది. ఫలూదాని అక్కడ ‘మాహిమ్’ అంటారు. ఇంట్లో ఒకరు ఉపవాసం ఉంటే పక్కవాళ్లకి తినడం ఇబ్బందిగా ఉంటుందా? అలా ఏం లేదండి. నేను నా ఆహారాన్ని స్కిప్ చేయను. మనం తింటున్నామని వాళ్ల ఫాస్టింగ్‌కి భంగం కలగదు. వాళ్ల ఆలోచన ఫుడ్ వైపు వెళ్లదు. నేనైతే అంత సిన్సియర్‌గా ఫాస్టింగ్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. అందుకే వాళ్ల విల్ పవర్‌కి నిజంగా హ్యాట్సాఫ్. సినిమా స్టార్స్‌కి కొత్త బట్టలంటే పెద్ద విషయం కాదు. కానీ ఈద్ టైమ్‌లో కొత్త బట్టలు కొనుక్కుంటారా? ఫాస్టింగ్ ఉంటున్న రోజుల్లో షాపింగ్ చేయం. ఈద్ సెలబ్రేట్ చేసుకునే ముందు రోజు మాత్రం బట్టలు కొనుక్కుంటాం. నేను సల్వార్లు కొనుక్కుంటాను. పెళ్లయిన వాళ్లనందరినీ అందరూ కామన్‌గా అడిగేదే.. పిల్లలు ఎప్పుడు ? ఇప్పుడైతే లేదు (నవ్వుతూ). పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? రిలేషన్షిప్ స్టేటస్ మారింది అంతకుమించి ఏమీ లేదు. పెళ్లికి ముందు ఒక ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు రెండు ఫ్యామిలీలు. బాధ్యత ఇంకాస్త పెరిగింది. ఎప్పుడైనా నమాజ్ చేశారా ? లేదు. అత్తింటివాళ్లు మతం మార్చుకోమని అడగలేదా? అస్సలు లేదు. పెళ్లికి ముందే మేం ఒకరి కోసం మరొకరు మారాలని అనుకోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని అనుకున్నాం. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యాం. మా పెద్దవాళ్లు దానికి అంగీకరించారు. మా అత్తామామలైతే ‘ఇన్నేళ్లుగా ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా.. సడన్‌గా మార్పు అంటే కష్టం. ఇన్నేళ్లూ ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి’ అన్నారు. మా అత్తమామయ్యలు చాలా బ్రాడ్ మైండెడ్. అర్థం చేసుకున్నారు. మా అమ్మానాన్న కూడా మాలో మార్పు కోరుకోలేదు. మతాలు ఏవైనా సాటి మనిషి పట్ల మానవత్వంతో ఉండటమే మా అభిమతం. అందరి అభిమతం అదే కావాలి. అప్పుడే అందరం బాగుంటాం. ఇక íసినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సిరివెన్నెల’ చేస్తున్నారు. ఇంకేమైనా చేస్తున్నారా? కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను. అమేజాన్ ప్రైమ్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలో ఈ సిరీస్ సీజన్ 2 కూడా స్టార్ట్ కాబోతోంది. తెలుగులో ‘ఢీ’ టీవీ షో చేస్తున్నాను. అలాగే మలయాళంలో కూడా టీవీ షోలు చేస్తున్నా. వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బావుంది. సినిమా షూటింగ్‌లానే ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుంది. రోజుకు 6–7 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ అని నేను నమ్ముతాను. ఫైనల్లీ.. సినిమాలు, సిరీస్‌లు, షోలతో బిజీ స్టార్‌గానే కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది? ఐయామ్ గ్లాడ్. రోజులు మారుతున్నాయి. చాలా మంది అంటుంటారు పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. నేను 18–19 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. సడన్‌గా ఇప్పుడు ఆపేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేస్తాను. మా అత్తమామలు, హస్బెండ్ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంటారు. నువ్వు వర్క్ చేయి... ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మాకే ఏదోలా అనిపిస్తుంటుంది అంటారు. అంత సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకేం కావాలి. అయితే సినిమాలలో పాత్రలు ఆఫర్ చేసేటప్పుడు పెళ్లయిన హీరోయిన్లను కేవలం కొన్ని పాత్రలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఆ విధానం మారుతున్నట్టుగా కనిపిస్తుంది. – డి.జి. భవాని ప్రేమకు కుల మతాలు ఉండవు. మనసులు కలిస్తే చాలు. ప్రియమణి, ముస్తఫా రాజ్‌ల మనసులు కలిశాయి. అయితే ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి అనుకున్నారు. హిందు–ముస్లింల మధ్య పెళ్లి. తమిళ, ఉర్దూ భాషల మధ్య పెళ్లి. ఏమవుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. కాని రెండు కుటుంబాల వాళ్లు అంగీకరించారు. అబ్బాయి తరపువారు ‘నువ్వు ముస్లిం అమ్మాయిగా మారితేనే’ అని ప్రియమణికి కండీషన్ పెట్టలేదు. అమ్మాయి తరపువారు ‘నువ్వు హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవుతావా’ అని ముస్తఫాని అడగలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముస్తఫా ముంబైలో ఈవెంట్స్ మేనేజర్. మంచి పలుకుబడి ఉంది. నటిగా దక్షిణ, ఉత్తరాదిన ప్రియమణి ఫేమస్. 