ఒకసారి ప్రవక్త మహనీయులు మస్జిదె నబవీలో సహచరులతో సమావేశమై ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి మస్జిదులోకి ప్రవేశించాడు. ఆయన గడ్డం నుండి వజూ నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. అతన్ని చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇతను స్వర్గవాసి’ అన్నారు.ప్రవక్త స్వయంగా స్వర్గవాసి అని చెప్పారంటే, ఈయనలో ఏదోప్రత్యేకత ఉండి ఉంటుంది, తెల్లవార్లూ దైవారాధనలోనే గడుపుతాడేమోని భావించిన ఒక సహచరుడు, అదేమిటో తెలుసుకోవాలని ఆయన్ని అనుసరించాడు.కాని తన అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇషా నమాజ్ అనంతరం దువా చేసుకొని పడుకున్న పెద్దమనిషి ఫజర్ నమాజు అజాన్ పిలుపునకు మాత్రమే లేచాడు.
రాత్రంతా కనీసం ఒక్క నఫిల్ నమాజు కూడా చేయలేదు! ఈ రోజు ఆరోగ్యం బాగోలేక చెయ్యలేదేమో.. అనుకొని రెండవరోజు గమనించాడు. రెండవరోజూ అదే పరిస్థితి. అలా నాలుగురోజులు గడిచి పొయ్యాయి.చివరికి ఉండబట్టలేక ‘ప్రవక్తవారు మిమ్మల్ని స్వర్గవాసి అన్నారు. మీ ఆరాధనల్లోని ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించాడు.దానికాయన, ‘ప్రత్యేకత ఏమీ లేదు బాబూ!’ అన్నాడు.‘లేదు.. లేదు.. ఏదో ఉంది. దయచేసి చెప్పండి’ అని బతిమాలాడు.దానికాయన, ‘బాబూ.. ఏమీ లేదు కాని ఒక చిన్న విషయం. అదేమిటంటే, మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకుంటాను.
రవంత అసూయా ద్వేషాలు కూడా మనసులోకి రానివ్వను. ఇదొక్కటే.. ఇది తప్ప ఇంకెలాంటి ప్రత్యేకతా లేదు’ అన్నాడు.అందుకే ముహమ్మద్ ప్రవక్త వారు, ‘అగ్ని కట్టెల్ని భస్మం చేసినట్లు అసూయ సత్కార్యాలను భస్మం చేస్తుందని, నరకానికి తీసుకుపోతుందని చెప్పారు. మనసు స్వచ్ఛంగా నిష్కల్మషంగా లేకుండా ఎన్ని ఆరాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మనసులో ఎవరి పట్లా కుళ్లు, కుట్ర, ఈర్షా్యద్వేషాలు లేకుండా, నిష్కల్మష హృదయంతో అందరినీ ప్రేమించగలిగే వారికే స్వర్గం లభిస్తుందన్నది ఇందులోని సారాంశం.
– మదీహా
Comments
Please login to add a commentAdd a comment