నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్‌ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది.
సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది.
‘ఆరు’గించినవి అవే..
రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్‌పువా అగ్రస్థానంలో ఉన్నాయి.
బిర్యానీ...అదే క్రేజ్...
హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు.
‘ఆహా’లీం..
ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది.
అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్‌పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి.
టేస్టీ.. యూనిటీ..
కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం.
– మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్
Comments
Please login to add a commentAdd a comment