ప్రియమణి
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు.
దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్‌లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు.
వెంకీ సార్ అలా అనడం హ్యాపీ
వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను.
99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని
ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను.
తనని చూస్తే నాకు గర్వం
విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే.
అతను నా లక్కీ చార్మ్
నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు.
మైండ్‌సెట్ మారింది!
òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు.
పారితోషికం తగ్గించాను
కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను.
Comments
Please login to add a commentAdd a comment