2017 అగస్ట్ 23న వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ‘మా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది’ అన్నారు ప్రియమణి. రంజాన్ మాసంలో భర్త ఆచరిస్తున్న నియమాల గురించి ‘సాక్షి’తో చెప్పారు. ఇండస్ట్రీలో ఉండే పోటీ వల్ల ఒత్తిడికి గురవుతుంటారా? మీ సక్సెస్ మంత్ర? లేదు. నాకెప్పుడూ స్ట్రెస్ అనిపించలేదు. ఎందుకంటే పోటీ అవసరం అని నా ఫీలింగ్. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా సక్సెస్ మంత్ర ఏంటంటే ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’. ఇవాళ కాకపోయినా ఏదో రోజు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతాను. దక్కుతుందో లేదో అని సందేహించి కష్టపడటం మానేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే మిగిలిపోతాం. -
సిరివెన్నెల
తెలుగు తెరపై ప్రియమణి కనిపించి రెండేళ్లయింది. ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే ఏ తెలుగు చిత్రంలో నటించలేదు. గతేడాది ముస్తఫా రాజ్‌ని పెళ్లాడిన ప్రియమణి కెరీర్‌పై కూడా బాగానే ఫోకస్ చేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత ఈ సినిమా నిర్మించనున్నారు. తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్‌ని ప్రియమణి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి మా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శక–నిర్మాతలు చెప్పారు. సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, ‘రాకెట్’ రాఘవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. -
ప్రియమణి చెపుతానన్న గుడ్‌న్యూస్ అదేనా..!
గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న నటి ప్రియమణి తల్లి కాబోతున్నారన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ప్రియమణి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆమె చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలాన్నీచేకూరుస్తుంది. ఇటీవల ప్రియమణి తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసి, త్వరలో నేను, నా భర్త ముస్తఫారాజ్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా. వేచి ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రియమణి త్వరలో తాను తల్లి కాబోతున్న విషయం ప్రకటిస్తారని భావిస్తున్నారు అభిమానులు. పెళ్లి తరువాత నటనకు దూరమైన ప్రియమణి ప్రస్తుతం బుల్లితెర మీద పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజర్‌గా బిజీగా ఉన్నారు. Something interesting and fun coming up for all of you from my mister @mustufaraj and me soon!!! Wait and watch pic.twitter.com/IBFcQi0GCI — Priyamani Raj (@priyamani6) 29 July 2018 -
ప్రియుడితో ప్రియమణి పెళ్లి
చెన్నై: నటి ప్రియమణి పెళ్లి తేదీ ఖరారైంది. ఆగస్టు 23వ తేదీన ప్రియుడితో మూడుముళ్లకు ప్రియమణిని సిద్దం అవుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం మొదలగు దక్షిణాది భాషల్లో కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో కొనేళ్లగా ప్రేమాయణం సాగిస్తున్న ప్రియమణి, ప్రియుడినే పరిణయమాడటానికి రెడీ అయ్యారు. వీరికి గతేడాది మే 28న వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఈ నేపధ్యంలో ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 23వ తేదీన ముస్తఫారాజ్, ప్రియమణి నిరాడంబరంగా రిజిస్టర్ పెళ్లి చేసుకోనున్నారు. 24వ తేదీన బెంగుళూర్లో వివాహ రిసెప్షన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ రిసెప్షన్‌కు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. చదవండి: ప్రియుడితో ప్రియమణి నిశ్చితార్థం -
కుబూల్ హై!
