కుబూల్ హై! | priyamani special interview about her engagement | Sakshi
Sakshi News home page

కుబూల్ హై!

Published Sat, Sep 17 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

కుబూల్ హై!

కుబూల్ హై!

నిఖా జరుగుతున్నప్పుడు అమ్మాయిని ‘అబ్బాయి నచ్చాడా? పెళ్లికి ఒప్పుకున్నావా?’
అని అడిగితే.. అమ్మాయి.. ‘కుబూల్ హై’ అనాలి. అప్పుడే పెళ్లి జరుగుతుంది.  ఇది ఇస్లామ్ ఆచారం.
ఎవరి ఒత్తిడి వల్లనో కాకుండా నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగే సంప్రదాయం ఇస్లామ్‌ది.
ప్రియమణి ముస్తఫాను పెళ్లి చేసుకోబోతోంది. ‘రసమ్’ (ఎంగేజ్‌మెంట్) హోగయా! నెక్ట్స్ ఇయర్ పెళ్లి!
ఈలోపు ‘ఇస్లాం మతస్తుణ్ణి చేసుకోబోతున్నావా?’ అని కొందరు అడుగుతున్నారు. కొందరు వెలి వేస్తున్నారు. ప్రియమణి ధైర్యంగా చెబుతోంది... ‘హా.. ముఝే కుబూల్ హై’.  అంటే.. ‘అవును.. నాకు సమ్మతమే’.

సినిమాలు తగ్గించేశారేంటి.. కారణం?
నా కెరీర్‌ని గమనిస్తే గ్లామరస్ రోల్స్ తక్కువ.. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కువ ఉన్న పాత్రలు చేసిన విషయం మీకు అర్థమవుతుంది. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసు కుంటే బాధపడే పాత్రలు చేయకూడదు. మలయాళం, కన్నడంలో చేస్తున్నా. తెలుగు, తమిళంలో ఈ మూడేళ్లల్లో మంచి పాత్రలు రాలేదు. క్వాంటిటీ చూసుకుంటే ఈపాటికి రెండొందలు సినిమాలు చేసేసేదాన్ని. నాకు క్వాలిటీ ముఖ్యం. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌గారు తీసిన ఈ ‘మన ఊరి రామాయణం’లో టిపికల్ వేశ్య క్యారెక్టర్ చేశా. ఓ విచిత్రమైన పరిస్థితిని ఈ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుంది? అతను (ప్రకాశ్‌రాజ్ పాత్ర) ఎలా హ్యాండిల్ చేస్తాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో అతనికి తారసపడే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో ఈ అమ్మాయి ఒకటి. అతని ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.

బుల్లితెరపై డ్యాన్స్ షోస్‌కి జడ్జిగా చాలానే సందడి చేస్తున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
జడ్జిని కాబట్టి, పోటీదారులను క్షుణ్ణంగా గమనించి తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్‌గా నేనెవర్నీ హర్ట్ చేసే టైప్ కాదు. అందుకే, ‘మీరు కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనో, అంతకుముందు బాగా చేశారు.. ఇప్పుడేమైంది అనో, సెట్ ప్రాపర్టీస్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనో’.. ఇలా వాళ్లు బాధ పడకుండా చెబుతుంటాను.

మీ ప్రేమకథ తెలుసుకోవాలని ఉంది.. ముస్తఫా రాజ్‌తో లవ్ గురించి?
(నవ్వేస్తూ)... నాలుగేళ్ల క్రితం సీసీఎల్ మ్యాచ్‌లప్పుడు పరిచయం. అది స్నేహంగా మారి, ప్రేమగా మారి, పెళ్లి దాకా వచ్చేసింది. ముస్తఫా మంచి లైఫ్ పార్టనర్ అవుతాడనిపించింది. నా గురించి కూడా తనకు సేమ్ ఫీలింగ్.

మీ సినిమాలను ముస్తఫా చూశారా?
నేను చేసినవాటిలో ఆయనకు తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’ ఇష్టం. తెలుగు ‘చండి’, ‘చారులత’ కూడా చూశాడు. సౌత్ సినిమాలు చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ కంపల్సరీ. ఎందుకంటే ఆయనకు ఇక్కడి భాషలు తెలియవు.

మీరిద్దరూ ఇంగ్లిష్ లేకపోతే హిందీలో మాట్లాడుకుంటారా?
అవును. స్కూల్‌లో నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. అదిప్పుడు హెల్ప్ అవుతోంది. ముస్తఫా, నేనూ ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటాం. ఆయన పేరెంట్స్‌తో మాత్రం హిందీలో మాట్లాడతాను.