నిఖా జరుగుతున్నప్పుడు అమ్మాయిని ‘అబ్బాయి నచ్చాడా? పెళ్లికి ఒప్పుకున్నావా?’ అని అడిగితే.. అమ్మాయి.. ‘కుబూల్ హై’ అనాలి. అప్పుడే పెళ్లి జరుగుతుంది. ఇది ఇస్లామ్ ఆచారం. ఎవరి ఒత్తిడి వల్లనో కాకుండా నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగే సంప్రదాయం ఇస్లామ్ది. ప్రియమణి ముస్తఫాను పెళ్లి చేసుకోబోతోంది. ‘రసమ్’ (ఎంగేజ్మెంట్) హోగయా! నెక్ట్స్ ఇయర్ పెళ్లి! ఈలోపు ‘ఇస్లాం మతస్తుణ్ణి చేసుకోబోతున్నావా?’ అని కొందరు అడుగుతున్నారు. కొందరు వెలి వేస్తున్నారు. ప్రియమణి ధైర్యంగా చెబుతోంది... ‘హా.. ముఝే కుబూల్ హై’. అంటే.. ‘అవును.. నాకు సమ్మతమే’. ♦ సినిమాలు తగ్గించేశారేంటి.. కారణం? నా కెరీర్‌ని గమనిస్తే గ్లామరస్ రోల్స్ తక్కువ.. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉన్న పాత్రలు చేసిన విషయం మీకు అర్థమవుతుంది. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసు కుంటే బాధపడే పాత్రలు చేయకూడదు. మలయాళం, కన్నడంలో చేస్తున్నా. తెలుగు, తమిళంలో ఈ మూడేళ్లల్లో మంచి పాత్రలు రాలేదు. క్వాంటిటీ చూసుకుంటే ఈపాటికి రెండొందలు సినిమాలు చేసేసేదాన్ని. నాకు క్వాలిటీ ముఖ్యం. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌గారు తీసిన ఈ ‘మన ఊరి రామాయణం’లో టిపికల్ వేశ్య క్యారెక్టర్ చేశా. ఓ విచిత్రమైన పరిస్థితిని ఈ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుంది? అతను (ప్రకాశ్‌రాజ్ పాత్ర) ఎలా హ్యాండిల్ చేస్తాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో అతనికి తారసపడే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో ఈ అమ్మాయి ఒకటి. అతని ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. ♦ బుల్లితెరపై డ్యాన్స్ షోస్‌కి జడ్జిగా చాలానే సందడి చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జడ్జిని కాబట్టి, పోటీదారులను క్షుణ్ణంగా గమనించి తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్‌గా నేనెవర్నీ హర్ట్ చేసే టైప్ కాదు. అందుకే, ‘మీరు కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనో, అంతకుముందు బాగా చేశారు.. ఇప్పుడేమైంది అనో, సెట్ ప్రాపర్టీస్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనో’.. ఇలా వాళ్లు బాధ పడకుండా చెబుతుంటాను. ♦ మీ ప్రేమకథ తెలుసుకోవాలని ఉంది.. ముస్తఫా రాజ్‌తో లవ్ గురించి? (నవ్వేస్తూ)... నాలుగేళ్ల క్రితం సీసీఎల్ మ్యాచ్‌లప్పుడు పరిచయం. అది స్నేహంగా మారి, ప్రేమగా మారి, పెళ్లి దాకా వచ్చేసింది. ముస్తఫా మంచి లైఫ్ పార్టనర్ అవుతాడనిపించింది. నా గురించి కూడా తనకు సేమ్ ఫీలింగ్. ♦ మీ సినిమాలను ముస్తఫా చూశారా? నేను చేసినవాటిలో ఆయనకు తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’ ఇష్టం. తెలుగు ‘చండి’, ‘చారులత’ కూడా చూశాడు. సౌత్ సినిమాలు చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ కంపల్సరీ. ఎందుకంటే ఆయనకు ఇక్కడి భాషలు