ఐదారేళ్ల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్నారు. మొత్తానికి అది నెరవేర్చుకుంటున్నారు..
నాకు మొదట్నుంచీ లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. ఇప్పటికిప్పుడు ఒక అబ్బాయిని చూసి, ‘ఈ అబ్బాయితో జీవితాంతం నువ్వు ఉండాలి. పెళ్లి చేసుకోవాలి’ అని చెబితే నావల్ల కాదు. ఎందుకంటే మనిషి మనస్తత్వం తెలియకుండా జీవితం పంచుకోలేను. నా మిగతా జీవితాన్ని ఎవరితో అయితే గడపాలనుకుంటున్నానో ఆ వ్యక్తి తాలూకు ఇష్టాయిష్టాలు, ప్లస్సులు, మైనస్సులు అన్నీ నాకు తెలియాలి. అలాగే నేనేంటో కూడా అవతలి వ్యక్తికి తెలియాలి. ఒక విషయాన్ని ఆ వ్యక్తి ఏ దృష్టికోణంతో ఆలోచిస్తున్నాడో నాకు తెలియాలి. నా గురించి కూడా తనకు అవగాహన ఉండాలి. ఒకర్నొకరు అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ సలహాలు ఇచ్చుకోవాలో, ఎక్కడ సహాయం చేసుకోవాలో తెలుస్తుంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసేసుకుని, ఒకవేళ ఆ పర్సన్‌తో వేవ్‌లెంగ్త్ కుదరకపోతే పశ్చాత్తాపపడే బదులు ముందే తెలుసుకుంటే మంచిదనుకున్నాను. అప్పుడు లైఫ్ స్మూత్‌గా ఉంటుంది. అలాగని ఎరేంజ్డ్ మ్యారేజ్ తప్పనను. అవి కూడా స్మూత్‌గా సాగుతుంటాయి.

ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా కానిచ్చారు. పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారా?
అదీ సింపుల్‌గానే. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని, ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా ఇద్దరివీ డిఫరెంట్ రెలిజియన్స్. ఒకవేళ వాళ్ల పద్ధతిలో చేయాలని ముస్లిమ్ వేలోనో, లేకపోతే మాకు తగ్గట్టుగా హిందూ సంప్రదాయంలోనో చేస్తే కరెక్ట్‌గా ఉండదు. మే బీ నిఖా చేసుకుంటాం. వాళ్ల రిజిస్టర్‌లో సైన్ చేస్తాం. ఆ సంతకంతో అఫీషియల్‌గా పెళ్లి చేసుకున్నట్లు అవుతుంది.

ఇప్పుడు మీరు దర్గాలకు.. ఆయన హిందూ గుళ్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలేమో..?
ఎవరి నమ్మకాలనైనా సపోర్ట్ చేయాలి. మాకా క్లారిటీ ఉంది. నేను చాలా దర్గాలకు వెళ్లాను. అజ్మర్ షరీఫ్ దర్గా,  ముంబయ్‌లో హజీ అలీకి వెళ్లాను. దర్గా ప్రత్యేకత ఏంటంటే.. ఏ కులం వాళ్లైనా, మతం వాళ్లైనా వెళ్లొచ్చు. గత డిసెంబర్‌లో అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌ని విజిట్ చేశాం. వాగా బోర్డర్, జలియన్‌వాలా బాగ్, గోల్డెన్ టెంపుల్‌ని చూడాలన్నది నా కోరిక. ముస్తఫా, నేనూ వెళ్లాం.

సూపర్... వాగా బోర్డర్‌కి వెళ్లారా... ఏమనిపించింది?
అక్కడ నాలుగు గంటల ప్రాంతంలో పరేడ్ (కవాతు) స్టార్ట్ అవుతుంది. ఇటు ఇండియన్స్ ‘జన గణ మన..’, అటు అక్కడ పాకిస్తానీస్ వాళ్ల జాతీయ గీతం పాడతారు. ఇండియా జిందాబాద్ అని వీళ్లు.. పాకిస్త్తాన్ చీర్ అని వాళ్లు అంటుంటే కలిగే ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేను. పరేడ్ చూడాలంటే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వెళ్లిపోవాలి. ముందు ఎవరు వెళితే వాళ్లకు సీట్స్ ఉంటాయ్. నార్మల్ టికెట్స్, స్పెషల్ టికెట్స్ ఉంటాయి. మేం నార్మల్ టికెట్ తీసుకున్నాం. ఎంతమంది జనాలు ఉంటారంటే ముందు వెళ్లకపోతే ఓ పది కిలోమీటర్లు వెనక ఆగిపోవాల్సిందే. మా ముస్తఫాది షార్ప్ బ్రైన్ కదా. ఆ బ్రైన్‌కి సెల్యూట్. తను ఓ పెద్ద ఆఫీసర్ దగ్గరికెళ్లి ‘ఇండియా నుంచి పెద్ద స్టార్  వచ్చింది. మీరు హెల్ప్ చేయాలి’ అన్నాడు. అప్పుడాయన స్పెషల్ ఎంట్రీలో మమ్మల్ని పంపించారు. పరేడ్‌ని దగ్గరగా చూశాం. ఆ ఆఫీసర్‌తో ఫొటోలు దిగాం. ఫైనల్‌గా వచ్చేస్తుంటే... ‘హీరోయిన్ మేడమ్. మీతో ఫొటో కావాలి’ అని ఫొటోలు దిగారు.