తెలియవు. ♦ మీరిద్దరూ ఇంగ్లిష్ లేకపోతే హిందీలో మాట్లాడుకుంటారా? అవును. స్కూల్లో నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. అదిప్పుడు హెల్ప్ అవుతోంది. ముస్తఫా, నేనూ ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటాం. ఆయన పేరెంట్స్‌తో మాత్రం హిందీలో మాట్లాడతాను. ♦ ఐదారేళ్ల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్నారు. మొత్తానికి అది నెరవేర్చుకుంటున్నారు.. నాకు మొదట్నుంచీ లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. ఇప్పటికిప్పుడు ఒక అబ్బాయిని చూసి, ‘ఈ అబ్బాయితో జీవితాంతం నువ్వు ఉండాలి. పెళ్లి చేసుకోవాలి’ అని చెబితే నావల్ల కాదు. ఎందుకంటే మనిషి మనస్తత్వం తెలియకుండా జీవితం పంచుకోలేను. నా మిగతా జీవితాన్ని ఎవరితో అయితే గడపాలనుకుంటున్నానో ఆ వ్యక్తి తాలూకు ఇష్టాయిష్టాలు, ప్లస్సులు, మైనస్సులు అన్నీ నాకు తెలియాలి. అలాగే నేనేంటో కూడా అవతలి వ్యక్తికి తెలియాలి. ఒక విషయాన్ని ఆ వ్యక్తి ఏ దృష్టికోణంతో ఆలోచిస్తున్నాడో నాకు తెలియాలి. నా గురించి కూడా తనకు అవగాహన ఉండాలి. ఒకర్నొకరు అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ సలహాలు ఇచ్చుకోవాలో, ఎక్కడ సహాయం చేసుకోవాలో తెలుస్తుంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసేసుకుని, ఒకవేళ ఆ పర్సన్‌తో వేవ్‌లెంగ్త్ కుదరకపోతే పశ్చాత్తాపపడే బదులు ముందే తెలుసుకుంటే మంచిదనుకున్నాను. అప్పుడు లైఫ్ స్మూత్‌గా ఉంటుంది. అలాగని ఎరేంజ్డ్ మ్యారేజ్ తప్పనను. అవి కూడా స్మూత్‌గా సాగుతుంటాయి. ♦ ఎంగేజ్మెంట్ సింపుల్‌గా కానిచ్చారు. పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారా? అదీ సింపుల్‌గానే. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని, ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా ఇద్దరివీ డిఫరెంట్ రెలిజియన్స్. ఒకవేళ వాళ్ల పద్ధతిలో చేయాలని ముస్లిమ్ వేలోనో, లేకపోతే మాకు తగ్గట్టుగా హిందూ సంప్రదాయంలోనో చేస్తే కరెక్ట్‌గా ఉండదు. మే బీ నిఖా చేసుకుంటాం. వాళ్ల రిజిస్టర్లో సైన్ చేస్తాం. ఆ సంతకంతో అఫీషియల్‌గా పెళ్లి చేసుకున్నట్లు అవుతుంది. ♦ ఇప్పుడు మీరు దర్గాలకు.. ఆయన హిందూ గుళ్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలేమో..? ఎవరి నమ్మకాలనైనా సపోర్ట్ చేయాలి. మాకా క్లారిటీ ఉంది. నేను చాలా దర్గాలకు వెళ్లాను. అజ్మర్ షరీఫ్ దర్గా, ముంబయ్‌లో హజీ అలీకి వెళ్లాను. దర్గా ప్రత్యేకత ఏంటంటే.. ఏ కులం వాళ్లైనా, మతం వాళ్లైనా వెళ్లొచ్చు. గత డిసెంబర్లో అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేశాం. వాగా బోర్డర్, జలియన్‌వాలా బాగ్, గోల్డెన్ టెంపుల్ని చూడాలన్నది నా కోరిక. ముస్తఫా, నేనూ వెళ్లాం. ♦ సూపర్... వాగా బోర్డర్‌కి వెళ్లారా... ఏమనిపించింది? అక్కడ నాలుగు గంటల ప్రాంతంలో పరేడ్ (కవాతు) స్టార్ట్ అవుతుంది. ఇటు ఇండియన్స్ ‘జన గణ మన..’, అటు అక్కడ పాకిస్తానీస్ వాళ్ల జాతీయ గీతం పాడతారు. ఇండియా జిందాబాద్ అని వీళ్లు.. పాకిస్త్తాన్ చీర్ అని వాళ్లు అంటుంటే కలిగే ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేను. పరేడ్ చూడాలంటే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వెళ్లిపోవాలి. ముందు ఎవరు వెళితే వాళ్లకు సీట్స్ ఉంటాయ్. నార్మల్ టికెట్స్, స్పెషల్ టికెట్స్ ఉంటాయి. మేం నార్మల్ టికెట్ తీసుకున్నాం. ఎంతమంది జనాలు ఉంటారంటే ముందు వెళ్లకపోతే ఓ పది కిలోమీటర్లు వెనక ఆగిపోవాల్సిందే. మా ముస్తఫాది షార్ప్ బ్రైన్ కదా. ఆ బ్రైన్‌కి సెల్యూట్. తను ఓ పెద్ద ఆఫీసర్ దగ్గరికెళ్లి ‘ఇండియా నుంచి పెద్ద స్టార్ వచ్చింది. మీరు హెల్ప్ చేయాలి’ అన్నాడు. అప్పుడాయన స్పెషల్ ఎంట్రీలో మమ్మల్ని పంపించారు. పరేడ్‌ని దగ్గరగా చూశాం. ఆ ఆఫీసర్‌తో ఫొటోలు దిగాం. ఫైనల్‌గా వచ్చేస్తుంటే... ‘హీరోయిన్ మేడమ్. మీతో ఫొటో కావాలి’ అని ఫొటోలు దిగారు. ♦ ఆర్టిస్టులకు చాలా విషయాల్లో ఉపయోగం ఉంటుందన్న మాట. జలియన్‌వాలా బాగ్ అనుభూతినీ పంచుకుంటారా? (నవ్వుతూ)... వాగా బోర్డర్లో కూడా ఇంత వర్కవుట్ అవుతుందని తెలీదు. జలియన్‌వాలా బాగ్ గురించి చెప్పాలంటే... అక్కడికి వెళ్లగానే చాలా డిప్రెస్డ్గా అనిపించింది. గోడపై బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి. మామూలుగా మనం బావి చూసినప్పుడు ఏమీ అనిపించదు. అక్కడి బావిలోకి తొంగి చూసినప్పుడు దుఃఖం తన్నుకొచ్చింది. ముస్తఫా.. వెరీ ఇంటెలిజెంట్ మీఇద్దరిలో ఎవరు తెలివిగలవాళ్లు..ఉదాహరణలతో చెబుతారా? ముస్తఫానే. ఏదైనా సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. చివరికి తెలియని నంబర్ల నుంచి పదే పదే ఫోన్ వస్తే కంగారు పడిపోతాను. అదేంటో చూడమని తనకే చెబుతాను. నాకనే కాదు.. మా నాన్నగారు, బ్రదర్ ముంబయ్‌లో బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ పరంగా వాళ్లకేమైనా ప్రాబ్లమ్ వస్తే ముస్తఫా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అది కూడా తెలివిగా. మిగతా జీవితాన్ని ఈయనతో హ్యాపీగా గడిపేయొచ్చనే భరోసా దక్కిందేమో..? ఆ భరోసా ఉంది. ఇప్పటికి మేం ఓ 90 శాతం ఒకర్నొకరు అర్థం చేసుకుని ఉంటాం. ఇంకా అర్థం చేసుకోవాలి. లైఫ్ అనేది డెఫినెట్‌గా ‘బెడ్ ఆఫ్ రోజెస్’ కాదు. చిన్ని చిన్ని ఆటుపోట్లు ఉంటాయి. అన్నీ తట్టుకునే కెపాసిటీ ఇద్దరికీ ఉంది. అందుకని మా లైఫ్ బాగుంటుందనే నమ్మకం ఉంది. పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేయడం ఆయనకు ఇష్టమేనా? కనీసం నాలుగైదేళ్లయినా హ్యాపీగా కెరీర్ కంటిన్యూ చెయ్ అన్నాడు. ♦ జనరల్‌గా ట్రిప్ అంటే ఫారిన్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేస్తే ముస్తఫా ఏమన్నారు? ఆయనక్కూడా ఇష్టమే. నింబూ స్పోర్ట్స్‌కి పని చేశాడు ముస్తఫా. ఆ టైమ్‌లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియన్ క్రికెటర్స్‌తో పాకిస్తాన్ వెళ్లాడు. అప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి వాగా బోర్డర్ చూశాడు. నాకెందుకు