ఆర్టిస్టులకు చాలా విషయాల్లో ఉపయోగం ఉంటుందన్న మాట. జలియన్‌వాలా బాగ్ అనుభూతినీ పంచుకుంటారా?
(నవ్వుతూ)... వాగా బోర్డర్‌లో కూడా ఇంత వర్కవుట్ అవుతుందని తెలీదు. జలియన్‌వాలా బాగ్ గురించి చెప్పాలంటే... అక్కడికి వెళ్లగానే చాలా డిప్రెస్డ్‌గా అనిపించింది. గోడపై బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి. మామూలుగా మనం బావి చూసినప్పుడు ఏమీ అనిపించదు. అక్కడి బావిలోకి తొంగి చూసినప్పుడు దుఃఖం తన్నుకొచ్చింది.
ముస్తఫా.. వెరీ ఇంటెలిజెంట్
మీఇద్దరిలో ఎవరు తెలివిగలవాళ్లు..ఉదాహరణలతో చెబుతారా?
ముస్తఫానే. ఏదైనా సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. చివరికి తెలియని నంబర్ల నుంచి పదే పదే ఫోన్ వస్తే కంగారు పడిపోతాను. అదేంటో చూడమని తనకే చెబుతాను. నాకనే కాదు.. మా నాన్నగారు, బ్రదర్ ముంబయ్‌లో బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ పరంగా వాళ్లకేమైనా ప్రాబ్లమ్ వస్తే ముస్తఫా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అది కూడా తెలివిగా.

మిగతా జీవితాన్ని ఈయనతో హ్యాపీగా గడిపేయొచ్చనే భరోసా దక్కిందేమో..?
ఆ భరోసా ఉంది. ఇప్పటికి మేం ఓ 90 శాతం ఒకర్నొకరు అర్థం చేసుకుని ఉంటాం. ఇంకా అర్థం చేసుకోవాలి. లైఫ్ అనేది డెఫినెట్‌గా ‘బెడ్ ఆఫ్ రోజెస్’ కాదు. చిన్ని చిన్ని ఆటుపోట్లు ఉంటాయి. అన్నీ తట్టుకునే కెపాసిటీ ఇద్దరికీ ఉంది. అందుకని మా లైఫ్ బాగుంటుందనే నమ్మకం ఉంది.

పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేయడం ఆయనకు ఇష్టమేనా?
కనీసం నాలుగైదేళ్లయినా హ్యాపీగా కెరీర్ కంటిన్యూ చెయ్ అన్నాడు.                                                                                                 
జనరల్‌గా ట్రిప్ అంటే ఫారిన్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేస్తే ముస్తఫా ఏమన్నారు?
ఆయనక్కూడా ఇష్టమే. నింబూ స్పోర్ట్స్‌కి పని చేశాడు  ముస్తఫా. ఆ టైమ్‌లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియన్ క్రికెటర్స్‌తో పాకిస్తాన్ వెళ్లాడు. అప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి వాగా బోర్డర్ చూశాడు. నాకెందుకు వెళ్లాలనిపించిందంటే... మా అమ్మ (లతామణి) బాడ్మింటన్ ప్లేయర్. పటియాలా, అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ చూశారామె. ‘ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఓ స్ట్రిప్ వంటి ల్యాండ్ ఉంది. అది ఇండియాదీ కాదు, పాకిస్తాన్‌దీ కాదు’ అని అమ్మ చెబుతుండేది. వాగా బోర్డర్‌ని సందర్శించాల్సిందనే కోరిక అప్పుడే కలిగింది.

అవార్డ్ ఫంక్షన్స్ అంటే మీ ఉడ్‌బీకి ఇష్టమేమో.. ఆ మధ్య మీతో కలసి ఐఫా అవార్డ్స్‌కి వచ్చారు కదా?
ముస్తఫా ఈవెంట్ మేనేజర్. ‘జింగ్ ఈవెంట్స్’ అని ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉంది. మరో పార్టనర్‌తో కలసి ‘సిక్స్ జింగ్’ అని ఈ మధ్య కొత్త కంపెనీ పెట్టాడు.