వెళ్లాలనిపించిందంటే... మా అమ్మ (లతామణి) బాడ్మింటన్ ప్లేయర్. పటియాలా, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చూశారామె. ‘ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఓ స్ట్రిప్ వంటి ల్యాండ్ ఉంది. అది ఇండియాదీ కాదు, పాకిస్తాన్దీ కాదు’ అని అమ్మ చెబుతుండేది. వాగా బోర్డర్‌ని సందర్శించాల్సిందనే కోరిక అప్పుడే కలిగింది. ♦ అవార్డ్ ఫంక్షన్స్ అంటే మీ ఉడ్బీకి ఇష్టమేమో.. ఆ మధ్య మీతో కలసి ఐఫా అవార్డ్స్‌కి వచ్చారు కదా? ముస్తఫా ఈవెంట్ మేనేజర్. ‘జింగ్ ఈవెంట్స్’ అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. మరో పార్టనర్‌తో కలసి ‘సిక్స్ జింగ్’ అని ఈ మధ్య కొత్త కంపెనీ పెట్టాడు. ♦ సోషల్ మీడియాలో అత్యాచారాల గురించి స్పందిస్తూ.. ‘ఇండియా నుంచి వెళ్లిపోవాలి’ అని మీరన్నది వివాదమైంది..? ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటల్లో అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించడం తగదు. ‘ఆల్మోస్ట్ ఎవ్రీడే మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇండియా సేఫ్ కాదనుకుంటే ఇక్కణ్నుంచి వెళ్లిపోండి’ అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే.. ‘వై ఈజ్ ఇట్ (ఇండియా) అన్‌సేఫ్ ఫర్ విమెన్?’ అని. అఫ్కోర్స్ ప్రపంచంలో ఎక్కడా సెఫ్టీ లేదు. కానీ, ప్రపంచంలో ఎక్కడ జరిగినా మనకు తెలియకపోవచ్చు. ఇండియాలో జరుగుతున్నది తెలిసిపోతుంది కాబట్టి, మన దేశం గురించి మాట్లాడాల్సి వచ్చింది. 18 ఏళ్ల వయసు లోపు అబ్బాయి తప్పు చేస్తే జువైనల్‌కి పంపిస్తున్నారు. అక్కణ్ణుంచి తిరిగొచ్చాక అతను మామూలు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అతణ్ణి ఎందుకు పనిష్ చేయకూడదు. ‘ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఎందుకన్నారు? మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. కానీ, డిఫెన్స్ మెకానిజమ్ నేర్చుకుని హెల్ప్ యువర్ సెల్ఫ్ అని మీరంటే బాగుండేది’ అని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. ఓకే.. టీనేజ్ అమ్మాయి దగ్గర్నుంచి ఓ 30, 40 ఏళ్ల వరకూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు. మూడు నెలల పసిపాప, 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేస్తే వాళ్లు ఆత్మరక్షణ చేసుకోగలరా? ♦ మీ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా బోల్డన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.. బాధగా ఉండి ఉంటుంది... నా ఫేస్బుక్ పేజీలో ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసిన తర్వాత.. ‘నువ్ పాకిస్తాన్‌కి వెళ్లిపో. మీ పిల్లలు టైస్ట్లుగా పుడతారు. జిహాద్.. అదీ ఇదీ’ అని కామెంట్స్ చేశారు. నన్ను విమర్శించినవాళ్లు షారుక్ ఖాన్ని ఏమీ అనలేదు ఎందుకని? షారుక్ ఓ హిందువుని పెళ్లి చేసుకున్నారు. కరీనా కపూర్ ముస్లిమ్ వ్యక్తి (సైఫ్ అలీఖాన్)ని పెళ్లి చేసుకుంది. ఆమిర్ ఖాన్ హిందూని పెళ్లి చేసుకున్నారు. ఒక వ్యక్తి అయితే.. ‘నువ్వు ఆమిర్‌ఖాన్ సిస్టర్‌గా ఉండాల్సింది’ అని కామెంట్ చేశాడు. ‘ఐయామ్ ప్రౌడ్ టు బి కాల్డ్ ఆమిర్ సిస్టర్’ అన్నా. ‘నా జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని నా ఎంగేజ్మెంట్ వార్తను, ఫొటోలను పంచుకున్నాను. మీ లవ్, సపోర్ట్, కంగ్రాచ్యులేషన్స్ కావాలి. జిహాద్, టైస్ట్, అలాంటి కామెంట్స్ వద్దు’ అన్నాను. నేనెవర్ని పెళ్లి చేసుకుంటాననేది నా ఇష్టం. నా తల్లిదండ్రులకు తప్ప ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ♦ ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. నా తల్లిదండ్రులు నాట్ వెరీ ట్రెడిషనల్. మా అమ్మానాన్నల తరపు ఫ్యామిలీ ట్రీ చూస్తే.. నాకు ఫారినర్ బ్రదర్ ఇన్-లా, సిస్టర్ ఇన్-లాలు ఉన్నారు. బ్రదర్ ఇన్లాల్లో ఓ పంజాబీ, బెంగాలీ, అయ్యర్, ఓ బ్రిటిషర్ బ్రదర్ ఇన్-లా ఉన్నారు. మావాళ్లు బ్రాడ్మైండెడ్. నా వైపు, ముస్తఫా వైపు అంకుల్స్, ఆంటీ లు మా ఇష్టాలను యాక్సెప్ట్ చేశారు. అది మా లక్. ♦ ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? నెక్ట్స్ ఇయర్ ఉండొచ్చు. డేట్ ఫైనలైజ్ చేయలేదు. ♦ ఓకే అండి.. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్యూ... - డి.జి. భవాని -
ఇక ఏడడుగులే ఆలస్యం!
చెన్నైకి చెందిన ముస్తఫా రాజ్ అనే వ్యాపారవేత్తతో కథానాయిక ప్రియమణి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించనున్నారు. బెంగళూరులోని బనశంకరిలో ఉన్న ప్రియమణి స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం ప్రియమణి-ముస్తఫాల వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు. ఇక ఏడడుగులు వేయడమే ఆలస్యం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా? వద్దా? అనే విషయం గురించి ప్రియమణి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా మనసుకి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి కుదరడం ఈ బ్యూటీకి ఆనందాన్నిచ్చి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
పెళ్లి చేసుకోబోతున్న మరో హీరోయిన్
అందాలతార అసిన్ గత నెలలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా అలరించిన ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది. బోయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌ను తాను పెళ్లాడనున్నట్లు ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించింది. ముస్తఫారాజ్‌ను మొదటిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశానని, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రియమణి తెలిపింది. ముస్తఫారాజ్ ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని, మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. తెలుగుతో పాటు పలు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రియమణి తమిళంలో నటించిన 'పరుత్తివీరన్' సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.