సోషల్ మీడియాలో అత్యాచారాల గురించి స్పందిస్తూ.. ‘ఇండియా నుంచి వెళ్లిపోవాలి’ అని మీరన్నది వివాదమైంది..?
ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటల్లో అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించడం తగదు. ‘ఆల్మోస్ట్ ఎవ్రీడే మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇండియా సేఫ్ కాదనుకుంటే ఇక్కణ్నుంచి వెళ్లిపోండి’ అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే.. ‘వై ఈజ్ ఇట్ (ఇండియా) అన్‌సేఫ్ ఫర్ విమెన్?’ అని. అఫ్‌కోర్స్ ప్రపంచంలో ఎక్కడా సెఫ్టీ లేదు. కానీ, ప్రపంచంలో ఎక్కడ జరిగినా మనకు తెలియకపోవచ్చు. ఇండియాలో జరుగుతున్నది తెలిసిపోతుంది కాబట్టి, మన దేశం గురించి మాట్లాడాల్సి వచ్చింది.

18 ఏళ్ల వయసు లోపు అబ్బాయి తప్పు చేస్తే జువైనల్‌కి పంపిస్తున్నారు. అక్కణ్ణుంచి తిరిగొచ్చాక అతను మామూలు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అతణ్ణి ఎందుకు పనిష్ చేయకూడదు. ‘ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఎందుకన్నారు? మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. కానీ, డిఫెన్స్ మెకానిజమ్ నేర్చుకుని హెల్ప్ యువర్ సెల్ఫ్ అని మీరంటే బాగుండేది’ అని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. ఓకే.. టీనేజ్ అమ్మాయి దగ్గర్నుంచి ఓ 30, 40 ఏళ్ల వరకూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు. మూడు నెలల పసిపాప, 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేస్తే వాళ్లు ఆత్మరక్షణ చేసుకోగలరా?

మీ ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా బోల్డన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.. బాధగా ఉండి ఉంటుంది...
నా ఫేస్‌బుక్ పేజీలో ఎంగేజ్‌మెంట్ ఫొటో పోస్ట్ చేసిన తర్వాత.. ‘నువ్ పాకిస్తాన్‌కి వెళ్లిపో. మీ పిల్లలు టైస్ట్‌లుగా పుడతారు. జిహాద్.. అదీ ఇదీ’ అని కామెంట్స్ చేశారు. నన్ను విమర్శించినవాళ్లు షారుక్ ఖాన్‌ని ఏమీ అనలేదు ఎందుకని? షారుక్ ఓ హిందువుని పెళ్లి చేసుకున్నారు. కరీనా కపూర్ ముస్లిమ్ వ్యక్తి (సైఫ్ అలీఖాన్)ని పెళ్లి చేసుకుంది. ఆమిర్ ఖాన్ హిందూని పెళ్లి చేసుకున్నారు. ఒక వ్యక్తి అయితే.. ‘నువ్వు ఆమిర్‌ఖాన్ సిస్టర్‌గా ఉండాల్సింది’ అని కామెంట్ చేశాడు.

‘ఐయామ్ ప్రౌడ్ టు బి కాల్డ్ ఆమిర్ సిస్టర్’ అన్నా. ‘నా జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని నా ఎంగేజ్‌మెంట్ వార్తను, ఫొటోలను పంచుకున్నాను. మీ లవ్, సపోర్ట్,  కంగ్రాచ్యులేషన్స్ కావాలి. జిహాద్, టైస్ట్, అలాంటి కామెంట్స్ వద్దు’ అన్నాను. నేనెవర్ని పెళ్లి చేసుకుంటాననేది నా ఇష్టం. నా తల్లిదండ్రులకు తప్ప ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్కషన్ జరిగిందా?
ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. నా తల్లిదండ్రులు నాట్ వెరీ ట్రెడిషనల్. మా అమ్మానాన్నల తరపు ఫ్యామిలీ ట్రీ చూస్తే.. నాకు ఫారినర్ బ్రదర్ ఇన్-లా, సిస్టర్ ఇన్-లాలు ఉన్నారు. బ్రదర్ ఇన్‌లాల్లో ఓ పంజాబీ, బెంగాలీ, అయ్యర్, ఓ బ్రిటిషర్ బ్రదర్ ఇన్-లా ఉన్నారు. మావాళ్లు బ్రాడ్‌మైండెడ్. నా వైపు, ముస్తఫా వైపు అంకుల్స్, ఆంటీ లు మా  ఇష్టాలను యాక్సెప్ట్ చేశారు. అది మా లక్.

ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?
నెక్ట్స్ ఇయర్ ఉండొచ్చు. డేట్ ఫైనలైజ్ చేయలేదు.

ఓకే అండి.. విష్ యు ఆల్ ది బెస్ట్.
థ్యాంక్యూ... 
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement